నాయనలారా! నన్ను మన్నించండి !
సగం వేషం వేసినందుకు
సగమే మోసం చేసినందుకు.
నా సగం మీసాన్ని,
సగం పెదవుల ఎరుపుని,
సగం బుగ్గల నునుపుని సహించండి.
ఈ ఒక్క పూటకీ నా మాటమీద
కాస్త శ్రద్ధ వహించండి.
వేషం వేసి ఇక్కడ
రక్తికట్టించలేనని నాకు తెలుసు.
తెలిసీ ఆ ప్రయత్నం చేసినందుకు
నన్ను మన్నించండి !
బాల్య యౌవనాలు
సహజంగా కూర్చిపెట్టిన సన్నివేశంలో
సరిగా నటించలేకపోయాను.
నా పాత్రను బాగా పోషించలేకపోయాను.
మిమ్మల్ని తృప్తి పరుద్దామనుకున్నాను
చివరికదీ చెయ్యలేకపోయాను.
ఈ మహానాటకంలో
ఒక అనుచితపాత్రనైనందుకు
నన్ను మన్నించండి !
ఈ అనంత సంగీతంలో
ఒక అపశ్రుతినైనందుకు
నన్ను మన్నించండి !
బహుశ నా నేపధ్యమే
నాకొక గుర్తింపు నివ్వొచ్చు.
నా నిష్క్రమణ మాత్రమే
ఈ సన్నివేశాన్ని కాపాడవచ్చు.
ఇలాచెప్పి, శెలవు తీసుకుంటున్నందుకు
నన్ను మన్నించండి !