- చాలా కథలు స్పష్టత లేకుండా, పాత వస్తువులనే తీసుకుని వ్రాసినవి. స్పష్టత, seriousness, విశ్లేషణ లేవు.
- పోటీకి కథ పంపేటప్పుడు, అవి నిర్ణేతలు చదువుతారని, తమ చేతివ్రాత వారికి అర్ధం కావాలనే విషయాన్నికూడా కొందరు రచయితలు (దాదాపు చాలామంది రచయితలు) విస్మరించారు. కొంతమంది మొదటిపేజీలో తమ పేరు వ్రాశారు. ఈ విధమైన నిర్లక్ష్యమే కథల్లో కనపడ్డంలో ఆశ్చర్యం లేదు.
- కథల స్థాయి చాలా తగ్గిపోయిందని చెప్పడానికి విచారిస్తున్నాము.
- అంతేకాక కథ వ్రాయడాన్ని కొంతలో కొంతైనా సీరియస్‌గా తీసుకోని రచయితలు ఎక్కువగా కనిపించారు.
- వాస్తవికతకోసం – అవి ఎంతగా పల్లెల్లో వాడుకలో వున్న పదాలైనా సరే – కొన్ని జుగుప్సాకరమైన పదాలను పదే పదే – ఒక పేజీలోనే నాలుగయిదు సార్లు – వాడడం అవసరమా?
- ముందు జరపబోయే పోటీలకు మాదొక సూచన- అర్ధంకాని దస్తూరీలలో కుస్తీ పట్టడం న్యాయనిర్ణేతలకి ఒక శిక్ష కనుక – పోటీ కథలన్నీ తప్పని సరిగా ప్రింటౌట్ తీయించి పంపాలనే నిబంధన పెట్టడం మంచిది.
ఆనకట్ట – గిరిజన తండాల జీవనం. అందులో ఒక అమాయక ప్రేమ. ప్రాజక్టుల వలన ఊళ్ళు మునిగిపోవడం -తండాలు, తట్టలూ బుట్టలూ చంకనెట్టుకుని వేరే వూళ్ళకు పోవడం -అందువలన నిశ్చితార్ధం వరకూ వచ్చిన పెళ్ళి ఆగిపోవడం – కథ -గిరిజన జీవన చిత్రణ, సునిశితమైన పరిశీలన- మరియు మిరండా గీసే చిత్రాల్లాగ ప్రతి చిన్న విషయాన్నీ వర్ణించి చెప్పడం – చివుక్కుమనిపించే ముగింపు. భేషజాలు లేని కథ -సూటిగా సాగిన కథనం.
జింకపిల్ల -ఒక పెద్ద ఆసామిని సంతోషపెట్టి నాలుగు రూపాయలు సంపాదించి చదువుకునే కూతురికి మంచి బట్టలు కొందామని, ఆశపడ్డ తండ్రి, ఇంకో ఆసామిని సంతోషపెట్టి తన పని సాధించు కోడం కోసం ఆ కూతుర్నే ఎత్తుకుపోయి మరొక పెద్దమనిషి – తండ్రి ఎంత వొడుపుగా జింకపిల్లని పట్టుకున్నాడో, అంతే ఒడుపుగా అతని కూతుర్ని ఎత్తుకుపోయాడు ఒక స్వార్ధపరుడు. కథనంకూడా బాగుంది. కాస్త చదువుకుని నాగరిక సమాజంలోకి అడుగుపెట్టాలనుకునే అమాయక యువతుల్ని అణిచి పెడుతున్న వైనం – మాంసం మార్కెట్‌కి సమిధల్ని చేస్తున్న వైనం.
యంగముని వ్యవసాయం – శ్రమైకజీవన సౌందర్యం. సహచరి తోడులోనే సంపూర్ణం. స్త్రీపురుషుల సంబంధంలో పనిని పంచుకోడం జీవితాన్ని సార్ధకం చేసుకోడం – కోరికలు పండించు కోవడం – జానపద శైలిలో సాగిన ఈ కథ ఒక గొప్పజీవన సత్యాన్ని ఆవిష్కరించింది.
లోను– బ్యాంకుల ద్వంద్వ వైఖరి – ఫాక్టరీలకోసం రైతుల పొలాలు కొనడం – గ్రామీణ జీవనం విచ్ఛిన్నం అయిపోవడం.లేని వారిని సతాయించి సతాయించి బాకీలు వసూలు చేసి, ఉన్నవాడికి అప్పులిచ్చి దండం పెట్టడం ఈ కథలో ఇతివృత్తం.