ఉదయపు చీకట్లో
ఒక గాలి తెర
కొబ్బరి చెట్టు జుట్టులోకి
వేళ్ళు పోనిచ్చి, నిట్టూర్చి
శెలవు తీసుకుంటోంది.
అవి విడిపోవడాన్ని
ఎవరు గమనిస్తున్నారు ?
కోడిపుంజొకటి బలాన్నంతా
గొంతులోకి కూడదీసుకొని,
చంద్రుడికి చివరి సంకేతాన్ని వినిపించింది.
ఎవరున్నారతన్ని సాగనంపడానికి ?
గడియారంలో నిశ్శబ్దానికి
గుండెదడ హెచ్చుతోంది.
ఎవరు గుర్తిస్తున్నారది నిష్క్రమించడాన్ని ?
చీలడానికలవాటుపడ్డ రోడ్లు,
దూరానికలవాటుపడిన
రైళ్ళు, రైలు పట్టాలు
ప్రస్తుతం నన్ను నడిపిస్తున్నాయి.
బహుశ అవేనేమో
మౌనంగా నన్ను ఓదారుస్తున్నాయి.