పాత పద్యం

పాత పద్యం చదువుతోంటే
ఎప్పుడో ఇల్లువిడిచి వెళ్ళిన కొడుకుని
మళ్ళీ కలుసుకున్నట్టుగా ఉంటుంది.

గుండెలపై ఆడించి
బుడిబుడినడకలు నేర్పించి
బయటి ప్రపంచం కోసం తయారుచేసింది
నేనేకదా అనిపిస్తుంది.

పరిపూర్ణమైన సామర్థ్యంతో
బ్రతుకందించిన బలంతో
కళకళలాడే ఈ రూపానికి
ప్రాణం పోసింది నేనేనా అనిపిస్తుంది.

పాత పద్యం చదువుతోంటే
పోగొట్టుకొన్నానని కూడా
మరిచిపోయిన వస్తువేదో
తిరిగి దొరికినట్టుగా ఉంటుంది.

ఏళ్ళనాటి చిందవవందర కాగితాలమధ్య
పాతపద్యం కనబడినప్పుడు
దిక్కుతోచని కొత్త ఊళ్ళో
బాల్యమిత్రుడు ఎదురైనట్టుగా ఉంటుంది.

దొరికిన పాత పద్యం
మరల పరిచయం చేసుకుంటుంది
కనుగొంటానని ఎంతసేపట్నించో
ఎదురు చూస్తున్న చిట్టితల్లిలా
కళ్ళమీంచి చేతులుతీసి
కిలకిలా నవ్వుతుంది.

కాలంతోబాటే ప్రపంచమూ మారిపోతుంది
మంచిచెడుల ఎడతెగని ఊగిసలాటలో
జీవితం తెలియకుండానే చేజారిపోతుంది
కాని, ఎన్నేళ్ళు గడిచినా
చెక్కుచెదరని మెరుపుతో
తళతళలాడే పాతపద్యాన్ని చూసినప్పుడు
ఒకప్పటి నన్నే
మళ్ళీ కలుసుకున్నట్టుగా ఉంటుంది.