విశ్వ మహిళా నవల: 5. సోఫీ ల ఱోష్

స్త్రీలకు సంబంధించి వారి అందాన్నో సౌశీల్యాన్నో చెప్పే ఎన్నో విశేషణాలు చేర్చడం చూస్తాం కానీ వాటిలో ‘మేధావి’ అన్నది తరచూ కనిపించే పదం కాదు. స్త్రీల సాహిత్యంలో గాని, పురుషుల సాహిత్యంలో గానీ స్త్రీలను మేధావిగా ప్రస్తావించడం జరగదు. కానీ ఒక జర్మన్ రచయిత్రి తొలి నవలలో తన కథానాయికను గురించి ఇతర పాత్రలు ‘సోఫియా మేధావి’ అని మెచ్చుకోవడం అప్పటి పాఠకులకు ఆశ్చర్యం కలిగించిందట. ఇప్పుడు కూడ ఆశ్చర్యం కలిగించే విషయమే అది. ఆనాటి జర్మన్లు, ఇతర యూరోపియన్లు అలాంటి పాత్రను సృష్టించిన రచయిత్రిని ఆరాధించారు. ఆ రచయిత్రి సోఫీ ల ఱోష్ (Sophie La Roche), ఆ నవల ది హిస్టరీ ఆఫ్ లేడీ సోఫియా స్టెర్న్‌హైమ్ (1771).

ఆడవాళ్ళు మేధావులుగా కూడ పరిగణింపబడవచ్చునని 18వ శతాబ్దిలోనే గుర్తించిన ఆమెను గురించి జర్మన్ రచయితల్లోనే అత్యున్నత స్థానంలో నిలిచే వుల్ఫ్‌గాంగ్ గొయ్‍టె (Wolfgang Goethe) ‘ఆమె నన్ను ప్రభావితం చేసింది’ అన్నాడు. సోఫీ జర్మన్ భాషలో నవల రాసిన తొలి మహిళ (1731-1807). ఆనాటికి జర్మనీలో అక్షరాస్యులైన స్త్రీలు పదిశాతం లోపే. వారు కూడ చదవడం కొద్దోగొప్పో నేర్చుకున్నారేమో కానీ రాయడానికి సాహసించడం లేదు. స్త్రీలకు ఎందులోనైనా నైపుణ్యం ఉందీ అంటే (గృహిణిగా కాక), ఒక్క లేఖా రచనలోనే. దానికి ఏ కుటుంబంలోని పురుషుల నుంచీ వ్యతిరేకత వచ్చేది కాదు. అందుకేనేమో ఈ తొలి మహిళానవల లేఖారచన శిల్పంలోనే సాగింది.

సోఫీ ల ఱోష్ జీవితం

పెళ్ళికి ముందు సోఫీ పేరు మరీ సోఫీ గుటర్‌మన్ (Marie Sophie Gutermann). ఆమె తండ్రి వైద్యుడు; సంపన్నుడు, సంస్కారవంతుడు, పండితుడు. అంతకంటే ముఖ్యంగా ప్రొటెస్టెంట్లలోనే మరింత కఠోరమైన భక్తిభావాలను సమర్థించే పయటిస్ట్ (Pietist) వర్గానికి చెందిన కుటుంబం వాళ్ళది. ఈ వర్గానికి చెందినవారు తమ నడవడిక, ఆలోచనలు, చదివే పుస్తకాలు, చేసే పనులు అన్నిటిలోనూ పవిత్రతకు ప్రాధాన్యమిస్తారు. కుటుంబం, సమాజం విధించే నియమనిబంధనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించకూడదని నమ్ముతారు. బైబిల్ లోని ప్రత్యక్షరమూ పాటించాలని నమ్ముతారు. ఈ వాతావరణంలో పుట్టిన సోఫీని ఒకరకంగా బాలమేధావి అని చెప్పవచ్చు. మూడోయేటే పుస్తక పఠనం ప్రారంభించిన తను అయిదోయేటికి బైబిల్ మొత్తం చదివేసింది. చదివినదాన్ని సమయానుకూలంగా ఉటంకించేది కూడా. అప్పట్లో ఆడపిల్లలకు స్కూళ్ళు, కాలేజీలు లేవు. కానీ కుమార్తె తెలివితేటలను గమనించిన తండ్రి ఇంట్లోనే ఆమెకు చదువు చెప్పించాడు. ఫ్రెంచి, చరిత్ర, భౌగోళిక శాస్త్రం, చిత్రకళ, ఎంబ్రాయిడరీ, సంగీతం, నృత్యం నేర్చుకుంది సోఫీ. వీటితో పాటు ఇల్లాలికి అవసరమైన పనులన్నీ నేర్చింది. ఆమె 12వ యేటే ఇటాలియన్ వైద్యుడు బయాంకొనీతో ఆమెకు వివాహం నిశ్చయమైంది. అతనికి జర్మన్ రానందువల్ల, ఆమెకు ఇటాలియన్ నేర్పించాడు. తల్లి 1748లో చనిపోగానే తండ్రికి కాబోయే అల్లుడితో అభిప్రాయభేదం వచ్చింది. తమకు పుట్టే సంతానాన్ని అతను కేథలిక్కులుగానే పెంచుతానని ప్రొటెస్టెంట్లుగా పెంచడానికి ఒప్పుకోనని చెప్పడంతో వివాహం రద్దుచేశాడు సోఫీ తండ్రి. సోఫీని తనతో లేచివచ్చేయమని కోరాడు బయాంకొనీ. కానీ తండ్రి మాట జవదాటడం తనకు ఇష్టంలేదని ఆమె తిరస్కరించింది. తర్వాత దూరపుబంధువుల ఇంటికి వెళ్ళింది. వాళ్ళింట్లో ఆఖరి కొడుకు క్రిస్టొఫ్ మార్టిన్ వీలండ్‌తో (Christoph Martin Wieland) చక్కని స్నేహం మొదలైంది. వాళ్ళిద్దరి మధ్యా అనురాగబంధం ఏర్పడింది కూడా. కానీ రెండు కుటుంబాల పెద్దలు (ఎందువల్లో తెలీదు) దీన్ని వ్యతిరేకించడం వల్ల వివాహనిర్ణయం మానుకున్నారు. కానీ ఎప్పటికీ స్నేహితులుగా ఉండిపోయారు. పరస్పర సాహిత్య జీవితాలకు చేదోడువాదోడుగా నిలిచారు. జర్మన్ నవలాకారుల్లో గర్ట రంగంలోకి దిగేవరకు మకుటం లేని మహారాజు వీలండ్. అటు వీలండ్ నుంచి శిక్షణా, ఇటు గర్ట నుంచి అనుకరణా రెండూ అందుకున్న అరుదైన మహిళ సోఫీ.

సోఫీ, చివరకు తన తండ్రి ఆదేశాలకు తలవొగ్గి ఫ్రెంచి రాజవంశీకుడయిన కౌంట్ జార్జి మైకల్ ఫ్రాంక్ వాన్ ల ఱోష్‌ను వివాహం చేసుకుంది. అక్కడినుంచి ఫ్రెంచి రాజవంశీయుల సన్నిధిలో ఆమె జీవితం కొనసాగింది. ఆమె మామగారు జీవించివున్నంత కాలం ఆయనిచ్చే పార్టీలకు హోస్టెస్‌గా అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడడం, గృహిణిగా అందరికీ అన్నీ సమకూర్చడానికే ఆమె పరిమితమైంది. తల్లి ప్రభావం వల్ల, సోఫీకి మొదటినుంచి గ్రామీణ జీవితంపై, ప్రకృతితో మమేకత్వంపై ఇష్టం ఎక్కువ. అందుకే తనకు ఇష్టంలేని నగర జీవితాన్ని తనదిగా చేసుకోవాల్సిరావడం ఆమెకు విసుగు తెప్పించింది. అయితే వివిధరంగాల్లో, కళల్లో నిష్ణాతులైనవాళ్ళు ఈ విందులకు వచ్చేవారు. వాళ్ళతో తెలివిగా మాట్లాడ్డానికి ఆమె చాలా చదవాల్సివచ్చింది. దానితో ఆమె పుస్తకపఠనం పెరిగి ఒక విధంగా ఆమెకు లాభమే చేసింది. మామగారి మరణానంతరం, భార్యాభర్తలు తిరిగి తమ పల్లె జీవితానికి వచ్చేయడం ఆమె జీవితంలో పెద్ద మలుపు. అక్కడ తిరిగి తన చిరకాల మిత్రుడు వీలండ్‌తో కలిసి సాహిత్య పఠనంతో పాటు రచన కూడ ప్రారంభించింది.

సోఫీ జీవితాన్ని, సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలంటే మూడు అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి

  1. అప్పటి జర్మన్ రచనల ధోరణి: 18వ శతాబ్ది జర్మన్ రచయితల్లో అగ్రేసరులైనవారు ఇద్దరు. ఒకరు సుప్రసిద్ధ నవలా రచయిత వీలండ్. జర్మన్ నవలాకారుల్లో అగ్రస్థానంలో నిలిచిన వీలండ్, సోఫీకి అండగా నిలబడి, ఆమె నవలలు ప్రచురించడానికి ముఖ్యకారకుడయ్యాడు. ఆమె తొలి నవలను ఎడిట్ చేసి, ముందుమాట రాసింది కూడ ఆయనే. ఆమెను అంతలా గౌరవించిన మరొకరు గొప్ప కవి, నవలాకారుడు గొయ్‍టె. ప్రపంచ సాహిత్యంలోనే తొలి వరసలో నిలిచే ఫౌస్ట్ (Faust) నాటకం, ది సారోస్ ఆఫ్ యంగ్ వెర్దర్ (The Sorrows of Young Werther) నవలలతో పాటు మరెన్నో రచనలతో జర్మన్ రచయితల్లోనే అతిగొప్ప రచయితగా నిలిచే గొయ్‍టె, సోఫీ ల ఱోష్ అభిమాని. వీలండ్ ఆమె నవలని ప్రచురిస్తే, గొయ్‍టె తన ప్రశంసల ద్వారా ఆమెకు కీర్తి తెచ్చిపెట్టాడు. గొయ్‍టె కేవలం ఆమెను ప్రశంసించడమే కాదు. తన నవల వెర్దర్‌కి సోఫియా నవలను స్ఫూర్తిగా తీసుకున్నాడని, కొన్నిచోట్ల ఈ నవలను అనుకరించాడనీ విమర్శకులు నిదర్శనాలతో సహా చూపించారు. బహుశా ఒక విషయంలో సోఫియా గొయ్‍టె కంటే ముందున్నట్టు కనిపిస్తుంది. గొయ్‍టె నవలలో నాయకుడు వెర్దర్ కష్టాలు, కడగండ్లు తట్టుకోలేక, తను ఆశించినవి అందుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు. కానీ సోఫీ నవలా నాయిక సోఫియా కష్టాలను తట్టుకుని, జీవనమార్గాన్ని మార్చుకుని మనోనిబ్బరంతో ముందుకు సాగుతుంది
  2. జర్మన్ సాహిత్యంపై, ముఖ్యంగా సోఫీపై ఫ్రెంచి తత్వవేత్త జాఁ జాక్ రుసో (Jean-Jacques Rousseau) ఆలోచనల ప్రభావం ఉంది. రచయిత్రిగా ఎదిగే క్రమం కంటే ముందే ఫ్రెంచి రచనలు ఎక్కువగా చదివేది. ఆమెకు మాతృభాష జర్మన్ కంటే ఫ్రెంచి భాష పైనే ఎక్కువ అధికారం ఉండేది. జెనీవాకు చెందిన రుసో 18వ శతాబ్దిలో యూరప్‌ని ఎంతగా ప్రభావితంచేశాడో తెలిసిందే. అప్పట్లో రుసోని చదవనివారు, ఆయన ఆలోచనలతో ప్రభావితం కానివారూ తక్కువే. రుసో సమన్యాయం ఆమెను ఆకర్షించింది. ప్రకృతికి చేరువగా ఉండడం మనిషిని మరింత సంస్కారవంతుణ్ణి చేస్తుందన్న మాటలు, ప్రజావిద్య గురించి రుసో సిద్ధాంతాలు ఆమెను ప్రభావితం చేశాయి. రుసో రచనల ప్రభావంతోనే ఈ నవలా నాయిక న్యాయం గురించి, వర్గవిభేదాల గురించి మాట్లాడుతుంది. అక్షరాస్యత పెంచడం ద్వారా సమాజానికి తన వంతు సేవ చెయ్యాలని సంకల్పిస్తుంది.
  3. 18వ శతాబ్ది యూరప్ సాహిత్యాన్ని, ముఖ్యంగా నవలారచనను ప్రభావితం చేసిన మరొక రచయిత శామ్యూల్ రిచర్డ్‌సన్ (Samuel Richardson). రిచర్డ్‌సన్ నవలల్లోని మనస్తత్వ చిత్రణ ఆనాటికి ఆధునికమైంది. ముఖ్యంగా నాయికల ప్రాధాన్యం, పురుషుల్లోని ‘మేకవన్నె పులుల’ తత్వం ఆనాటి రచయిత్రులకు రిచర్డ్‌సన్‌ని ఆదర్శ రచయితని చేసింది. సోఫీ కూడ ఈ నవలల నుంచి స్ఫూర్తి పొందింది. సోఫీకి ఇంగ్లండ్ అన్నా, ఫ్రెంచి అన్నా చాలా అభిమానం. తన మాతృభాష సాహిత్యం కంటే అవే ఎక్కువ చదివేది. రిచర్డ్‌సన్‌లా తను కూడ లేఖారచనద్వారా గొప్ప నవలను రాసింది. ఆ శిల్పాన్ని ప్రయోగించడంలో రిచర్డ్‌సన్‌ని చాలాచోట్ల అనుకరించింది కూడా. కానీ ఈ నవల ఈ ప్రభావాల సమాహారం కాదు. రచయిత్రి జీవితానుభవాల నుంచి, ఆమె సంస్కారం నుంచి, తన మహిళా పాఠకులకోసం ఒక ఆదర్శ మహిళను సృష్టించాలన్న తపన నుంచీ ఈ నవల పుట్టింది. ఆమె అనుకున్నట్టే ఎంతోమంది మహిళాపాఠకులు ఈ సోఫియాని ఆదర్శంగా తీసుకుంటున్నట్టు ఆమెకు లేఖలు కూడ రాశారు.

కథాపరిచయం

ఈ నవలంతా ఉత్తరాల ద్వారా నడుస్తుంది. కథానాయిక పేరు సోఫియా. ఉత్తరాల్లో ఎక్కువ భాగం సోఫియా స్టెర్న్‌హైమ్, తన స్నేహితురాలు ఎమీలియాకు రాస్తుంది. వాటిని ఎమీలియా చెల్లెలు రోసీనా ఎడిట్ చేసి సంకలనం చేస్తుంది. ఆరంభంలో రోసీనా స్వయంగా సోఫియా తల్లిదండ్రుల ప్రేమ కథ, వివాహం, ఇద్దరి మరణం మొదలైన విషయాలు చెబుతుంది. ఆ తర్వాతి నుంచి సోఫియా ఉత్తరాలు ప్రారంభమవుతాయి. ఇంకా నవలలో నాయకుడు లార్డ్ సీమోర్, ప్రతినాయకుడు లార్డ్ డెర్బీ తమ స్నేహితులకు రాసే లేఖలు, మరికొన్ని అప్రధాన పాత్రల లేఖలు కథనం సరళంగా, స్పష్టంగా సాగేలా చేస్తాయి. స్థూలంగా కథ ఇదీ:

వేర్వేరు అంతస్తులకు చెందినప్పటికీ ప్రేమపెళ్ళి చేసుకుని ఎంతో ఆనందంగా సహజీవనం చేసిన చక్కని దంపతుల కుమార్తె సోఫియా. అయితే దురదృష్టవశాత్తు చిన్నతనంలోనే తల్లిని, ఆ తర్వాత కొంతకాలానికి తండ్రిని కోల్పోతుంది. తండ్రి మరణించే సమయంలో సోఫియాను ఎమీలియా, రోసీనాల తండ్రి అయిన మతగురువుకు, అత్త కౌంటెస్ లూబౌకు (Löbau) అప్పగిస్తాడు. ఎమీలియా తండ్రి, కుటుంబం ఆమెను ఎంతో ప్రేమతో చూస్తారు. కానీ ఆమె అత్త స్వార్థానికి, కృత్రిమత్వానికి, ధనాశకీ పెట్టింది పేరు. సోఫియాకు తన స్నేహితురాళ్ళ వద్దే ఉండిపోవాలని ఉన్నా అత్త ఒప్పుకోదు. బలవంతంగా తనతో నగరానికి తీసుకువెళ్తుంది. అక్కడ ఫ్రాన్స్ రాకుమారుడికి సోఫియాను ఉంఫుడుగత్తెగా చెయ్యాలన్నది అత్త ప్రణాళిక. సోఫియా అతని మీద ఏమాత్రం ఆసక్తి చూపదు. ఆమెతో సంబంధం కష్టమైన పనేనని రాకుమారుడు కూడ గుర్తిస్తాడు. ఈలోగా లార్డ్ సీమోర్‌తో పరిచయం అవుతుంది ఆమెకు. అతని సహృదయత, హుందాతనం, మంచితనం ఆమెను చాలా ఆకర్షిస్తాయి. కానీ అప్పటికే అతనికి మరొకరితో వివాహం నిశ్చయమైందని వింటుంది. పైగా అతను కూడ ఆమె పట్ల అనురాగం కలిగినా వ్యక్తం చేయడు. సోఫియాని ఆమె అత్త తరచు రాకుమారుడు హాజరయ్యే విందులకు తీసుకువెళ్తూ అతనికి ఆమె పట్ల ఆకర్షణ పెరిగేలా చేస్తూంటుంది. సోఫియాకు తెలీకుండా రాజకుమారుడిచ్చిన దుస్తులను, నగలను ఆమెకు అలంకరించి ఒక విందుకు తీసుకువెళ్తుంది. అది చూసిన వాళ్ళందరూ అప్పటికే సోఫియా రాకుమారుడికి దగ్గరైందని అనుమానిస్తారు. అలా అనుమానించినవారిలో లార్డ్ సీమోర్ కూడ ఉన్నాడు. అతను ఆమెను రాకుమారుడికి లొంగిపోయిందనుకుని అసహ్యించుకుని వెళ్ళిపోతాడు. ఇదంతా తెలీని సోఫియాకు లార్డ్ సీమోర్ ప్రవర్తన అర్థంకాదు.

సోఫియాను విపరీతంగా మోహించి ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్న లార్డ్ డెర్బీ ఈ ఉదంతాన్ని గమనిస్తూ ఉంటాడు. అందగాడు, సంపన్నుడు, మాటకారి అయిన డెర్బీ ఆడవాళ్ళను వల్లో వేసుకోవడంలో నిపుణుడు. కానీ సోఫియా తనకు తెలిసిన అందరు ఆడపిల్లల్లాంటిది కాదని అతను త్వరలోనే గ్రహిస్తాడు. ఒక లేఖలో తన మిత్రుడికి ఈ విషయం చెబుతూ, సోఫియా అందరిలాంటి అమ్మాయి కాదు. ఇతర ఆడపిల్లల్లా, తన హోదా, అందం, చలాకీతనం చూసి ఆమె లొంగిపోయే ప్రసక్తిలేదు. కనక ఆమెను లొంగదీసుకోవాలంటే పెళ్ళాడక తప్పదు. అది దొంగ పెళ్ళయినా సరే. (ఇది చదువుతూంటే గిరీశం, బుచ్చమ్మను లొంగదీసుకునేందుకు చేసే వ్యూహం గుర్తుకు వస్తుంది) అంటాడు. సోఫియాకు, సీమోర్‌కు మధ్య అనురాగం ఏర్పడుతోందని కూడ గ్రహిస్తాడు. ఇంక జాప్యం చేయకూడదని, రాకుమారుడి నుంచి తప్పించుకోడానికి సోఫియాకు తనను పెళ్ళిచేసుకోడమే మార్గమని చెప్తాడు. పథకం ప్రకారం సోఫియాను ఒప్పించి, లార్డ్ డెర్బీ సోఫియాను కపట వివాహం చేసుకుంటాడు. తన సేవకుడికి మతాధికారి వేషం వేసి, అతని చేత తమ పెళ్ళి చేయిస్తాడు. సోఫియా అతని భార్యగా విధులు నెరవేరుస్తుంది కాని, సాన్నిహిత్యానికి అంత సుముఖంగా లేకపోవడం గమనిస్తాడు. ఆమె ఇంకా లార్డ్ సీమోర్‌నే ప్రేమిస్తున్నదని అతనికి అర్ధమై ఆగ్రహిస్తాడు. ఒకరోజు ఇద్దరి మధ్యా జరిగిన వివాదం వికృతరూపం దాల్చి, ఆమెపై బలాత్కారం చేసి ఆమెను వదిలేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత ఆమెకు రాసిన ఉత్తరంలో తమ పెళ్ళి చెల్లదని, ఇక సోఫియాకూ తనకు ఎలాంటి సంబంధం లేదనీ చెప్తాడు.

భర్తగా నటించి తనని రేప్ చేసిన లార్డ్ డెర్బీ కలిగించిన దెబ్బనుంచి కోలుకోడానికి సోఫియాకు కొంత సమయం పడుతుంది. కానీ ఆమె మనోనిబ్బరం, ఆమెకు ఆశ్రయం కల్పించిన స్నేహితురాలు ఎమీలియా, ఆమె భర్త ఔదార్యం ఆమెను మామూలు మనిషిని చెయ్యడమే కాదు, తోటివారికోసం సేవచేసే పని కూడ కల్పించుకునేలా చేస్తాయి. ఆమె అనాథలైన యువతులకు పునరావాసం కల్పించడం, బాలికలకు పాఠశాలలు ప్రారంభించడం వంటి పనుల్లో తృప్తి పొందుతుంది. ఈలోగా మిసెస్ సమర్స్ అనే కులీన స్త్రీ తనకు సహాయకురాలిగా రమ్మని ఆమెను ఇంగ్లండుకు తీసుకువెళ్తుంది. సోఫియా తన పేరు మార్చుకుని అక్కడ ప్రశాంతంగా జీవిస్తూంటుంది. కొంతకాలం తర్వాత, ఇంటి యజమానురాలు మిసెస్ సమర్స్ మేనకోడలు భర్తతో సహా వస్తున్నట్టు కబురు వస్తుంది. ఆ భర్త మరెవరో కాదు. లార్డ్ డెర్బీయే. డెర్బీకి యాదృచ్ఛికంగా ఒక పనివాడి వల్ల ఆ ఇంట్లో సోఫియా ఉందని తెలుస్తుంది. తను భార్యతో సహా అక్కడికి వెళ్తే, ఆమెను తను దొంగపెళ్ళి చేసుకున్న విషయం బట్టబయలవుతుందన్న భయంతో, తను వచ్చేలోగానే ఆమెను అపహరించి, స్కాట్లండ్‌లో కొండమీద బంధించమని సేవకుడిని ఆదేశిస్తాడు. అలా సోఫియా రెండోసారి డెర్బీ దుర్మార్గానికి గురవుతుంది. కానీ ఇప్పుడు కూడ కుమిలిపోదు. అక్కడ బందీగా ఉంటూ కూడ ఆమె ధైర్యాన్ని కోల్పోక స్థానికులతో కలిసి వారి బాగోగులు చూసుకోవడం మొదలుపెడుతుంది. ఆ ఊళ్ళో ఆమెకు డెర్బీ తనకంటే ముందు వివాహం చేసుకున్నట్టు నటించి వదిలేసిన మరో స్త్రీ తారసపడుతుంది. ఆమెకు డెర్బీ ద్వారా ఒక కొడుకు కూడా. డెర్బీ లీలలు ఒకటొకటిగా బయటపడుతూంటాయి. గతాన్ని మరిచిపోవడానికి సంఘసేవనే మార్గంగా ఎంచుకుంటుంది సోఫియా. ఎలాగో రోజులు ప్రశాంతంగా గడుస్తూండగా డెర్బీ సేవకుడు జాన్ ఆమె దగ్గరికి వచ్చి తన యజమానికి కొత్త భార్య పట్ల మోజు తీరిపోయిందని, సోఫియా వస్తే ‘ఏలుకోడానికి’ సిద్ధంగా ఉన్నాడనీ చెప్తాడు. సోఫియాలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. అతన్ని దూషించి, ససేమిరా రానని చెబుతుంది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన తోపులాటలో జాన్ ఆమెను బండల మీద నుంచి తోసేస్తాడు. ఆమె మరణించిందనుకుని అక్కడినుంచి వెళ్ళిపోతాడు. దాదాపు సజీవ సమాధిలో ఉండిపోతుంది సోఫియా.

ఈలోగా లార్డ్ డెర్బీకి హటాత్తుగా జబ్బుచేసి మరణశయ్యమీదకు చేరతాడు. అప్పుడు అతన్ని చూడడానికి వచ్చిన లార్డ్ సీమోర్‌తో పశ్చాత్తాపం ప్రకటిస్తూ, తను సోఫియా పట్ల చేసిన దురాగతాలను చెప్పి, ఆమె మరణించిందని చెప్తాడు. తను ఆమెను ఎంత అపార్థం చేసుకున్నదీ అప్పటికిగాని సీమోర్‌కి అర్థంకాదు. వెంటనే సీమోర్, అతని మిత్రులు స్కాట్లండ్‌లో డెర్బీ చెప్పిన స్థలానికి వస్తారు, కనీసం ఆమె మృతదేహాన్నయినా తీసుకువెళ్ళి అంత్యక్రియలు చేద్దామని. కానీ కొనవూపిరితో ఉన్న ఆమెను అదృష్టవశాత్తు ఆ గ్రామీణులు రక్షించారని, ఒక సంపన్నుడి ఇంట్లో ఆమెకు ఆశ్రయం కల్పించారనీ తెలుస్తుంది. వారి సహకారంతో క్రమంగా ఆరోగ్యవంతురాలవుతున్న సోఫియాను చూసి పరమానందభరితుడౌతాడు లార్డ్ సీమోర్. సీమోర్ సోఫియాను వివాహం చేసుకోవడంతో వీరి ప్రేమకథ సుఖాంతమవుతుంది. సోఫియా ఆదర్శాలైన అనాథలను ఆదుకోవడం, స్త్రీలకు, పిల్లలకు చదువు చెప్పడం వివాహానంతరం భర్త సహకారంతో కొనసాగుతాయి. ఇద్దరూ తమ సమాజంలో చక్కని పేరు ప్రతిష్టలు తెచ్చుకుని, అందరి అభిమానాన్ని పొందుతారు.

సంక్లిష్టమైన ఈ ఇతివృత్తాన్ని లేఖల ద్వారా కథనం చేయడంలో రచయిత్రి అపారమైన ప్రతిభ చూపింది. ఉత్తరాలనగానే కథకు మాత్రమే ఉపకరిస్తాయనిపిస్తుంది కాని, ఇందులో ఉత్తరాల ద్వారా అప్పటి సమాజం, ఆర్థిక వ్యత్యాసాలు, స్త్రీలను, పేదలను ధనవంతులు దోచుకునే విధానాలు, వాటికి వ్యవస్థ ఆమోదాలు అన్నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి.

ఎందుకు రాసింది?

సోఫీ మామగారి మరణానంతరం చిన్న ఊరికి వచ్చి భర్తతో నివసించిందని చెప్పుకున్నాం. ఆమె ఇద్దరు కూతుళ్ళూ ఉన్నతవిద్య కోసం వేరే ఊళ్ళకు వెళ్ళిపోయారు. ఆమెకు పిల్లలు దగ్గర లేరన్న దిగులు బాధించింది. అప్పుడు స్నేహితుడైన ఒక ఉపాధ్యాయుడికి మొరపెట్టుకుంది. ఆయన ఆమెకొక సలహా ఇచ్చాడు: ‘నీ మనసులో ఏమేం ఆలోచనలు మెదులుతున్నాయో అవన్నీ కాగితం మీద పెట్టు. అది విద్య కావచ్చు; దాతృత్వం కావచ్చు. నీకిష్టమైనవన్నీ.’ అలా తన ఆలోచనలకు అక్షరరూపం ఇచ్చే క్రమంలో ఆమెకు ఈ నవల కథ తోచింది. నవల రాయడంలో తన ఉద్దేశం తన ఒంటరితనాన్ని మరచిపోవడం; తను ఒక ఉన్నతాశయాలు కల మహిళగా పరిణతి చెందిన క్రమాన్ని తలపోసుకోవడం. ఆ క్రమంలో ఎదురైన అనుభవాలు తన కుమార్తెల వయసులో ఉన్న ఇతర యువతులకు ఉపయోగపడతాయేమోనన్న ఆశ. ఇదే ఆమెచేత ఈ నవలను రాయించింది. విమర్శకులు ఆమెను ‘తర్కానికీ, భావోద్వేగానికీ మధ్య ఊగిసలాడిన రచయిత్రి’గా సరిగ్గానే అంచనావేశారు. ఇందువల్లే ఆమె నవల ఆమె అనుకున్నట్టు యుక్తవయస్కులకే కాక, అన్ని వయసులవారికీ నచ్చింది. ఆడపిల్లలకు నీత్యుపదేశం ఆమె ఆశించిన ఫలితమైనప్పటికీ అలాంటి రచన వల్ల మామూలుగా పాఠకులకు, విమర్శకులకు తోచే యాంత్రికత, రసహీనత ఆమె రచనలో లేవు. దానికి కారణం ఆమె పాత్రచిత్రణలో చూపిన పరిణతి, కథానాయిక పాత్రలో ఇమిడ్చిన సజీవత్వం.

రచనలో ఆమెకు సహకరించిన వ్యక్తిగా చిన్నప్పటి ప్రియుడు వీలండ్‌ను ముఖ్యంగా చెప్పుకోవాలి. వీలండ్ తనని తాను స్త్రీవాదిగా చెప్పుకునేవాడు. స్త్రీలందరికీ విద్య అందాలని ఆయన ఉపన్యాసాలు ఇచ్చేవాడు. అంతకుముందు వరకు ఫ్రెంచి, ఇంగ్లీషు పుస్తకాలు మాత్రమే చదివిన సోఫీ, వీలండ్ ద్వారా జర్మన్ భాషలోని మంచి పుస్తకాలు కూడ చదివింది. ముఖ్యంగా అతని నవలలు స్త్రీల పక్షాన నిలబడేవి. జర్మనీలో అప్పటికింకా మతమౌఢ్యంగాని, స్త్రీల పట్ల మతం పేరిట అమానుష చర్యలు గానీ తగ్గలేదు. నిజానికి 1775లో కూడ అమాయకురాళ్ళయిన స్త్రీలను మంత్రగత్తెలుగా ముద్రవేసి, సజీవదహనం చేసిన ఘనత ఆ దేశానిది! అలాంటి నేపథ్యంలో స్త్రీల సమానత్వాన్ని ప్రచారంచేసిన వీలండ్ వంటివారు స్త్రీలకు ఆశాకిరణాలుగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు. అంత మంచి వీలండ్ కూడా సోఫీ నవలను ఎడిట్ చేయడంలో, దాన్ని పరిచయం చెయ్యడంలో తన అసూయను అధిగమించలేకపోయాడు. ఈ నవల ‘స్త్రీ జాతికి మణిదీపం వంటి’దనీ ‘మహిళలందరూ తప్పక చదవాల్సిన గ్రంథ’మనీ పూర్తిగా ఆడవాళ్ళ సాహిత్యం కిందికే దీన్ని చేర్చాడు. నిజానికి ఈ నవలలో రాజకుటుంబాలలోని అనైతికత గురించి, ధనిక, పేద వర్గాల వ్యత్యాసాల గురించి, ఆర్థిక సామాజిక దోపిడీల గురించి, స్త్రీ పురుష భేదం, ధనిక, పేదలనే వ్యత్యాసం లేకుండ ప్రజలందరూ విద్యావంతులు కావాల్సిన ఆవశ్యకత గురించి సోఫీ రాసిన సన్నివేశాలు, చర్చలు ఎన్నో ఉన్నాయి. అవి స్త్రీలకు పరిమితమైనవి ఎంతమాత్రం కావు. ఒకవైపు సోఫీని సాహిత్యానికి పరిచయం చేసిన ఘనతను నెత్తికి ఎక్కించుకుంటూనే, ఆమె పట్ల కనీకనిపించని వివక్షను వీలండ్ చూపించాడన్నది తెలుస్తూనే ఉంటుంది.

మతం ఇచ్చిన మనోనిబ్బరం

సోఫీ ల ఱోష్ ఈ నవలలో ఒక అసాధారణమైన యువతిని సృష్టించింది. ఆ యువతి ఒక విధంగా తనే. ఒకచోట ఆమె చెప్పుకున్నట్టు ఈ కథలో నాయిక వ్యక్తిత్వం మేరకు ఆత్మకథాత్మకత ఉంది. (Sophie von La Roche admitted that the heroine of her novel Lady Sternheim, namesake Sophia, was actually a self-portrait, and she describes the heroine Sophia in great detail, modeling her after her own characteristics and physical features-ఒక విమర్శకుడు) కాకపోతే కథలోని సంఘటనలు, ఇతర పాత్రలూ తన కల్పనే. సోఫియా నైతిక విలువలకు అత్యంత ప్రాధాన్యమిచ్చే పాత్ర. పవిత్రతను పరమాదర్శంగా స్వీకరించిన పయటిజమ్ అనుయాయి అయిన సోఫీ, తన కథానాయికకు కూడ అదే ఆదర్శాన్ని ఇచ్చింది. ఈ మతసూత్రాల ఆధారంగా ఈ నవలలో అయిదు రకాల ఆదర్శాలను నాయిక సోఫియా పాత్ర ద్వారా అందించింది.

  • మొదటి ఆదర్శం: ఆ రోజుల్లో ఆడవాళ్ళందరూ ఉత్సాహంగా ఎదురుచూసే డాన్స్ పార్టీలు, నాటక ప్రదర్శనలు, రాజవంశీకుల విందులు ఇష్టపడకూడదు. ఎందుకంటే అవి తుచ్ఛమైన ఆనందాలు కనక. పైగా సమాజంలో స్త్రీకి పెళ్ళి తప్ప మరో లక్ష్యం లేనట్టుగా పురుషులను ఆకర్షించడానికే ఈ విందులకు ఆహ్వానిస్తారు కనక.
  • రెండో ఆదర్శం: జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా తట్టుకోగల సహనం, వినయవిధేయతలు అలవరచుకోవాలి. తమకే ప్రపంచంలోని కష్టాలన్నీ వచ్చిపడ్డాయన్న సెల్ఫ్ పిటీని ఈ నవలలో స్త్రీ పాత్రలు ఎక్కడా వ్యక్తంచెయ్యవు.
  • మూడో ఆదర్శం: సమాజంలో తమకంటే తక్కువ స్థితిలో ఉన్నవారిని ఆదుకోవాలి; వారికి చేతనైన సహాయం చెయ్యాలి. సోఫియా ఈ వితరణ చూపే పద్ధతిలో కూడ ఎంతో పరిణతి కనిపిస్తుంది. కొందరు బతికిచెడ్డ స్త్రీలకు నేరుగా తను డబ్బు ఇస్తే అవమానంగా భావిస్తారేమోనని గుప్తదానాలు చేస్తుంది. ఎక్కడ ఎప్పుడు ప్రయాణిస్తున్నా ఆమె చూపులు దారివెంబడి కనిపించే నిర్వాసితులు, అనాథలమీదే ఉంటాయి. మార్గమధ్యంలో ఆగిపోయి మరీ డబ్బులు పంచేస్తుంది.
  • నాలుగో ఆదర్శం: ప్రజలందరూ విద్యావంతులు కావాలి. దానికి అందరూ బాధ్యత వహించాలి. వ్యక్తిగత జీవితంలో రెండుసార్లు ఒకే పురుషుడి చేత ఘోరంగా అవమానింపబడినా, శారీరకంగా హింసింపబడినా, ఒకే ఒక్క ఆశయంతో ఆ బాధను అధిగమిస్తుంది సోఫియా. తన మనసును స్వీయానుభవం నుంచి మరల్చుకోవడం. ఆ మరల్చుకోవడానికి ఆమె ఎన్నుకున్న మార్గం బాలికలకు, నిరక్షరాస్యులైన మహిళలకు విద్య నేర్పడం.
  • అయిదో ఆదర్శం: భగవంతుడితో ఆత్మీయమైన, ఆంతరంగికమైన అనుబంధం సాధించినపుడే మన ఆత్మ సౌందర్యవంతమవుతుంది. ఆ దిశగా ప్రయత్నించాలి. ఈ క్రమంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మవిమర్శ. ఆత్మావలోకనం. ఎప్పటికప్పుడు వ్యక్తి తను చేస్తున్న పనులు, తన ఆలోచనలు సరైనవా కావా, పవిత్రంగా ఉన్నాయా లేదా అని తర్కించుకోవాలి. విశ్లేషించుకోవాలి. తప్పులుంటే సరిదిద్దుకోవాలి. బలహీనతలుంటే అధిగమించాలి. అప్పుడే భగవంతుడికి చేరువవుతాడని ఆమె నమ్మింది. దాన్ని ఆచరించింది కూడా.

ఈ నవలలో సోఫియాకు వచ్చిన కష్టం మామూలుది కాదు. పవిత్రతకు ప్రాధాన్యమిచ్చే ఆమె శరీరాన్ని అపవిత్రం చేశాడు లార్డ్ డెర్బీ. కానీ కథలోను, పాత్ర చిత్రణలోనూ ఉన్న ప్రత్యేకత ఇక్కడే ఉంది. లార్డ్ డెర్బీ తనను బలాత్కరించి వెళ్ళిపోయి, తమకిద్దరికీ జరిగింది ‘దొంగపెళ్ళి’ అని ఉత్తరం రాసినపుడు, సోఫియా తనకు ‘కష్టం వచ్చిందని, తను మోసపోయిందనీ’ అనుకుంటుందే తప్ప తను ‘అపవిత్రమయ్యానని’ ఎప్పుడూ అనుకోదు. ఆమె దృష్టిలో పవిత్రత మానసికమైంది. అందుకే ఇదొక కష్టంగాను, తను అధిగమించవలసిన అడ్డంకిగానూ మాత్రమే అనుకుంటుంది. దానికి ఆమెకు తెలిసిన విరుగుడు తనకంటే దుస్థితిలో ఉన్నవాళ్ళకు సేవచేయడం. అందుకే, స్త్రీలు, పిల్లల సేవకు జీవితాన్ని అంకితం చేస్తుంది. నవల ఆసాంతం సోఫియా ఒక్కొక్క సంఘటనను లేఖలో తన స్నేహితురాలికి రాస్తున్నప్పుడు, తన ప్రవర్తనలో ఏదైనా లోపం ఉందా, తన ప్రతిస్పందనల్లో, ప్రతిచర్యల్లో న్యాయముందా అన్న సంఘర్షణ వ్యక్తం చేస్తూంటుంది. తనలోని బలహీనతలను అధిగమించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూంటుంది. ఆమెలోని ఒక స్పష్టమైన బలహీనత ఇంగ్లీషువారి మీద ఉన్న గౌరవం. ఇంగ్లండుకు చెందినవారు కాబట్టే లార్డ్ సీమోర్, లార్డ్ డెర్బీలు ఇద్దరినీ ఇష్టపడుతుంది. సీమోర్ మీద కలిగిన ప్రేమ ఆమెకు స్వచ్ఛందంగా కలిగిందే. డెర్బీ మాత్రం తనే పావులు కదుపుతాడు. ‘ఇంగ్లీష్‌వాడు కదా! మంచివాడే అయ్యుంటాడు’ అనుకునేంత నమ్మకం ఆమెకు బ్రిటిష్ సంస్కారం పైన. ఆ ఇంగ్లీషు వ్యామోహమే ఆమెను డెర్బీని నమ్మేలా చేస్తుంది. ఆ విషయాన్ని కూడ తర్వాత గ్రహిస్తుంది.

సోఫియా పాత్రలోని సంఘర్షణను, ఆమె జీవితంలో ఎదురైన ఆటుపోట్లను తట్టుకుని విజయవంతంగా జీవితాన్ని మలుచుకున్న తీరును రచయిత్రి చాలా గొప్పగా చిత్రించింది. సోఫియా పాత్ర పైనే ఎక్కువ శ్రద్ద పెట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే కథానాయకుడు లార్డ్ సీమోర్ పాత్రగాని, ప్రతినాయకుడు లార్డ్ డెర్బీ పాత్రగాని, అటూ యిటూ కాని రాకుమారుడి పాత్రకాని, ఇంకా ఇతర మంచి, చెడు పాత్రలు కానీ అంతగా ఆకర్షించవు. వాటి నిర్మాణం, పరిణామాల పట్ల అంత శ్రద్ధ కనిపించదు. వ్యక్తిగత జీవితంలో సమగ్రతను సాధించి, సామాజిక జీవితంలో పురుషులతో సమానమైన భాగస్వామ్యాన్ని అకుంఠిత దీక్షతో సాధించిన సోఫియా పాత్ర మాత్రం కలకాలం నిలిచిపోయే విధంగా చిత్రణ సాగింది. తను డెర్బీ చేత పరాభవం పొందినపుడు దాన్ని మరిచిపోవడానికి ఆమె చేసే వాదన విలక్షణంగా ఉంటుంది.

Despite my sincere love of virtue, my obstinacy and imprudence have exposed me to sorrow and contempt. I have lost much and suffered greatly. But should I, for that reason, forget the happiness of my early years and regard with indifference the opportunities which still present themselves, exclusively devoting myself to the sensibilities of my self-love?

తమకు అన్యాయం జరిగిందని కుంగిపోయే ప్రతి ఒక్కరూ చదవాల్సిన వాక్యాలివి. నిజంగానే తన మొండితనం (లార్డ్ సీమోర్ ప్రేమ అర్థమైనా అతనే బయటపడాలన్న మొండితనంతో తన మనోభావాలను అతనికి చెప్పడానికి ఇష్టపడదు) విచక్షణారాహిత్యం వల్లే లార్డ్ డెర్బీ కుతంత్రాన్ని పసిగట్టలేకపోయింది. దాని ఫలితం అనుభవించింది. కానీ ఆ ఒక్క కారణంగా, తను ఇంతకాలం అనుభవించిన ఆనందాలను, భవిష్యత్తులో తనకు రాగల గొప్ప అవకాశాలనూ విస్మరించడంలో ఏమైనా అర్థం ఉందా? అని ప్రశ్నించడమే అపురూపమైన దృక్పథమైతే, దానికి మరొకటి చేరుస్తుంది. ‘నాకు నామీద ప్రేమ మితిమీరడం వల్లే కదా నాకు జరిగిందానికి ఇంతగా బాధపడుతున్నాను’ అనుకుంటుంది. సెల్ఫ-లవ్ వల్ల వ్యక్తికి తన కష్టాలన్నీ విపరీతపరిమాణంలో కనిపిస్తాయన్న గొప్ప సత్యాన్ని అలవోకగా చెప్పేసింది ఇక్కడ. దాన్ని కొంచెం తగ్గించుకుంటే ఇతరులను ప్రేమించడంలో, ఇతరులకు సేవ చేయడంలో మన కష్టాలను మరచిపోవచ్చునని ఆచరించి చూపిస్తుంది సోఫియా.

ఇలాంటి వాక్యాలు నవలలో చాలానే కనిపిస్తాయి. వ్యక్తికి తన పట్ల, సమాజం పట్ల ఉన్న బాధ్యతల గురించి స్పష్టమైన అవగాహన ఉన్న రచయిత్రి సోఫీ. దానికి ప్రతిబింబమే సోఫియా. రాజకుటుంబం విందుల్లో తరచు వినిపించే అతి పొగడ్తల పట్ల ఆమె ఎగతాళి, తన తల్లిదండ్రుల స్మృతులు, వారసత్వం పట్ల గౌరవం, ఎదుటివాళ్ళలో మంచినే చూడడానికి ప్రయత్నించే మనస్తత్వం, తన మనసుకు నచ్చనిదాన్ని పదిమంది మెప్పుకోసం ప్రశంసించడం చేతకాని నిజాయితీ, ఎవరు కష్టాల్లో ఉన్నా చూడలేనితనం, ఆ చూడలేకపోవడం నుంచి వచ్చే కార్యదక్షత, ఇలాంటి మంచి లక్షణాలు ఎన్నో ఉన్న సోఫియాను అభిమానించని పాఠకుడు ఉండడు. అయితే ఇంత పరిపూర్ణమైన స్త్రీ ఒక నమూనాలా, మూసపాత్రలా ఉందా అంటే లేదనే చెప్పాలి. సోఫియా పాత్రలో ఎక్కడా సంభావ్యత చెడదు. అసహజంగా అనిపించదు. ఎందుకంటే తన బలహీనతలను ఈ నాయిక దాచుకోదు. తన తప్పుడు నిర్ణయాలను సైతం ఒప్పుకుంటుంది. తను పరిపూర్ణత వైపుగా అడుగులు వేస్తున్నానని, తనలాగే అందరూ ఆ దిశగా ప్రయాణం సాగించాలనీ కోరుకుంటుంది. ఇది నాయిక కోరికే కాదు. రచయిత్రిది కూడా.

అందుకే ఈ నవల 1771లో వెలువడిన సంవత్సరమే మరో మూడు ముద్రణలు పొందింది. 1978 నాటికి మరో 8 ముద్రణలు పొందింది. 1976 నాటికి డచ్చి, ఫ్రెంచి, ఇంగ్లీషు భాషల్లోకి అనువదింపబడింది. ఈ నవల వెలువడిన వెంటనే సాహిత్యలోకంలో సంచలనం సృష్టించింది. దీనికి ఎక్కువగా అనుకూల సమీక్షలే వచ్చినా ప్రతికూల సమీక్షలు చేసినవారు కూడ లేకపోలేదు. కానీ అనంతరకాలంలో విమర్శకులు, ఈ నవల 18వ శతాబ్దపు ట్రేడ్‌మార్కు అయిన ‘సెంటిమెంటల్’ నవలా విభాగానికే చెందినప్పటికీ సోఫియా పాత్ర దాని విలువను అమితంగా పెంచిందని సరిగ్గా అంచనా వేశారు. స్త్రీలకు ప్రణయం, కుటుంబం పట్ల ఎంత బాధ్యత ఉందో, సామాజిక పరిణామాల పట్ల కూడ అంతే అవగాహన ఉండాలని, ప్రగతిశీల కార్యక్రమాల్లో స్త్రీలు విరివిగా పాల్గొనాలనీ సూచించిన ఈ నవల జర్మన్ నవలల్లోనే శిఖరాయమానమైనదని భావించారు.


సి. మృణాళిని

రచయిత సి. మృణాళిని గురించి: రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ...