కొన్నిసార్లు ఆడకుండానే
విరమించవలసి వస్తుంది.
సకలాలంకారాలూ చేసుకొని
సర్వ సన్నద్ధంగా ఉన్నా,
నీ పాత్ర రాకండానే నాటకం
ముగింపుకొచ్చేస్తుంది.
నూరిన నీ కత్తి
వీరత్వాన్ని కురిపించకముందే,
ఒక మహా యుద్ధం
కళ్ళముందర జరిగిపోతుంది.
అయినా, కదిలే నదిలో దూకి
ఈదులాడాలనుకొన్నప్పుడు
ఏ క్షణం బాగుంటుందనే ఆలోచనకి తావేలేదు.
ఎడతెగని రాత్రిని
ఎదిరించి ప్రయాణించాలనుకొన్నాక
ఎప్పుడు బయల్దేరాలనే ప్రశ్నే ఉదయించదు.
ఇక్కడ రిహార్సల్స్ లేవు,
రీటేక్ లూ లేవు.
ఉన్నది ఒకే ఒక ప్రదర్శన.
అది ఆరంభించడమే గాని,
అదనుకోసం చూసి ప్రయోజనం లేదు.