ఇస్మాయిల్‌ గారి కవితా తత్వం

ఇస్మాయిల్ గారు కాకినాడ పి.ఆర్. గవర్నమెంటు కాలేజీలో చాలా కాలం ఫిలాసఫీ లెక్చరరుగా పని చేసి, కాలేజీ ప్రిన్సిపాలుగా పదవీవిరమణ చేశారు. కొంత కాలం అధికార భాషా సంఘం సభ్యునిగా కూడా ఉన్నారు. ఆరు కవితా సంకలనాలు, రెండు వ్యాస సంకలనాలు, రెండో ప్రతిపాదన – అనే పేరుతో ఇతర భాషలనుండి అనువదించిన కవితల సంకలనం ప్రచురించారు. ఆయన మృత్యువృక్షంకి ఫ్రీవర్స్ ఫ్రంటు అవార్డు, కవిత్వంలో నిశ్శబ్దంకి తెలుగు యూనివర్సిటీ అవార్డూ వచ్చాయి. ఇటీవల కళాసాగర్ వారు lifetime achievement కింద లక్ష రూపాయల ప్రత్యేక పురస్కారంతో సత్కరించారు.

ప్రపంచం దుఃఖమయంగా కనిపిస్తుంది. నిత్య జీవితంలో ఎదురయ్యే బాధలు, నిరాశ, అభద్రత మొదలైనవి మనల్ని పీడిస్తూ ఉంటాయి. అలాగే తిరిగిరాని గతం, రాకతప్పని మృత్యువు, అంతుపట్టని భవిష్యత్తు వంటివి నిరంతరం మనని కలవరపెడుతూ ఉంటాయి. వీటివల్ల కలిగే మానసికోద్రేకాలు సహజంగానే అనేకమంది కవులకు కవితావస్తువులుగా సమకూరాయి. ఐతే దీనికి భిన్నంగా,ఆహ్లాదకరమైన, ఆరోగ్యవంతమైన ‘సజీవ సామగ్రి’తో అద్భుతమైన కవిత్వం సృష్టించిన అతికొద్దిమంది కవుల్లో ఇస్మాయిల్ గారు ముఖ్యులు.
కష్టాలుంటాయి. కాని, పాటతో వాటిని జయించాలి.

సెలయేరా, సెలయేరా!
గల గల మంటో నిత్యం
ఎలా పాడగలుగుతున్నావు?
చూడు, నా బతుకునిండా రాళ్ళు.
పాడకుంటే ఎలా?
(పాట)

జీవన వైభవాన్ని, జీవన సౌందర్యాన్ని దర్శించి, వాటికి స్పందించటం ద్వారా యిటువంటి ధోరణి అలవడిందనుకొంటాను. సకల చరాచర సృష్టితోనూ ఒక మమేకత సాధించి, వాటితో సంస్పందించటం ఆయన కవిత్వంలో కనిపిస్తుంది. అందుకే సృష్టిలో ఉన్న రకరకాల వస్తువులగురించి ఆయన ప్రస్తావించినప్పుడు, కేవలం personification మాత్రమే కాకుండా, ఒక సున్నితమైన హాస్యధోరణి అందులో ఉంటుంది. మనకు అతి సన్నిహితులైన వారి గురించి ప్రస్తావించేటప్పుడు మాత్రమే మనం ఇటువంటి హాస్య ధోరణిని పాటించగలం. ఉదాహరణకి చప్పట్లు కొట్టే ఆకులు, తోక ఊపుకొంటూ వచ్చే సూది, వొంతెన కిందుగా ఊహల్లోకి గెంతుతూ పారే ఏరు, గంపెడుకాయలతో ఆశ్చర్యపడి నిలుచున్న కొబ్బరిచెట్టు, ముప్పొద్దులూ కాలవలో మొహం చూసుకుని ఆశ్చర్యపోయే మబ్బు, భూమి బుగ్గపై చల్లటి నవ్వు సొట్టలా ముడుచుకొనే బావి ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు.

ఇస్మాయిల్ గారి కవిత్వంలో ఎక్కడా గతం గురించిన చింత కాని, భవిష్యత్తు గురించిన ఆందోళన గాని కనిపించదు. ఎల్లప్పుడూ వర్తమానంతోనే వాటికి ప్రమేయం. ఎక్కడా self pity ఉండదు. అల్లాగని కొంతమంది లాగా తనను తానొక ఉన్నత స్థానం మీద ఊహించుకుని ప్రవచించటం కూడా ఉండదు. కేవలం వర్తమానం పట్ల అనురక్తి, చెక్కుచెదరని ఆశాభావం మాత్రం కనిపిస్తాయి.

ఎరుపెక్కే
ఇవాళ్టి సంధ్యకానీ
నలుపెక్కివచ్చే
నిరాశాంధం కానీ
నా మనస్సులో
ఆనందపు తెరచాపలెత్తి
అనవరతం సాగిపోయే
ఈ కాంతిపడవల్ని
ఆర్పలేవనుకుంటాను
(శ్రావణ మంగళవారం)

జీవితంపై ఆయనకున్న positive attitudeకి మరొక సూచిక పిల్లల గురించి ఆయన రాసిన పద్యాలు. పిల్లల గురించి ఆయన చాలా పద్యాలు రాశారు. వీటిలో పిల్లలపై ఆయనకున్న ప్రేమ, వారిని జీవితానికి నిజమైన ప్రతినిధులుగా చూసే ఆయన దృష్టి స్పష్టంగా తెలుస్తాయి. ట్వింకిల్, ట్వింకిల్ కహుటెక్, ట్వింకిల్ నవ్వు, నక్సల్ భావే, ఆట ముఖ్యం, పాపాయి ముందు నా పద్యం, ఇలా ఎన్నో కవితల్లో ఇంకా లెక్క లేనన్ని హైకూలలో పిల్లల గురించిన ప్రస్తావన కనిపిస్తుంది.

కాళ్ళకి కాళ్ళు తొడుక్కుని
నీళ్ళల్లో నించున్నాడు కుర్రాడు
రెండు మొహాల్లోనూ ఆశ్చర్యం
(హైకూ)

ఎవరికోసం వర్షిస్తాయి మేఘాలు,
పిల్లల కోసం కాకపోతే
గొడుగులడ్డు పెట్టుకునే వాళ్ళ కోసమా?
(హైకూ)

పిట్టల్ని తోలమని
పాపని కాపలా పెడితే
కాకుల్తో స్నేహం చేస్తోంది
(హైకూ)

పిల్లలు జీవనవైభవానికి, దాని కొనసాగింపుకీ ప్రతినిధులని నాకనిపిస్తుంది. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు వారి దృష్టిలో ఉండే స్వచ్ఛత, అమాయకత కవులకి కూడా వాంఛనీయాలు కాబట్టి వారికి పిల్లలతో ఒక సన్నిహిత సంబంధం ఉంటుందేమో.

నది బాజాని మోగించే
సదా బాలకుడు టాగోర్
(బోటులో టాగోర్)

ఇస్మాయిల్ గారొకసారి రాశారు, “పిల్లలంత ఆనందంగా ఎందుకుంటారంటే వాళ్ళు నిజమైన కవులు కాబట్టి. అసలు మనందరం పుట్టటం కవులుగానే పుడతాం” అని.

ఇస్మాయిల్ గారు రాసిన పద్యాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవలసినవి personal poems అంటే ఎవరైనా ఒక వ్యక్తిని సంబోధిస్తూ రాసినవి. తెలుగులో ఇటువంటి పద్యాలు తక్కువ. అంటే ఇటువంటివి లేవని కాదుగానీ చాలా సందర్భాలలో ఈ రూపాన్ని ఎలిజీల కోసమో, లేదా తిట్టు కవిత్వంగానో ఉపయోగించుకోవటం జరిగింది. ఇస్మాయిల్ గారు రాసిన personal poemsలో ఒక personal touch ఉండటమే కాకుండా, ఒక మంచి ఉద్దేశ్యం, ఆకాంక్ష కనిపిస్తాయి. ఇవి జీవితం పట్ల, స్నేహం పట్ల ఆయనకున్న సదవగాహనని మనకి తెలియజేస్తాయి. శ్యామలరావు గారికి, సదాశివ రావు గారికి, ములిగిన ఓడలు (కాశీ గారికి), వైరు (నగ్నమునికి), కాలవ ఒడ్డున షికార్లు (బిట్ర మోక్ష లక్ష్మీ నరసింహస్వామికి) వంటి పద్యాలు ఆయన స్నేహస్వభావానికి తార్కాణంగా నిలుస్తాయి.

ఆయన రాసిన పద్యాలలో ఒక్క పద్యంలో మాత్రమే మృత్యువు గురించిన ప్రసక్తి ఉంటుంది. అదే మృత్యువృక్షం. ఇందులో కూడ మృత్యువు వల్ల కోల్పోయిన అనుబంధాల గురించి నిగూఢమైన ప్రస్తావన ఉంటుంది తప్పించి ఎక్కడా సెంటిమెంటాలిటీ కనిపించదు.

అకస్మాత్తుగా
ఒకరోజు
మృత్యువృక్షం
వ్యత్యస్తంగా
తలకిందుగా
మొలిచింది.
మూగిన బంధుమిత్రులు
మోసుకుపోయి అతణ్ణి
విత్తనంలా
పాతారు.
జనాల
మనోగగనంలో
చాపుకున్న
జ్ఞాపకాల కొమ్మల్నీ
గాఢానురాగాల
ఊడల్నీ
వెనక్కి పీల్చేసి
ఈ మృత్యుబీజం
ఏమీ తిరిగివ్వదు.

కవిత్వంలో సెంటిమెంటాలిటీ ఉండకూడదనే విషయంలో ఆయనకి పట్టుదల ఎక్కువ. ఇదికొంత భిన్నమైన ధోరణి. ఎందుకంటే, సెంటిమెంటనేది మన సాహిత్యంలో చాలా కీలకమైన అంశమైపోయింది. మన కధలు, నవలలు, నాటకాలు, సినిమాలు వీటన్నింటిలోనూ సెంటిమెంటొక జనరంజక సాధనం. విప్లవ కవిత్వంలో మృతవీరుల సంస్మరణార్థం రాసే పద్యాలలో కూడా కొన్ని సార్లు ఇది చోటుచేసుకొవటం కద్దు. కాని ఇస్మాయిల్ గారు సెంటిమెంటు నంగీకరించరు. కవిత్వం ఇంకా finer sensibilitiesకి appeal చెయ్యాలనేది ఆయన ఉద్దేశ్యం కావచ్చు.

ఇస్మాయిల్ గారు విధిగా పాటించిన మరొక సూత్రం తన కవిత్వంలో ఎక్కడా references లేకుండా జాగ్రత్త పడటం. అంటే, ఆయన వాడే imagesకి గానీ, comparisonsకి గానీ ఏరకమైన పౌరాణిక, చారిత్రక లేదా జానపద కధలు లేదా పాత్రలతో సంబంధం ఉండదు. ఒక పద్యానికి సంబంధించిన విషయమంతా అందులోనే ఉంటుంది గానీ, దానినర్ధం చేసుకోవటానికి వేరే ఏరకమైన పరిజ్ఞానమూ సంపాదించవలసిన అవసరం ఉండదు. references వల్ల పాఠకుడి దృష్టి మరలిపోయే ప్రమాదం ఉంటుందనేది ఆయన ఉద్దేశ్యం కావచ్చు. references లేకపోవటంవల్ల పద్యానికొక universality కూడా ఏర్పడుతుంది. ఐతే, ఇటువంటి references సాధారణంగా ఒక జాతి సంస్కృతితో ముడిపడి ఉంటాయి కాబట్టి, వాటివల్ల పాఠకునికి ఇంకా దగ్గరగా వెళ్ళే అవకాశం ఉంటుందని కొందరు భావించవచ్చు. అందువల్ల, ఈ విషయంలో భిన్నాభిప్రాయాలకు ఆస్కారం ఉంది.

ఇస్మాయిల్ గారి కవిత్వంలో అనుభూతి సాంద్రత ఎక్కువ. ఆయనను అనుభూతివాద కవిగా వర్గీకరించిన విమర్శకులు, ఆయన కవిత్వంలో ఈ లక్షణం గురించి ఇదివరలో విస్తారంగానే రాశారు. ఈ సందర్భంలో ముఖ్యంగా చెప్పుకోవలసినవి కేవలం ఒకే అనుభూతికి పరిమితమై రాసినపద్యాలు, లేదా అతి సాధారణమైన ఒక చిన్న సంఘటన ఆధారంగా రాసిన పద్యాలు. ఉదాహరణకి, ఎండాకాలంలో చల్లటి మంచినీళ్ళు తాగటం (దాహం), ఒకామె కప్పులో టీ తీసుకొని రావటం (టీ కప్పు), నిద్రలో ఉలిక్కిపడటం (నిద్రలో ఆమె కళ్ళు) వంటివి చెప్పుకోవచ్చు.

ఇందుకు భిన్నంగా, ఒక ఆలోచనని చెప్పటానికి మాత్రమే రాయబడిన పద్యాలు కూడా లేకపోలేదు. ఉదాహరణకి, స్వేచ్ఛాగానం. పేరుకి స్వేచ్ఛాగానమే అయినా,

దివిలో ఊగే విహంగాన్ని
భువిలో పాకే పురుగు బంధింస్తుంది

అని మొదలయ్యే ఈ పద్యంలో అన్నీ బంధాలే కనిపిస్తాయి. స్వేచ్ఛలో ఉన్న బంధాల్ని గుర్తించటమే ఈ పద్యంలో ప్రత్యేకత. అనేక బంధాలు చెప్పబడ్డాక,

గురి మరచిన గాలి బాణాన్ని
తెరలెత్తిన నౌకా ధనస్సు బంధిస్తుంది
ఈ మనిషి ఆ మనిషిని బంధిస్తాడు
ఇద్దర్నీ బంధిస్తుంది మనీష

అనే వాక్యాలతో ఈ పద్యం ముగుస్తుంది. కృష్ణ శాస్త్రి గారి స్వేచ్ఛాగానం (1,2) పద్యాలతో ఈ పద్యాన్ని కూడా కలిపి విశ్లేషిస్తూ, ఇస్మాయిల్ గారే ఒకసారి వ్యాసం రాశారు.
స్పష్టంగా విడమరిచి చెప్పలేని ఒక అస్తిత్వ చింతన వంటిది, ‘చెట్టు నా ఆదర్శం’లో ఒకటి రెండు పద్యాలలో మాత్రం కనిపిస్తుంది.

చిటపట…
ఎడతెగక మ్రోగు విధిఢక్క
కడుపులో శూన్యపు ప్రేవుని
ఏల మోగు నగార
ఎచట దీనికి మేర?
అకటకట
వికట ప్రతిబింబాల
అద్దాల చెరసాల
బందీని నేనె
బందిఖానాని నేనె
(ఎందుకయ్యా వుంచినావు, బందిఖానాలో)

చివరి రెండు పంక్తులలో చెప్పబడ్డ తాత్వికసత్యం విశేషమైనది.

ఇవిగాక, కేవలం logicతో రాసిన చిన్నపద్యాలు కొన్ని ఉన్నాయి. వీటికి పాఠకుడి దృష్టిని బట్టి, రకరకాల అర్థాలు చెప్పుకోవచ్చు.

బైట ఉండాల్సినవేమిటో
లోన ఉండాల్సినవేమిటో
అన్నీ నాకు తెలుసు.
ఐతే,
ఈ కిటికీకి
ఇక్కడేం పని?
(గోడ)

దోవ బహు దుర్గమంగా ఉంది
ఆ వేపు కెప్పుడు చేరతానో
ఇప్పుడు మెళ్ళో ఇదోటి తగిలించారు
ఈ పని పూర్తయాక ప్రయాణం సాగిస్తాను
(మేకు)

అప్పట్లో కమ్యూనిస్టు విమర్శకుల్ని కవ్వించటానికి రాసిన కొన్ని పద్యాలు కూడా ఇదే కోవకి చెందుతాయి. వాటిలో ముఖ్యంగా – అనంతపురంలో రెండు గాడిదలు, వడ్రంగి పిట్ట, వంటివి చాలా వివాదానికి దారితీశాయి.

పైన చెప్పిన పద్యాలు కొన్ని మినహాయిస్తే, ఇస్మాయిల్ గారి కవిత్వంలో స్పష్టత, సరళత ఎక్కువ. గాఢతని కోల్పోకుండా స్పష్టతని సాధించటం వాటి లక్షణం. జీవితంలో ఉండే diversityకి జవాబుగా, కొందరు కవులు తమ కవిత్వంలో complexityతో దానిని సవాలు చేస్తే, ఇస్మాయిల్ గారి వంటివారు తమ కవిత్వంలో సరళత ద్వారా దాని నెదుర్కొన్నారు. కవుల్లో నిజాయితీ ఉన్నంతవరకు, ఏ మార్గం అవలంబించినా కృతకృత్యులు కాగలుగుతారు.

ఇస్మాయిల్ గారు భాషలో పాటించిన నిరాడంబరత కూడా చెప్పుకోదగినది. ఆయన పద్యాలలో ఎక్కడా క్లిష్టమైన పదాలుగానీ, సుదీర్ఘమైన వాక్యాలుగానీ ఉండవు. ‘చెట్టు నా ఆదర్శం’లో కొన్ని గ్రాంధిక పదాలు కనిపిస్తాయి గానీ, తరువాతి పద్యాలలో వాటిని పూర్తిగా విడిచిపెట్టారు. భావానికి, పాఠకునికీ మధ్య భాష అడ్డు రాకూడదనేది ఆయన ఉద్దేశ్యం. సరళమైన చిన్న వాక్యాలతో ఉండే పద్యాలలో ఆయన, రెండో అక్షరం ప్రాసని మాత్రం చాలా వరకు పాటిస్తారు. తెలుగు భాషకి అంత్యప్రాసకంటె, అక్షరమైత్రి ఎక్కువ సొగసునిస్తుందని ఆయన భావిస్తారు.

ఇస్మాయిల్ గారి కవితా సంకలనాలు: చెట్టు నా ఆదర్శం, మృత్యు వృక్షం, చిలకలు వాలిన చెట్టు, రాత్రి వచ్చిన రహస్యపు వాన, బాల్చీలో చంద్రోదయం, కప్పల నిశ్శబ్దం(హైకూలు) వీటిలో ఏది తీసుకున్నా, ఆయన కవితా తత్వం స్పష్టంగా మనకు గోచరిస్తుంది. ఇవే కాకుండా, ఆయన రాసిన అనేక సాహిత్య వ్యాసాలలో కవిత్వం గురించి తన అభిప్రాయాలను విస్తారంగా చర్చించారు. ఆయన ప్రచురించిన రెండు వ్యాస సంకలనాలు: కవిత్వంలో నిశ్శబ్దం, కరుణ ముఖ్యం. ఇవి ఆయన కవితా దృక్పధాన్ని అర్థం చేసుకోవటంలో మనకుపయోగపడతాయి. ఈ వ్యాసాలలో ఆయన వెలువరించిన అభిప్రాయల వెలుగులో ఆయన కవిత్వాన్నే విశ్లేషించటం ఒక మంచి ప్రయత్నమౌతుంది. ఎవరైనా ఇటువంటి ప్రయత్నానికి పూనుకొంటే, ఇస్మాయిల్ గారి కవిత్వం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి.