1991 – 2005 తెలుగు నవల – విస్తరించిన వివిధ కోణాలు

తొంభయ్యవ దశకంలో వచ్చిన నవలకు చాలా వరకు ముడిసరుకు ఎనభయ్యవ దశకం నుంచీ లభించింది. డబ్బై ఎనభై దశకాల్లో జరిగిన అనేక రాజకీయ ఆర్థిక మార్పులు తొంభయ్యవ దశకం నాటి వచన రచనా భూమికని ఏర్పరిచాయి.

గత కొంతకాలంగా అస్తిత్వ ఉద్యమాలు ఊపందుకున్నాయి. స్త్రీలు, దళితులు, ముస్లింలు తమపై అమలవుతున్న ప్రత్యేక పీడనలను అక్షరబద్ధం చేస్తున్నారు. అస్తిత్వ ఉద్యమ నేపథ్యంలో సాహిత్యంలో నిర్దిష్టత ప్రాధాన్యం సంతరించుకుంది. రచయితలు, కవులు తమ తమ మూలాల్లోకి వెళ్ళి రాయడం తప్పని సరయింది. లింగవివక్ష, కులం, మతం, ప్రాంతంవంటి నిర్దిష్టతలు తెలుగు సాహిత్యం సంపన్నతకు దోహదం చేస్తున్నాయి.

ఒక విప్లవ ప్రధాన స్రవంతిలో భాగమై ఉన్న స్త్రీలు, దళితులు, చైతన్య పూర్వకంగా సృజనాత్మకంగా తమను కలుపుకోలేనందువల్ల వేరువేరు పాయలుగా విడిపోయి ఎవరికి వారు పరిష్కార విముక్తి మార్గాలు వెదుక్కుంటున్నారు.

1975-85ని అంతర్జాతీయ మహిళా దశాబ్దంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన తరువాత ప్రజా రాజకీయ ఉద్యమ చైతన్యం ఈ కాలంలో అసమానతలకు సంబంధించిన అన్ని పార్శ్వాలనూ కదిలించింది. లింగవివక్ష, పునరుత్పత్తి హక్కులు, అణిచివేత, పీడన, హింస, ఇంటిచాకిరి మొదలైన కీలకమయిన అంశాలను లేవనెత్తింది. స్త్రీలు తమ స్వేచ్ఛకు, వ్యక్తిగత వికాసానికి ఆటంకాలుగా ఉన్న పరిస్థితులేమిటో గుర్తించి ఆ క్రమంలో వివాహం, దాని ననుసరించి ఏర్పడ్డ కుటుంబం, ప్రధానమైన అడ్డంకులుగా పని చేస్తున్నాయని గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా మంది స్త్రీలు తమదైన తాత్విక పునాది నిర్మించుకుని రచనలు చేయసాగారు.

ఈ సందర్భంగా తొంభైల తరువాత వచ్చిన స్త్రీవాద రచనలు పరిశీలిస్తే వెలుతురు సోకని అనేక అంశాలు అవగతమవుతాయి. పరిశీలిస్తే –

ఆధునిక యువతి అంతరంగాన్ని, స్వీయ మానసిక చైతన్యాన్ని ఆవిష్కరించింది అహల్య (కుప్పిలి పద్మ). ముగ్గురు పురుషులతో తనకున్న సంబంధ బాంధవ్యాలను సహజీవనానికి, లేదా సహచర్యానికి, సంబంధించిన అంశాలను చర్చకు పెట్టింది. శాంతి నిండిన, స్నేహమయ ప్రేమతో, సమానంగా నడవగలిగే పరిస్థితికోసం ఎందుకు ప్రయత్నించకూడదు, అంటూనే ప్రతిపాదనల్ని సున్నితంగా తిరస్కరించి ఒంటరిగా ఉండడానికే నిశ్చయించుకొంటుంది.

వివాహంతో నిమిత్తం లేని స్త్రీ పురాణ సంబంధాలను స్త్రీల వైపు నుంచి వాంఛించబడడం ఆ సంబంధాలలోని ఔచిత్యాన్ని ఔన్నత్యాన్ని పురుషాధిక్య ప్రపంచం గుర్తించలేకపోవడం అనే అంశాలను ప్రయోగం (ఓల్గా) చర్చించింది.

స్త్రీలను విడదీసి పోటీకి పెట్టిన పితృస్వామ్య మాయాజాలాన్ని బట్టబయలు చేసింది. ‘‘ఆమె అడవిని జయించింది (గీతాంజలి) తన సంక్షోభ కారణాలు, పరిష్కారాలు, కేవలం తనలో లేవని వ్యవస్థలో ఉన్నాయని గ్రహించి నివారణ కోసం ఉద్యమించింది.

భిన్న పార్టీలలో శత్రువులుగా ఉన్న అగ్రవర్ణ భూస్వాముల పెత్తనం కింద నలిగిపోతున్న దళితులందరినీ సమీకరించి ఎదిరించి గ్రామాల్లో మహిళా ఉద్యమాన్ని నడిపి అగ్రవర్ణ పురుషుల అహంకారానికి బలైపోయిన స్త్రీ కథ ‘‘ఆకాశంలో సగం’’ (ఓల్గా). దళిత స్త్రీ నాయకత్వంలో స్త్రీలందరూ ఏకమై అగ్రవర్ణ భూస్వాములను ఎదుర్కోడం నవలలో ముఖ్య విషయం.

పట్టణ స్త్రీల జీవితం కన్నా దళిత స్త్రీల జీవితాలు ముఖ్యంగా పల్లెలో ఎందుకు భిన్నమైనపో చూపుతుంది ‘‘ఎల్లి’’ (అరుణ). కులానికి, లింగానికి వర్గానికి సంబంధించిన అధికార సంబంధాలను పలుకోణాల్నుంచి ప్రవేశపెట్టి బయట పెత్తందారుల లైంగిక పీడన, ఇంట్లో పురుషుల పీడన, పునరుత్పత్తి హక్కులు లేని దుర్భర జీవిత పరిస్థితులను ఎరుకుల జీవిత నేపధ్యంలో చిత్రించింది.

పైనాలుగు నవలలు రకరకాల సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన స్త్రీల సమస్యలను చర్చించాయి.

కొన్నేళ్ళ క్రితం రాజస్థాన్‌లో రూప్‌కన్వర్‌ సతి జరిగింది. ఆ ప్రేరణతో వచ్చిన ‘‘సతిమంటలు’’ (సింహాప్రసాద్‌) నవల విధవల మనోవేదనని మన కళ్ళకు కడుతుంది.

వృత్తిరీత్యా, సామాజిక దౌష్ట్యంలో భాగమయిన కుళ్ళు రాజకీయాల మధ్య నిత్యం నలిగిపోతూ, విధినిర్వహణలో సజీవ సమాధులవుతున్న వేలాది ఎ.ఎన్‌.ఎం. నర్సుల జీవితాలను సమాజానికి తెలియజేసింది ‘‘సంకెళ్ళు’’ (పి.వి.బి.శ్రీరామమూర్తి). సలీం ‘‘జీవన్మృతులు’’ నవలలో కూడా నర్సులకు సంబంధించిన సమస్యలను స్పృశించాడు.

గ్రామాల్లో అట్టడుగువర్గాల్లో స్త్రీలను, ఆసాములు కామానికి మాతంగినులుగా, బసివినిలుగా ఎలా బలితీసుకుంటారో వి.ఆర్‌.రాసాని ‘‘మట్టిమనుషు’’ల్లో బయటపెట్టారు.

‘‘సరిహద్దు’’, ‘‘రాగో’’ (సాధన) నవలల్లో జైని అంబక్కల జీవితాలను పరిశీలిస్తే స్త్రీలపై అత్యంత క్రూరంగా అమలయ్యే ఉక్కు చట్రంలాంటి పితృస్వామిక అణచివేత ఆదివాసీ ఆడవాళ్ళ జీవితాల్లోనూ అనివార్యమని తెలుస్తుంది.

‘‘పునరావాసం’’ (అప్పల నాయుడు)లో పాతికేళ్ళ గిరిజన మహిళ బంతి ఏ అనుభవాలలోంచి అవగాహనలోంచి, కీకారణ్యంలోంచి, ఒక బిగిసిన పిడికిలై ఆమె జ్ఞానం వికసిస్తుందో మనం చూడొచ్చు.

రాజకీయంగా సాంస్కృతికంగా ముస్లింల సమస్యలు చాలా ప్రత్యేకమయినవని ఇంతవరకూ వెలువడిన ముస్లిం సాహిత్యం నిరూపించింది. ఈ సందర్భంలో (సలీం) ‘‘వెండిమేఘం’’ నవల వెలువడింది. క్రింది స్థాయి ముస్లిం స్త్రీ జీవితాన్ని మతంలో అంతర్గతంగా ఉండే వైరుధ్యాలనీ వివరించడంతో పాటు తమ ఆత్మన్యూనతకి మూలాలెక్కడున్నాయో కూడా పట్టుకునే ప్రయత్నం చేసింది.