స్వీయచరిత్రలు: వలసకాలపు ఆంధ్రసమాజం

సాహిత్యానికీ చరిత్రకూ అవినాభావ సంబంధం ఉన్నదని అందరూ ఎరిగిందే. అయితే ఆ క్రమాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్న అవగాహన ఎక్కువమందికి లేదు. అందులోనూ చారిత్రక దృష్టి తక్కువగా ఉన్న తెలుగు సమాజంలో, చారిత్రక ఆధారాలు అతి తక్కువగా కాపాడుకునే తెలుగు సంప్రదాయంలో, ఈ అధ్యయనం చేయడం అంత సుళువు కాదు. ఇదే కష్టం అనుకుంటే, 19వ శతాబ్దపు తెలుగు సామాజిక, సాహిత్య చరిత్రలపై మనం దృష్టిని అంతగా సారించలేదని ఒప్పుకోక తప్పదు. తెలుగు సాహిత్యంలో 19వ శతాబ్ది వరకూ ఉన్న కవులు, రాజులు, కావ్యాల గురించి కొద్దో గొప్పో సమాచారం లభిస్తోంది (కావ్యావతారికలు, శాసనాలు, అనంతర కవుల ప్రశంసలూ, లక్షణగ్రంథాల ద్వారా). అందుకే నాటి సామాజిక చరిత్రను ఆయా కావ్యాలపై ఆధారపడి ఊహించుకోవాల్సిందే తప్ప విడిగా లభించే ఆధారాలు తక్కువ.

కానీ 19వ శతాబ్ది విషయం అలా కాదు. అది మనకు సమీపగతకాలం. కనుక, సామాజిక చరిత్ర నిర్మాణానికి కేవలం సాహిత్యం పైనే ఆధారపడవలసిన అవసరం ఉండకూడదు. కానీ, ఇక్కడ కూడ సాహితీగ్రంథాలను ఆలంబన చేసుకున్నప్పుడే ఆ సమాజం గురించి సరైన అవగాహన సాధించగలుగుతున్నామంటే, అది సాహిత్యం గొప్పదనమా, లేక చారిత్రక రచనల కురచదనమా అన్నది ఆలోచించాల్సిన విషయమే. ఈ నేపథ్యంలో వకుళాభరణం రాజగోపాల్, ఆత్మకథలను ఆధారం చేసుకుని వలసవాద సమాజాన్ని విశ్లేషించాలనుకోవడం మెచ్చుకోవాల్సిన, సమర్థించాల్సిన విషయం.

ఆ మెచ్చుకోలుకు మరో కారణం – 19వ శతాబ్ది నుంచి వచ్చిన సాహిత్యం, దానిలోని వలస తత్వం, ఆ అర్ధశతాబ్ది రచనలను ఎలా అధ్యయనం చెయ్యాలి, ఎలా అర్థం చేసుకోవాలి అన్నది విపులంగ చర్చించడం ఇంతవరకూ వచ్చిన తెలుగు సాహిత్య పరిశోధనల్లో కనిపించదు. (కొంతవరకు అక్కిరాజు రమాపతిరావు, కొత్తపల్లి వీరభద్రరావుగార్లు కృషి చేసినప్పటికీ.) 19వ శతాబ్ది అనగానే సి. పి. బ్రౌన్, చిన్నయసూరి, వీరాస్వామయ్య పేర్లు అందరికీ మామూలుగా గుర్తుకొస్తాయి. వారిని అద్భుతమైన విశేషణాలతో కొలవడం కూడ మనకు మామూలే. కానీ వారిని ఆనాటి సామాజిక, సాంస్కృతిక నేపథ్యంలో, మరీముఖ్యంగా వలసవాద భావజాలపు నేపథ్యంలో ఎలా అంచనా వెయ్యాలన్న దృష్టి అంతగా కనిపించదు. ఆ లోటును పూడ్చిన పుస్తకం రాజగోపాల్ రాసిన స్వీయ చరిత్రలు: వలసకాలపు ఆంధ్ర సమాజం (తెలుగు అనువాదం: దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి). తెలుగు సాహిత్యపరిశోధకులు చేయవలసిన పనిని ఒక చరిత్రపరిశోధకుడు చేసి చూపించినందుకు రాజగోపాల్‌ను ముందుగా అభినందించాలి.

ఇక ఈ రచనలో ఆయన ఎన్నుకున్న మార్గమేమిటి? అప్పటి పద్యకావ్యాలనో, నాటకాలనో, అనువాదాలనో, నవలలనో కాక, స్వీయచరిత్రలను ఎంచుకోవడం. స్వీయచరిత్రే ఎందుకు? తను అధ్యయనం చేసిన ‘ఇంటరాక్షన్‌కి ఇవే అనుకూలం కనక’ అని రాజగోపాల్ ముందే చెప్పుకున్నారు. సృజనాత్మక సాహిత్యంకంటే, స్వీయానుభవం, ప్రాపంచిక దృక్పథాల పునాదిపై రచించబడిన ఆత్మకథల ద్వారానే ఆనాటి సామాజిక చరిత్రను పట్టుకోవడం ఈ పరిశోధకుడి లక్ష్యంగా అర్ధమవుతుంది.

ఆయన ఎంచుకున్న ఆత్మకథలు – బ్రిటిష్‌వారి కొలువులో పని చేసి, ఇంగ్లీషులో ‘జాగ్రత్తగా’ ఆత్మకథ రాసుకున్న వెన్నెలకంటి సుబ్బారావు – The Life of Vennelacunty Soob Row (1873); క్రైస్తవమతప్రచారాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన వీరాస్వామయ్య యాత్రాచరిత్ర (1830-31 లో రచన); బ్రిటిష్ పాలనను గౌరవిస్తూ, పాశ్చాత్య సంస్కరణల నేపథ్యంలో తెలుగు సమాజంలో పరివర్తనకు ప్రయత్నించిన వీరేశలింగం స్వీయచరిత్రం (1903-1915); వలసపాలన నేపథ్యంలో, సంక్లిష్ట స్థితిలోనూ తమ జీవితాలను ప్రభావవంతంగా మలుచుకున్న సంప్రదాయ పండితులు ఆదిభట్ల నారాయణదాసు నా యెఱుక (1953 లో ప్రచురితం); చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి స్వీయచరిత్ర (ప్రచురణ: 1950); తన కథ ద్వారా స్త్రీల సామాజిక ప్రతిపత్తి గురించి ఆలోచింపచేసిన ఏడిదము సత్యవతి ఆత్మచరితము (1934); చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు స్వీయచరిత్ర (1942). ఈ స్వీయచరిత్రలన్నీ రాసిన వెంటనే ప్రచురింపబడలేదు. కొన్ని తర్వాతికాలంలో అందుబాటులోకి వచ్చాయి.

ఇది పిహెచ్.డి. సిద్దాంతగ్రంథం కనక, తను పరిశీలించదలిచిన రచనల కంటే ముందు ఆత్మకథల నిర్వచనం, లక్షణాలు వాటికి సంబంధించిన సిద్ధాంతాలను రాజగోపాల్ చర్చించారు. ఆత్మకథలను సామాజిక చరిత్ర నిర్మాణానికి ఇంతవరకూ ఏ పరిశోధనా ఉపయోగించుకోలేదు కనక తను ఆ పనికి పూనుకున్నట్టు ఆయన చెప్పారు. అది నిజమే. తెలుగులో సుప్రసిద్ధమైన తొలి స్వీయచరిత్ర కందుకూరి వీరేశలింగంది. (అదే తొలి స్వీయచరిత్ర కాదని ఎప్పుడో రుజువైనప్పటికీ). ఈ స్వీయచరిత్రను బట్టి ఆయన కార్యక్షేత్రం, సాహిత్యక్షేత్రం తెలుస్తున్నాయన్న విశ్లేషణలు తప్ప, దాని ద్వారా తెలుస్తున్న ఆనాటి సమాజపు వలసవాద స్వభావాన్ని తెలుగు పరిశోధకులు పెద్దగా పట్టించుకోలేదు.

తెలుగు ఆత్మకథల్లోకి వెళ్ళే ముందు ఆత్మకథల సిద్దాంతాలను విపులంగా పరిచయం చేశారు రాజగోపాల్. ఈ సిద్ధాంతాల ప్రకారం, ఆత్మకథ కేవలం సాహిత్యప్రక్రియ కాదు. అది మానవానుభవానికి ప్రాతినిధ్యం వహించే ఒక విధానమని, ఆత్మకథారచనకు నవలాపఠనం ముఖ్య ప్రేరణా ఆధారమని, నవలకూ ఆత్మకథకూ తేడాను గుర్తించడంలో పాఠకుడి పాత్ర కీలకమైనదనీ పలువురి సిద్దాంతాలను క్రోడీకరించి మనకు అందించారు. ఆత్మకథల పరిణామక్రమం గురించిన ఈ వివరణ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. అగస్టీన్ నేరాంగీకార కథనం (కన్ఫెషన్) నుంచి బిల్డుంగ్స్‌రోమన్, తీర్థయాత్ర, సాహసగాథ వంటి వాటి మీదుగా క్రమంగా ఇప్పుడు మనం చెప్పుకునే ఆత్మకథ రూపొందిన విదానాన్ని అందించిన తీరు బాగుంది. ఆత్మకథలో ఉత్తమపురుష కథనం, ప్రథమ పురుష కథనం, వచనం, పద్యం వంటి అన్ని రూపాలనూ రాజగోపాల్ గుర్తించారు.

రెండో అధ్యాయంలో తొలి తెలుగు వ్యక్తి ఇంగ్లీషులో రాసిన ఆత్మకథను, మరో యాత్రాచరిత్రను విశ్లేషణకు ఎన్నుకున్నారు. ఇంతవరకూ తెలుగులో ఆత్మకథల పరిశీలన చేసిన రచనలు గాని, ఉపన్యాసాలు గానీ యాత్రాచరిత్రలను పెద్దగా పట్టించుకోలేదు. కనక ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రాచరిత్రను రాజగోపాల్ ఆత్మకథల కోవలో పెట్టడం కొంత ఆశ్చర్యాన్ని, ఆసక్తిని కలిగిస్తుంది. (ఇటీవల తెలుగులో యాత్రాకథనాల వర్షం కురుస్తోంది. వాళ్ళందరూ ఆత్మకథలు రాసుకోనవసరం లేదేమో). అయితే యాత్రాకథనంలోని ఆత్మకథనానికి, ఆత్మకథలోని కథనానికీ మధ్య తేడాని రాజగోపాల్ చక్కగా విశ్లేషించారు. యాత్రాకథనంలో పరిసరాలు, సామాజిక చరిత్ర విపులంగా ఉండగా, ఆత్మకథలో రచయిత వ్యక్తిగత జీవిత వివరాలు ప్రధానస్థానం ఆక్రమిస్తాయి. ఈ రెండిటినీ కలిపి పరిశీలించినపుడు ఆ కాలపు చరిత్ర కొంతైనా అర్థమవుతుందన్న తన ప్రతిపాదనను రాజగోపాల్ బాగ సమర్థించారు. సుబ్బారావు ఆత్మకథపై ఇంత విపులంగా చర్చించిన తొలి వ్యక్తి రాజగోపాలే కావచ్చు. ఆయన ఆత్మకథ నెపంగా, అప్పటి దేశీయ విద్యావిధానం, ఇంగ్లీషు పాలకులను మెప్పించాలన్న తెలుగు మేధావుల ప్రయత్నం, నియోగి కులం స్వరూపస్వభావాలు, దక్షతలు అన్నీ ఇందులో చర్చకు వచ్చాయి. (గురువుగారు వెల్చేరు నారాయణరావు ప్రభావం ఇక్కడ బాగానే కనిపిస్తుంది). ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రాచరిత్ర గురించి విపులంగా చెబుతూ, తొలిసారి జాతీయవాదాన్ని తెరపైకి తీసుకువచ్చిన వ్యక్తి అతను అని రచయిత చెప్పడం చాలా ఆసక్తికరం. వీరాస్వామయ్యను ఎంతకీ తొలి యాత్రాచరిత్ర రచయితగ భిన్నమైన వచనశైలికి ఆద్యుడిగా చెప్పడమే తప్ప, ఇంతవరకూ ఎవరూ పెద్దగా పట్టించుకోని విషయం ఇది. క్రైస్తవులతో చర్చల్లో హిందూమతం, హిందూ జనజీవనం, సంస్కృతుల గురించి వాదించి, దాని ఆధిక్యాన్ని నిరూపించడానికి అతను చేసిన యత్నాన్ని నిశితంగా పరిశీలించి ఈ వ్యాఖ్య చేశారు రాజగోపాల్. అయితే స్త్రీల విషయంలో మాత్రం అతను ఛాందసుడిగానే మిగిలిపోయాడని కూడ గుర్తించారు. జాతీయోద్యమం అన్నది ఏదీ లేనికాలంలో జాతీయత అన్న అంశాన్ని తొలిసారిగా గుర్తించిన వీరాస్వామయ్యను మళ్ళీ తెలుగు పరిశోధకులు చదవాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనం గుర్తు చేస్తుంది.

మూడో అధ్యాయం కందుకూరి వీరేశలింగం గురించి. 19వ శతాబ్ది తెలుగు మేధావుల ఆలోచనల్లోని క్రమపరిణామాన్ని చెప్పడానికి రాజగోపాల్ ఎన్నుకున్న రచయితలు సరైనవారే. వెన్నెలకంటి సుబ్బారావు ఆంగ్లేయులను ఏ మాత్రం విమర్శించకుండా జాగ్రత్తపడడంతో సమాధానపడ్డాడు. పైగా ఆంగ్లేయుల భాషాభ్యసన విధానం, దేశీయ విద్యావిధానం కంటే మెరుగ్గా ఉందని కూడ చెప్పుకొచ్చాడు. కానీ వీరేశలింగం అంతకంటే మరో అడుగు ముందుకు వేసి, పాశ్చాత్యుల సంస్కరణ భావాలను ఒంటబట్టించుకున్నాడు. వీరేశలింగం పంతులు దేశము, అభివృద్ధి, వికాసము అనే పదాలను ఎంతో స్ఫూర్తిదాయకంగా వాడినప్పటికీ, దాని వెనక ఉన్నది జాతీయవాదం కాదని పరిశోధకుడు సరిగ్గానే గుర్తించారు. ఎందుకంటే బ్రిటిష్ పాలనను, దానివల్ల భారతీయ సమాజానికి చేకూరిన ప్రయోజనాలను వీరేశలింగం పూర్తిగా సమర్ధించాడు. ఈ క్రమంలో 1907లో తెలుగు ప్రాంతాల్లో జాతీయవాదం ఉధృతమైన తర్వాత వీరేశలింగం ఒకరకంగా ఏకాకి అయ్యాడనడం సరైన విశ్లేషణే. రాజగోపాల్ చేసిన మరో మంచి పని, వీరేశలింగం స్వీయచరిత్రతో పాటు, జొన్నవిత్తుల గురునాథం రాసిన (1911) వీరేశలింగం జీవితచరిత్రను, వీరేశలింగం నవల రాజశేఖరచరితమును కూడ చర్చించడం. ఒక వ్యక్తి స్వీయచరిత్రను, వారి జీవితచరిత్ర, సృజనాత్మక రచనలతో కలిపి చూడడం మంచి పరిశోధనకు, విశ్లేషణకు తోడ్పడుతుంది.

ఈ అధ్యాయం కేవలం వీరేశలింగం స్వీయచరిత్రలోని విషయాలతో సరిపెట్టుకోక, అప్పటి ఆంధ్ర దేశ రాజకీయ చరిత్రను (వీరేశలింగంతో సంబంధంలేని అంశాలతో సహా) వివరిస్తుంది. వీరేశలింగం వారసత్వం సామాజిక, సాహిత్యరంగాలపై చూపిన ప్రభావాన్ని రాజగోపాల్ చక్కగా అంచనావేశారు. బ్రాహ్మణుడైన వీరేశలింగం బ్రాహ్మణ కులంలోని లోపాలను, అసమానతలను గర్హించడం మొదలైన తర్వాతే ఇతర కులాలవారు బ్రాహ్మణులను అభిశంసించడం, బ్రాహ్మణవ్యతిరేక ఉద్యమం తమిళనాడులో మొదలుకావడం జరిగాయని ఆసక్తికరమైన, సహేతుకమైన విశ్లేషణ చేస్తారు. (తమ కులంలోని లోపాలను, బలహీనతలను బ్రాహ్మణులే మొట్టమొదట గుర్తించి, ఖండించారనడానికి కందుకూరితో పాటు, గురజాడ, చలం వంటి వారెందరో కనిపిస్తారు.)

ఆత్మకథ, నవలలు రెండిటికీ సన్నిహిత సంబంధం ఉన్నదన్నది రాజగోపాల్ వాదన. తొలిదశలో అన్ని భాషల్లోనూ నవలలు ఉత్తమపురుష కథనంలో ఉండడం వెనక ఈ సంబంధమే కారణమన్న సూచన కూడ చేశారు (అధోజ్ఞాపికల్లో). అయితే ఉత్తమపురుష కథనం నవలాకారుడు అవలంబించే ఒక శిల్పవ్యూహంలో భాగం కాదా అని అనుమానం వస్తుంది. ఉత్తమపురుషలో రాసినంత మాత్రాన ఆ నవలలో కథకుడు, రచయిత కానవసరం లేదు కదా. కథకుడు, రచయిత అన్న వింగడింపును అర్థం చేసుకున్నపుడు, ఉత్తమపురుష కథనంలో రచయిత ఉండనవసరమే లేదన్నది కూడ అర్ధమవుతుంది. (ఉదాహరణకు విశ్వనాథ మాబాబులో కథకుడు, రావిశాస్త్రి గోవులొస్తున్నాయి జాగ్రత్తలో కిరీటి ఏ కోశానా రచయితలు కాలేరు కదా). కనక, ఆత్మకథకూ, నవలకూ ఉన్న సంబంధం బొత్తిగ తీసేయవలసింది కాకున్నా, ఈ పరిశోధకుడు ఊహించినంత ఎక్కువగా ఉండదు. నవలాశిల్పాన్ని సూక్ష్మంగా అధ్యయనం చేసినపుడు, కథకుడు, రచయిత ఇద్దరూ ఒకరే కారని స్పష్టమవుతుంది.

ఆదిభట్ల నారాయణదాసు నా యెఱుక పేరుతో రాసిన ఆత్మకథను రాజగోపాల్ చాలా విపులంగా వివరించారు. ఇక్కడ కూడ తులనాత్మక దృష్టితో ఆకాలం రచనలను విశ్లేషించారు. దేవదాసీ వ్యవస్థను అసహ్యించుకుని, వివాహాలలో మేజువాణీని నిరాకరించిన కందుకూరి, దేవదాసీల వద్ద జావళీలు నేర్చుకుని తన హరికథాగానాన్ని పరిపుష్టం చేసుకున్న ఆదిభట్ల – ఇద్దరూ ఏకకాలంలో స్వీయచరిత్రలు రాయడం ఒక ఆసక్తికరమైన సన్నివేశం. నారాయణదాసు జీవితంపై, ఆలోచనలపై వలస పాలన ప్రభావం పెద్దగా కనిపించదు. ఇది కూడా కందుకూరికీ ఆయనకూ ఉన్న వ్యత్యాసమే. వలసపూర్వపు తెలుగు సమాజమే నారాయణదాసు ఆత్మకథలో ప్రతిబింబించడం కనిపిస్తుందంటారు రాజగోపాల్. ఈ ఇద్దరు ‘తొలి తెలుగు స్వీయచరిత్రకారుల’ మధ్య చక్కని తులనాత్మక అధ్యయనానికి కావలసిన ముడిసరుకు ఈ పుస్తకంలో లభిస్తుంది. కానీ రాజగోపాల్ ఆ పనిని ఇంకా విపులంగా చేయగలిగివుండీ చేయలేదనిపిస్తుంది. ఇద్దరి స్వభావాలు, ఆలోచనాధోరణుల్లోని తేడాలు చెప్పారు గానీ బహుశా నారాయణదాసుని తగినంతగా విమర్శించలేదనిపిస్తుంది. కందుకూరిలో లోపాలను వ్యాఖ్యానించినంతగా ఇతని విషయంలో చేయలేదు. వలసపాలన తెచ్చిన సౌకర్యాలు (రవాణా,ముద్రణ ఇత్యాదులు) తన పేరు ప్రతిష్టలకు కారణమైనప్పటికీ దాసు వారిని దూషిస్తూనే ఉండడం, స్త్రీలకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ (వితంతు వివాహాలను ఆయన తిరస్కరించాడు) ఫక్తు సంప్రదాయవాదిగానే మిగిలిపోవడం, తన జీవితంలో ఎంతమందితో సంబంధం (దేవదాసీలు) పెట్టుకున్నా, ఇంగ్లీషువారికి స్త్రీ సంపర్కం ఎక్కువని ఎగతాళి చేయడం – ఇవన్నీ ఒకరకంగా ఆయనలోని హిపోక్రసీని తెలిపేవే. కానీ అది సామాజిక సందిగ్ధ పరిణామదశలో ఒక కళాకారుడి మనసులోని ద్వంద్వ భావనల కింద పరిగణించి, సమర్థించినట్లు కనిపిస్తుంది. ఆ రకంగా ఈ గ్రంథం కందుకూరి కంటె ఆదిభట్లను కావాలనే పైన కూర్చోబెట్టినట్టు అనిపిస్తుంది.

ఆదిభట్ల జ్ఞాపికలుగా స్వీయచరిత్ర చెప్పిన తొలి రచయిత అయితే, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి పద్యాలలో ఆత్మకథ రాసిన తొలి తెలుగు రచయిత. ‘జాతకచర్య’ నుంచి ‘ఇటీవలి చర్య’ వరకు సాగిన ఆయన ఆత్మకథను చక్కగా పరిచయం చేశారు రాజగోపాల్. ఈ ఆత్మకథలో సామాజికత కంటే సాహిత్యపరమైన విషయాలే ఎక్కువున్నాయి. అందులోనూ తొలిభాగమైన జాతకచర్యలో గ్రహాలు, జ్యోతిష్కులు వంటి విషయాల ప్రభావం తన జీవితంపై ఎలా ఉందని చెప్పడం, ఇటీవలి చర్యలో తమ సాహిత్యవిరోధులను ఓడించడం, విమర్శించడమే పనిగా పెట్టుకున్న వైనం కనిపిస్తుంది. సమాజానికి సంబంధించిన విషయాలకు వస్తే, ఇతను కందుకూరి కంటే నారాయణదాసుకే చేరువగా కనిపిస్తాడు. బాలికల విద్య, వితంతు వివాహాలు, విడాకుల చట్టాన్నీ వ్యతిరేకించడం, దేవదాసీ వ్యవస్థను మాత్రం సమర్థించడం ఈయన ఆత్మకథను బట్టి తెలిసే విషయాలు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కింది వర్గాలవారికి అవకాశం ఇవ్వడాన్ని, మాలమాదిగలను హరిజనులని పిలవడాన్ని, వారికి ఆలయప్రవేశం కల్పించాలన్న నినాదాన్నీ ఈయన వ్యతిరేకించారు. కనక వెంకటశాస్త్రి వలసపాలన పూర్వస్థుడు కాకున్నా, ఆ పడికట్టు భావజాలం నుంచి బయటపడలేకపోయాడని స్పష్టంగానే తెలుస్తుంది.

తెలుగులో మహిళ రాసిన తొలి ఆత్మకథ ఏడిదము సత్యవతి ఆత్మచరితము (1934). ఈ రచన చిన్నదైనా, రాజగోపాల్ విశ్లేషణ లోతుగా ఉంది. మొదటి భాగంలో చిన్నప్పుడే ఒక అబ్బాయిని కలవడం, అతనితో సరదా సంభాషణ జరపడం, తర్వాత అతన్ని పెళ్ళి చేసుకోవడం, అతని ఉద్యోగం, అనారోగ్యంతో అతని మరణం – ఈ సంఘటనలతో కూడిన ఆమె కథ మాత్రమే ఉంటుంది. ఇందులో తేదీలు, ఇతర వివరాలేమీ ఉండవు. కానీ రెండో భాగంలో ఆమె సమాజాన్ని, స్త్రీల ప్రతిపత్తిని గురించి వేసే ప్రశ్నలు ఆమె మనసులోతులను మనకు తెలుపుతాయి. ఈ రచన నేపథ్యంలో రాజగోపాల్ 19వ శతాబ్ది ఉత్తరార్థంలోని స్త్రీల స్థితిగతులను చర్చిస్తారు.

ఏడిదము సత్యవతి – పాతివ్రత్యం, వితంతువులు, బాల్య వివాహాలు, వితంతు పునర్వివాహాలు, దాంపత్యంలో ఆనందంకోసం సూచనలు, సృష్టి రహస్యం, శ్రాద్ధాలు పెట్టడం, భగవంతుడి లీలలు మొదలైన అనేక అంశాలపై తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పారు. వాటిలో కనిపించే అభ్యుదయ దృక్పథాన్ని, తార్కికతను రాజగోపాల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాజగోపాల్ ఆమె రచనావిధానాన్ని ‘ఆలంకారిక వ్యూహం’ అని చాలా ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. అంతకు పూర్వం తను అవలంబించిన విశ్లేషణాపద్ధతుల కంటే భిన్నంగా ఒక విలక్షణమైన పద్ధతిలో చేసినట్టు నాకనిపించింది. ఒకరకంగా ఆమె కల్పనాసాహిత్యంలో ఉపయోగించే రచనా వ్యూహాన్ని ఆత్మచరిత్రంలో ఉపయోగించిందన్న వ్యాఖ్యానం కొత్తరకమైంది.

తను, భర్త తొలిసారిగా కలుసుకున్న సన్నివేశాన్ని (అతనికి 13, తనకు 10 సంవత్సరాలు అప్పుడు) ఆమె తను చదివిన సాహిత్యం ఆధారంగా రొమాంటిక్‌గా వర్ణించివుంటుందని అతని ఊహ. అలాగే వివాహమైన కొంతకాలానికే వితంతువైనప్పటికీ, తనని తాను పదే పదే పతివ్రతగా ప్రకటించుకోవడంలో ఆమెలోని ఊహాత్మక ఆలోచనావిధానాన్ని సరిగ్గా పట్టుకున్నారు రాజగోపాల్. ఒక దశలో తనని తాను సతీసావిత్రితో కూడ పోల్చుకుంటుంది. తను పతివ్రతనని చెప్పుకోవడంవల్ల సమకాలీన సమాజంలో తనకు స్త్రీల స్థితిగతుల గురించి మాట్లాడే అధికారం లభించినట్లు ఆమె భావించిందన్న రాజగోపాల్ మాటల్లో తర్కం ఉంది. సత్యవతిని కేవలం స్త్రీలకు సంబంధించిన చైతన్యం కలిగిన తొలిదశ రచయిత్రిగానే కాక, మూఢనమ్మకాలను, సంప్రదాయాలను, ఆచారవ్యవహారాలను ప్రశ్నించే ఒక హేతువాదిగా కూడ రాజగోపాల్ నిరూపించారు. స్త్రీ చరిత్రకారులకి కూడ ఇంతవరకూ తెలియని విషయాలను సత్యవతి గురించి చెప్పడంలో కృతకృత్యులయ్యారు. అలాగే 19వ శతాబ్దిలో స్త్రీ విద్య గురించి రాజగోపాల్ ఇచ్చిన వివరాలలో కొన్ని నా మట్టుకు నాకు ఇంతవరకూ తెలియవు. (ఉదాహరణకు 1867 లో జానకమ్మ విశాఖపట్నంలో బాలికలకు పాఠశాల తెరిచిన విషయం). ఆ శతాబ్దిలో ఏ పండితుడు బాలికావిద్య పక్షాన నిలిచారో, ఎవరు ఖండించారో కూడ చెబుతూ మంచి సమాచారాన్ని అందించిన అధ్యయనం ఇది. భండారు అచ్చమాంబ, కనుపర్తి వరలక్ష్మమ్మలతో సత్యవతిని పోల్చడం కూడ, స్త్రీల ఆలోచనల్లో పరిణామక్రమం గురించి పాఠకులకు ఒక అవగాహన కలిగించడంలో భాగమే. అయితే కనుపర్తి, ఈమె ఒకేసారి రచనలు చేసినప్పటికీ, సత్యవతిలో జాతీయదృక్పథం ఏ మాత్రం కనిపించకపోవడం, వరలక్ష్మమ్మ తన లేఖల్లో జాతీయోద్యమం గురించే ఎక్కువగా రాయడం – ఈ తేడాని మరింత చర్చించివుంటే బాగుండేది.

ఆఖరుగా విశ్లేషించిన చిలకమర్తి స్వీయచరిత్రలో పరిశోధకుడికి చిలకమర్తి పట్ల ఉన్న అభిమానం, గౌరవం వ్యక్తమవుతాయి. ఇతరుల స్వీయచరిత్రల్లా వీరిది ప్రసిద్ధి చెందకున్నా, దేనికీ ఇది తీసిపోదని రాజగోపాల్ మంచి విశ్లేషణ చేశారు. తనని తాను తక్కువ చేసుకున్నా, ఆయన జీవితం తెలుసుకోవడం కూడ అవసరమని, ఆయన వినయం ఆయన సాధించినదాన్ని తక్కువ చెయ్యలేదనీ రాజగోపాల్ అనడం సమంజసంగా అనిపిస్తుంది. ఈ సిద్ధాంతవ్యాసం వల్ల తెలుగు సాహిత్య చరిత్రకు అందుతున్న కొత్త విలువలేమిటి? అన్నది ఆలోచించాల్సిన విషయం.

  1. సామాజిక, రాజకీయ దృక్పథంతో సాహిత్యచరిత్ర నిర్మాణానికి అవలంబించాల్సిన సూత్రాలేమిటో ఈ రచన చెబుతుంది.
  2. ఒక పాఠ్యం అందించే అంతర్గతసాక్ష్యంతో పాటు, అప్పటి సమాజంలోని అదే అంశాలను పరిశీలిస్తూ, రెండిటికీ ఉన్న తారతమ్యాలను విశ్లేషించడం ఎలాగో చూపుతుంది.
  3. తెలుగు పరిశోధకులు ఎక్కువగా పట్టించుకోని వలసపాలన అధ్యయనం ఎలా చెయ్యాలో, ఎందుకు చెయ్యాలో ఈ రచన స్పష్టం చేస్తుంది.
  4. ఏ రచయితమీదా తీర్పుల జోలికి పోకుండా, సంయమనంతో పరిశోధనా వ్యాసం రాయడం, విస్తృతమైన తన అధ్యయనాన్ని సమగ్రమైన ఆధారాలతో సహా చెప్పడం తెలుగు పరిశోధకులకు మార్గదర్శనం చేసే విధంగా ఉన్నాయి.

ఇకపోతే, స్వీయచరిత్రల అధ్యయనంలో, చర్చించగలిగిన మరికొన్ని విషయాలను ఆయన వదిలేశారనిపించింది. అవి…

ఆత్మకథల సిద్ధాంతాన్ని చెప్పినంతగా, అంటే వివిధ ఆకరాలనుంచి సేకరించిన సమాచారాన్ని అందించినంతగా, వాటిపై తన అభిప్రాయాలను ఎందుకు చెప్పలేదు? ఆత్మకథలను రచయితలు తమ కోసం రాసుకుంటారా లేక వాళ్ళకు లక్ష్య పాఠకులుంటారా? ఆత్మకథారచనలో నిజాయితీకి, సత్యనిష్టకూ ఉన్న విలువ ఏమిటి? తను సేకరించిన యూరోపియన్ లేదా ఇతర భారతీయ భాషల్లోని ఆత్మకథల్లో కేవలం సమాజాన్ని మెప్పించే కథనంతో, తనని హీరోని చేసే కథనంతో ఆగిపోయినవెన్ని? తన జీవితంలోని మంచిచెడులను, తన స్వభావంలోని లోటుపాట్లను నిక్కచ్చిగా ఒప్పుకున్నవి ఏవి? తొలిదశలో నేరారంగీకార రచనకు, తర్వాత వచ్చిన స్వీయచరిత్రలకు విషయంలో ఉన్న తేడాలేమిటి? అలా చూస్తే, గాంధీ ఆత్మకథ, శ్రీశ్రీ అనంతం కూడ నేరారంగీకార రచనల కిందికి వస్తాయా? వంటి చర్చలు కూడ చేర్చితే బాగుండేది. అలాగే, 19వ శతాబ్ది గురించి, వలసపాలనను గురించి చర్చిస్తున్నపుడు, అందులోనూ స్వీయచరిత్ర రాసుకున్నవారిలో ఎక్కువమంది ఆంగ్లవిద్యను అభ్యసించినవారే అయినపుడు, విక్టోరియన్ నైతికత వారిమీద ఎలాంటి ప్రభావం చూపింది? అన్న విషయాన్ని కూడ చర్చించాల్సింది. (ఉపయుక్త గ్రంథ పట్టికలో విశ్వనాథ ఆత్మకథ, చలం ఆత్మకథా ప్రస్తావింపబడ్డాయి కానీ, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి అనుభవాలూ-జ్ఞాపకాలూ కానీ, శ్రీశ్రీ అనంతం గానీ లేవు. పరిశోధకుడు చదవని, లేదా ప్రస్తావించడానికి ఇష్టపడని రచనలను గురించి అడగడం భావ్యం కాదు కానీ కేవలం నా సందేహం వెలిబుచ్చుతున్నాను).

ఏమైనా, ఇంతకుముందే అన్నట్టు, సాహిత్యకారులు చేయవలసిన అధ్యయనాన్ని ఒక చరిత్రకారుడు చేయడం, అందులోనూ ఆంగ్లమాధ్యమంలో రాయడం ద్వారా, తెలుగువారి గురించి ఇతర భాషీయులకు ఎంతో కొంత జ్ఞానాన్ని అందించడం అభినందించాల్సిన విషయం. ఇంగ్లీషులో ఉన్న ఈ సిద్ధాంతగ్రంథాన్ని త్వరితంగా తెలుగులోకి అనువదింపజేసి, ప్రచురించడం మెచ్చుకోదగ్గ విషయం.

ఇకపోతే అనువాదం గురించి. ఇందులో వాడిన భాష ఇంకాస్త సరళంగా, అక్లిష్టంగా ఉండివుండవచ్చు. కొన్ని పేరాలు రెండు మూడు సార్లు చదివితే తప్ప అర్థం కావు. కొన్ని చోట్ల యథాతథానువాదంగా, సంక్లిష్ట, సంశ్లిష్ట వాక్యాలతో కూడి పాఠకుడిని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. మొదటి అధ్యాయంతో పోలిస్తే తర్వాతి అధ్యాయాల్లో అనువాదం సరళంగా సాగింది. కొన్ని పదాల అనువాదం కొంచెం విచిత్రంగా ఉంది. ఉదాహరణకు మోటిఫ్‌కు కథనఘటకం అన్న రూపం అర్థమయ్యేలా లేదు. ‘మూలాంశం’ అనే పదం ప్రచారంలో ఇప్పటికే ఉంది (తెలుగు జానపద పరిశోధకులు దాన్ని స్థిరీకరించారు).

తెలుగు పరిశోధకులు తప్పక చదవవలసిన గ్రంథమిది. అలాగే తెలుగు సాహిత్యచరిత్ర అధ్యయనంలో 19వ శతాబ్దికి సంబంధించినంతవరకు కొత్తచూపును అందించే రచనగా దీని స్థానం పదిలం.


పుస్తకం: స్వీయ చరిత్రలు: వలసకాలపు ఆంధ్ర సమాజం.
రచన: వకుళాభరణం రాజగోపాల్
అనువాదం: దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి
ప్రచురణ: ఎమెస్కో బుక్స్, పే. 272, వెల: ₹200.00
ప్రతులకు: అమెజాన్.ఇన్


సి. మృణాళిని

రచయిత సి. మృణాళిని గురించి: రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ...