విశ్వమహిళానవల 16: మేరీ షెలీ

తల్లేమో తొలి స్త్రీవాద సిద్ధాంతకర్త మేరీ ఉల్‌స్టన్‌క్రాఫ్ట్ (Mary Wollstonecraft). తండ్రేమో రాజకీయ దురంధరుడు, తత్వవేత్త, రచయిత విలియమ్ గాడ్విన్. ఇక భర్త, అసమాన కాల్పనిక కవి పర్సీ బిష్ షెలీ (Percy Bysshe Shelley). ఇన్ని ‘గుర్తింపు’ల మధ్య మసిబారకుండా, తన వెలుగు విరజిమ్మడం సామాన్యవిషయం కాదు. ఆ పని చేసి చూపింది మేరీ షెలీ (Mary W. Shelley). ఫ్రాంకెన్‌స్టైన్ (Frankenstein) అన్న ఒక్క నవలతో ఆమె ఆ గుర్తింపు సంపాదించింది. ఆమె ఇంకా వేరే రచనలు రాసినట్లు కూడ చాలామందికి చాలాకాలం తెలీదు. అవి ఇటీవలికాలం వరకూ వెలుగు చూడలేదు. ఇప్పుడు మేరీ షెలీని ‘రొమాంటిక్ యుగంలో ఒక అపురూపమైన రచయిత్రి’గా విమర్శకులు ఒప్పుకుంటున్నారు.

1797లో జన్మించి, 1851లో మరణించిన మేరీ షెలీ జీవితం ఎగుడుదిగుళ్ళ కూడలి. ఎన్నో తరాల స్త్రీలను ప్రభావితం చేసిన తన తల్లి ప్రేమను ఆమె పొందలేకపోయింది. ప్రసవానంతరం వ్యాధితో ఉల్‌స్టన్‌క్రాఫ్ట్ మరణించడం వల్ల తల్లి తెలీదు మేరీకి. కానీ తల్లి భావాల ప్రభావం ఆమెపై ఎప్పుడూ ఉంది. తల్లి రచనలు చదవడం, ఆమె ఆశయాలను తన ఆశయాలుగా మలుచుకోవడం మేరీని మానసికంగా తల్లికి దగ్గర చేశాయి.

మేరీ ఉల్‌స్టన్‌క్రాఫ్ట్ మరణానంతరం గాడ్విన్ మళ్ళీ వివాహం చేసుకున్నాడు. మారుతల్లితో ఎప్పుడూ సయోధ్య కుదరలేదు మేరీకి. అంతమాత్రాన ఆమె బాల్యం దుఃఖభరితమేమీ కాలేదు. ఎందుకంటే తండ్రి ఆమెను బాగా దగ్గరకు తీసుకున్నాడు. స్వయంగా చదువు చెప్పాడు. ఇతరులతో చదువు చెప్పించాడు. చివరకు ఆమెకు తమ ఇంట్లో సౌకర్యంగా లేదని తన మిత్రుడి ఇంటికి స్కాట్‌లండ్‌కు పంపాడు. ఇవన్నీ మేరీ చదువరి కావడానికి బాగా దోహదం చేశాయి. కానీ క్రమంగా తండ్రిప్రేమ కూడా దూరమయ్యే పరిస్థితి వచ్చింది. దానికి ఒక రకంగా కారణం పర్సీ షెలీ. షెలీ సుప్రసిద్ధుడు కాకముందే గాడ్విన్‌కి అతనితో పరిచయమైంది. మొదట్లో అంతా బాగానే ఉన్నారు. తామిద్దరిదీ ఒకేరకమైన ఉదారవాద రాజకీయ సిద్ధాంతమని ఇద్దరూ మురిసిపోయారు. ఈ ఉన్నత భావాలతో షెలీ, తండ్రి నుంచి సంక్రమించే తన వాటా ఆస్తిని పేదలకు ధారాదత్తం చేస్తానని ప్రకటించడం, తనని తాను నాస్తికుడిగా ప్రకటించుకుని, విశ్వవిద్యాలయం అధికార్లతో గొడవపడి సస్పెండ్ కావడం, వీటితో అతన్ని తండ్రి ఇంటి నుంచి తరిమేయడం జరిగాయి. తన భావాలను మార్చుకోడానికి ఇష్టపడని షెలీ నిరాశ్రయుడై, అప్పుల్లో పడ్డాడు. గాడ్విన్ దగ్గర కూడా అప్పులు చేశాడు. కానీ ఆ అప్పు తీర్చలేకపోయాడు షెలీ. ఆ తరుణంలో స్కాట్‌లండ్ నుంచి తిరిగి వచ్చింది 16 ఏళ్ళ మేరీ. అనతికాలంలోనే 21 ఏళ్ళ షెలీ, మేరీ ప్రేమలో పడ్డారు. షెలీకి అప్పటికే పెళ్ళయింది. ఒక కూతురు కూడా. భార్య రెండోసారి గర్భవతి. కానీ అప్పటికే భార్యతో పడక, విడిగా ఉంటున్నాడు. వీరిద్దరి ప్రణయానికీ తండ్రి ఆశీర్వాదం లభిస్తుందని ఆశించిన మేరీకి నిరాశే ఎదురైంది. కాణీకి ఠికాణా లేని షెలీని అల్లుడిగా గాడ్విన్ ఊహించుకోలేదు. ఇష్టపడలేదు. దాంతో మేరీ, షెలీ, మేరీ సవతి సోదరి క్లెయర్‌ని తోడు తీసుకుని పారిపోయారు. కలిసి జీవించారు. ఆ ప్రేమలో కొంతకాలం ఫ్రాన్స్‌లో బాగానే ఉన్నా, 1810-20ల మధ్య యుద్ధ వాతావరణంలో ఉండలేక, తిరిగి ఇంగ్లండ్ వచ్చారు.

అక్కడినుంచీ వీరి జీవితంలో అన్నీ ఎత్తుపల్లాలే. ఇద్దరూ కలిసి చదువుకోవడం, రాసుకోవడం, మరో సుప్రసిద్ధ కవి లార్డ్ బైరన్ స్నేహం, అతనితో కలిసి సాహిత్య చర్చలు వారి జీవితంలో నిత్యకృత్యాలైనా, వ్యక్తిగత జీవితం సంక్లిష్టమైన స్త్రీపురుష సంబంధాలు, బిడ్డల అకాల మరణం, ఎప్పటికీ వీడని పేదరికం వల్లా ఘర్షణలతో నిండిపోయింది. మేరీ, షెలీల సంతానంలో నలుగురు శిశువులుగా చిన్నప్పుడే చనిపోగా, ఒక్క కొడుకు మాత్రమే బతికాడు. జీవితచరమాంకంలో అతనే మేరీకి తోడుగా ఉన్నాడు. పిల్లల మరణాలు మేరీని విపరీతంగా కృంగదీశాయి. కానీ అవేవీ ఆమె రచనావ్యాసంగానికి అడ్డు కాలేదు.

షెలీ, మేరీల ప్రణయం

చిన్నతనంలోనే ప్రేమించుకున్న మేరీ, షెలీ అతని మరణం వరకూ (ఆ మాటకొస్తే మరణానంతరం కూడా) ప్రేమను కోల్పోలేదు. అయితే వాళ్ళిద్దరూ ‘ఉదార’ స్త్రీపురుష సంబంధాలు మొగ్గ తొడుగుతున్న ఆ యుగస్వభావానికి లోనై, ‘స్వేచ్ఛాప్రణయ’ సిద్ధాంతాన్ని విశ్వసించారు. అందుకే ఇద్దరు తమకు వివాహం అవసరమని కూడా ఇద్దరు పిల్లలు పుట్టేవరకూ అనుకోలేదు. ఆ తర్వాత స్నేహితుల ప్రోద్బలంతో పెళ్ళి చేసుకున్నారు. కానీ వీళ్ళిద్దరి మధ్యా ఒక తేడా ఉంది. తమ సిద్ధాంతం ప్రకారం ఎలాంటి ఆంక్షలూ లేవు కనక షెలీ మరో ముగ్గురు స్త్రీలతో సంబంధం పెట్టుకున్నాడు. మేరీ మాత్రం, షెలీ నుంచి ఎలాంటి ఆంక్షలూ లేకపోయినా, ఎందరో పురుషులు తమ ప్రేమను ప్రకటించినా, వారితో సన్నిహితంగా ఉండలేకపోయింది. ఆమెకు సర్వం షెలీయే.

వీరితోపాటు అదే సిద్ధాంతం నమ్మిన సుప్రసిద్ధ కవి లార్డ్ బైరన్, మేరీ సవతి చెల్లెలితో సంబంధం పెట్టుకుని పిల్లల్ని కూడా (వివాహం లేకుండానే) కన్నాడు. ఆ తర్వాత తన తోవన తాను వెళ్ళాడు. వీరిద్దరికీ కలిగిన సంతానాన్ని పెంచడానికి కూడ మేరీ, షెలీ సిద్ధపడ్డారు. అంతే కాదు. షెలీ మొదటి భార్య హేరియట్ ఆత్మహత్య చేసుకున్నాక, ఆ పిల్లల్ని కూడా మేరీ పెంచడానికి సుముఖురాలైంది. అందరినీ ప్రేమించే ఒక అసాధారణ మనస్వి అయిన మేరీ ఇవన్నీ సంఘర్షణ లేకుండా చేయగలిగిందా అంటే చెప్పలేం. పైకి అలాగే ప్రవర్తించినా, ఈ సంఘటనలు వారి జీవితాలను నిత్యసంఘర్షణకు గురిచేశాయి. మరోవైపు అప్పులవాళ్ళ బాధలు. ధనవంతుడైన షెలీ తండ్రి అతని వివాహాన్ని, వృత్తినీ సహించలేక ఒక్క పైసా ఇవ్వనని భీష్మించుకోవడం; మేరీ తండ్రికి ఇవ్వడానికి డబ్బు లేకపోవడం వీరి ఆర్థిక స్థితిని మరింత దిగజార్చాయి. ఇక ఇంగ్లండులో అప్పులబాధలు భరించలేక పారిపోయి చాలా కాలం ఇటలీలో ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడే ఇద్దరి సాహిత్య జీవితం సుసంపన్నమైంది. నిరవధికంగా రాస్తూ కూర్చున్నారు. తన ఇటలీ రోజుల్ని స్వర్గంగా వర్ణించింది మేరీ తన డైరీలో.

ప్రేమలు, పిల్లలు, వారి మరణాలు, అప్పులు, అనారోగ్యాల మధ్యే మేరీ, షెలీల జీవితం గడిచింది. వీటన్నిటి మధ్యా వారు చేసిన సృజన మాత్రం అజరామరంగా నిలిచింది. షెలీ భార్యగా, ఫ్రాంకెన్‌స్టైన్ అనే క్లాసిక్ నవలా రచయిత్రిగా చిరకాలం చరిత్రలో ఉండిపోయిన మేరీకి అసలైన గుర్తింపు, ఆమె రచనలన్నిటి విశ్లేషణ ఆమె మరణానంతరమే సంభవమైంది. మేరీ ఏడు నవలలు రాసింది. ఎంతో ప్రయోజనకరమైన డైరీలు రాసింది. పర్సీ షెలీ కవితలన్నిటినీ ఎడిట్ చేసి రెండు సంపుటాలుగా ప్రచురించింది. మంచి సంపాదకురాలిగా పేరు తెచ్చుకుంది. జర్మనీ ఇటలీలలో తమ అనుభవాలను యాత్రాసాహిత్య చరిత్రలుగా రాసింది. షెలీ 1822లో పడవ ప్రమాదంలో మరణించిన తర్వాత నుంచి తన జీవితాన్ని సాహిత్యానికే అంకితం చేసింది. షెలీ తండ్రి తన కొడుకు జీవితచరిత్రను రాయకూడదని ఆంక్షలు విధించడంతో, ఆయన పిల్లల పేరిట ఇచ్చే డబ్బు తనకు అవసరం కావడంతో మేరీకి షెలీ జీవితచరిత్ర రాయాలని ఎంత కోరికగా ఉన్నా, ఆ పని చేయలేదు. కానీ చాలా తెలివిగా షెలీ జీవిత వివరాలను, అతని కవితాసంకలనాలలోనూ, తన రచనల్లోనూ అక్కడక్కడా నేర్పుగా పొందుపరిచింది. చివరిరోజుల్లో కొడుకు, కోడలితో ఆనందంగా జీవించిన కొన్నేళ్ళే బహుశా ఆమె జీవితంలో ప్రశాంతంగా గడిపిన రోజులు. 1851లో తన 53వ యేట బ్రెయిన్ ట్యూమర్‌తో మరణించింది. తల్లిని ఎరక్కపోయినా, విండికేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ విమెన్‍ని మేరీ, షెలీ కూడ క్షుణ్ణంగా చదివారు. అర్థం చేసుకున్నారు. తన సమకాలికులైన స్త్రీలలో ముఖ్యంగా రచయిత్రులలో కొందరు అనవసరంగా అపనిందలకు, అపార్థాలకు గురైనపుడు, మేరీ వాళ్ళ తరఫున పోరాడింది. వాళ్ళ హక్కుల గురించి వ్యాసాలు రాసింది. తన తల్లి వారసత్వాన్ని అలా కొనసాగించింది. దీనికి ఆమెకు షెలీ పూర్తిగా సహకరించాడు.

మేరీ షెలీ నవలలు

మేరీ షెలీ అనగానే ఫ్రాంకెన్‌స్టైన్ తప్ప మరొకటి గుర్తుకు రాదు. కానీ ఆమె చారిత్రక నవలలు వాల్పర్గా (Valperga, 1823), పర్కిన్ వార్బెక్ (Perkin Warbeck, 1830) రాసింది. మరో రెండు సాంఘిక నవలలు లొడోర్ (Lodore, 1835), ఫాక్‌నర్ (Falkner, 1837), ఒక భవిష్య ప్రపంచాన్ని చిత్రించే నవల ది లాస్ట్ మాన్ (The last man, 1826) కూడా రాసింది. చివరి నవలను ఒక రకంగా అస్తిత్వవాద నవలగా చెప్పవచ్చు. మానవజీవితమంతా అర్థరహితమైందన్న ఆలోచన ఈ నవలకు నేపథ్యం. తండ్రితో చర్చల్లో, తండ్రి పుస్తకాలలో ఆమెకు లభించిన సమాచారం ఆధారంగా ఈ నవల రాసింది. వాల్పర్గా వంటి చారిత్రక నవలలను స్త్రీకోణం నుంచి రాసింది. అప్పటికే పురుషులను హీరోలుగా చిత్రించే వాల్టర్ స్కాట్ చారిత్రక నవలలు బాగా ప్రాచుర్యం పొందాయి. వాటిని ధిక్కరిస్తున్నదా అన్నట్టు చరిత్రలో స్త్రీలు నిర్వహించే గుర్తింపులేని కార్యకలాపాలను తన చారిత్రక నవలల్లో ఎత్తి చూపింది. చారిత్రక నవలలన్నీ పురుషులు ఒకరిపై ఒకరు సాధించుకునే విజయాలే, ఆధిపత్యాలే. కానీ విజయం అన్న భావనకు బదులు ‘ఆలోచన, ఉద్వేగం’ అనే కోణాలనుంచి చరిత్రను చూసే స్త్రీ పాత్రలను కల్పించి, చరిత్రంటే కేవలం దండయాత్రలు, పౌరుషాలు, యుద్ధాలు కావని ఆమె వ్యాఖ్యానించింది. కానీ ఇవేవీ ఆమెకు గుర్తింపు తీసుకురాలేదు. మటిల్డా (Matilda) అన్న ఆమె నవల ఆత్మకథాత్మకంగా ఉండడంతో తక్కినవాటికంటే ప్రాచుర్యం పొందింది. ఈ నవలలో ప్రధాన పాత్రలకు నమూనాలు తను, తండ్రి, షెలీలే. అలాగే ది లాస్ట్ మాన్ నవలలో కథానాయకుడు లార్డ్ బైరన్‌కు ప్రతిబింబమని విమర్శకులు తేల్చారు. తక్కిన నవలల మాటెలా ఉన్నా, ఫ్రాంకెన్‌స్టైన్ నవల మాత్రం తొలి సైన్స్ ఫిక్షన్ నవలగా చరిత్రలో నిలిచిపోయింది.

ఫ్రాంకెన్‌స్టైన్

ఈ నవల ఒక తమాషా సన్నివేశం నుంచి ప్రభవించింది. షెలీ, మేరీ, బైరన్‌లు సుదీర్ఘకాలం కలిసి గడిపేంత ఆత్మీయులు. ముగ్గురూ తరచుగా దూరతీరాలకు ప్రయాణాలు చేస్తూ, సాహిత్యంలో మునిగితేలేవారు. ఒక రాత్రి ముగ్గురూ చలిలో నిప్పు రాజేసుకుని కూర్చుని, తలా ఒక ‘దయ్యం’ కథ రాయాలని, తక్కినవాళ్ళని భయపెట్టాలని పందెం వేసుకున్నారు. ఎవరు ముందు రాస్తారో చూద్దామని ముగ్గురూ ఆ పనిలో పడ్డారు. నిజానికి ఆ రోజున ఎవ్వరూ రాయలేకపోయారు. కానీ మేరీకి మరుసటిరోజున నిద్రలో ఒక భయంకరమైన రూపం కనిపించి ఉలిక్కిపడి లేచింది. ఆ భీకర ఆకృతి పక్కనే ఒక బక్కపల్చని యువకుడు కూర్చుని ఉన్నాడు. అతను హడలిపోయి పారిపోగా, ఈ ఆకృతి ఒక్కసారిగా లేచింది. అతని వెంటపడింది. మేరీ వణుకుతూ లేచి కూర్చుంది. కానీ కొద్ది సేపటికే, పీడకల వస్తే వచ్చింది కానీ తన కథకు వస్తువు దొరికిందని ఆనందించింది. ఆ భీకరరూపమే చివరికి ఫ్రాంకెన్‌స్టైన్ నవలగా రూపుదిద్దుకుంది. అలా 1818లో మేరీ ఈ నవలను తన 18వ యేట ప్రారంభించింది. 1820లో, కేవలం 20 ఏళ్ళ వయసులో దాన్ని పూర్తి చేసి ముద్రించింది. రెండో ముద్రణలో 1821లో రచయిత్రిగా తన పేరు వేశాడు షెలీ. ఈ నవల సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.

ఈ కథ – సృష్టికి, సృష్టికర్తకూ ఉన్న సంబంధం గురించి; మానవీయతకు, అమానవీయతకూ ఉన్న సంబంధం గురించి, వికారానికి, అందానికీ ఉన్న సంబంధం గురించి; మేధకు, ఉద్వేగానికీ ఉన్న సంబంధం గురించి, శాస్త్రజ్ఞానానికి, యథార్థానికీ ఉన్న సంబంధం గురించి. ప్రకృతికి, మనిషికీ ఉన్న సంబంధం గురించి సరికొత్త వ్యాఖ్యానం. ఈ సంబంధాల సంఘర్షణలో జయాపజయాలు ఎవరివన్న విచికిత్సలో పాఠకుడిని వదిలేసే రచన ఇది.

మొదటి కథకుడు వాల్టన్:

కెప్టెన్ రాబర్ట్ వాల్టన్ అనే నౌకాధిపతి, తన సోదరి మార్గరెట్ వాల్టన్‌ సెవిల్‌కు రాసిన లేఖల సమాహారం ఈ కథ. కథ మొదలైనపుడు వాల్టన్ కథకుడు. అతను తన నౌకలో అందరూ తన వద్ద పని చేసేవాళ్ళే కానీ స్నేహితులని చెప్పదగ్గవాళ్ళు లేరని బాధపడతాడు. రచయితని కావాలన్న ఉబలాటంతో, తన ప్రపంచ పరిజ్ఞానాన్ని, శాస్త్రీయ అవగాహననూ పెంచుకోవడానికి ఉత్తరధృవానికి ప్రయాణమై వెళ్తున్న అతనికి కొంతసేపటికి సుదూర తీరంలో ఒక పడవ మీద భయంకర ఆకృతి కలిగిన ఒక ప్రాణి తెడ్డు వేస్తూ వేగంగా వెళ్ళడం కనిపిస్తుంది. దాన్ని చూసి విస్తుపోతూండగానే మరో పడవలో మరణం అంచున సొమ్మసిల్లి పడిపోయివున్న మరోక వ్యక్తి కనిపిస్తాడు. అతన్ని తన పడవ లోకి తీసుకుని, శుశ్రూష చేస్తాడు వాల్టన్. అతనితో మాటలు కలిపే క్రమంలో, తనకు విజ్ఞానశాస్త్రంపై ఉన్న మోజును తెలుపుతాడు. అలా అతను రక్షించిన వ్యక్తి పేరు విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్. అతను తన రక్షకుడిని చూసి జాలిపడి, తను కూడ శాస్త్రజ్ఞానంపై అలాంటి వ్యామోహమే పెంచుకున్నానని, అలాంటి మోజు జీవితాల్నే నాశనం చేస్తుందని చెబుతూ, తన కథ చెప్తాడు.

రెండో కథకుడు ఫ్రాంకెన్‌స్టైన్:

ఇటలీకి చెందిన ప్రాంకెన్‌స్టైన్‌కు చదివే రోజుల్నుంచి కొత్త ఆవిష్కరణలపై అమితమైన అభిమానం. తోబుట్టువులు, పిల్లల్ని ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులు, తండ్రి దత్తత తీసుకున్న ఎలిజబెత్ అనే అమ్మాయి – ఇలాంటి సాహచర్యంతో ఆనందంగా బాల్యాన్ని గడుపుతాడు. బాల్యంలోనే తల్లి మరణించినా, తండ్రి లాలనలో ఆనందంగా జీవితం గడుస్తూంటుంది. అయితే అతని మనస్సంతా సైన్స్ నేర్వడం మీద, ప్రయోగాలు చేయడం మీదా. ఆ ఉత్సాహంలో ఎన్నో గ్రంథాలు చదివి, నిరంతరం ప్రయోగశాలల్లో గడిపి ప్రాణం పోయడం ఎలానో కనుక్కుంటాడు. ఆ ఉత్సాహంలో మానవుల లాగా వివేకం కలిగిన ఒక ప్రాణిని తయారుచేయాలని నిశ్చయిస్తాడు. చివరకు ఒక మానవాకృతిని పోలిన ఆకృతిని తయారుచేస్తాడు. కాని, తను ఎంత సరిగ్గా కొలతలు చేశాననుకున్నా, ఆ జీవి ఎనిమిదికి పైగా అడుగుల ఎత్తుతో, భీకరమైన ముఖకవళికలతో, పసుపురంగు శరీరంతో, లోపల్నించి మాంసకండరాలు కనిపించేంత పారదర్శకమైన చర్మంతో, తన సృష్టికర్త ఫ్రాంకెన్‌స్టైన్‌ను భీతావహుణ్ణి చేస్తుంది. దాన్ని చూసిన వెంటనే విచలితుడై, పారిపోతాడు ఫ్రాంకెన్‌స్టైన్. అతని సృజన అతని ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అలా వెళ్తూ తన చిన్ననాటి ఆప్తమిత్రుడు హెన్రీ నెవిల్‌ని కలుస్తాడు. అప్పటికే రోగిష్టిలా తయారైన ఫ్రాంకెన్‌స్టైన్‌ని తన సపర్యలతో ఆరోగ్యవంతుణ్ణి చేస్తాడు హెన్రీ. ఇద్దరూ తిరిగి అతని ఇంటికి వచ్చేసరికి, తన సృష్టిని ఎలా పరిచయం చెయ్యాలా మిత్రుడికి అని ఫ్రాంకెన్‌స్టైన్ తర్జనభర్జనలు పడుతూండగానే, అది అక్కడ లేనట్టు గమనిస్తాడు. నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంటాడు.

అక్కడి నుంచి మొదలవుతుంది అసలు కథ. కొన్నిరోజుల్లో తన చిన్న తమ్ముడు ఐదేళ్ళ విలియమ్ హత్యకు గురయ్యాడని తండ్రి నుంచి వార్త వస్తుంది. ఈ ఘోరవార్త వినగానే ఊరికి చేరుకుంటున్న తరుణంలో, తను సృష్టించిన అమానుషుడు (monster) పారిపోతూ కనిపిస్తాడు. ఈ హత్య అతనే చేశాడని అర్ధమవుతుంది అతనికి. కానీ ఎందుకు చేశాడు? ఒకవేళ చేసినా ఆ విషయాన్ని తను ఎలా నిరూపించగలడు? ఆ పిల్లవాడి దాది, నిరపరాధి, ఎంతో మంచిదైన 19 ఏళ్ళ జస్టిన్ వద్ద, విలియమ్ మెడలో వేసుకునే ఒక తాయత్తు వంటిది దొరకడంతో, ఆమెను దోషిగా నిర్ణయించి ఉరితీస్తారు న్యాయాధికారులు. ఫ్రాంకెన్‌స్టైన్‌కు స్పష్టంగా తెలుసు జస్టిన్ నిరపరాధి అని. ఆ అమ్మాయితో మాట్లాడతాడు. కానీ ఏమని చెప్పాలి? తను ఒక భయంకరమైన ప్రాణిని సృష్టించాడని చెబితే ఎవరైనా నమ్ముతారా? ఒక మనిషి మరో ‘మనిషి’ని ప్రయోగశాలలో సృష్టించాడంటే అది విశ్వసించదగ్గ విషయమేనా? తనను పిచ్చివాడికింద జమకట్టడం ఖాయం. అందుకే మౌనంగా ఉండిపోతాడు.

అయితే తనలోని అపరాధ భావనను బాధ భరించలేక, కుటుంబసభ్యులతో గడపలేక, ఒక్కడే కొండల్లోకి వెళ్తాడు. అక్కడ అతనికి తను సృష్టించిన ‘భయంకరుడు’ కనిపిస్తాడు. అప్పుడు ఆ అమానుషుడు తన కథను, తన సృష్టికర్త ఫ్రాంకెన్‌స్టైన్‌కు చెప్పుకుంటాడు.

మూడో కథకుడు అమానుషుడు

తనను ఫ్రాంకెన్‌స్టైన్ సృష్టించినందుకు ఎంతో సంతోషించాడు అమానుషుడు. కానీ సృష్టికర్త తనను చూసి భయపడి పారిపోగానే, బాధపడ్డాడు. ఇక అక్కడ ఉండలేక పారిపోతూ, ఒక అడవిలో జనసంచారం ఉన్న ప్రాంతంలో దాక్కున్నాడు. అక్కడ ఒక అందమైన, మంచివాళ్ళైన ఒక కుటుంబం (గుడ్డి తండ్రి, కొడుకు, కూతురు) తారసపడి, వాళ్ళను చూస్తూ రోజులు గడిపాడు. వాళ్ళ కంటపడకుండా ఎన్నోరోజుల పాటు వారిని దూరం నుంచి చూస్తూ, వారి కథను తెలుసుకుని ఆనందిస్తాడు. ఒకప్పుడు బాగా బతికిన ఆ కుటుంబం కొందరి కుట్రల వల్ల చితికిపోయిందని గ్రహించి బాధపడతాడు. ఆ కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు చూసి ముచ్చటపడతాడు. మానవజీవితం అందమైందని అనుకుంటాడు. రోజూ కట్టెలు కొట్టి తెచ్చి అమ్ముకుంటున్న ఆ కొడుకుకు సహాయంగా తనే రాత్రిపూట కట్టెలు తెచ్చి వాళ్ళ ఇంటిముందు పడేస్తూంటాడు. ‘ఆహా ఎవరో పుణ్యాత్ములు తనకు సహాయం చేస్తున్నారని’ ఆ కుర్రవాడు సంతోషించడం చాటుగా చూసి ఆనందిస్తాడు.

ఇలా కొంతకాలం గడిచాక, చివరికి తనను చూసి వాళ్ళు భయపడరు అని నమ్మకం చిక్కాక, ఇంట్లోకి వెళ్తాడు. అప్పుడు గుడ్డి తండ్రి మాత్రమే ఉన్నాడు కనక, ఇతని విగ్రహం చూడలేడు కనక, బాగానే పలకరిస్తాడు. కానీ త్వరలోనే పిల్లలు వచ్చి, ఇతనిని చూసి భయపడతారు. కొడుకు ఇతని మీద రాళ్ళు విసిరి గాయపరుస్తాడు. ఆ దెబ్బలకు అమానుషుడు మళ్ళీ అడవిలోకి పరిగెట్టిపోతాడు. మరుసటిరోజు అతను తిరిగి ఆ యింటికి వచ్చేసరికి, కూతురు, కొడుకు తండ్రిని తీసుకుని, అన్నీ వదిలేసి పారిపోతారు. మానవులు తనని ఇంతగా అసహ్యించుకోవడాన్ని భరించలేకపోతాడు అమానుషుడు. విచారంగా అక్కడినుంచి వెళ్తుండగా ఒక బాలుడు నీళ్ళలో పడిపోతే రక్షిస్తాడు. కానీ వాడి తండ్రి ఇతన్ని చూసి జడుసుకుని, తుపాకీతో కాలుస్తాడు. భుజానికి గాయమవుతుంది. మేలు చేసినవాడికి కూడ మనుషులు హాని చేస్తారని అర్ధమవుతుంది అమానుషుడికి. ఇక అక్కడినుంచి కోపం, పగ పట్టలేకపోతాడు. దీనికంతటికీ కారణం తన సృష్టికర్తే కనక అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని, ఊరికి వెళ్ళి నిలదీయాలని జెనీవా వెళ్తాడు. అక్కడ అదే కోపంలో విలియమ్‌ని చంపి, (ఫ్రాంకెన్‌స్టైన్ డైరీలను చదివాడు కనక అతని కుటుంబం వివరాలు తెలుసుకున్నాడు అమానుషుడు), అతని మెడలోని తాయత్తు అడవిలో వెళ్తున్న జస్టిన్ సంచీలో పడేస్తాడు. ఆ కారణంగా జస్టిన్ ఉరిశిక్షకు గురవుతుంది.

ఎట్టకేలకు జెనీవాలో తన సృష్టికర్త ఫ్రాంకెన్‌స్టైన్‌ని కలుసుకుని ‘మీ మనుషులు నన్ను భరించడం లేదు. కనక, నాకు ఒక తోడు నువ్వే సృష్టించాలి, నాలాంటి ఒక ఆడమనిషిని సృష్టించు. అప్పుడు మేమిద్దరం ఈ మానవలోకాన్ని వదిలి వెళ్ళిపోతాం’ అంటాడు. విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్ కుదరదంటాడు. అలాగైతే, నీ యావత్తు కుటుంబాన్ని నాశనం చేస్తానంటాడు అమానుషుడు. తప్పనిసరై మరో సృష్టికి అంగీకరిస్తాడు ఫ్రాంకెన్‌స్టైన్. తన వాగ్దానాన్ని మరిచిపోకుండా నిరంతరం ఫ్రాంకెన్‌స్టైన్‌ వెంటే తిరుగుతూంటాడు అమానుషుడు.

ఫ్రాంకెన్‌స్టైన్ మళ్ళీ ప్రయోగశాలకు వెళ్ళి సృజన కార్యక్రమం ప్రారంభిస్తాడు. కానీ కొంతకాలానికి ఆలోచనలో పడతాడు ‘వీడు ఇప్పటికే కల్లోలం సృష్టించాడు. మరో అమానుష ప్రాణిని సృష్టిస్తే ఈ లోకం మరింత ప్రమాదంలో పడుతుందికదా. ఒకవేళ వీళ్ళకు పిల్లలు పుడితే, ఒక దారుణమైన జాతిని సృష్టించిన వాడినవుతాను కదా’ అని తన నిర్ణయం మార్చుకుని సగంలో స్త్రీని సృష్టించడం మానేస్తాడు. కోపోద్రిక్తుడైన అమానుషుడు, ‘నీ పెళ్ళి రోజున కనిపిస్తాను’ అని హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్ తన పనిముట్లు తగలబెట్టి తన సృజనకు చరమగీతం పాడదామని నిర్ణయించుకుంటాడు. ఆ పనిచేసి తిరిగి పడవలో వస్తూండగా, ఐర్లండ్ తీరం చేరుకుంటాడు. అక్కడ దిగగానే అతని మిత్రుడు హెన్రీ సెవిల్ హత్యా నేరంపై అరెస్టవుతాడు. అమానుషుడే ఈ పని చేశాడని అతనికి అర్ధమవుతుంది. చాలారోజులు దుఃఖంలో మునిగిపోతాడు. చివరికి తండ్రి పిలవగా ఎలిజబెత్‌ని వివాహం చేసుకోడానికి జెనీవాకు వెళ్తాడు.

బాల్యం నుంచి ప్రేమించుకుంటున్న విక్టర్, ఎలిజబెత్‌లు వివాహం చేసుకుంటారు. కానీ విక్టర్ మనసు భయంతో కంపిస్తూంటుంది. తన అమానుషుడు ఎప్పుడు వస్తాడో తెలీక. అతన్ని వెతుక్కుంటూ పెళ్ళిరోజు రాత్రంతా ఆరుబయట తిరుగుతూంటాడు విక్టర్. చివరకు తిరిగి ఇంటికి రాగా, నిర్జీవంగా పడివున్న భార్య ఎలిజబెత్ కనిపిస్తుంది. ఆమెను ఎవరో గొంతుపిసికి చంపారని వైద్యుడు చెప్తాడు. విక్టర్ నిశ్చేష్టుడవుతాడు. తను ఆరుబయట వెతుకుతూండగా, అమానుషుడు అతని గదిలోకే వచ్చాడని అర్థమవుతుంది. ఎలిజబెత్ చనిపోయిన కొంత కాలానికే అప్పటికే విలియమ్, జస్టిన్‌ల మరణాలతో కృశించిన విక్టర్ తండ్రి కూడ మరణిస్తాడు. ఇక అక్కడ ఉండలేక విక్టర్, తను సృష్టించిన అమానుషుణ్ణి తుదముట్టించాలని నిర్ణయించుకుని అతన్ని వెతుక్కుంటూ బయల్దేరతాడు. అతను కనిపించాడని భావించిన దేశాలన్నీ తిరిగి చివరికి పడవలో ఉత్తరధృవం వైపు వెళ్తున్న అమానుషుణ్ణి చూసి, వెంటపడుతూండగా, పడవలో శోషవచ్చి పడిపోవడంతో వాల్టన్‌కి తారసపడతాడు.

మళ్ళీ మొదటి కథకుడు వాల్టన్:

విక్టర్ కథ అక్కడితో ఆగిపోగా, వాల్టన్ తన సోదరికి లేఖ కొనసాగిస్తాడు. ఈలోగా వాతావరణం మారి, అతని పడవ ప్రమాదంలో పడి, నావికులందరూ ఉత్తర ధృవం వద్దు, బతికుంటే బలుసాకు తినొచ్చు వెనక్కి వెళదాం అని కెప్టెన్‌ని అర్థిస్తారు. కెప్టెన్ మొదట వారిని ఉత్సాహపరచాలని ప్రయత్నిస్తాడు గానీ వాళ్ళు ఒప్పుకోరు. ఇదంతా విన్న విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్ తను మాత్రం తిరిగి వెళ్ళననీ, తను సృష్టించిన ఆ అమానుషుడిని వెతికి పట్టుకుని చంపిగానీ తిరిగిరానని, తను వేరే పడవలో వెళ్తాననీ అంటాడు. కానీ అలా చెప్పిన కొంతసేపటికే ఫ్రాంకెన్‌స్టైన్ మరణిస్తాడు. మరణించే ముందు వాల్టన్‌తో ‘find happiness in tranquility and avoid ambition’ అని బోధించి మరీ చనిపోతాడు. తన జీవితం అతనికి అదే నేర్పిందంటాడు. మరికొంత సేపటికే, తన సృష్టికర్త చనిపోయిన విషయం ఎలా తెలుసుకుంటాడో గానీ, అమానుషుడు ఈ నౌకలోకి వస్తాడు. తన సృష్టికర్తను చూసి ఏడుస్తాడు. ‘అతను బాధపడినదానికంటే తను జీవితంలో ఎక్కువ బాధపడ్డానని, అతనే చనిపోయాక తనకింక జీవితంతో పనిలేదని, చనిపోతున్నాననీ’ చెప్పి మళ్ళీ తన చిన్న పడవ ఎక్కి మాయమైపోతాడు. ఆ తర్వాత ఎప్పటికీ ఎవరికీ కనిపించడు. నా జీవితంలో ఇలాంటి కథ ఎక్కడా వినలేదని చెల్లెలికి ఉత్తరం ముగిస్తాడు వాల్టన్.

నవలారచన వెనక

బ్రిటిష్ సాహిత్యంలో అది ఒకవైపు కాల్పనిక కవిత్వం ఏలుతున్న యుగం. మరోవైపు పారిశ్రామిక విప్లవం స్థిరపడిన యుగం. కాల్పనిక యుగ ప్రభావంతో రచయితలు సైన్స్‌ని ప్రశ్నించడం మొదలైంది. హేతువాదాన్ని, ప్రకృతిపై మానవుడి నియంత్రణను రొమాంటిక్ కవులు ధిక్కరించారు; నిరసించారు. మనిషికీ, సహజ ప్రకృతికీ మధ్య విడదీయలేని బంధం ఉందని రొమాంటిక్ కవులు చాటి చెప్పారు. విజ్ఞాన శాస్త్రం అవధులకు అందని సృజన ఉండవచ్చునని, ఆత్మసంబంధమైన ఒక జీవితం మనిషిని ఆవహించవచ్చుననీ రొమాంటిక్ కవులు నమ్మారు. ఇలా విజ్ఞానశాస్త్రం తనకే తెలియని ఒక లోకంలోకి అడుగుపెడుతుందనే భయం ఒకటి అప్పటి ఆలోచనాపరుల్లో మొదలైంది. ఆ ‘భయమే’ ఈ నవలకు ప్రాణభూతలక్షణమైంది. అమానుషుడి పాత్ర సృష్టికి కారణమైంది. ఈ రొమాంటిక్ సిద్దాంతాల ప్రవర్తకుల్లో మేరీ భర్త పర్సీ షెలీ ముఖ్యుడు. అతని ప్రభావం సహజంగానే మేరీ మీద ఉంది. మరోవైపు సైన్స్ గురించి ఆలోచించడమే కాక, నేచురల్ సైన్స్ (ఇప్పుడు ఫిజికల్ సైన్స్) గురించి పుస్తకాలు రాసిన తండ్రి గాడ్విన్ ప్రభావమూ ఆమెపై ఉంది. కనక విజ్ఞానశాస్త్రాన్ని ఉపయోగించి మానవుల్ని సృజించవచ్చునన్న అనుమానం బహశా ఆమెకు కలిగివుండవచ్చు. (ఇప్పటి క్లోనింగ్‌లా). పందొమ్మిదో శతాబ్ది రెండో దశకంలో ఈ ఆలోచన రావడమే అబ్బురం. శాస్త్ర విజ్ఞానంతో ఇలాంటి ప్రయోగాలు చేయవచ్చునన్న ఆలోచన చేయడం అపురూపఘట్టం. అందుకే ఈ నవలను తొలి సైన్స్ ఫిక్షన్ నవల అన్నారు విమర్శకులు. అప్పటికింకా డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం పుట్టలేదు. (డార్విన్ రచన On the origin of species 1859లో ప్రచురింపబడింది). మనిషిని దేవుడు సృష్టించాడనే అందరూ నమ్ముతున్నారు. అలాంటిది, మనిషి మరో మనిషిని ప్రయోగశాలలో సృష్టించగలడన్న ఆలోచన అతి నూతనం, నమ్మశక్యం కానిది కూడా. అలాంటి ఊహ చేయగలిగినందుకే మేరీ షెలీని అభినందించారు విమర్శకులు.

కానీ సృజన అనేది గొప్పదైతే, మానవుడు మానవుణ్ణి సృష్టించడం మరీ అపురూపమైతే, ఆ సృజన పట్ల సృష్టికర్తకు అసహ్యం, ద్వేషం కలిగినట్లు ఎందుకు చిత్రించింది? ఈ ప్రశ్న నవల చదివిన ప్రతి ఒక్కరినీ కలచివేస్తుంది. మానవసృజన ఇంకా పరిపక్వం కాలేదు. అరకొరగా మాత్రమే ప్రయోగం జరిగింది. అందుకే మనమెరిగిన మానవ నిర్మాణం అమానుషుడి నిర్మాణంలో సాధ్యపడలేదు. సంపూర్ణ అవగాహనతో, విజ్ఞానంతో చేయలేనపుడు, ఆ సృజన ప్రమాదకారి అవుతుందన్న సూచన ఇందులో ఉంది. మిడిమిడిజ్ఞానం ఎంత వినాశకరమో ఈ నవల చెబుతుంది. అంటే సైన్స్‌కు ఎంత పరిమితివుందో పరోక్షంగా చెప్పింది రొమాంటిక్ యుగ ప్రభావితురాలైన మేరీ. మనిషి సృజించిన యంత్రాలకు విశేషాదరణ లభిస్తున్న పారిశ్రామిక విప్లవయుగంలో, అది నిర్జీవపరికరాలకే పరిమితమని, దాన్ని ‘అతిగా’ ఊహించుకుంటే విధ్వంసం తప్పదనీ సూచించదలుచుకుందేమో మేరీ.

మరో రకమైన విశ్లేషణ ప్రకారం, అమానుషుడు మరో వ్యక్తి కాడు. ఫ్రాంకెన్‌స్టైన్ అంతరాత్మే. కథానాయకుడు ఫ్రాంకెన్‌స్టైన్ తన మనసులోని దురూహలను, దుర్మార్గపు ఆలోచనలను, స్వంతవారిపై ఉన్న అక్కసునూ ఈర్ష్యనూ ఈ ‘సృష్టి’ నెపంతో వెళ్ళగక్కాడని మనోవైజ్ఞానిక విమర్శకులు కొందరు భావించారు. అమానుషుడికి పుట్టుకతో వచ్చిన భాషాజ్ఞానం, విశ్లేషణా సామర్థ్యం, ప్లూటార్క్, మిల్టన్ మొదలైన రచయితలనుంచి ఉల్లేఖించడం, అనేక భాషలు విని అర్థం చేసుకోవడం, తన భావాలను విపులంగా వ్యక్తీకరించగలగడం, భావోద్వేగాలు అనుభవించడం – ఇవన్నీ ఈ వాదనకు ఊతమిస్తాయి. అదే నిజమైతే ఇది ఆత్మహింసాకథనమవుతుంది. కానీ అదే నిజమైతే, తనకు కోపమున్నవారు అంతమొంది, తను ప్రేమించే ఎలిజబెత్ తన సహచరి అయ్యాక అతను శాంతించాలి. కానీ ఆమె అంతకంటే దారుణంగా హత్యకు గురవుతుంది. కనక, ఈ వాదనకు బలం తక్కువ.

ఫ్రాంకెన్‌స్టైన్ పాత్రను దాన్‌తే రాసిన పారడైజ్ లాస్ట్‌లో సాతాను పాత్రతోనూ, గ్రీకుపురాణాల్లోనీ ప్రొమీథియస్ (Prometheus) తోనూ పోల్చారు విమర్శకులు. సంప్రదాయాన్ని, అనాదిగా ఉన్న విశ్వాసాలను ధిక్కరించిన పాత్రలివి. నిజానికి మేరీ షెలీ తన నవలకు ఒక ఉపశీర్షిక పెట్టింది. ‘ఫ్రాంకెన్‌స్టైన్, లేదా, మాడర్న్ ప్రొమిథియస్’ అని. గ్రీకు పురాణాల్లో ప్రొమీథియస్ అనే దేవుడు, మానవులకు అందరాని, పవిత్రాగ్నిని తన దేవతాలోకం నుంచి తస్కరించి, మనుషులకు అందిస్తాడు. అంటే ఏదైతే ఇప్పటికవరకూ దేవతల పరిధిలో ఉందో దాన్ని మానవుల పరిధిలోకి తెస్తాడు. ఈ నవలలో ఫ్రాంకెన్‌స్టైన్ చేసే పని అదే. సృష్టించడం భగవంతుడి కార్యకలాపం కాగా, దాన్ని మానవుడికి ఆపాదించడం. ఆ పని మానవుడు కూడ చేయగలడని చెప్పడం.

అన్నిటికంటే ముఖ్యమైన అంశం – సృష్టికర్తకు, తన సృజన పట్ల ఏవగింపు కలిగితే, ఆ సృజన ఎలా స్పందించాలి? తనకు ప్రాణం పోసిన క్షణం నుంచి తన ‘దేవుడు’ ద్వేషిస్తూంటే, అమానుషుడు ఎంతో బాధపడతాడు. అందరు మానవుల్లా తనకు సాధారణ రూపం ఇవ్వకపోవడం వల్లనే కదా, మానవ జాతి తనని చూసి అసహ్యించుకుంటోంది? తనని ఎప్పటికప్పుడు గాయపరచడానికి ప్రయత్నిస్తోంది? తను ఎంత స్నేహంగా ఉండాలని అనుకున్నా, మనుషులెవరూ తనని దగ్గరకు రానివ్వడం లేదు. అందుకే తను మానవజాతిమీద పగబట్టాడు. అందరు మానవుల మీదా కాదు. తననిలా చేసిన ఒక్క తన సృష్టికర్త జీవితాన్నే నాశనం చేయాలనుకున్నాడు. ఆ పరిస్థితి తన సృష్టికర్తే కల్పించాడు.

“I am malicious because I am miserable. Am I not shunned and hated by all mankind? You, my creator would tear me to pieces and triumph… if I cannot inspire love, I will inspire fear, and chiefly towards you, my arch enemy, because my creator, do I swear inextinguishable hatred’ (పేజీలు 147/148).

ఫెమినిస్టుల విశ్లేషణ మరోరకంగా ఉంది. మేరీ షెలీకి అప్పటికే బిడ్డ పుట్టి చనిపోయింది. ఆమెకు అది విపరీతమైన బాధ కలిగించింది. ఆ వేదన ఈ సృజన వెనక ఉందని అంటారు. అంతే కాదు. పురుషుడు, స్త్రీ సహాయం లేకుండా, బిడ్డను సృష్టించడానికి పూనుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని, కేవలం పురుషుడే సృష్టిస్తే, అమానుషులే పుడతారనీ కూడ వ్యాఖ్యానించారు విమర్శకులు.

ఇలా చూస్తే ఈ నవలకు అనేక రకాలైన విశ్లేషణలు, భాష్యాలు చెప్పడానికి అవకాశం ఉంది. ప్రచురింపబడిన నాటి నుంచీ విశేషప్రాచుర్యం పొందిన ఈ నవల 20వ శతాబ్దిలో ఇతర కళారూపాలను ఆకర్షించింది. 1910 నుంచి షార్ట్ ఫిల్మ్‌లు, పూర్తి స్థాయి సినిమాలు, టి.వి. కార్యక్రమాలు దీని ఆధారంగా వచ్చాయి. ప్రజాకళారూపాల్లో, సంస్కృతిలో ఫ్రాంకెన్‌స్టైన్ నవలను యథాతథంగా కంటే, ఒక ప్రతీకగా చూపడం ఎక్కువ. హారర్ సినిమాల్లోనూ, అమానుషమైన ప్రవర్తనను సంకేతించడంలోనూ ఈ పేరును వాడుకోవడం ఎక్కువైంది. Frankenstein’s Monster అనాల్సింది పోయి, ఈ కళారూపాల్లో ఫ్రాంకెన్‌స్టైన్ అనే వాడడం వల్ల, ఎక్కువగా ఈ పేరే ‘అమానుషుడు’ అనే అర్థంలో మిగిలిపోయింది. DC Comics, Marvel Comics లతో సహా, ఈ పేరును, ఈ పాత్రను వాడుకోని వారు లేరంటే అతిశయోక్తి కాదు. హాలీవుడ్‌లోని అనేక హారర్ సినిమాలకు స్ఫూర్తి ఈ ఫ్రాంకెన్‌స్తైన్ నవలే. కేవలం పాపులర్ కల్చర్‌లో ఫ్రాంకెన్‌స్టైన్ గురించి చెప్పాలన్నా మరో సుదీర్ఘ వ్యాసం తయారవుతుంది. మేరీ షెలీ ఈ నవల రచనా క్రమం గురించి ఇలా అంది:

‘Invention… does not consist in creating out of void; but out of chaos…’ (ఫ్రాంకెన్‌స్టైన్ – రచయిత్రి ఉపోద్ఘాతం, పేజీ 15).

అలాంటి విధ్వంసం నుంచి పుట్టిన అసాధారణమైన నవలే ఇది.


సి. మృణాళిని

రచయిత సి. మృణాళిని గురించి: రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ...