ఎప్పుడో నేను ఫోటో తీసేదాకా
నీ బాల్యం ఉంటుందిరా, బాబూ !
మంచులా, మైనంలా,
మౌనంగా కరిగిపోతుంది.
బాల్యం ఒక ప్రవాహం
వెళుతూ, వెళుతూ కాస్సేపు
ఈ పసివాడి దగ్గర సేద తీరింది.
యౌవనం ఒక రుతుపవనం
పోతూ పోతూ ఆమె నీలాకాశ దేహం మీద
ఒక ఇంద్రధనుస్సు విసిరింది.
గిర్రున తిరిగే వంద దృశ్యాలలో
ఏ చిన్నముక్కో
ఈ కెమేరా కంటికి చిక్కుతుంది.
అనవరతం సాగే ఈ అనంత గీతంలో
ఏ ఒక్క మాటో
ఈ పాళీ నాల్కకి పట్టుబడుతుంది.
ఈ కనిపించని ప్రవాహపు
కదలికలో ఉన్న అందాన్ని,
దేనితో కేప్చర్ చెయ్యమంటావు ?