నిర్ణేతల వ్యాఖ్య: వ్యాసాలు, నాటకాలు

వ్యాసాలు

నాకు అందిన వ్యాసాలను క్షుణ్ణంగా చదివాను. ఒకరిని మించి ఒకరు పోటీలు పడ్డారనిపించింది. వ్యాసానికి ఉండవలసిన సమాచార ప్రాధాన్యం, విశ్లేషణ సామర్ధ్యం, వ్యక్తీకరణచాతుర్యం కనిపిస్తున్నాయి.

అవార్డ్స్‌ ఒకరిద్దరికే ఇవ్వడం అనివార్యం. అయితే యోగ్యమైనవి, వైవిధ్యభరితమైనవి సాధారణ ప్రచురణలుగా మీ తొమ్మిదవ ద్వైవార్షికసంచికలో ప్రచురించి మీ సంచికకను ఒక ‘రెఫరెన్స్‌ వేల్యూ’ ఉండేవిధంగా తీర్చిదిద్ది సాహితీలోకంలో ఆ సంచికకు వ్యాప్తిచేస్తే మిక్కిలి ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను.

…1990 తర్వాత తెలుగు సాహిత్యధోరణులు వికేంద్రీకృతమయ్యాయి. దానితో చాల ‘మంచి’ రచనలు సైతం తెలియకుండ పోయాయి. అలాంటి వాటిని నేను ఈ వ్యాసాల ద్వార గమనించగలిగాను. అట్లే సినిమాలకు సంబంధించి, గ్రామపునర్నిర్మాణానికి సంబంధించిన ఎన్నెన్నో విషయాలు తెలుసుకొనే అవకాశం నాకు కలిగింది.

-డా.వెలుదండ నిత్యానందరావు.

[స్థలాభావం వల్ల ఒకటికన్నా ఎక్కువ వ్యాసాలు ప్రచురించడం విషయంలో నిత్యానందరావు గారి సూచన పాటించ లేకుండా వున్నాము. మరెవరన్నా అలాంటి పనికి పూనుకోగలరని ఆశిస్తున్నాము. — “కబురు” సంపాదక వర్గం]

నాటిక

…నాకుపంపిన 43 నాటిక రచనలను చదివి ఈ క్రింది అంశాలను తెలియ జేస్తున్నాను.

  1. పోటీకి పంపిన రచనలలో కొన్ని నాటకాలుగానూ, కొన్ని నాటికలుగాను, మరికొన్ని లఘునాటికలుగానూ, ఈ విభజన ప్రదర్శన కాలపరిమితిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయిండం జరిగింది.
  2. రెండు రచనలు పౌరాణిక ఇతివృత్తాలతోనూ, రెండు రచనలు పౌరాణిక సాంఘిక ఇతివృత్తాలతోను, రెండు రచనలు పిల్లలనాటికలుగానూ, మరోరెండు రేడియోనాటికలుగానూ ఉన్నయ్‌.
  3. మిగతా రచనల కథాంశాలు ఇలా ఉన్నాయి.

రైతు సమస్యలు – కరువు ఆత్మహత్యలు/ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులను సాంఘిక బహిష్కరణ/వరకట్నపు వేధింపులు-స్త్రీల ఆత్మహత్యలు/ ప్రేమ పెళ్ళిళ్ళు-మోసపోవడాలు/వృద్ధాప్య సమస్యలు/గ్రామాల్లో పెత్తందార్ల, ధనికుల, వడ్డీవ్యాపారాల దోపిడీలు, అమాయకుల బలి/నిరక్షరాస్యత- విద్యావస్యకత/కుటుంబ సమస్యలు/మానసిక రుగ్మతలు

ఎన్నుకున్న ఇతివృత్తం ఏ దయినా నాటక రచనకు కావాల్సింది, నాటకీయత గల సంఘటనలు-సన్నివేశాలు. ఈ రచనల్లో ఈ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పైన చెప్పిన సమస్యలతో తెలుగు నాటకరంగంలో ప్రతియేటా కొన్ని డజన్ల రచనలు వస్తున్నయ్‌. చాలా మంది రచయితలు ఇంతకంటె బాగానే రాశారు.‘ఆటా’ వారి నాటిక రచనల పోటి ప్రకటను ఎక్కువమంది రచయితలు చూసినట్లు లేదు. అందుకే పోటీకి మంచి రచనలు రాలేదు.

43 రచనలు చదివిన మీదట ఏ ఒక్క రచనకి ఆటావారి ఉత్తమ రచన బహుమతి, 30వేల రూపాయలు అందుకునే అర్హత లేదని నేను నిర్ణయించాను.

-డా.డి.ఎస్‌.ఎన్‌.మూర్తి

[బహుమతినందుకోగల నాటిక రాకపోవడం మాకు చాలా అసంతృప్తి కలిగించింది — కబురు” సంపాదక వర్గం]