ఆటావారు 2006 సంవత్సరానికి ప్రకటించిన నవలల పోటీకి వచ్చిన 27 నవలలు పరిశీలించాను. కొంత వరకూ వస్తువులో వైవిధ్యం కనిపించింది. మామూలు ప్రణయగాథలు, ఆధునిక సమాజంలోని ఆర్భాటాలు, మానసిక సమస్యలు, ప్రపంచీకరణ ఫలితాలు, మానవసంబంధాలు- ఇలాంటి వస్తువులతో నవలలు వచ్చాయి. నవలా ప్రక్రియ స్వరూప స్వభావాల పట్ల అవగాహన ఉన్న రచయితలు తక్కువ అనిపించింది. నవలంటే ఒకఅంతస్సూత్రం అనేది లేకుండా సన్నివేశాలు పేర్చుకుంటూ పోవడం, లేదా సినిమా తీసేందుకు అనుకూలమైన మెలోడ్రామాను పండించడం అనే భావన ఎక్కువగా కనిపించింది. కొన్నిటిలో భాష చాలా లోపభూయిష్టంగా ఉంది. మనోవైజ్ఞానిక ధోరణిలో రాసిన నవలల్లో ప్రయత్నం మెచ్చవచ్చుగానీ, వాటి స్థాయి ఆశించినట్లుగా లేదు.
వస్తువులోనూ, కథనంలోనూ ఎన్నదగినవిగా ఉన్నవి ముఖ్యంగా రెండు. అవి జిగిరీ, తోలుబొమ్మలాట. జిగిరీ నవల మానవుడిలో ఉన్న రెండు పార్శ్వాలను స్పృశించిన రచన. మనిషి తన స్వార్ధంకోసం జంతువులను వాడుకుని, అవసరం తీరగానే వాటిని వదిలించుకునే అవకాశ వాదాన్ని, అమానవీయతనూ చాంద్ పాత్ర ప్రతిబింబిస్తే, జంతువులోని విశ్వాసపాత్రతను గౌరవించి, తన కుటుంబం కంటే ఆ జంతువుతో సహజీవనమే మేలని భావించే గొప్పమనసుకు ఇమామ్ ప్రాతినిధ్యం వహిస్తాడు. ఒక కుగ్రామం లోని ముస్లిమ్ కుటుంబం, యాదృచ్ఛికంగా తారసపడిన ఎలుగును పెంచి, పెద్దజేసి, దానికి ట్రిక్కులు నేర్పి,దాని ఆటల ప్రదర్శన వల్ల వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తూంటుంది. 20 ఏళ్ళు ఆ ఎలుగ్గొడ్డు వారి కుటుంబాన్ని పోషించిన తర్వాత, ప్రభుత్వాధికార్లు చూపెట్టిన ఆశతో, రెండెకరాల భూమికోసం ఎలుగును వదిలించుకోవలసిన పరిస్థితి వచ్చినపుడు, కుటుంబంలో రెండువర్గాలు ఏర్పడడం, తల్లీ, కొడుకూ ఆ భూమికోసం, అంతకాలం తమను పోషించి, తమ కుటుంబసభ్యురాలిగా ఉన్న ఎలుగును చంపడానికి సిద్ధం కావడం, ఈ దారుణాన్ని చూడలేక, తండ్రి ఇమామ్ తన కుటుంబాన్ని వదిలి ఎలుగుతో శాశ్వతంగా వెళ్ళిపోవడం -ప్రధానకథ.
కథ చెప్పిన విధానం, ఉపయోగించిన భాష చాలా సహజంగా, ఆసక్తికరంగా, హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. కథలో తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను పోషిస్తూనే, ఎప్పటికప్పుడు మానవ స్వభావంలోని లోతులను తరచి చూసే తాత్వికత కూడా అందించడం నవలలోని ప్రత్యేకత. ఆధునిక మానవుడి self-centredness నూ, జంతువులను కేవలం తమ జీవనోపాధికి ఒక సాధనంగా, ప్రాణంలేని పరికరంగా చూసే అమానవీయ దృక్పథాన్ని చాలా స్పష్టంగా, సమర్ధంగా చెప్పిన నవల. చిట్టచివరికి, పాశవికనైజం కలిగిన తన భార్యాబిడ్డలకంటే మానవీయత కలిగిన తన ఎలుగ్గొడ్డుతో సహజీవనమే మెరుగని కథానాయకుడు ఇమామ్ భావించినట్లు చిత్రించడం చక్కని ముగింపు. వస్తుశిల్పాలు రెండిటిలోనూ, రచయిత జీవిత దృక్పథంపరంగానూ ఎన్నదగిన రచన ఇది.
తోలుబొమ్మలాట– ఆధునికీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో మన వినోదాలుకూడ టీవీ, సినిమాలకు పరిమితమై, దేశీయ కళలు, జానపద ప్రదర్శన కళలు కనుమరుగైపోతున్న విషయం ఇందులో వస్తువు. పల్లెలలో ఇంతకు ముందున్నట్లు స్వచ్ఛమైన వాతావరణం లేదనీ, ప్రపంచమంతా నిజంగానే ఒక ఆధునిక గ్రామమైపోతోందనీ, దానివల్ల గ్రామసీమల్లో కూడ పట్టణాల్లో లానే ఒక కృత్రిమ వాతావరణం, అనుకరణ సంప్రదాయం స్థిరపడుతున్నాయనీ ఈ నవల చెబుతుంది. తోలుబొమ్మలాట ఆడుకునే ఒక కుటుంబం, తమ వృత్తికి ఆదరణలేక, బతుకుతెరువు దొరక్క, ఆ బొమ్మలను అమ్ముకునే పరిస్థితి వచ్చేసరికి, అది ఇష్టం లేక, మళ్ళీ తమ కళకు ఆదరణ లభించకపోతుందా అనే తాపత్రయ పడే ఘటన ఈ నవలకు కేంద్రం. వాళ్ళ ప్రయత్నాల పరంపరలో భాగంగా గ్రామాల్లో వచ్చిన మార్పులను నవల చక్కగా చిత్రించింది. తోలుబొమ్మలాటకు సంబంధించిన సాంకేతిక వివరాలను ఎక్కడా జర్నలిస్టు ధోరణి లేదా, విజ్ఞానసర్వస్వ ధోరణి లేకుండా చెప్పిన పద్ధతి, రచయితకు నవలా ప్రక్రియపై ఉన్న అధికారాన్ని చెప్తుంది. తోలుబొమ్మలాట పేరిట జానపద కళలను ఊరికే romanticise చేయకుండా ఆ ఆటగాళ్ళలోని, ఆడే విధానంలోని లోపాలను, బలహీనతలను కూడ బయట పెట్టడం ప్రశంసనీయం. తమ ప్రయత్నాలకు వైఫల్యమే ఎదురయినా, ఆశను విడవక, తమ ప్రదర్శనా తీరులోని లోపాలను గురించి ఆత్మవిమర్శ చేసుకోవాలని గుర్తించడం, కొత్తరకమైన ప్రదర్శన విధానంతో, ధోరణితో మళ్ళిమళ్ళి ప్రయత్నిస్తూ, దాన్ని పునరుద్ధరించడానికి పునరంకితం కావాలని కథానాయకుడు నిర్ణయించడం-melodrama లేని వాస్తవిక ముగింపు. టీవీలపై దాడి అవసరానికిమించి పునరుక్తమయినప్పటికీ, మొత్తం మీద ఈ నవలలో సందేశమూ ఉంది. వాస్తవికతా ఉంది. ఆలోచింపజేసే గుణమూ, తాను స్వీకరించిన వస్తువుపై చక్కని విశ్లేషణా ఉన్నాయి. కథాకథనం ఆసక్తికరంగానూ, సంభాషణలు అత్యంత స్వాభావికంగానూ ఉండి, నవలలో పఠనీయతా గుణంకూడ ఉంది.
పైకారణాల వల్ల ఈ రెండు నవలలు ఒక్కొక్కటీ రూ.30,000/- బహుమతికి అర్హమైనవిగా భావిస్తున్నాను -మృణాళిని.