తెలుగు గ్రామాలు – ఒక అవలోకనం

దేశానికి పల్లెలు జీవధారా సదృశాలు. దేశ ఆర్థిక ప్రగతికి పల్లెలు పట్టుకొమ్మలు. దేశ సౌభాగ్యానికి, సౌభ్రాతృత్వానికి, సహజీవనానికి పల్లెలు కాణాచులు, ఆదర్శాలు, రైతు దేశానికి వెన్నెముక వంటి వాడని మహనీయులు పేర్కొన్న మాటలు అక్షర సత్యాలు.

ఎన్ని మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుందని, ఒక్కొక్క నీటి బిందువు కలయికే మహాసముద్రం అయనట్టుగా చిన్న చిన్న గ్రామాల కలయికే నేటి పట్టణ రూపం సంతరించుకొంటుంది.

ఈనాటి పరుగు పందెపు ప్రపంచంలో వివిధ రకాలైన కాలుష్యాలతో, అసభ్యకర నాగరికతతో, స్వార్థరాజకీయాలతో పెద్దా – చిన్నా అనే తేడా లేక నైతిక విలువలు పతనమయ్యాయి. తల్లిదండ్రులు, గురువులపైన వినయ విధేయతలు, భక్తిశ్రద్ధలు మృగ్యమైనాయి. సుఖం మరిగి ఆర్థిక జీవన వ్యాపారంలో ధనార్జనే ధ్యేయంగా సొంత లాభంకోసం మానవుడు వెంపర్లాడుతున్నాడు. ఈ కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ యుగంలో మనుషులు యంత్రాల్లాగా తయారై, మనసులు మారిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ‘‘సమకాలీన తెలుగు గ్రామాలను’’ సింహావలోకనం చేస్తే ….

‘‘తెనుగుదనము వంటి తీయందనము లేదు
……………………….
తెనుగు తల్లి సాధుజన కల్పవల్లిరా
……………………’’

అని ‘కరుణశ్రీ’ గారన్నది నిజమనిపిస్తుంది.

ప్రాచీన కాలంనుంచి నదీతీర ప్రాంతాల్లోనే నాగరికత విలసిల్లింది. ప్రజలు గ్రామాలను నీరు సమృద్ధిగా లభించే ప్రాంతాల్లోనే నిర్మించుకొన్నారు. గ్రామానికి వెలుపల వర్షపు నీరు వృధా కాకుండా చిన్న కుంటలు, చెరువులు నిర్మించుకొని కాలువల ద్వారా నీటిని పారుదల చేసుకొని పంటలు పండించుకనే వారు. నదీ పరివాహక ప్రాంతాల్లో గ్రామ నిర్మాణం చేపట్టటం వల్ల తాగటానికి, పంటలకు నీరు సమృద్ధిగా లభించే అవకాశం కలిగింది.

ఇళ్ళ నిర్మాణానికి తగిన వనరులు గల చిన్న కొండలు, తుప్పలు గల ప్రదేశాల్లో ఇళ్ళు సులభంగా నిర్మించుకనే వారు ఆ గ్రామవాసులు. గోడలు గట్టి రాళ్ళతో కట్టుకని కప్పువేయటానికి ‘కూసాలు’ (pillers), దూలాల (beams)కు ‘యాప’ కలప వాడేవారు. అందువల్ల అవి ఎంతో బలంగా ఉండేవి. దూలాలపైన దంతెలు వేసి చాపలు గాని, బండలుగాని పరిచి ఆపైన చౌడుతో కాంక్రీట్‌ లాగా కప్పేవారు. ఇళ్ళ నిర్మాణం విశాలంగా ఉండేది. స్నానం చేసిన నీరు ‘మురుగు’ కాకుండా ‘జాలాది’ (పెద్ద గుంట) తీసి ఆ నీరు అందులో ఇంకేలా చేసుకొనే వారు. పశువులకు ప్రత్యేకంగా ‘కష్టాలు’ వేసేవారు. ఆర్థిక స్తోమత కల వారు మట్టిమిద్దెలు కట్టి పశువులకు తగిన వసతి (గాడి) ఏర్పాటు చేసుకొనే వారు. ఎరువు వేయటానికి ‘దిబ్బ’లకు వసతి చేసేవారు. అందుకే ‘గ్రామం గేయం లాంటిది – నగరం నాటకం లాంటిది’ అంటాడు ‘లాంగ్‌ఫెలో’.

భౌతిక వనరుల ద్వారా వంట చెరకు, పశుగ్రాసం సమకూర్చుకోవటమే గాక అటవీ సంపదను వారు చక్కగా వినియోగించుకొనే వారు. అడవిలో సునాయాసంగా దొరికే రేగు, బలుసు, కలివె, బిక్కి, కండ ఈత మొదలైన పళ్ళు, తేనె, ఉసిరిక, కుంకుడుకాయలు, కరక్కాయలు మొదలైన వాటిని శ్రామికులు తెచ్చుకని గ్రామాల్లో మార్పిడి పద్ధతిలో అమ్ముకని వచ్చిన ధాన్యం, నిత్యావసర వస్తువులతో జీవనం సాగించే వారు.

ఆనాటి గ్రామాల్లో మంచి ఆయుర్వేద వైద్య విధానముండేది. అన్ని జబ్బులకు భిషగ్వరులు (వైద్యులు) అడవుల్లో లభించే ఆకులు, చెట్లబెరడు, పూలు, గడ్డలు, వేర్లు మొదలైన వాటితో చక్కని వైద్యం చేసేవారు. ఈ విధానం ఇప్పటికీ కొండ ప్రాంత గ్రామాల్లో జరుగుతూ ఉంది. ఇవేకాక ఆనాటి గ్రామవాసులు వివిధ రకాలైన సుగంధ ద్రవ్యాలు కూడా తయారుచేసి వ్యాపారం చేసేవారు.

గ్రామాల చుట్టూ చిట్టడవులు, పెద్ద వృక్షాలు, సామాజిక వనాలు ఉండటం వల్ల సకాలంలో వర్షాలు కురుస్తూ పర్యావరణం సమతుల్యంగా ఉండి నాటి గ్రామాలు ఆరోగ్య వాతావరణంలో కళకళ లాడేవి. అందుకే …. ‘‘దేవుడు గ్రామాన్ని సృష్టించాడు – మనిషి పట్టణాన్ని సృజించాడు’’ అంటాడు ‘విలియం కాపర్‌’. నాడు ప్రజలు ఉపయోగించే వస్తువులు, పరికరాలు ఆరోగ్య ప్రదాయకాలే! మంచాలు, బల్లలు, కుర్చీలు – చివరికి దువ్వెన కూడా – చెక్కతో తయారుచేసినవే కనుక ఏ దుష్ఫలితాలు లేక ఆరోగ్య దాయకంగా కూడా ఉండేవి. స్వయంగా నేసిన నూలు వస్త్రాలు వంటి నిండా ధరించి వాతావరణ దుష్ప్రభావం నుంచి తమ శరీరాలను సంరక్షించుకొనే వారు. పళ్ళు తోముకోవటానికి వేపపుల్ల, మర్రి ఊడ, ఉత్తరేణివేరు, కానుగ పుల్ల మొదలైనవి వాడటం వల్ల అవి దంతాలకు, చిగుళ్ళకు ఎంతో మేలు కలుగజేసేవి. ఇది ఆయుర్వేద పరమైన దంత ధావనం అని చెప్పవచ్చు. అలాగే స్నానాదులకు సైతం ఆరోగ్యకరమైన ‘సున్నిపిండి’ని వాడేవారు. ఇందులో సుగంధ ద్రవ్యాలతో పాటు శనగపిండి, ఉలవపిండి, మెంతులు, తంగేడు ఆకులు, ఒట్టివేర్లు మొదలైనవి పొడిచేసుకొని అందరూ ఉపయోగించే వారు. అందుకే వారి అందం ఎండ – వానల్లో కూడా చెక్కుచెదరకుండా ఉండేది. అదే అమలిన సౌందర్యమంటే! ప్రస్తుతం సోమరితనం ఎక్కువై నేటి గ్రామవాసులు సైతం వేపపుల్ల తెచ్చుకోవటానికి కూడా బద్ధకించి సింథటిక్‌, ప్లాస్టిక్‌లతో తయారైన టూత్‌ బ్రష్షులు, పేస్టులు వాడుతున్నారు. ప్రస్తుత గృహోపకరణాలైన దువ్వెన, నూనెలు, క్రీములు, బెడ్‌, ఫుడ్‌, బెంచీలు, కుర్చీలు, బకెట్‌, మగ్గు – ఒకటేమిటి? సమస్త వస్తుజాలమంతా – సింథటిక్‌, ప్లాస్టిక్‌ మయం కావటం చేత వాటి ప్రభావం వల్ల నేడు ఎంతమంది అనారోగ్యానికి గురవుతున్నారో లెక్కకు అందని విషయం.

‘‘పురికిని కోమటి ప్రాణము’’
…………………..

అని సుమతి శతకకర్త అన్నట్టుగా నాడు గ్రామాల్లో వైశ్య ప్రముఖులు ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులు సరఫరా చేసేవారు నిల్వ ధాన్యాల్ని ఎగుమతి చేస్తూ గ్రామ ఆర్థిక విధానంలో తోడ్పడే వారు. అవసరమైన వారికి ధనసహాయం చేస్తూ సంవత్సరాంతాన మాసూలు కాలంలో వసూలు చేసుకంటూ సహాయ సహకారాలు అందించే వారు.

రైతులు వేరుశనగ, శనగపప్పు, ధనియాలు, నువ్వులు, కంది, ఆముదాలు మొదలైన వ్యాపార పంటలు పండించే వారు. పొగాకు పండించి ‘బ్యార్నీల’ ద్వారా తగిన ఉష్ణోగ్రత వద్ద పదును చేసి వ్యాపారం చేసేవారు. నాటి గ్రామాల్లో అన్ని పంటలతో పాటు1 ‘నీలిమందు’ పైరువేసి, నీలిమందు తయారుచేసి ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసేవారు. దీనితోపాటు ఉల్లి విత్తనాలు, ఔషధ దినుసులు, తేనె, కలప, వెదురు, సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసేవారు. కొన్ని గ్రామాల వారు నూలు వస్త్రాలు, అద్దకం ప్రత్యేకంగా చేసేవారు. సముద్రతీర గ్రామవాసులకు ఉప్పు తయారు చేయటం, చేపలు పట్టి అమ్మటం వ్యాపారంగా ఉండేది. ఇంకా లోహపరిశ్రమ, చెక్క బమ్మలు, దువ్వెనలు, వెదురుతో బుట్టలు – తడికెలు, ఎన్నో రకాల అల్లికలు చేసి వ్యాపారం సాగించే వారు ఆనాటి గ్రామ ప్రజలు అందుకే ….

‘‘అప్పిచ్చువాడు, వైద్యుడు,
ఎప్పుడునెడతెగక పారు ఏరును, ద్విజుడున్
చొప్పబడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూర చొరకుము సుమతీ!’

అన్నాడు సుమతి శతక కారుడు. ఆ విధంగా భౌతికంగా, సామాజికంగా నదీతీర ప్రాంతాల్లో ప్రకృతి వనరులు బాగా ఉన్నట్టి ప్రదేశాల్లో అదనుకు తగిన వర్షం. అవసరానికి వైద్యం, వ్యాపార లావాదేవీలు కలిగి సమజీవనం సాగిస్తూ పాడి – పంటల భాగ్యాలతో తులతూగేవి ఆనాటి తెలుగు పల్లెసీమలు. నేడు గ్రామాలు వర్షాలు లేక, వనరులు తరిగి, కాలుష్యాలతో ఆ పాడి, పంట, భాగ్యాలకు నోచుకోవటం లేదు.