ఎంత ప్రేమించినా ఏముంది
అడుగుల సడికే పక్షులన్నీ
హడావుడిగా ఎగిరిపోతాయి.
వలలై చుట్టుకున్న చూపుల్ని
కలిసి ఎగరేసుకుపోతాయి.
గుమిగూడి గింజలేరుకుంటున్నప్పుడు
కనువిందు కలిగిస్తాయి.
చెదిరిపోయేటప్పుడు వీటి అందానికి
కళ్ళు చెదిరిపోతాయి.
ఒకోసారి ఒకో కొత్త చిత్రాన్ని
ఆకాశానికతికిస్తాయి.
ఆలోచనల తీరు వేరు.
నడక మొదలైతే చాలు
కువ కువలాడుతూ
మనసుకొమ్మ మీద వచ్చివాల్తాయి.
కిల కిలా రావాల్లోంచి
పాటను పట్టుకోమని
ఒకటే మారాం చేస్తాయి.
అడుగులు నిలిచిన మరుక్షణం
సడిలేకుండా ఎగిరిపోతాయి.
గుమిగూడినంతసేపే వీటి అందం.
చెదిరినప్పుడు మాత్రం మనసు
చివుక్కుమనిపిస్తాయి.