1991 – 2005 తెలుగు నవల – విస్తరించిన వివిధ కోణాలు

‘‘ఈ కుల వివక్ష యేమిటి?
ఆహా! ఏ పుణ్యాత్ముడు కల్పించెనో
ఈ పాడు ధర్మంబులు’’

శ్రీరంగరాజు చరిత్ర నవలలో నాయకుడు రంగరాజు వేటకు వెళ్ళి వడదెబ్బ తగిలి సొమ్మసిల్లిపోతే దరిదాపుల్లో ఉన్న కొందరు కాపులు పరుగున వచ్చి అతని నోట్లో నీళ్ళు పొయ్యడానికి ప్రయత్నిస్తారు. ఇంతలో ఒక ముసలాయన వచ్చి ఆ రాజుకి మనం నీళ్ళు పొయ్యకూడదు. ఈ నీళ్ళు తాగితే అతడు కులభ్రష్టుడవుతాడని వాళ్ళను అడ్డుకుంటాడు ఈ సన్నివేశంలో రచయిత పైమాటలంటాడు.

1872లో నరహరి గోపాలకృష్ణమ చెట్టి రచించిన శ్రీరంగరాజు చరిత్ర నవలలో రంగరాజు ఒక రాజ కుమారుడు. అతని తండ్రికి వేశ్య వలన కలిగి మరొక కుమారుడుంటాడు. కొడుకు లిద్దరినీ సమానంగానే చూస్తాడు తండ్రి. రంగరాజుకు అది నచ్చదు. అతడు ఇల్లు వదిలి పారిపోతాడు. ఒక ఊళ్ళో లంబాడి కన్య సోనాబాయి కనిపిస్తుంది. రంగరాజు ఆమెను ప్రేమిస్తాడు. ఆమెను ప్రేమించి వేరొకడు కొండవీడుకు ఎత్తుకు పోతాడు రంగరాజు కొండవీడు చేరుకుంటాడు. అక్కడ సోనాబాయి రంగరాజుకు మేనత్త కూతురని తెలుస్తుంది. వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుంటారు. ఇదీ కథ. ‘‘సోనాబాయి పరిణయము’’ అనే వేరే పేరు కూడా ఈ నవలకు ఉంది.

గత పది పదిహేనేళ్ళలో వచ్చిన నవలల గురించి చెప్పబోతూ ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఇప్పుడు ఇంతింతై వటవృక్షంలా శాఖోప శాఖలుగా విస్తరించిన తెలుగు నవల దాని విశ్వరూపాన్ని విత్తనంలోనే నాటికి ఎలా ఇముడ్చుకోగలిగిందో తెలియచెప్పటానికి.

కందుకూరి వీరేశలింగం పంతులు వచన ప్రబంధంగా రాజశేఖర చరిత్ర (వివేక చంద్రిక) ని 1878లో వెలువరించాడు. తదనంతర నవలలకి ఒక నమూనాగా ప్రచారంలోకి రావటంతో రాజశేఖర చరిత్ర మొదటి నవలగా గుర్తింపును, ప్రాముఖ్యాన్ని పొందింది.

నరహరి గోపాలకృష్ణమ చెట్టి తన నవలను నవీన ప్రబంధమన్నాడు. 1896లో వివేక చంద్రికా విమర్శనంలో కాశీభట్ట బ్రహ్మయ్య శ్రాస్తి నవల అని స్థిరపరిచేరు.

తదాదిగా తెలుగు నవల సంఘ సంస్కరణోద్యమానికి చేదోడు వాదోడుగా నిలిచింది. ఆంధ్రుల చారిత్రక వైభవాన్ని చాటి చెప్పింది. జాతీయ ఉద్యమానికి ఊపిరులూదింది. మనిషి మనోవల్మీకంలో సంచరించే సరీసృపాల విన్యాసాల్ని, వాటి హేతువుల్ని వెదికింది. పోరాటాల్లో ‘మృత్యుం జయులై’న ‘‘ప్రజల మనుషుల్ని’’ వారి వీరోచిత గాథల్ని గానం చేసింది. ‘‘చెలియలి కట్టల్ని’’ దాటి ‘స్వేచ్ఛ’గా ‘మైదానాల్లో’ సంచరించింది. మధ్య తరగతి బుద్ధి జీవులకు ‘చదువు’ నేర్పించి ‘మంచీ – చెడులను’ విడమరిచింది. ‘అల్పజీవి’కి ఆలంబనగా నిలబడింది. ‘అంధకారంలో’ ఉన్న ‘మట్టి మనిషి’ని గురించి ఆరా తీసింది.

ఇంతచేసి రాను రాను తీరిక సమయం ఎక్కువై సుఖం మరిగి పడవలాంటి కారుల్లో రాకుమారుడి లాంటి ప్రియుడితో షికార్లు కొడుతూ పగటి కలలు కన్నది. చివరికి భూతప్రేత పిశాచాలను ఆవాహన చేసుకున్నది. కానీ అదే సమయంలో ‘‘కలిమంటుకున్నాది’’. అది రాష్ట్ర వ్యాప్తంగా రాజుకునేసరికి ఒక దశాబ్దం పట్టింది.