మూత విప్పగానే అత్తరులా
గుప్పున గుబాళించడం నాకు తెలీదు.
తలుపు తియ్యగానే ఏ.సి.లా
ఊహించని స్నేహపు చల్లదనంతో
ఉక్కిరి బిక్కిరి చెయ్యడం నాకు చేతకాదు.
శిల్పి తన శిల్పాన్ని తెలుసుకున్నట్టుగా
నెమ్మది నెమ్మదిగా నన్ను తెలుసుకోవాలి.
విత్తనపు మృదు స్పర్శనుంచి,
వృక్షపు బిగి పట్టుదాకా మట్టి
వేచినట్టుగా వేచిచూడాలి.
నా సాహచర్యంకోసం
సముద్రంతో స్నేహం చెయ్యడానికి
కావలసినంత ఓర్పు కావాలి.
నేను
తెలిసేకొద్దీ తికమక పెట్టే పజిల్ని.
తరచి చూస్తేగాని తలకెక్కని కావ్యాన్ని.
నిజానికి నాకు నేను కూడా
ప్రాకృతంలో రాసి, ఎప్పుడో
పాతివేయబడ్డ శిలాశాసనాన్ని !