“సందుక”: నారాయణస్వామి

పోగొట్టుకొన్నవాడి పాట

[“సందుక” లోని మరికొన్ని కవితలు రచయిత వెబ్ సైట్ లో చదవగలరు. -సంపాదకులు]
సందుకశిఖామణి మొదటి పుస్తకం “మువ్వల చేతికర్ర” లో “కొయ్య కాలు” అనే కవిత ఉంది. ఈ కవితను ముందుమాటలో ప్రస్తావిస్తూ ఇస్మాయిల్ గారు ఇలా రాసారు – ” కవిత్వం కవికి కొయ్యకాలు లాంటిది. తను కోల్పోయిన దేనికో substitute. తనను తాను తలక్రిందులుగా పాతుకుంటేనేకానీ అది చిగిర్చదు.”నారాయణస్వామి రెండో పుస్తకం “సందుక” చదివినప్పుడు వెంటనే నాకీ వాక్యాలు గుర్తుకువచ్చాయి. తను కోల్పోయినదానిని కవిత్వంతో భర్తీ చేసుకునే ప్రయత్నం ఈ పుస్తకం నిండా కనిపిస్తుంది. సందుక, అర్ర, ఊరి చెరువు ఏదైనా కోల్పోవడానికి ఒక ప్రతీక మాత్రమే. స్వామి తనను తాను తలక్రిందులుగా పాతుకోకపోయినా,తన ఊరినించి తెచ్చిన “చిన్నారి మొక్క”ను తనలో తలక్రిందులుగా పాతుకున్నాడు. దాని పూల ఎరుపుదనం నెత్తురులోకి చొచ్చుకొనిపోయి, శరీరమంతా వ్యాపించింది. అది బహుశ అతని కవిత్వమే కావచ్చు.

పోగొట్టుకోవటం రెండురకాలుగా జరుగుతుంది. మొదటిది అప్రయత్నంగా పోగొట్టుకొనేవి. బాల్యం, యౌవనం, కన్న ఊరు, కాలేజీ జీవితం మొదలైనవి. వీటన్నింటినీ కాలక్రమంలో సహజంగానే కోల్పోతాం. వీటిని కవిత్వంలో పలవరించటమే తప్పించి తిరిగి పొందటానికి వీలులేదు. వీటిని తలుచుకున్నప్పుడు “ఆనందం లాంటి విచారం కలుగుతుంది”(తిలక్). లేదా “బాగా పరిచయమున్న ఒక కొత్త సువాసన చుట్టుముడుతుంది”. తిరిగిరావు కాబట్టే ఈ అనుభవాలకంత విలువ అబ్బుతుంది. అది కష్టమైనా, పేదరికమైనా, గతస్మృతి ఇప్పుడు మధురంగానే తోస్తుంది.

“పల్లెనుండి పట్నం దాకా
సర్వీసు బస్సులో ప్రయాణం చేసిన
పేదరికపు గునుక పూలు
ఇంటినిండా పూస్తయి.”
(సందుక)

బాల్య యౌవనాలకు సంబంధించిన ఇటువంటి స్మృతులు “అర్ర“, “సందుక” కవితల్లో విరివిగా కనిపిస్తాయి. తన ఊరిని గురించిన జ్ఞాపకాలు “చెరువేమయ్యింది“, “యాడకి బోయిన్రు” వంటి కవితల్లో ఉన్నాయి. ఊరి చెరువు గురించి అనేకమంది కవులు రాసారు. తమ బాల్యం నాటి పల్లెను గుర్తుచెయ్యటానికి కవులకి చెరువొక సామాన్య ప్రతీకగా మారిందనుకుంటాను. “ఇంటి మీద గూన పెంకులల్ల అద్దంముక్క లెక్క ఎండిన మొగులుకు యేల్లాడుతుండే” చెరువు గురించి ఈ కవితలో ప్రతిభావంతంగా చెప్పాడు. ఐతే, కవిత చివర్లో గ్రానైటు కంపెనీల గురించిన ప్రస్తావన అనవసరమనుకుంటాను. అది లేకపోయినా విషయం అర్థమౌతూనే ఉంది. కవిత మరికొంత సాధారణీకరింపబడుతుంది కూడా.

“ఉన్న ఊరు, కన్న తల్లి” అంటారు గాని, ఈ రెండిటికీ ఒక తేడాఉంది. ఎన్నేళ్ళ తరువాత వెళ్ళి చూసినా అమ్మ మారదు. ఆమె ఆప్యాయత, అభిమానం అలాగే ఉంటాయి. బిడ్డలు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళెంతగా మారారో చూసి తల్లి ఆశ్చర్య పడుతుంది. కాని, ఊరు అలాకాదు. మంచికో, చెడ్డకో ఊరు మారుతుంది. తాము విడిచి వెళ్ళిన ఊరు ఎంతగా మారిపోయిందో చూసి పిల్లలే ఆశ్చర్య పడతారు. మరింత సంపన్నమై, మరింత ఆధునికత సంతరించుకున్న ఊరు, ఆరేడు సంవత్సరాల తరువాత తనను చూడటానికి వచ్చిన పరదేశికి “అంజాన్ కొట్టవచ్చు”. అందులో ఆశ్చర్యమేమీ లేదు. తనకున్నవి పోగొట్టుకున్న ఊరు తనలో తానే దు@ఖించవచ్చు. ఐతే, ఊరికి దూరమై, దాని మార్పులవల్ల ప్రభావితమయ్యే పరిస్థితిలో లేనివాళ్ళకు, ఆ మార్పుల్ని విమర్శించే హక్కు లేదేమోనని నాకనిపిస్తుంది. అదే ఊళ్ళో కొనసాగుతున్న వాళ్ళు , ఆ సాధకబాధకాలు అనుభవిస్తారుకాబట్టి, ఏ మాటైనా అనుకోవచ్చు. నేను గమనించిన దేమంటే, ఊరు గురించి రాసిన కవుల్లో ఎక్కువమంది ఊరికి దూరమైన వాళ్ళే. వారి జ్ఞాపకాల భద్రత కోసం ఊరు యధాతధంగా ఉండదు కదా! అంతేకాదు, ఇటువంటి కవితల్లో ఎప్పుడూ తిరిగి వచ్చినవాడి స్వరమే వినబడుతుంది. అలా కాకుండా, ఊరే తిరిగివచ్చిన వాడిని ప్రశ్నిస్తున్నట్టుగా ఎవరైనా రాస్తే ఆసక్తికరంగా ఉండవచ్చు.

ఇకపోతే, పోగొట్టుకోవటంలో రెండవ రకం- మన నిర్ణయాలు, ఎంపికల పర్యవసానంగా, ఉద్దేశ్యపూర్వకంగా పోగొట్టుకున్నవి. – మాతృ దేశం, విప్లవ రాజకీయాలు, విభిన్నమైన విలువలు వగైరా. వీటిని పోగొట్టుకోవటంలో తన బాధ్యత ఉండటం వలన, వీటిని గురించి ప్రస్తావించినప్పుడు కవి స్వరంలో ఒక అపరాధభావం తొంగిచూస్తుంది. స్వామి గతంలో విప్లవ రాజకీయాల్లో చురుగ్గా పాల్గోనేవాడు. (“కల్లోల కలల మేఘం” ఆవిష్కరణ సందర్భంగా బస్ స్టాపుల్లో అతికించిన విరసం పోస్టర్లు నాకింకా గుర్తే). ఈ నేపధ్యాన్ని, స్థిరమైన, సుఖవంతమైన అమెరికా జీవితంతో పోల్చిచూసినప్పుడు, ఈ అపరాధభావం మూలాలు మనకు దొరుకుతాయి. ఈ విచారం వలన కలిగే ప్రయోజనమేదీ లేకపోయినా, కవి తనను తాను అంచనా వేసుకొనే క్రమంలో భాగంగా దీనిని అర్థం చేసుకోవచ్చు. అంతిమంగా కవిత్వం కవి ఆత్మావలోకనమే కాబట్టి ఈ సందర్భంలో అది బాగా పలుకుతుంది. అలాగే, తన నిర్ణయం వల్ల పోగొట్టుకున్నవాటిని, ఎప్పటికైనా తిరిగిపొందాలన్న ఆశ కవిలో మిగిలి ఉండటం కూడా సహజమే.

“మీ గొంతులో అలసటకన్నా
చెదరని ధైర్యం
ఆర్తితో తడిమాక
ఒక కొత్తదనం
ఊపిరిపోసుకుంటుంది.
మళ్ళీ మీముందుకొచ్చి
పునర్జన్మ పొందటానికి
లోలోపల ఒక పెనుకెరటం
సుడులు తిరుగుతుంది.”
(సారూ)

ఎన్నారైలుగా పిలవబడే వారిలో, మాతృ దేశం గురించి ఇటువంటి ఆశే సుడులుతిరగటం మనం తరచు చూస్తుంటాం. “అపరిచితం”, “కదల్లేనితనం”, “కలయిక“, “అప్పటిమాట కోసం”, “గాల్లో ఎగిరాక గానీ” -వంటి అనేక కవితల్లో ఈ అపరాధభావం వివిధ చాయల్లో కనిపిస్తుంది. వీటిలో ఒకటిరెందు చోట్ల వచ్చిన “డాలర్” ప్రస్తావన తొలగించిఉంటే బాగుండేదని నాకనిపించింది. ఎందుకంటే, ఇటువంటి అనుభవం ఎక్కడైనా కలగవచ్చు. పల్లెనుండి పట్నానికి వచ్చి స్థిరపడిన వారిలో కూడా ఇది కలగ వచ్చు. కవి తన అనుభవాన్ని సాధారణీకరించే క్రమంలో ఇటువంటి పదాలు అడ్డునిలుస్తాయి. తాను పోగొట్టుకున్నా, తనలో నిరంతరం మెదిలే స్మృతుల్ని “లోపలా.. బయటా..” కవితలో చాలా బాగా ఆవిష్కరించాడు. “ఉదృతంగా వాన కురుస్తున్న చప్పుడు” అని మొదలయ్యే ఈ కవితలో , బయట వాన జాడలేవీ కనిపించక, కురిసేవానంతా తన లోపలే కురుస్తోందని కవి గుర్తిస్తాడు. బహుశ, ఈ లోపలి వర్షమే కవి తనలో నాటుకున్న మొక్కని సజీవంగాఉంచి, చిగురింపజేస్తుంది. బాహ్య ప్రపంచం, తన జీవన శైలి అన్నీ మారినా, తనలోపలి తనను కాపాడుకొనేందుకు చేసే ప్రయత్నం, అందుకు కావలసిన అంతర్ముఖీనత, నిరంతర చింతన ఈ సంకలనంలో సమృద్ధిగా ఉన్నాయి.

నారాయణస్వామికి మనుషుల పట్ల, బాంధవ్యాల పట్ల ప్రేమ అధికం. “అవ్వా“, “సారూ” వంటి కవితల్లో ఇది స్పష్టంగా తెలుస్తుంది. చెప్పే విషయం వెరేదే అయినా, “చెరువేమయ్యింది” కవితలో ఈ క్రింది పదచిత్రం , బాంధవ్యాల మీద కవికున్న సున్నితమైన ప్రేమను సూచిస్తుంది :

“ఎప్పుడోసారి నాల్గు వానలు పడి
చారెడు నీల్లొస్తే
అత్తగారింటి నుంచొచ్చిన
అక్కసుంటి చెరువును
కావలిచ్చుకొని
ఎన్నెన్ని ముచ్చట్లు
చెప్పెటోల్లము”

స్మృతుల బరువు లేకుండా, వర్ణనాత్మకంగా సాగిన కవితలు “FALL”, “వేకువ-సంధ్య”. ఇటువంటి కవితలు మరిన్ని ఈ సంకలనంలో చేర్చిఉండవలసింది. ఈ సంకలనంలో కవితల ఎంపికను పరిశీలిస్తే, సంకలనం మొత్తానికి ఏకసూత్రాన్ని సాధించాలని ప్రయత్నించినట్టు కనబడుతుంది. నా వరకు నేను, అనుభవంలో, ప్రకటనలో వైవిధ్యం ఉన్న కవితల సంకలనాన్ని ఎక్కువ ఇష్టపడతాను.

జీవితంలో ఏది పోగొట్టుకున్నా, దానికి కవిగా స్పందించగలిగే సామర్థ్యం పోగొట్టుకోనంతవరకు, కవి సజీవంగా మిగిలే ఉంటాడనటానికి ఈ సంకలనం ఒక మంచి నిదర్శనం. అందుకు స్వామిని తప్పక అభినందిస్తాను.