జిగిరీ – 1వ భాగం

పొద్దు పొడిచింది.

పొద్దు గూకింది.

పగలు గడిచింది. రాత్రి గడిచింది.

ఇమామ్‌ రాలేదు. షాదుల్‌ జాడలేదు.

వాళ్ళు రాకపోవడం బీబమ్మకు సంతోషంగా ఉంది. చాంద్‌కు సంతోషంగా ఉన్నా లోలోపల భయంగా ఉంది. ఇద్దరూ ఇంట్లకూ బయటకు తిరుగుతున్నారు. అడుగుల చప్పుడైతే ఇమామ్‌ అనుకుని చూస్తున్నారు. గురక వినిపిస్తే షాదుల్‌ అనుకుని ఉల్కిపడుతున్నారు.

ఇంతకు ముందయితే ఆ ఇద్దరినీ చూడకుండా ఈ ఇద్దరు ఉండేవారు కాదు. అందునా షాదుల్‌ను చూడకుండా ఎవరూ ఉండేవారు కాదు. షాదుల్‌ ఆడింది ఆట పాడింది పాట.

షాదుల్‌ కాలుకు ముల్లు నాటితే వీళ్ళు గిలగిల కొట్టుకుంటారు.

షాదుల్‌కు ఆకలేస్తే వీళ్ళకు పేగులు గుర్రుమంటాయి.

షాదుల్‌కు జ్వరమస్తే వీళ్ళకు ముద్ద దిగదు.

వాళ్ళు ఉప్పిడి ఉపాసమున్నా షాదుల్‌ కోసమైనా పొయ్యి వెలిగించవలసిందే! వాళ్ళు కడుపు మాడ్చుకున్నా షాదుల్‌ కడుపు నిండాల్సిందే! ఏ టైంలో ఎవలు ఎక్కడున్నా షాదుల్‌కు మాత్రం సమయానికి సత్తు గిన్నెలో తిండి పెట్టాల్సిందే!

వీళ్ళతో ఇంతగా కలిసిపోయిన షాదుల్‌ నిజంగా మనిషి కాదు. అది జంతువు. సాదువుగా మారిన క్రూర జంతువు. నల్లటి మూతి, నల్లటి జూలు, వాడిగా ఉన్న పండ్లు, కత్తుల్లాంటి గోళ్ళు.

ఇమామ్‌ మనిషి. పొట్టిగా .. సన్నగా .. తెల్లటి గడ్డం, సన్నటి మీసం, మొనదేలిన ముక్కు, చురుకైన కళ్ళు, పైకి చెక్కుకున్న గళ్ళలుంగి, నల్లటి కోటు, నల్లటి బూట్లు, కుడిచేతికి రాగి కడెం!

వాళ్ళ పేర్లు కూడా ఎవరికీ తెలియవు.

ఇమామ్‌ను పక్కీరోడు, పక్కీర్‌ సాబ్‌ అంటారు. షాదుల్‌ను ఎలుగు, ఎలుగుబంటి, గుడ్డేెలుగు అంటారు. వీళ్ళిద్దరూ వేరువేరుగా ఎప్పుడూ, ఎక్కడా, ఎవరి కంట పడ్డ దాఖలాలు లెవ్వు. ఎప్పుడు కనిపించినా ఇద్దరూ ఒక్క చోటనే కనిపిస్తారు.

ఇమామ్‌ చేతిలో తాడు ఉండేది. దాని రెండవ కస షాదుల్‌ మూతికి బిగించి ఉండేది. ఇమామ్‌ ముందు షాదుల్‌ వెనుక, రోజూ పొద్దు కంటే ముందు నిద్ర లేచేవారు. చీకటి తర్వాత ఇల్లు చేరేవారు.

చేతిలో తాడు ఉన్నా లేకున్నా షాదుల్‌ ఇమామ్‌ను వెంబడించేది. అక్కడక్కడా ఆగి ముక్కును నేలకు ఆనించి గరుక్కుమని పీల్చుకుని చప్పరించేది. రోజూ అలవాటైనా ఊరకుక్కలు మొరుగుతూనే ఉండేవి. వాటికి భయపడకుండా గంభీరంగా నడుస్తుండేది షాదుల్‌.

ఇమామ్‌కు షాదుల్‌ను చూస్తుంటే చేతికందిన కొడుకును చూస్తున్నట్టుగా ఉండేది. ప్రేమగా జూలు నిమిరేవాడు. మెడను ముద్దాడేవాడు. ‘అరే బేకూఫ్‌ ..’ అని ముద్దుగా తిట్టుకునే వాడు.

అప్పుడప్పుడూ షాదుల్‌ వెంట చాంద్‌ ఉండేవాడు. తప్పితే బీబమ్మ ఉండేది. చాంద్‌ ఉన్నప్పుడు షాదుల్‌ అల్లరిగా ఆడుతూ ఉండేది. బీబమ్మ ఉన్నప్పుడు గావురాలు పోతూ ఉండేది. ఒక్క ఇమామ్‌ ఉన్నప్పుడు మాత్రమే భయంగా ఉండేది షాదుల్‌.

ఊరి చివరగా ఉన్న గుడిసె వాళ్ళది. ఈ నలుగురూ ఒకే గుడిసెలో ఉండేవారు. చలికాలం రాత్రులైతే గుడిసెలో చల్లగా ఉండేది. ముగ్గురూ మంటపెట్టుకుని కూర్చుండే వారు. షాదుల్‌కు మంటను చూస్తే భయం. ఒదిగి ఒదిగి మూలకు కూర్చుండేది.

ఆట పట్టించడానికి చాంద్‌ అప్పుడప్పుడూ మండుతున్న పుల్లను తీసి షాదుల్‌ వైపు చూపించేవాడు. షాదుల్‌ మరింతగా నక్కి నక్కి కూర్చుండేది.

ఇమామ్‌, బీబమ్మ, చాంద్‌ కూర్చున్నారంటే మాటలు షాదుల్‌ గురించే ఎక్కువగా నడిచేవి.

‘‘అబ్బా … మన షాదుల్‌ ముసలిదై పోయింది గదా’’ చాంద్‌ అనేశాడు.

ఆ మాటలకు బీబమ్మనే ముందుగా సమాధానం చెప్పేది. ‘‘అవున్రా చాంద్‌. నన్నూ, అబ్బాను షాదుల్‌ను ముగ్గురిని నుప్వక్కనివే సాదాలె’’ అంటుండేది.

ఆ మాటలకు షాదుల్‌కు కోపం వచ్చేదో లేదో కాని ఇమామ్‌కు మాత్రం ఉక్రోషం ముంచుకచ్చేది. ‘‘షాదుల్‌ ఒకల కష్టంతో బతుకడు. బతికినన్ని రోజులు మనకే తిండి పెడుతడు. చివరికి చచ్చిపోయినంక గూడా … దాని తోలుకు ఎంత గిరాకీ ఉందనుకున్నరు’’ అనేవాడు.

ఇమామ్‌ను ఉడికించాలని బీబమ్మ ‘‘ఆ … ఎంతలే … ఇంకో రెండు మూడేండ్లు పోతే అది నడువలేదు. అప్పుడు మాత్రం దాన్ని కష్టపెడుతామా ఏంది …? పండవెట్టి సాదుడే గదా’’ అనేది.

ఇమామ్‌కు, చాంద్‌కు ఆమె మాటలు నచ్చేవికావు. ‘‘చెల్‌ .., అది మనిషిగాదు. మలుసుక పండది. సచ్చేదాక సాముజేత్తది’’ అనేవాడు చాంద్‌.

బీబమ్మ చాంద్‌ను, షాదుల్‌ను మురిపెంగా చూసుకునేది.

చాంద్‌ షాదుల్‌తో ఆడుకునే వాడు.

ఇమామ్‌కు అప్పుడప్పుడూ బాధగా అనిపించేది. కొడుకుతో భార్యతో ‘‘షాదుల్‌ మనకోసం అన్నీ త్యాగం చేసింది. అలవాట్లను మార్చుకుంది. అడివిని విడిచి ఊరికి వచ్చింది. మనకోసం సాధువై పోయింది. మన ఇంట్లో దీపం పెట్టింది’’ అనేవాడు.

బీబమ్మ మరింత లోతైన మనిషి. అందునా కొడుకు చాంద్‌ను, ఎలుగు షాదుల్‌ను వేరుచేసి చూడని మనిషి. షాదుల్‌ తత్వాన్ని బాగా అర్థం చేసుకున్న మనిషి. ‘‘ఇంట్లో దీపమేగాదు … మనకు బతుకు ఇచ్చింది గదయ్యా …’’ అంటూ ఏదో జీవితతత్వం చెప్పేది.

అది చాంద్‌కు గానీ ఇమామ్‌కు గానీ అర్థమయ్యేది కాదు.

చాంద్‌ది షాదుల్‌ వయసే! ఇరువై ఇరువై ఒక్కటి మధ్యన ఉంటడు. అతడు కళ్ళు తెరిచే సరికే షాదుల్‌ ఇంట్లో తిరుగుతంది. చాంద్‌ కంటే ముందుగా ఎదిగి కుటుంబాన్ని ఆదుకుంది. చాంద్‌కు ఆ సంగతి తెలుసు. ‘‘అమ్మీ … నాకు ఇద్దరు తండ్రులు. అబ్బా … షాదుల్‌’’ అనేవాడు.

రోజూ పొద్దున లెవంగనే ఇమామ్‌ మక్కపిండిని తడిపేవాడు. బీబమ్మ ఉడికేసేది. చాంద్‌ పాలు తెచ్చేవాడు. సల్ల గటుకతో షాదుల్‌ కడుపు నిండేది.

ఇంట్లో ఉన్నంతసేపు బీబమ్మ ఏదో ఒకటి షాదుల్‌ ముందు వేసేది. చాంద్‌ బయట నుంచి ఏదో పట్టుకొచ్చేవాడు. ఏది పెట్టినా తింటూ ఉండేది షాదుల్‌.

ఒకటి కాదు … రెండు కాదు … ఇరువై ఏండ్ల సోపతి వాళ్ళది. ఇదంతా ఇంతకు ముందటి మాట. ఇప్పుడు షాదుల్‌ గుడిసెలో లేదు. షాదుల్‌ లేదన్న బెంగ కూడా బీబమ్మ, చాందల్‌ల గుండెలో లేదు. అది రాత్రి పూట.

ఇప్పుడు షాదుల్‌ లేనందుకే గుడిసెలో పొయ్యి వెలుగుతుంది. కొడుకు కోరికమీద బీబమ్మ తీపివంట చేస్తుంది. పక్కనే కూర్చుండి లొట్టలు వేస్తున్నాడు చాంద్‌.

‘‘అమ్మీ … అబ్బ ఇంకా రాకపాయె’’ చాంద్‌ అడిగాడు.

‘‘వస్తడు … దాన్ని అమ్మి రావాలె గదా …’’ బీబమ్మ అన్నది.

‘‘… అమ్మీ … ఇప్పటికైనా షాదుల్‌ పీడ వదిలినట్టే గదా!’’ సంతోషంగా అడిగాడు చాంద్‌.

‘‘వదిలిందనే అనుకుంటున్నాను. నాలుగు రోజులయింది గదా! వాళ్ళు తీసుకోకుంటే ఎప్పుడో వచ్చేవాడు. ఇన్ని రోజులున్నాడంటే బేరం కుదిరినట్టే లెక్క’’ అన్నది మైబమ్మ.

‘‘అమ్మీ .. మనకు రెండెకరాల భూమి వచ్చినట్టేగదా!’’ చాంద్‌ అడిగాడు.

‘‘వచ్చినట్టే. ఎం.ఆర్వో సారు మంచోడు. కాని ఈ ఎలుగు మళ్ళీ కనిపించవద్దన్నాడు’’ పొయ్యిలో కట్టెల్ని కెలుకుతూ అన్నది బీబమ్మ.

చాంద్‌కు పట్టరాని సంతోషంగా ఉంది. ‘‘అమ్మీ .. ఆ భూమిని మనం సాగు చేసుకుందాం. అక్కడే గుడిసె వేసుకుందాం. కోళ్ళను పెంచుకుందాం’’ తల్లికి దగ్గరగా జరుగుతూ అన్నాడు.

బీబమ్మ కొడుకులోని ఆతృతను చూస్తంది. అంతే ఆతృతతో భర్తకోసం ఎదురు చూస్తుంది. ఆమెకు ఏ మూలనో కొద్దిగా అనుమానం. ఇమామ్‌గాని ఆ ఎలుగును మళ్ళీ వెంట పెట్టుకొస్తాడా ..? అని’ అతనికి మాత్రం భూమి కావాలని ఉండదా …? ఎన్ని రోజులు ఇట్లా ఊర్లు తిరిగుతం…?’ అని వెంటనే తనని తాను సముదాయించుకుంటుంది.

పొయ్యిమీద వేనీలు మరుగుతున్నాయి. పాలలో మరుగుతున్న వేనీల వాసన గుడిసె నిండా నిండుకుంది. అంతకు ముందు రోజే తల్లీ కొడుకులిద్దరూ గుడిసెను శుభ్రం చేశారు. ఎలుగు ఉన్నప్పుడైతే గుడిసె పెంటకుప్పలా ఉండేది. అప్పుడప్పుడు పొక్కలి తేలినప్పుడు నీళ్ళు చల్లుకునే వారు అంతే!

ఇప్పుడు గుడిసె రూపమే మారిపోయింది. ఎలుగును కట్టి ఉంచే కంకి కొయ్యను తీసేశారు. అది పండుకోవడానికి పరిచిన నారతట్టు బయటకు విసిరికొట్టారు. దాని నీళ్ళకోసం ఉంచిన గోళెం, తిండికోసం ఉంచిన సత్తుపల్లెం కప్పడానికుంచిన తోలుగుడ్డ … అన్నింటిని బయటకు విసిరికొట్టారు.

ఇరవై ఏండ్ల నుంచి అక్కడో ఎలుగు జీవిస్తుందనడానికి ఏ ఒక్క ఆనవాలూ లేకుండా చేశారు. ఎర్రమట్టితో అలికి శుబ్రం చేశారు.

‘‘అమ్మీ … షాదుల్‌ ఉన్నప్పుడు ఇల్లు ఇంత శుబ్రంగా ఉండేది కాదుగదా!’’ చాంద్‌ అడిగాడు.

బీబమ్మ తలూపింది. ఆ మార్పుకు ఆమె ఇంకా అలవాటు పడిపోలేదు. చాంద్‌కు మాత్రం కొత్త లోకంలో తిరుగుతున్నట్టుగా ఉంది. సంతోషంగా ఉంది.

‘‘షాదుల్‌ ఉన్నప్పుడు ఒక్క కోడి దక్కలేదు. ఇప్పుడు కోళ్ళను పెంచుకుందాం. బాతుల్ని కూడా .. బాతుకూర బలే ఉంటుంది’’ ఉత్సాహంగా అన్నాడు చాంద్‌.

కొడుకు ఉత్సాహం చూస్తుంటే బీబమ్మకు ముచ్చటేస్తుంది. అన్నింటికి మించి రేపు అతడు రెండెకరాలకు రైతు కాబోతున్నాడన్న విషయం ఆమెకు సంతోషాన్నిస్తుంది. తను కలలో కూడా ఊహించలేదు. ఇన్ని రోజులు అదే జీవితమనుకుంది. తన తర్వాత తన కొడుకు గూడా ఓ కొత్త ఎలుగుతో జీవితాన్ని సాగించాలని అప్పుడు కోరుకుంది. ఆ కోరికను, ఆ జీవితాన్ని తలుచుకుంటే ఇప్పుడు అసహ్యంగా ఉంది.

కొడుకును దగ్గరగా తీసుకుని ‘‘అవున్రా … దాని మలం విషం కదా!’’ అన్నది అంటూనే మరుగుతున్న కీరను గ్లాసులో వంచి కొడుక్కు ఇచ్చింది.

చాంద్‌ ఊది ఊది దాన్ని చల్లార్చుకున్నాడు. కొద్ది కొద్దిగా చప్పరిస్తుంటే కొత్త జీవితంలా తియ్యగా మధురంగా ఉంది. బీబమ్మ ఇంకో గ్లాసు తీసుకుని కొంత వంచుకుంది. మిగిలింది భర్తకు దాచింది.

‘‘అమ్మీ … అబ్బా ఇంకా రాడేం …? నాకేదో అనుమానంగా ఉంది’’ చప్పరిస్తూనే అన్నాడు చాంద్‌. అతని గొంతులో ఆందోళన.

ఆ మాటలకో అలవాటులేని తీపికోగాని బీబమ్మకు పొలమారింది. దగ్గుతూ గ్లాసును కింద పెట్టింది. అప్పుడే ఏదో మార్పును గమనించాడు చాంద్‌. అంత ఘాటైన తీపి వాసనలోనూ ఆగెదరు వాసనను పసిగట్టాడు చాంద్‌. మనసు ఏదో కీడును శంకించింది. చెవులు రిక్కించి అడుగుల శబ్దాన్ని విన్నాడు. ‘మొండి మనిషి. తెచ్చినా తెస్తాడు’ అనుకుంటూ బయటకు వచ్చి చూశాడు.

అప్పటికే పొద్దుగూకి చాలాసేపయింది. బయట దట్టంగా చీకటి. అంత చీకట్లోనూ తండ్రి ఆనవాలును పసిగట్టాడు చాంద్‌. కండ్లు చికిలించి అతడి నడక తీరును చూశాడు. ముక్కుపుటాలకు అందుతున్న సంకేతాన్ని పసిగట్టాడు. అతనిలోని అనుమానం గట్టి పడింది. అడుగుల చప్పుడు దగ్గరయింది.

చాంద్‌కు నోట్లోని తీపి చేదుగా అనిపించింది. అంతకు ముందు కమ్మగా తలిగిన ఘాటైన వాసన ఉక్కిరి బిక్కిరి చేసింది. తన అనుమానాన్ని మరోసారి నిర్ధారించుకున్నాడు. కోపం దు:ఖం రెండూ ఏకమై పొంగివచ్చాయి. చేతిలోని గ్లాసును దూరంగా విసిరికొడుతూ ‘తేరీ మాకూ .. సువ్వర్‌ మారో … ఆ సైతాన్‌ను మళ్ళీ తెస్తండు’ అన్నాడు చాంద్‌.

కొడుకు మాటలకు ఉల్కిపడ్డది బీబమ్మ. బయం బయంగా బయటకు వచ్చింది. అలా జరక్కూడదని మొక్కుకుంటూనే పానాదిలోకి చూసింది. ఆమె జరక్కూడదనుకున్నదే జరిగింది. ఇమామ్‌, ఇమామ్‌ వెంటున్న ఎలుగు ఆమెకు దయ్యాల్లా కనిపించారు.

తల్లీ కొడుకులిద్దరూ బయటకు వచ్చేసరికే వాకిట్లోకి చేరుకున్నాడు ఇమామ్‌. ఎలుగుతో తన రాకను వాళ్ళు స్వాగతించరని తెలుసు. అయినా మొండిగా వాకిట్లో నిలబడ్డారు.

చాంద్‌ కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు. బీబమ్మ మాత్రం కోపంగా బయటకు వచ్చింది. ‘‘నీకేం బుట్టింది. మళ్ళీ ఎంట తెచ్చుకున్నవు. అడిగిన దరకు ఇచ్చిరానుంటివి. నగదు ఇయ్యకున్నా ఇచ్చిరానుంటివి. ఇయ్యల్ల గాకుంటే రేపు ఇస్తరు. ఒక్క పైస దర పలుకకుంటే ఉత్తగైనా ఇచ్చి రానుంటవి. దీని పీడా పోతుండె. మనకు శని చుట్టుకున్నట్టే చుట్టుకుంది’’ అన్నది.

ఇమామ్‌ బావమరిది ఇంటి నుంచి పొద్దు పొడవక ముందే బయల్దేరాడు చాలా దూరం. పొద్దంతా కాలినడక. ఒకటి రెండు చోట్ల లారీలో ఎక్కే అవకాశం ఉండె. కాని ఎక్కబుద్ది కాలేదు. షాదుల్‌ను వెంటేసుకుని నడవాలనే అనిపించింది. షాదుల్‌ తన నుంచి విడిపోతుందనే బాద ముందు నడక బాద నిలువలేదు.

దారి పొడుగునా షాదుల్‌ గురించే ఆలోచిస్తూ వచ్చాడు. ఎక్కడా పచ్చి మంచినీళ్ళు ముట్టలేదు. షాదుల్‌కు మాత్రం నాలుగు పచ్చి కంకుల్ని కొని ఇచ్చాడు. రెండు చోట్ల నీళ్ళను పట్టాడు. అవి దానికి ఏమాత్రం సరిపోవని తెలుసు. ఎక్కువ కొందామంటే జేబులో డబ్బులేదు.

ఇమాం నీరసంగా వాకిట్లోనే కూలబడ్డాడు. షాదుల్‌కు ఇవేవీ తెలియవు. ఆకలి ఒక్కటే తెలుసు. ఇమామ్‌ చుట్టూ రెండు చుట్లు తిరిగి బీబమ్మ దగ్గరికి వచ్చింది. రెండు కాళ్ళమీద నిలబడి ఆమె చేతుల్ని అందుకునే ప్రయత్నం చేసింది.

ప్రేమగా దాని జూలును దువ్వే చేతులు దూరం జరిగాయి. ఆప్యాయతగా దానికి ఎదురుగా వెళ్ళే కాళ్ళు వెనక్కి నడిచాయి. జాలిని కురిపించే ఆమె కళ్ళల్లోంచి నిప్పులు రాలుతున్నాయి. ఆమెలోని మార్పును తొందగరానే పసిగట్టింది ఎలుగు.

ఆమెను అందుకునే ప్రయత్నం చేయలేదు. కాళ్ళు దించి వెనక్కి తగ్గింది. మూతిని భూమికి ఆనించి వాసన పసిగడుతూ ఇంట్లోకి నడిచింది. ఇల్లు కొత్తగా ఉంది. గూడు కూలిన పక్షిలా ఇల్లంతా తిరిగింది. తన ఆనవాళ్ళకోసం వెదుక్కుంది. ఇల్లంతా మూతితో వాసన చూసింది. గర్రుగర్రుమని తుమ్మింది. కుయ్యి కుయ్యిమని మూల్గింది. సత్తుపల్లాన్ని వెతుక్కుంది. నీళ్ళ కుండీకోసం చూసింది. పడుకోవడానికి కనీసం నారతట్టుకోసం చూసింది ఎలుగు.

ఎక్కడా ఏ ఆనవాలూ కనిపించలేదు. తిరిగి తిరిగి వాకిట్లకు వచ్చింది. ఇమామ్‌ పక్కనే ఒదిగి కూర్చుంది. ఇమామ్‌ దాని కళ్ళలోని బాధను చూశాడు. కడుపులోని ఆకలి చూశాడు. దానికి రోజూ జరిగే మర్యాదలు ఈరోజు జరిగిన మర్యాద చూశాడు. కండ్లల్ల నీళ్ళు తిరిగాయి. కడుపుల పేగులు కదిలాయి. దాని జూలును దువ్వుతూ అలాగే కూర్చుండి పోయాడు.

అతడి చేతివేళ్ళ స్పర్శతో ఏ సంకేతం అందిందో షాదుల్‌కు. అతనికి మరింత దగ్గరగా జరిగింది మరింత ఒదిగిపోయింది. ఇమామ్‌ తన్మయత్వంతో అలాగే దువ్వుతున్నాడు.

కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు. చాంద్‌ లోపలికి వెళ్ళిపోయాడు. ఇమామ్‌ బయట ఉన్నాడు. బీబమ్మ తలుపు దగ్గరే ఉంది. చివరికి గొంతు పెకిలించుకుని తనే అడిగింది బీబమ్మ.

‘‘ఏమైందంటే చెప్పవు. బెల్లంగొట్టిన రాయి లెక్క అట్లనే ఉంటివి. ఏం బుట్టింది నీకు … ఎటుకాకుంట జేత్తవా ఏంది …?’’ అన్నది. అంటూనే భర్త దగ్గరికి వచ్చింది.

ఇమాం దు:ఖాన్ని ఆపుకుంటూ ‘‘ఏం చెప్పమంటవు. వాళ్ళుగూడా మన లెక్కనే ఉన్న ఎలుగును వదిలించుకోవాలనుకుంటున్నరు. మాదే మీకిస్తం తీసుకో అంటున్నరు’’ అన్నాడు.

బీబమ్మకు కోపం ఆగలేదు. ‘‘నల్లమొఖపోల్లు … అప్పుడు ఇయ్యమని ఇంటి మూడు సుట్లు తిరిగిరి గదా! … అయినా అటే ఆవునూరు పోయేదుండె’’ అన్నది.

‘‘ఆవునూరు లేదు … గూడెం లేదు … అంతట ఇట్లనే ఉంది. బయట తిరుగనిత్తలేరట. రాంగ రాంగనే రెండు ఊర్లల్ల పోలీసోళ్ళు అటకాయించిండ్రు’’ అన్నాడు.

‘‘ఈ పనికి ఇన్ని రోజులు ఏం జేసినవు మొన్ననే రావద్దా …’’ అన్నది కోపంగా.

‘‘వస్తే ఏంజేద్దువు’’ అంతే కోపంగా అన్నాడు ఇమామ్‌.

ఇంట్లో ఉండి ఇద్దరి మాటలు వింటూనే ఉన్నాడు చాంద్‌. తండ్రి మీద కోపం వచ్చింది. ఆవేశంగా బయటకు వచ్చాడు. తల్లి సమాధానం చెప్పక ముందే ‘‘ఇంత ఎండ్రీన్‌ తాగి సచ్చిపోదుము. ఇప్పటికైనా మాకు అదే గతి. నుప్వక్కనివే ఉండు’’ అన్నాడు.

షాదుల్‌కు ఆ మాటలు, ఆ ఇల్లు ఏదో భయాన్ని కలిగించినట్టున్నాయి. ఇమామ్‌కు ఇంకా దగ్గరగా జరిగింది. అప్పుడప్పుడు నేలకు మూతిని ఆన్చి బుస్సున గాలిపీల్చుకుని చీమల్ని చప్పరిస్తుంది.

ఇమామ్‌ నోరెత్తలేదు. వాకిట్లోనే మంచం వాల్చుకున్నాడు. షాదుల్‌ గుడిసె చుట్టూ రెండు రౌండ్లు కొట్టి వచ్చి మంచం కింద ఒదిగిపోయింది.

చాంద్‌ తండ్రితో ఏదో తేల్చుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. రెండెకరాల భూమి తనకు కాకుండా పోతుందనే భయం అతడిని తండ్రి మీదికి ఉసిగొల్పింది. అతడి భయం అదికాదు. తెల్లవారితే ఎం.ఆర్వో వస్తాడు. అతడికి గాని ఎలుగు కనిపించిందంటే తనకు పట్టా ఇయ్యడు. తను ఏమి చెప్పినా నమ్మడు. అందుకే ఈ రాత్రే ఏదో ఒకటి చెయ్యాలనుకుంటున్నాడు.

‘‘అలాగే .. అబ్బా … నువ్వు దాన్ని వదిలించుకుంటవా … నన్ను వదిలించమంటవా .. ఏదో ఈ రాత్రే తేలిపోవాలి’’ అన్నాడు మంచం దగ్గరగా వస్తూ.

ఇమామ్‌ గొంతు దు:ఖంతో కూరుకుపోయింది. ‘‘నేనేం చేసేదిరా .. నేను మాత్రం వద్దంటున్నానా … ఎట్ల వదిలించుకుంటనో చెప్పు. నేనేం చేయాలో చెప్పు. నువ్వు చెప్పినట్టే చేస్త’’ అన్నాడు నిస్సహాయంగా.

తండ్రి ఏమంటాడో కొడుకు ఏమంటాడో ఇద్దరు కొట్లాడుకుంటారోనన్న భయంతో ఇద్దరి మధ్యలోకి వచ్చిన బీబమ్మ కొద్దిగా కుదుటపడింది. భర్త మాటలను ఒప్పుకుంటున్నట్టు ‘‘అవున్రా నువ్వే చెప్పు’’ అన్నది కొడుకుతో.

ఇద్దరి మాటలతో కోపం తగ్గినా ఆవేశంగానే ఉన్నాడు చాంద్‌. నిర్ణయం తన మీద పెట్టేసరికి కొద్దిగా తడబడ్డాడు. అయినా తన నిర్ణయం చెబుతున్నట్టు ‘‘ఈ రాత్రే నిలివెడు గొయ్యి తీద్దాం. దాంట్లో పాతి పెడుదాం. పీడాపోతది’’ అన్నాడు.

బీబమ్మ నోరెత్తలేదు. ఇమామ్‌ మాత్రం ఉల్కిపడ్డాడు. ‘ఆ .. పాణంతోనే’ అన్నాడు.

‘‘ఆ … పాణంతోని గాకుంటే సంపిపెడుదాం …’ అన్నాడు. అంటూనే ఇంట్లోకి వెళ్ళి పారపలుగు పట్టుకొచ్చాడు చాంద్‌.

రోజూ గుడిసెలో కరెంటు లైటు వెలుగుతుండేది. దాని వెలుతురే మసక మసకగా గుడిసె చుట్టూ అలుముకుంటుంది. రోజూ బయట తిరగాలంటే వాళ్ళకు ఆ వెలుతురే ఆధారం. ఈరోజు ఆ వెలుతురు లేదు. రాత్రిపూట కరెంటు పోల్‌కు రెండు తీగల్ని తగిలించి పొద్దునే తీసేస్తుంటాడు చాంద్‌. ఈ రోజు ఆ పని చేయలేదు. గుడిసె నిండా చుట్టూ చీకటే. మండిన పొయ్యి వెలుతురు గూడా ఆరిపోయింది.

ఆ చీకట్లోనే పలుగు పారతో ముందుకు నడిచాడు చాంద్‌.

షాదుల్‌ను పాణంతో పాతిపెట్టడం అనే ఆలోచననే తట్టుకోలేక పోతున్నాడు ఇమామ్‌. మంచంలోంచి లేచి కొడుకు చేతిని అందుకున్నాడు. ‘‘అరే .. చాంద్‌ … బేటా … ఆగరా … ఆగు … ఆలోచిద్దాం … ఆగు’’ అన్నాడు.

చాంద్‌ ఉరిమి చూశాడు. చీకట్లో ఆ చూపు కనిపించలేదు కాని కనిపిస్తే ఇమామ్‌ వణికిపోయేవాడే. చాంద్‌ తండ్రిని విసరికొట్టాడు. ఇమామ్‌ విరుచుకుపడ్డాడు. బీబమ్మ ఇమామ్‌ను లేపి నిలబెట్టింది.

‘‘సూడు .. నీ మనసులో ఒకటుంది పైకి ఒకటి అంటున్నావు. దాన్ని వదిలి పెట్టడం నీకిష్టం లేదు’’ అన్నాడు చాంద్‌. ‘‘… అందుకే అమ్మకొత్తనని మళ్ళీ తెచ్చినవు.’’

‘‘అరే … బేటా … అది కాదురా …’’ అంటూ ఏదో చెప్పబోయాడు ఇమామ్‌. చాంద్‌ ఆవేశంగా దగ్గరికి వచ్చాడు. బీబమ్మ ఉల్కిపడి ఇద్దరి మధ్యలోకి వచ్చి నిలబడింది. ఒకరికొకరు మసక మసకగా కనిపిస్తున్నారు.

‘‘ఒక్కటే మాట … నువ్వు పాతిపెడుతవా… నన్ను పాతిపెట్టుమంటవా …? ఎస్సైసారు ఏమన్నడు తెలుసుగదా …’’ అన్నాడు చాంద్‌.

‘‘ఎస్సైసారు కోపగొండి మనిషి. అబద్దమాడినమని తెలిస్తే తోలు దీత్తడు.’’ కొడుకు కోపాన్ని తగ్గించాలని అన్నది బీబమ్మ.

ఇమామ్‌ మాట్లాడలేకపోయాడు. తండ్రి సమాధానం కొరకు ఎదురు చూసిన చాంద్‌ అతని మౌనాన్ని గమనించి ‘‘నాకు అడ్డం వచ్చినవనుకో … దాన్నిగాదు … నిన్ను … నిన్ను నరికి పాతర వెడుత. తెరిమయ్యకు చోద్‌’ అంటూ దూరంగా వెళ్ళి తవ్వడం మొదలెట్టాడు.

బీబమ్మ ఏదో గొణుగుతుంది. ఇమామ్‌ వచ్చి మంచంలో ఒరిగిపోయాడు. మంచం కింద ఎలుగు గుర్రుగుర్రుమంటుంది. దాని చావుకు సంబంధించిన విషయంలో వారం పది రోజుల నుండి బాధ పడుతున్నాడు ఇమామ్‌. ఈ వారం పది రోజులు ఎన్నడూ దాని కడుపు నింపింది లేదు. మొదట ఒకటి రెండు రోజులు ఆకలికి తట్టుకోలేక తల్లడిల్లింది. తలపైకెత్తి అరిచింది. కోపంగా చూసింది. తర్వాత తర్వాత అలవాటు చేసుకున్నట్టుంది. గుర్రుగుర్రుమని దీనంగా చూడటం తప్ప ఏమీ చేయలేకపోతుంది ఎలుగు.

ఇంకో గంటలనో అరగంటలనో దాన్ని పాతి పెడుతున్నామన్న సంగతి ఇమామ్‌ను స్థిరంగా ఉండనీయడం లేదు. లేచి కూర్చున్నాడు, కూర్చోబుద్ధి కాలేదు. ఆందోళనగా లోపలికి వెళ్ళాడు. మక్క గటుకను నిలవ ఉంచే కుండలో చూశాడు. కుండ ఖాళీగా ఉంది. ఉట్టిమీది కుండలో మాత్రం అన్నం ఉంది. ఎలుగు తినే సత్తుపల్లెం కోసం చూశాడు. అది కనిపించలేదు. తాను తినే బొక్క ప్లేటులో రెండు అన్నం పెల్లల్ని పెట్టుకుని మంచం వద్దకు వచ్చాడు ఇమామ్‌.

అన్నం వాసన పసిగట్టి మంచం కింది నుంచి బయటకు వచ్చింది ఎలుగు. ప్లేటును ఎలుగు ముందుంచాడు ఇమామ్‌. దాని తలను తడుముతూ మూతికి బిగించిన బెల్టును విప్పాడు. రెండుసార్లు వాసన చూసి రెండు పెల్లల్ని రెండుసార్లు గతికింది షాదుల్‌.

ఈ ఇరువై ఏండ్లలో షాదుల్‌కు అన్నంపెట్టిన సందర్భాలు తక్కువ. ‘‘అన్నం తింటే వాతం. షాదుల్‌కు అన్నం పెట్టొద్దు’’ అనేది బీబమ్మ చాంద్‌ కూడా అదేమాట అనేవాడు.

కామారెడ్డికి వెళ్ళి తనే స్వయంగా మక్కల, జొన్నలు కొనుక్కొచ్చేవాడు చాంద్‌. ‘‘గిర్నీలో గటుక పట్టించి కుండలో నింపేవాడు. లీటరు పాలను పెరుగుచేసి పెరుగును చల్లచేసి మూడు పూటలు చల్లగటుక తాగించేవాడు ఎలుగుకు. దాని తిండి విషయంల ఎవలనూ నమ్మేవాడు కాదు.

‘‘ఎందుకురా … ఉన్నదంతా దానికే పెడుతున్నావు. మనమేం తిందాం… కొంత తగ్గించు’’ యాష్టగా అనేవాడు ఇమామ్‌ కొడుకుతో.

‘‘మనం మనుషులం … ఆశతోనైనా బతుకుతాం. దానికేముంటుంది తిండి తప్ప. దాని కష్టంలోంచే దానికి పెడుతున్నం. మన కష్టం కాదు గదా’’ అనేవాడు చాంద్‌.

బీబమ్మ కూడా తలూపేది. వాళ్ళు నీళ్ళతో కడుపు నింపుకుని ఎలుగుకు పాలతో కడుపు నింపిన రోజులు చాలా ఉన్నాయి. అది ఇప్పుడు తారు మారయింది. అదే విషయం ఇమామ్‌ను తొలుస్తుంది.

ఎలుగుకు అన్నం పెడుతుంటే ఆ రోజులన్నీ గుర్తుకొస్తున్నాయి ఇమామ్‌కు. చీకట్లోనే బీబమ్మ కొరకు వెదికిండు. బీబమ్మ కనిపించలేదు. చాంద్‌వైపు చూసిండు. చాంద్‌ దీక్షగా తవ్వుతున్నాడు. కొడుకును చూస్తుంటే భయమేసింది ఇమామ్‌కు. వెళ్ళి మంచంలో ఒరిగిపోయాడు.

రెండు గుక్కల్లో అన్నాన్ని గతికిన షాదుల్‌ ఇంకా కంత అన్నం కరకు ఎదురు చూసింది. ఎప్పుడైతే ఇమామ్‌ మంచమెక్కిండో అప్పుడే ఆశను వదులుకుంది. వెళ్ళి మంచం కింద ఒదిగింది.

‘‘అగే … బీబీ ..’’ పిలిచిండు ఇమామ్‌.

బీబమ్మ బయటకు వచ్చింది. ‘‘మనకు ఇరువై ఏండ్ల కష్టం చేసింది. ఇరువై ఏండ్లు మనని సాదింది. ఇప్పుడు దీన్ని పాణంతోనే పాతిపెడుదామా’’ అడిగిండు ఇమామ్‌.

కొద్దిసేపు బీబమ్మ మాట్లాడలేదు. ఆమె బాధ పడుతుందనుకున్నాడు ఇమామ్‌. ఆమె మనసు మార్చాలని ఇంకేదో చెప్పాడు. ఆమెను తనవైపు తిప్పుకోవాలని చూశాడు.

బీబమ్మ కోపంతో బుస్సుమంది. ‘‘నేను ఒక్కటే మాట అడుగుతా. నీకు భూమి కావాలా వద్దా’’ అన్నది.

అంతే తీవ్రంగా ‘‘వద్దు. వాని భూమివద్దు. మన్ను వద్దు. ఇన్ని రోజులు బతుకలేదా .. ఇప్పుడు బతుకమా …’’ అన్నాడు ఇమామ్‌ ఆ మాటలంటున్నప్పడు అతడిగొంతు ఏడుపుతో కూరుకుపోయింది.

ఆ మాటలు చాంద్‌ విన్నట్టున్నాడు. కన్ని క్షణాలు ఆగిన అతడి చేతిలోని పలుగు రెట్టింపు వేగంతో భూమిని పొడుస్తుంది. ఆ చప్పుడు ఇమామ్‌కు బాధను కలిగిస్తుంటే బీబమ్మను భయపెట్టింది. అదే భయంతో ‘‘నీకు అవసరం లేకుంటే వానికి అవసరం లేదా … వాడు ఎట్ల బతుకుతాడనుకుంటున్నావు. ఈ భూములు ఎప్పటికి పంచుతరనుకున్నవా … ఏదో దాని గాలి వచ్చింది. ఇస్తున్నరు. నాలుగు రోజులాగి నాకు ఎలుగు లేదని తిరిగితే మాత్రం ఇస్తరనుకున్నవా..?’’ అన్నది.

ఇమామ్‌ నోరెత్తలేదు. బీబమ్మనే మళ్ళీ అన్నది. ‘‘వాని బుద్ధి వానిష్టం. నువ్వు మలుసుకపండు. ఏం చేసుకుంటడో చేసుకోని. ఎవలకు ఏం చెప్పుకున్నడో మనకేం తెలుసు. వాడు కోపం మీదున్నాడు. చంపనన్న చంపుత సావనన్న సత్త అంటుండు. ఈ రాత్రి చెట్లు గుట్టలు పట్టుకుని ఉరుకుతే ఎవలు ఎంటపోవాలె’’ అన్నది.

అప్పడప్పుడే వెన్నెల మొలిచింది. చీకట్లు మాయమై మసక మసకగా వెలుతురు పరచుకుంది. ఆ వెలుతురులో ఒకరికకరు స్పష్టంగా కనిపిస్తున్నారు. చాంద్‌ పలుగుతో తవ్వి పారతో మట్టిని ఎత్తుతున్నాడు. బీబమ్మ మంచం దగ్గర నిలబడింది. ఇమామ్‌ ముడుచుకుని పడుకున్నాడు. షాదుల్‌ మంచం కింద బుస్సు బుస్సుమంటుంది.

ఆ వెన్నెల రాత్రి ఇమామ్‌లో ఎన్నో ఆలోచనల్ని కలిగిస్తుంది. షాదుల్‌తో ఏ ఊరు బయలుదేరాలన్నా వెన్నెల రాత్రినే ఎన్నుకునే వాడు. షాదుల్‌కు కూడా వెన్నెలంటే ఇష్టం. ఎంత దూరమైనా అలసట, ఆయాసం లేకుండా నడిచేది. వెన్నెలలో ఆడుకునేది.

దాని పుట్టుపూర్వోత్తరాలు గుర్తుకొస్తున్నాయి ఇమామ్‌కు. ఇరువై ఏండ్ల కింద ఇదే వెన్నెల రాత్రి అది తనకు చిక్కింది. అప్పుడు వెంట బీబమ్మ కూడా ఉంది. చాంద్‌ ఏడాది పిల్లవాడు అంతే! షాదుల్‌ ఆరు నెలలు దాటిన పిల్ల. చాలా కష్టపడి రెండు మూడు రోజులు కావలి కాచి, గంటలకు గంటలు మాటువేసి అడవిలో దానిని పట్టుకున్నాడు. క్షణం ఆలస్యమైనా దాని తల్లి పంజాకు పుర్రె పగిలి చచ్చేవాడే!

ఆ కష్టం .. దానిని ఇష్టంగా పెంచుకున్న క్రమమంతా గుర్తుకు వస్తుంది ఇమామ్‌కు.