నేనిప్పుడు కలలపడవలో
తేలడంలేదు.
కలవరించడం లేదు.
జీవితంలో తుదకంటా మునుగుతున్నాను.
మత్తెక్కిన జూదగాడిలా
మొత్తం కాలాన్ని పణం పెట్టి
ఈ ఆట ఆడుతున్నాను.
గెలిచితీరాలని ఆరాట పడుతున్నాను.
సాలెగూడులా, తేనెపట్టులా
నిదానంగా దేనికో
రూపమివ్వాలనుకోవడం మానేసాను.
శక్తినంతా ఉపయోగించి
పరుగుపందెంలో పాల్గొంటున్నాను.
జ్ఞాపకాలు రేపే ఏదో పాటకి
హాయిగా తలాడిస్తూ కూచోవడం లేదు.
హోరెత్తించే జీవితప్పాటవిని
వెర్రి ఆవేశంతో ఊగిపోతున్నాను.
అయినా, ఇప్పుడే
పాత్రోచితంగా జీవిస్తున్నానని
నేననుకొంటున్నాను.