స్త్రీ పాత్ర

అక్కడున్న అందరి మనసుల్లోని

దుఃఖాన్నీ

ఆవిష్కరించే బాధ్యతని

ఒక స్త్రీ నయనం వహిస్తుంది.

ప్రకటించక,

ప్రకటించలేక,

పాతిపెట్టిన వందల మాటల్ని

ఒక్క మౌనరోదన వర్షిస్తుంది.

సున్నితమైన జ్ఞాపకాల వేలికొసల తాకిడికి

శ్రుతిచేసిన వీణలా ఆమె ధ్వనిస్తుంది.

కనిపించని విషాదపు ఒత్తిడికి

చిగురుటాకులా ఆమె చలిస్తుంది.

విల్లంబులా వంగిన మనసుల్లో

గూడుకట్టుకొన్న టెన్షన్నంతా

ఆ నారి భరిస్తుంది.

హఠాత్తుగా అసంగతంగా మారిన

అక్కడి వాతావరణానికి

ఆమె అర్థం కల్పిస్తుంది.

ఆ సన్నివేశానికి ఆమె నాయిక;

బయటపడని పాత్రల మనోరూపాల్ని

లీలగా ప్రదర్శించే

పారదర్శక యవనిక.