శివకాశి

ఇతనికెవరూ వీరత్వాన్ని

వెన్నతో పెట్టి తినిపించలేదు.

ఒళ్ళో కూచోబెట్టుకుని,

సాహస గాధల్ని

ఓపిగ్గా వినిపించలేదు.

అయినా, ఉదయమయ్యేసరికల్లా ఈ పసివాడు

మృత్యువు గుహలోకి నడిచిపోతాడు.

చీకటిపడేదాకా అక్కడే

దానితో ఆటలాడతాడు.

సమాజపు దట్టమైన అడవిలో

అతను మూల మూలకీ వెళతాడు.

భాష నేర్చిన మృగాలమధ్య

భయంలేకుండా తిరుగుతాడు.

అయినా అతనిపేరు

ఎవరికీ పెట్టరు.

అసలతని ఉనికినే ఎవరూ

ఆనవాలు పట్టరు.

అతని జీవితంలో

అల్లరి లేదు; ఆటల్లేవు;

తప్పటడుగుల్లేవు;

తడబడే మాటల్లేవు.

కళ్ళ వెలుగుల్ని కాకరపువ్వొత్తులకి,

చిరునవ్వుల్ని మతాబులకి ఇచ్చేసి,

అమావాశ్య జీవితంలోనే తను

అమాయకంగా మిగిలిపోతాడు.