విశ్వమహిళానవల 19: డొరొతీ కాంబెల్

నాగరికతకు దూరంగా ఉన్న ప్రాంతమని, స్కాండినేవియా దేశాల ప్రభావంతో విచిత్రమైన భాష, ఆచారవ్యవహారాలను కలిగుండే మనుషులనీ ఇంగ్లీషువారు ఎద్దేవా చేసిన ప్రాంతం స్కాట్‌లండ్ ఉత్తరతీరంలో ఉండే షెట్‌లండ్ ద్వీపాలు. అక్కడ పుట్టి పెరిగినవారే ఆ ఉనికిని చెప్పుకోడానికి మొహమాటపడే, అయిష్టం వ్యక్తం చేసేంత వివక్ష దాని పట్ల ఉండేది ఒకప్పుడు. అలాంటి చోట జన్మించి, అక్కడి జీవితాన్నే తన కవిత్వంలోనూ, రాసిన ఒకే ఒక్క నవలలోనూ చిత్రించిన రచయిత్రి డొరొతీ ప్రిమ్‌రోజ్ కాంబెల్ (Dorothea Primrose Campbell). మరో రకంగా చెప్పాలంటే ప్రాంతీయ అస్తిత్వాన్ని కథాసూత్రంగా మలిచిన తొలి రచయిత్రి అనవచ్చునేమో.

షెట్‌లండ్ అతిసుందరమైన ద్వీపం. ప్రకృతి సౌందర్యమంతా కలబోసుకున్న ప్రాంతమది. (థ్రిల్లర్ సీరియల్స్‌లో కూడా షెట్‌లండ్‌ను చూసినపుడు ఆ పచ్చని పచ్చికకు, నీలాకాశానికి, కట్టిపడేసే ఎగువ ప్రాంతాలకు (హైలండ్స్‌), సరస్సుల సౌందర్యానికి, బారులు తీర్చిన గొర్రెల వయ్యారాలకూ గుర్రాల విన్యాసాలకూ ముగ్ధులైపోతాం తప్ప, హంతకుడెవరు అన్న ఆసక్తి కూడ కలగదు.) అక్కడ ప్రధానమైన వృత్తులు గుర్రాల పెంపకం, ఉన్నిదుస్తుల అల్లిక, చేపలు పట్టడం. అక్కడి తొలినాళ్ళ సాహిత్యమంతా మౌఖికమే, జానపదమే. 1469కు ముందు 8వ శతాబ్ది నుంచీ స్కాండినేవియాలో భాగంగా ఉన్న షెట్‌లండ్, ఒక వివాహంలో కట్నం రూపంలో స్కాట్‌లండ్‌కు ధారాదత్తమైంది. అయినా బ్రిటిష్ పెత్తనం వచ్చేవరకూ నార్డిక్ వారసత్వాన్ని నిలుపుకుంది. నెపోలియన్ యుద్ధాల నేపథ్యంలో షెట్‌లండ్ బ్రిటన్ ఆధిపత్యంలోకి వచ్చిన తర్వాత, క్రమంగా వారి వీరగాథలు, పాటలు అంతరించిపోయాయి. అప్పటి వారి భాష నోర్న్ (Norn) బ్రిటన్ పాలనతో మారిపోయింది. ఆంగ్లమే విద్యామాధ్యమం, రచనా మాధ్యమం అయింది. షెట్‌లండ్ నేపథ్యంగా రాసిన రచయితల్లో ఒక ప్రముఖుడు ఉన్నాడు. వాల్టర్ స్కాట్ షెట్‌లండ్‌ను సందర్శించి ది పైరేట్స్ అనే నవల రచించాడు. అతని తర్వాత, అంతగా పేరు రాకపోయినా షెట్‌లండ్ పైనే రాసిన రచయిత్రులు డొరొతీ కాంబెల్ (1792-1863); మార్గరెట్ చామర్స్ (1758-1827). మార్గరెట్ కవితలు మాత్రమే రాసింది.

షెట్‌లండ్

1823లో విలియమ్ బర్న్ అనే స్కాట్‌లండ్ దేశీయుడు, కెనడాకు వలసపోయి తన మిత్రుడు నికల్సన్‌కు రాసిన ఉత్తరంలో ‘ఇంకా సగం ఆటవికజాతిలా ఉండే ఆ షెట్‌లండ్ వాళ్ళ మధ్య నువ్వెలా జీవిస్తున్నావో తెలీదు. కాస్త నాగరిక ప్రపంచంలోకి రా’ అంటాడు: I wish Mrs. Nicolson and you would think of coming up to the civilized world for the winter months–I should like far better that you would leave Shetland for good and all–I can’t guess what satisfaction you can have in drilling in a set of semibarbarous peasantry. స్కాట్‌లండ్‌కు చెందినవాడే అయినా, అందులో భాగమైన షెట్‌లండ్‌ని అంత చులకనగా చూశాడతను. కానీ అప్పటికే అతనికి ఈ మిత్రుడు నికల్సన్, షెట్‌లాండ్ కేంద్రంగా డొరొతీ కాంబెల్ రచించిన హార్లీ రాడింగ్‌టన్: ఎ టేల్ (1821 ప్రచురణ) నవల పంపి ఉన్నాడు. ఉత్తరం చివర దాన్ని ప్రస్తావిస్తూ, కథావస్తువును మెచ్చుకోకున్నా, ‘ఈ రచయిత్రికి మాత్రం మంచి ప్రతిభ ఉంది. ఇంకా మంచివి రాయగల’దని మెచ్చుకున్నాడు బర్న్.

తన ప్రాంతీయులే తమను, తమ సంస్కృతిని కించపరిచే వాతావరణంలో, దాన్నే వస్తువుగా తీసుకుని నవల రాసే సాహసం చేసింది డొరొతీ కాంబెల్. మొదట్లో ఆమె కవిగానే అందరికీ పరిచయం. ఆమె రెండు సంపుటాల కవితలు ఆమెకు బాగా పేరు తెచ్చాయి. కానీ, ఆమె రాసిన ఏకైక నవల హార్లీ రాడింగ‌టన్: ఎ టేల్ కొందరు విమర్శకులను తప్ప సామాన్య పాఠకులను ఆకర్షించలేకపోయింది. 19వ శతాబ్ది నాటికి షెట్‌లండ్‌వారు పూర్తిగా బ్రిటిన్‌కు లోబడి, తమ భాషను, యాసను విస్మరించారు. వ్యవహారంలో ఇంకా ఆ ఛాయలున్నా, సాహిత్యంలో ఆ యాసను ప్రవేశపెట్టే సాహసం ఒకరిద్దరు తప్ప ఎంతోమంది చేయలేదు. వాళ్ళు కూడా 20వ శతాబ్ది రచయితలు. డొరొతీ కాంబెల్ కూడ ఆంగ్లంలోనే రాసింది కానీ సంభాషణల్లో తరచు తమ యాసను ప్రవేశపెట్టింది. ఆమె నవల ప్రజలను ఆకర్షించే లోపే తర్వాతి సంవత్సరం, నవలారచనలో చేయి తిరిగిన స్కాట్ రాసిన ది పైరేట్ విడుదల కావడంతో, పాఠకుల దృష్టిని అది ఆకట్టుకుంది. ఇక ఈమెను చదివేవాళ్ళే కరవయ్యారు – స్కాట్ కంటే ముందే ఈమె షెట్‌లండ్ నేపథ్యంలో రాసినా. నిజానికి తనని తాను రచయిత్రిగా పెద్దగా పరిగణించుకోని కాంబెల్, తన నవలకు కొంతైనా మద్దతు ఇవ్వమని స్కాట్‌కు లేఖ కూడ రాసింది ‘నేను జెట్‌లండ్ మీద నవల రాశాను’ (zetland) అని సంకోచిస్తూ చెప్పుకుంది స్కాట్‌కు. ఎందుకంటే గ్రేట్ బ్రిటిన్‌లో ఏ మాత్రం గుర్తింపు లేని ప్రాంతాల్లో ఇది ఒకటి. ఆర్థికంగా, సాంస్కృతికంగా వెనకబడిన ప్రాంతం. ప్రకృతివనరులపైనే జీవికకు ఆధారపడిన ప్రాంతం. అందుకే బర్న్ వంటి మరెందరో అక్కడి ప్రజలను, వారి సంస్కృతిని అనాగరికంగా భావించారు. అలాగని తమ రచనల్లో రాశారు కూడా. స్కాట్ పుణ్యమాని ఆ ప్రాంతానికి కొంత గుర్తింపు వచ్చింది.

డొరొతీ జీవితం

డొరొతీ 1793లో లెర్విక్‌లో జన్మించింది. తండ్రి వైద్యుడు. ఆమె పెద్ద కూతురు. ఒక చెల్లెలు, ఇద్దరు తమ్ముళ్ళు. తాత నుంచి సంక్రమించిన అప్పులు తీరక కుటుంబం ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేది. దానికి తోడు తల్లి గంజాయికి బానిసైంది. ఆమె 16వ యేట తండ్రి మరణించడంతో, డొరొతీ జీవితం అతలాకుతలమైంది. అయితే చిన్నప్పటినుంచి చదువులో మంచి ప్రావీణ్యం సాధించిన ఆమె 1812లో తనే ఒక పాఠశాల ప్రారంభించింది. అది కొంతకాలం బాగానే నడిచినా, తల్లి దురలవాట్లతో, అప్పులతో నడపలేక, చివరికి తన పాఠశాల నిర్వహించలేక, మూసేసి, మరో పాఠశాలలో ఉపాధ్యాయినిగా చేరి, కుటుంబాన్ని పోషించింది. ఈ క్రమంలో మానసికంగాను, ఆర్థికంగానూ ఆమెకు అండగా నిలిచినవాడు వాల్టర్ స్కాట్ ఒక్కడే. అయినా తాత, తండ్రులు చేసిన అప్పులు తీరకపోవడంతో, 1841లో ఇంగ్లండ్ వెళ్ళి ఒక ఇంట్లో గవర్నెస్‌గా పనిచేసింది. కానీ వాళ్ళు దివాలా తీయడంతో ఆ ఉద్యోగమూ పోయింది. ఆ తర్వాత ఎన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నా, ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. దానికి ముఖ్య కారణం- ఆమె షెట్‌లండ్‌కు చెందివుండడం! షెట్‌లండ్ వాస్తవ్యుల పట్ల ఉన్న వివక్షను ఆమె జీవితంలో ఎదుర్కోవడం బహుశా ఆమె నవలా వస్తువుకు ప్రేరణ అయివుండవచ్చు. రెండోది ఆమె వయసు- అప్పటికే 40 దాటివుండడం. చివరికి గవర్నెస్‌ల కోసం ఏర్పాటు చేసిన ఆశ్రయంలో చేరి, 1863లో మరణించింది. ఒకరకంగా చూస్తే, ఆమె జీవితంలో ఆనందంగా ఉన్నదశ ఏదీ కనిపించదు.

ఆమె తన 10వ యేటే కవితలు రాసింది. అవి ఆమె 18 ఏళ్ళ వరకూ ప్రచురితం కాలేదు. అంత చిన్నవయసులో రాసినా ఆ కవితల్లో పరిణతి ఉందని, పదేళ్ళ పిల్ల రాసినదానిలా లేదనీ 1811లో వాటి ప్రచురణకర్త ఆశ్చర్యపోయాడు. షెట్‌లండ్ వారి నమ్మకాలు (మంచికి ప్రతీక అయిన ఫెయిరీలు, చెడుకు ప్రతీక అయిన తిరుగుబోతులు), అక్కడి జీవనవైవిధ్యాన్ని, వృత్తులను తెలిపే కథాత్మక ఖండకావ్యాలు ఆమె రచించింది. విఫల ప్రణయగాథలు, దేశభక్తి వస్తువులుగా కొన్నిటిని రచించింది. ఎక్కువగా విషాదాన్ని వ్యక్తం చేసే ఈ కవితలు ఈనాటికీ ప్రజాదరణ పొందుతున్నాయి. ఆ కవితలకు వచ్చిన పేరు ఆమె రాసిన ఒక్కగానొక్క నవలకు రాలేదు.

హార్లీ రాడింగ్‌టన్ కథ

కొన్ని నవలలు చదివీ చదివగానే అర్థమై, ఉదాత్తంగా, ప్రత్యేకంగా ఉంటాయి. కొన్ని నవలలను నిశితంగా చదివి, పొరలు విప్పుకుంటూ పోతే తప్ప, వాటిలోని పస అర్థం కాదు. ఈ నవల రెండో కోవకు చెందింది. నవలలో కథ గొప్పదేమీ కాదు. ఒకరకంగా ఒక బలహీనుడు, విధి ఎలా లాక్కుపోతే అలా వెళ్ళే యువకుడి కథ. సహజత్వం పుష్కలంగా ఉన్నా, ఆదర్శం, ఆకర్షణ తక్కువగా ఉన్న పాత్రలు, కథనం.

హార్లీ రాడింగ‌టన్ కథానాయకుడు. అతను లండన్ పొగాకు వ్యాపారి కుమారుడు. సంపన్నుడు. తల్లి స్కాట్‌లండ్‌కు చెందింది. చిన్నప్పుడు బాగా గారాబంగా పెరుగుతాడు. హార్లీ తండ్రి చనిపోవడంతో, తల్లి ఐర్లండ్‌కి చెందిన ఒక వివాహితుడిని పెళ్ళి చేసుకుంటుంది (వివాహితుడని తెలీక). ఆమె, సవతి తండ్రి, హార్లీని వదిలివేయడంతో, ఒక్కసారిగా దిక్కులేని అనాథ అయిపోతాడు. సముద్రంపై ఉపాధి వెతుక్కుంటూ వెళ్తాడు. కానీ నౌక మునిగిపోయి షెట్‌లండ్‌ చేరుకుంటాడు. అక్కడ ఆ బాలుడిని పేదవాళ్ళయిన హాన్సన్స్, ఆ తర్వాత మధ్యతరగతికి చెందిన గౌరవప్రదమైన కుటుంబం ఇర్వింగ్‌సన్స్ పెంచుతారు. ఇలా షెట్‌లండ్‌ లోని అనేక ద్వీపాల్లో పెరుగుతాడు. కొంతకాలం తర్వాత ఎడిన్‌బర్గ్ అనే సంపన్న కుటుంబానికి చెందిన ఎలెన్ అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ ప్రాంతంలో ఉండే సాండర్స్ అనే వ్యక్తి, డబ్బుకోసం స్మగ్లర్ల చేత అతన్ని అపహరింపజేస్తాడు. ఎలాగో తప్పించుకుని మళ్ళీ సముద్రంలోకి వెళ్తాడు. పడవ మునిగిపోతుంది. ఈసారి కూడా ఎలానో బతికి మరో నౌకలో గ్రీన్‌లండ్ వెళ్తాడు. అక్కడినుంచి ఎట్టకేలకు షెట్‌లండ్‌ చేరుకుంటాడు. కానీ అతను వచ్చేసరికే అనారోగ్యంతో తను ప్రేమించిన ఎలెన్ మరణించి ఉంటుంది. ఆ బాధను తట్టుకోలేక లండన్‌కి పారిపోయి అక్కడ రాయల్ నేవీలో చేరతాడు. నేవీలో ఉన్నతస్థాయి చేరుకుని, నైట్‌హుడ్ కూడ సాధిస్తాడు. ఇప్పుడతను తన ప్రేయసి ఎలెన్ తండ్రి ఎడిన్‌బర్గ్‌కు వారసుడవుతాడు. (అతనికి కొడుకులు లేనందువల్ల, అల్లుడు కాబోయిన ఇతన్ని వారసుడిగా భావిస్తాడు.) తిరిగి స్కాట్‌లండ్ ఎగువ ప్రాంతాలకు వచ్చి గ్రేస్ హేమిల్టన్ అనే సంపన్నుడి కుమార్తెను వివాహం చేసుకుంటాడు. కానీ ఆ తర్వాత ఎప్పుడూ తిరిగి షెట్‌లండ్‌కు వెళ్ళడు. అక్కడ తన వారనుకున్నవారంతా అప్పటికే మరణించారని తెలుసుకుంటాడు. ఇక వెళ్ళబుద్ధి కాక స్కాట్‌లండ్, లండన్‌ల మధ్యే తిరుగుతూ శేషజీవితాన్ని గడిపేస్తాడు.

కథలో స్థూలదృష్టికి ప్రత్యేకత ఏమీ ఉన్నట్టు కనిపించదు. రెండు సంపుటాల పెద్ద నవల ఇది. ఇందులో హార్లీ జీవితంలోని ప్రధాన సంఘటనలు, అతనికి తారసపడే ముగ్గురు అమ్మాయిలు, మంచి భార్య కోసం అతను చేసే అన్వేషణ ఒక కోణం కాగా, అంతకంటే ముఖ్యమైంది హార్లీ తిరిగే ప్రదేశాలు, సముద్రంతో అతని నిత్యయుద్ధం, ఒక్కొక్క ప్రాంతంలో (షెట్‌లండ్, స్కాట్‌లండ్, లండన్) అతను ఎదుర్కొనే వ్యక్తుల స్వభావాలు, వారితో అతని సమాగమాలు. ‘యునైటెడ్ కింగ్‌డమ్’ అన్నది ఏర్పడక మునుపు, ప్రాంతీయ వ్యక్తిత్వం కలిగినవి ఒక జాతీయ స్వభావాన్ని అలవరచుకునే ముందు, ఎటువంటి పరిణామాలు, ప్రతిస్పందనలు ఆ ప్రజల్లో ఉంటాయో చెప్పే నవల ఇది. నవల రచనాకాలం 19వ శతాబ్ది పూర్వార్ధం కాగా, కథాకాలం 18వ శతాబ్ది ఉత్తరార్ధం. (హార్లీ 1736 ప్రాంతాల్లో జన్మించినట్టు కథలోని చారిత్రక సంఘటనలవల్ల తెలుస్తుంది.) అప్పటికే స్కాట్‌లండ్ ఇంగ్లండ్‌తో కలిసిపోయింది. అప్పటి చరిత్రకారులు స్కాట్‌లండ్‌ని వధువుగా, ఇంగ్లండ్‌ని వరుడిగా వర్ణించేవారు! ఎందుకంటే ఇంగ్లండ్, స్కాట్‌లండ్ రాజకీయ కుటుంబాలు ‘వివాహాల’ ద్వారానే కలిసిపోయాయి. అప్పట్లో ప్రచారంలో ఉన్న మౌఖిక గాథల్లో, లిఖిత గాథల్లో కూడా స్కాట్‌లండ్ అమ్మాయి, ఇంగ్లండ్ అబ్బాయిల వివాహాల చిత్రణ అనివార్యంగా ఉండేది. ఇక్కడ ఇంగ్లండ్ ‘వరుడు’ కావడం ఆ దేశం ఆధిపత్యానికి ప్రతీక.

ఈ నవలలో కూడా షెట్‌లండ్, గ్రీన్‌లండ్, స్కాట్‌లండ్, లండన్‌ల మధ్య ఉపాధికోసమో, పరిస్థితుల ప్రాబల్యం వల్లనో తిరిగే హార్లీ సమాంతరంగా వధువును అన్వేషిస్తూంటాడు. వాచ్యంగా చెప్పాలంటే అతను వరుడు. కానీ వ్యంజనతో అర్థం చేసుకున్నపుడు అతను వధువు. క్రమంగా తన పుట్టిల్లు అయిన షెట్‌లండ్‌ను పూర్తిగ విస్మరించి, మెట్టినిల్లు లండన్‌లో స్థిరపడతాడు. అలాగే ప్రాంతీయ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోడానికి ప్రయత్నిస్తున్న షెట్‌లండ్‌ను అర్థం చేసుకోలేక, జాతీయ దృక్పథాన్ని అన్ని ప్రాంతాలపై రుద్దుతున్న ఇంగ్లండ్ ప్రలోభంలో పడిపోతాడు.

దీన్నే మరోరకంగానూ అర్థం చేసుకోవచ్చు. అనాగరిక ప్రాంతంలో (షెట్‌లండ్) పుట్టిన అతను, నాగరిక ప్రపంచాన్ని (ఇంగ్లండ్) స్వంతం చేసుకున్నాడు; పుట్టుకతో మానసికంగా బలహీనుడిగా ఉన్న అతను (స్త్రీత్వం) సంపన్నుడై, సామాజిక హోదాని సంపాదించుకుని, (పురుషత్వం) ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని, తిరిగి ఆ గుణాలను తన మాతృభూమికి అందించాలని యత్నిస్తాడు. షెట్‌లండ్ తన ‘పరిమిత’ ప్రాంతీయ దృక్పథాన్ని వదిలించుకుని, యునైటెడ్ కింగ్‌డమ్‌లో భాగంగా ‘జాతీయ’ దృక్పథాన్ని అలవరచుకోవాలని ఆకాంక్షిస్తాడు. కానీ నవలంతా పూర్తి చేసిన తర్వాత పాఠకుడికి షెట్‌లండ్, ఇంగ్లండ్ దేనికవే ఉండిపోయినట్టు అనిపిస్తుంది. షెట్‌లండ్ ప్రాంతీయ అస్తిత్వాన్ని ఇంగ్లండ్ గుర్తించినట్టూ ఉండదు; ఇంగ్లండ్ ఆధిపత్యసంస్కృతితో మమేకమై షెట్‌లండ్ ‘జాతీయ’ అస్తిత్వాన్ని పొందినట్టూ ఉండదు. ఇలాంటి ముగింపును రచయిత్రి వైఫల్యంగా కొందరు విమర్శకులు భావించారు. కానీ మరో రకంగా చూస్తే అది ఆమె విజయమే. విజయం మాటెలా ఉన్నా, వాస్తవం. జాతీయ భావన అన్నది ప్రాంతీయ అస్తిత్వాన్ని కబళించలేకపోయిందన్న అంతర్లీనమైన వ్యాఖ్య, ఈ నవలను మంచి నవలనే చేసిందని అనిపిస్తుంది. ‘The novel is ultimately unwilling, or unable, to push Shetland to the point of national inclusion, whether bad or good’ అని వ్యాఖ్యానించింది పెన్నీ ఫీల్డింగ్ అనే విమర్శకురాలు.

స్త్రీ పాత్రల వ్యక్తిత్వ చిత్రణలో మాత్రం తన సమకాలీనుల్లా (జేన్ ఆస్టిన్ వంటివారు) తగినంత శ్రద్ధ డొరొతీ పెట్టినట్టు కనిపించదు. ఎస్ఫాల్ట్, ఎమిలీ, గ్లోరియా అనే ముగ్గరు యువతుల వ్యక్తిత్వాలు పాఠకులపై ఎలాంటి ప్రభావాన్ని చూపవు. హార్లీతో ఉన్న సంబంధానికి మాత్రమే అవి పరిమితాలు. అది కొంచెం నిరాశ కలిగించే విషయమే.

అదలా ఉండగా, కొంత వ్యక్తిత్వం కలదిగా కనిపించే హార్లీ తల్లి ప్రతికూల స్వభావం కలిగిన పాత్ర! భర్త మరణానంతరం రెండో వివాహం చేసుకుని, కొడుకుని అతని ఖర్మానికి వదిలి వెళ్ళడమే కాక, తన మూలాలు షెట్‌లండ్‌లో ఉన్నందుకు సిగ్గుపడే స్వభావం కలిగిన స్త్రీ. స్కాట్‌లండ్, ఐర్లండ్‌లను కించపరిచే బ్రిటిష్ సాంస్కృతిక వాతావరణాన్ని ప్రతిబింబించే సంభాషణల్లో ఇది ఒకటి. హార్లీ తల్లి తన గురించి చెప్పుకున్న పద్ధతి:

“My country indeed! I will defy any body to say I am a Scotchwoman–from my speech, my manners, or any thing about me. You might as well say I was an Irishwoman.”

“Why, Mrs. Radington, you are nevertheless, by your own account, a Scotchwoman born and bred. Why deny it?”

“You know very well, sir, for I have told you a thousand times, I hate to be thought a Scotchwoman; every body here laughs at the Scotch, and despises them.” (1: 28)

స్కాట్‌లండ్‌నే సహించలేని ఆవిడ, అందులో చిన్నభాగమైన షెట్‌లండ్ తన పుట్టినప్రాంతమని చెప్పుకోవడం అవమానమని భావించడంలో ఆశ్చర్యం లేదు.

కానీ పెద్దగా చదువు, సంపదా లేని వ్యక్తులు ఈ నవలలో ‘షెట్‌లండ్ స్కాట్‌లండ్‌లో భాగమని కూడ ఒప్పుకోరు. దానికదే స్వతంత్రదేశమని గర్వంగా చెప్పుకుంటారు. పడవ ప్రమాదంలో బతికి బట్టకట్టిన హార్లీ ఒక గ్రామంలో తేలతాడు. అక్కడి ఆమెను ‘ఇది బ్రిటనా, స్కాట్‌లండా?’ అని అడిగితే, ‘రెండూ కాదు. షెట్‌లండ్’ అని సమాధానమిస్తుంది. ఇలా రచయిత్రి, ప్రాంతీయ, జాతీయ అస్తిత్వాల గురించి వైవిధ్యమైన, వైరుధ్యమైన కోణాలను నవలలో చూపుతుంది.

ఈ నవలను పట్టించుకున్నవాళ్ళు, దానిపై రాసినవాళ్ళు బహుతక్కువ. సమకాలీన చరిత్రకు చక్కని నవలారూపమిచ్చిన ఈ రచన షెట్‌లండ్ అనే చిన్న ద్వీపసమూహం పట్ల మన అవగాహనను పెంచుతుంది. డొరొతీ తర్వాత షెట్‌లండ్‌పై రాసిన నవలాకారులు తక్కువ. 1877లో జెస్సీ శాక్స్‌బీ (Jessie Saxby (1842-1940) ఎ స్టోరీ ఆఫ్ ది షెట్‌లండ్ ఐల్స్ అన్న నవల రాసింది.

19వ శతాబ్ది పూర్వార్ధంలో ఇంగ్లీషు, ఫ్రెంచి, రష్యన్, జర్మన్ వంటి అన్ని భాషల్లోనూ మహిళలు స్త్రీపాత్రల ప్రాధాన్యంతో, వివాహం, ప్రణయం, స్త్రీల ఆర్థిక స్వాతంత్ర్యం వంటి వస్తువులతోనే నవలలు రాస్తున్న తరుణంలో, ప్రాంతీయ అస్తిత్వం గురించి ప్రశ్నలు లేవనెత్తిన అపురూపమైన రచయిత్రిగా డొరొతీ కాంబెల్‌ని గుర్తించవచ్చు.

సి. మృణాళిని

రచయిత సి. మృణాళిని గురించి: రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ...