ఓ రాత్రివేళ
అంతటా నిశ్శబ్దం
ఆక్సిజన్ లాగా ఆవరిస్తుంది.
వాయించని కంజరలాగా చంద్రుడు,
మోయించని మువ్వల్లాగా చుక్కలు
ఆకాశం మౌనం వహిస్తుంది.
వీధిలైట్లన్నీ తలవంచుకొని,
ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోతాయి.
ఓ పిట్ట ఒంటరిగా
దొంగతనానికి వెళుతున్నట్టుగా,
ఏమీ సద్దుచెయ్యకుండా
ఎగిరిపోతుంది.
అంతలో,
అంతటి మౌనాన్నీ హఠాత్తుగా ప్రశ్నిస్తూ,
నిశ్చలమైన చెరువులో నీటిబొట్టుపడ్డట్టుగా,
ఓ పసిపాప ఏడుస్తుంది!
చిట్టచివరకి, ఏడుపవగానే,
చుట్టూ పరుచుకున్న మౌనం
ఎంత గాఢమయ్యిందీ అర్థమౌతుంది.
ఇంక ఊరుకోలేని చెట్టు
గాలికోసం కేకేస్తుంది.
ఆకాశంలో మబ్బులు
నా మనసులాగే,
అసంతృప్తిగా,
అసంపూర్ణ చిత్రాలు గీస్తూ,
ఆగిపోతాయి.