తానా కథాసాహితి 2001 తెలుగు నవల కథానిక పోటీ సమీక్షాపత్రం

2001 జూన్‌ 29, 30, జులై 1వ తేదీలలో అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( Telugu Association of North America, TANA ) జరుపుతున్న 13వ ఉత్తర అమెరికా తెలుగు మహాసభల సందర్భంగా తానా ప్రచురణల సంఘం, కథాసాహితి, హైదరాబాదు వారి సహకారంతో తెలుగు నవల కథానికల పోటీని నిర్వహించింది.  తెలుగు రచయితలు తెలుగు సాహిత్యంలోనూ, ప్రపంచ సాహిత్యంలోనూ కలకాలం నిలబడేలా రచనలు చేసేలా ప్రోత్సహించాలనే ప్రయత్నంలో, ఆ ప్రమాణాలను అందుకొనగల ఉత్తమ నవలకు 1 లక్ష రూపాయలు, ఉత్తమ కథానికకు 25 వేల రూపాయలు బహుమతిగా తానా ప్రకటించింది. 1997లో తానా ప్రారంభించిన నవలల పోటీలో చంద్రలత రచించిన రేగడివిత్తులు నవలకు, 1999లో కాశీభట్ల వేణుగోపాల్‌ రచించిన తపన నవలకు ఈ బహుమతులు లభించటం పాఠకులకు తెలిసిందే. 1999 తానా కథల పోటీలలో ఆరు కథలకు చెరి ఐదేసివేల రూపాయలు బహుమతులు లభించాయి.

కథానికల పోటీ ఫలితాలు

ఈ సంవత్సరం కథానికల పోటీకి మొత్తం 486 కథలు రాగా, ప్రాథమిక పరిశీలన తరువాత 361 కథలు మిగిలాయి. రెండవ వడబోత తరువాత మిగిలిన 80 కథలనుంచి ప్రఖ్యాత కథకులు శ్రీ శ్రీరమణ, విమర్శకులు శ్రీ వల్లంపాటి వెంకటసుబ్బయ్య గార్లు 11 కథలను ఎంపిక చేసి అమెరికాలోని పరిశీలకుల బృందానికి అందించారు. ఆఖరి దశకు ఎన్నికైన కథానికలన్నీ  వస్తువు, పాత్రచిత్రణ, శైలి, భాషలలో మంచి ప్రమాణాలను పాటించాయని పరిశీలకుల బృందం అభిప్రాయపడింది. అయితే, 25వేల రూపాయల బహుమతికై ఆశించిన ప్రమాణాలను వీటిలో ఏ ఒక్క కథా పూర్తిగా చేరుకోలేదన్న భారత పరిశీలకుల అభిప్రాయంతో ఏకీభవించి, బహుమతి మొత్తాన్ని కొద్దిగా పెంచి ఉత్తమమని ఎంచిన రెండు కథలకు ప్రథమ  బహుమతిగా పంచటానికి, ఇంకొక కథకు ప్రోత్సాహక బహుమతిని ఇవ్వటానికి అమెరికా పరిశీలకులు నిర్ణయించారు.

ప్రథమ బహుమతి (చెరి 15 వేల రూపాయలు)

అస్తిత్వానికి అటూ ఇటూ          రచయిత   మధురాంతకం నరేంద్ర
టైటానిక్‌                               రచయిత   సురేష్‌

ప్రోత్సాహక బహుమతి (5 వేల రూపాయలు)

నీడ                                  రచయిత   సుంకోజీ దేవేంద్రాచారి

బహుమతులకు ఎన్నికైన కథలు, తానా మహాసభల సావనీరులోనూ, విపుల మాస పత్రికలోనూ ప్రచురింపబడతాయి.

బహుమతి పొందిన కథానికల పై పరిశీలకుల అభిప్రాయం (సమీక్షకుడు   ఎస్‌ నారాయణస్వామి)

మన సమాజంలో ఇప్పుడు ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. మార్పు సహజం. ఐతే, ఇదివరకట్లా కాకుండా, ఇప్పటి మార్పులు శరవేగంతో జరిగిపోతూ సమాజ వ్యవస్థని అతలాకుతలం చేస్తున్నై. ప్రపంచం అంతకంతకూ చిన్నదై పోతోంది. ఒక పక్క అమెరికన్‌ ఎకానమీ మందగిస్తే, మరో పక్క దాని ప్రకంపనలు అమృతలూరులోనూ, ఆదిలాబాదులోనూ, అనకాపల్లిలోనూ అనుభవానికి వస్తున్నై. ఎక్కడెక్కడో జరుగుతున్న సంఘటనల ఫలితాలు మన దేశంలో నగరాల్లోనే కాక మారుమూల పల్లెటూళ్ళలో కూడా ఆర్ధిక సాంఘిక రాజకీయ పరిణామాల్ని నిర్దేశిస్తున్నై. ఇలా శరవేగంతో జరుగుతున్న మార్పుల్లో ఏది ఎవరికి మంచి చేస్తోంది, ఏది ఎంతమందికి చెడు చేస్తోంది అని తీరిగ్గా కూర్చుని విచారించే అవకాశం ఎవరికీ ఉండడం లేదు. కానీ ఈ ప్రశ్నలు వేసుకోవడం, సమాధానాల కోసం వెతకడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పటికంటే మరీ మరీ అవసరం. ఇందులో సమకాలీన సాహిత్యానికి చాలా ముఖ్యమైన పాత్ర వుంది.

ఈ కథల పోటీ పరిశీలనలో చివరి మెట్టుదాకా ( finalists ) చేరుకున్న పదకొండు కథల్నీ స్థూలంగా చూస్తే సమాజంలో జరుగుతున్న వేరు వేరు మార్పుల్ని తమదైన దృక్కోణం నించి చూసే ప్రయత్నం కనిపిస్తుంది. ఇది మంచి విషయం. ఇక్కడి దాకా బానే వుంది. ఆయా కథల రచయితలు ఈ బాధ్యతని ఎంత వరకూ సమర్ధ వంతంగా నెరవేర్చ గలిగారూ అని ప్రశ్నించుకున్నప్పుడు ఈ కథల్లోని తేడాలు ప్రత్యక్ష మవుతున్నాయి. ఈ పోటీ విషయంలోనే గాక ఎప్పుడైనా సరే ఈ ప్రశ్నకి సమాధానమే గొప్ప కథకీ, మంచి కథకీ, మామూలు కథకీ, ఎందుకూ పనికి రాని చెత్తకీ భేదాన్ని స్పష్టం చేస్తుంది.

పరిశీలనలో చివరి మెట్టుకి చేరినా ఏ బహుమతికీ ఎన్నుకోని ఎనిమిది కథలూ మామూలు కథ స్థాయి నించీ మంచి కథ అయ్యేందుకు కనీసార్హతలు కలిగిన స్థాయి వరకూ వున్నాయి. మరి ఎందుకు ఇవి మంచి కథలు కాలేక పోయాయి అని పరిశీలించడం సమంజసం. కేవలం వస్తువు దృష్య్టా ఈ కథలన్నీ పాసు మార్కులు సంపాయించుకున్నై. ఎంచుకున్న వస్తువుని కథగా మలచటంలో, పాత్రల చిత్రణలో, కథన శైలిలో, ముగింపులో, రచయిత వేర్వేరు స్థాయిలలో ఆగి పోవడం వల్ల చాలా కథలు వస్తువుకి పూర్తిగా న్యాయం చెయ్యలేక పోయాయి. ఈ వైఫల్యానికి ఎన్నో కారణాలు వుండవచ్చు   రచయితకి వస్తువు మీద సరైన పట్టు లేక పోవడం, వస్తువుకి అనుగుణంగా వుండే సిధ్ధాంతంలో కావలసిన అవగాహన లోపించడం, చిన్న కథల శిల్పం మీద తనదైన దృక్పథం లేకపోవడం, మొదలైనవి. ముందు చిన్న కథలు రాయడంలోని craft  బాగా తెలిస్తే గాని ఆ ప్రక్రియని art  స్థాయికి పైకెత్తడం సాధ్యం కాదు. ఇందులో లబ్ధ ప్రతిష్ఠులైన రచయితలూ వుండొచ్చు, కొత్తగా కథా రచనలోకి అడుగుపెడుతున్న రచయితలూ వుండొచ్చు.

అస్తిత్వానికి అటూ ఇటూ (సమీక్షకురాలు   మాచిరాజు సావిత్రి)

ఏ కళలోనైనా కళాకారులకీ, కళాస్వాదులకీ మధ్యనున్న సంబంధం రసానుభూతి.  ఈ రసానుభూతికి చేరేందుకు కళాకారులు దోవ చూపిస్తూంటే, కళాస్వాదకులు అనుసరిస్తారు.  ఈ దోవ సుగమంగా, ఆసక్తికరంగా ఉండేటట్టు చూసుకోవడం కళాకారుల విధి.  ఈ రసాన్వేషణలో గమ్యమెంత ముఖ్యమో ప్రయాణం కూడా అంతే ముఖ్యం; ఒక్కొక్క సారి గమ్యానికంటే పయనమే ముఖ్యం కూడా అవవచ్చు.

ఈ సూత్రాన్ని కథా రచనకు అన్వయిస్తే, కథావస్తువెంత ముఖ్యమో కథాశిల్పం కూడా అంతే ముఖ్యమని తెలుస్తుంది.  ప్రపంచస్థాయి కథలతో పోలిస్తే ముఖ్యంగా శిల్పంలోనే తెలుగు రచయితలు చాలా బలహీనంగా ఉన్నారని స్పష్టమౌతుంది. భాషా, పాత్రచిత్రణా, సంభాషణలూ, కథనం (కథలోని సంఘటనల ఎన్నికా, కూర్పూ) శిల్పంలో భాగాలూ, రససృష్టికి రచయితకి అందుబాటులోనున్న పరికరాలూ.  ఈ పరికరాలన్నిటినీ చాలా నైపుణ్యంగా వాడుకున్న కథ, శ్రీ మధురాంతకం నరేంద్ర రచించిన “అస్తిత్వానికి అటూ ఇటూ.” అచ్చమైన తెలుగు నుడికారాలూ, పాత్రోచితమైన సంభాషణలూ, జ్ఞానేంద్రియాలన్నిటినీ స్పృశించే వర్ణనలూ, అన్నీ కలిసి పాఠకుడికి పాత్రలతో బాటే వారికి కలిగిన అనుభవాలన్నీ పంచుకున్నట్టు అనుభూతి కలిగిస్తాయి.  గంగా యమునల నీటి రంగులూ, ఉప్పెన తరువాత వాటిలో కలిగిన కల్లోలమూ పాత్రల మనస్థితులలో ప్రతిబింబించిన తీరు ఈ కథలోని శిల్పప్రావీణ్యానికి నిదర్శనం.  ముగింపు అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టుగానో, కుండ బద్దలు కొట్టినట్టుగానో, కథంతా ఇందుకోసమేనన్నట్టున్న కొసమెరుపు తోనో, నీతి వాక్యంతోనో కాకుండా సూక్ష్మంగా పాఠకుడి గ్రహింపుకి వదిలేసిన రీతి రచయిత ప్రౌఢత్వానికీ, రచయితకు పాఠకుడి మేధస్సు పైనున్న నమ్మకానికీ ప్రతీకగా నిలిచింది. ఈ కారణాలన్నిటివల్లా ఈ కథని ప్రథమ బహుమతికి అర్హమైనదని నిర్ణయించాం.

టైటానిక్‌ (సమీక్షకుడు   జంపాల చౌదరి)

మంచి కథలు జీవితానికో, మానవసంబంధాలకో, ఒక చారిత్రక నేపధ్యానికో అద్దం పడతాయి, హృదయాన్ని తడతాయి, మేధకు పనిపెడతాయి, ఆలోచింపచేస్తాయి, వెంటాడతాయి. మంచి కథల్ని కాలక్షేపానికి చదివేసి పక్కన పారేయలేం.  తేలిగ్గా మర్చిపోలేం. మంచికథలు చూడగానే లోపలేముందో తెలిసిపోయే ఒంటిపొర   కాగితప్పొట్లాల్లా కాకుండా, ఒకదానిపైన ఒకటిగా అనేక పొరల వెనక అందంగా, చిత్రంగా చుట్టిన బహుమతి పేకెట్లలాగా ఒక్కో పొర విడతీసినప్పుడల్లా ఇంతకు ముందు కనిపించని విశేషాలు కనిపిస్తూ ఉంటాయి. కథలో వస్తువేదయినా, ముఖ్యరసం (శృంగారమో, హాస్యమో, విషాదమో, భీభత్సమో) ఏదయినా, రసానుభూతితోపాటు ఆలోచింపచేయటం మంచి కథల లక్షణాలలో ఒకటి. కథ వ్రాయటానికి రచయిత ఎన్నుకొన్న శిల్పం, రసాన్ని పోషించటంలోనూ, వస్తువుపై తనకున్న అవగాహనను పాఠకుడికి అందించటంలోనూ రచయిత చూపే నేర్పు కూడా మంచి కథకు అవసరం.

సురేష్‌ రాసిన టైటానిక్‌ ప్రస్తుత ఆర్థిక సామాజిక పరిణామాలను, జన జీవనంపైనా, దైనందిన సంబంధాలపైనా ఈ పరిణామాలు చూపిస్తున్న ప్రభావాల్నీ ప్రతిబింబించే సాహసప్రయత్నం. తీసుకొన్న వస్తువుపట్ల ఈ రచయితకి స్పష్టమైన దృక్పథం ఉన్నదనేది స్పష్టం. రచయిత చెప్పాలనుకొన్న విషయాలు చిన్నకథ చట్రంలో తేలిగ్గా ఇమిడేవి కావు. ఈ చిత్రానికి పెద్ద కేన్వాసు కావాలి. దీనికితోడు ఈ కథ చెప్పటానికి రచయిత ఎన్నుకొన్న మార్గం కూడా మామూలుది కాదు. ఈ కథని మొదట్లో మొదలు పెట్టకుండా మూడు కాలాల్లో ఒకేసారి చెప్పటనికి ప్రయత్నించాడు రచయిత. ఈ ప్రక్రియ పాఠకుల్ని మొదట్లో కొద్దిగా ఇబ్బంది పెట్టినా, నెమ్మదిగా విషయక్రమం తెలుస్తుంది. స్థబ్దమైన జనపదాల్లో పారీశ్రామీకరణ జరిగినప్పుడు వచ్చే మార్పులు, ప్రైవేట్‌ పబ్లిక్‌ రంగాలు పోటీ పడినప్పుడు పబ్లిక్‌ రంగ సంస్థలే నష్టపడే కారణాలు, ఈ పోటీల్లో నలిగి అణిగిపోయే ఆశయాలూ, జీవితాలూ, ప్రాపంచీకరణ నేపధ్యంలో చూపటం రచయిత ఉద్దేశం. రచయిత కథాస్థలాల్ని కళ్ళకు కట్టేట్లా చిత్రీకరించి, కథలోని చిన్నాపెద్దా పాత్రల్ని, వారి జీవనగతుల్నీ తక్కువ మాటల్తోటే వివరంగా పరిచయం చేయగలిగారు. కథ చదివాక ఈ సంఘటనల్నీ, ఈ పాత్రల్నీ తేలిగ్గా మర్చిపోలేం. కాకపోతే రచయిత ఒక్కోసారి విషయం మనకు అర్థం అవుతుందో లేదో అన్న అనుమానంతో కాబోలు ఉపన్యాసాలివ్వటం, ఏకంగా ప్రధానమంత్రి పత్రికాప్రకటనల్నే వాడుకోవటం లాంటి విషయాలు పంటికింద రాళ్ళలాగా ఇబ్బంది కలిగిస్తాయి. కొంత ఎడిటింగ్‌ పాఠకుల తెలివితేటల పట్ల ఇంకొంత గౌరవం చూపిస్తే ఈ కథ ఇంకా గొప్పగా తయారై ఉండేది. ఒకేసారి హృదయానికి, మేధకు హత్తుకునేట్లుగా మంచి పట్టుతో వ్రాసిన సమకాలీన కథ టైటానిక్‌.

నీడ (సమీక్షకుడు   కన్నెగంటి రామారావు)

అసలు మనం అనుకుంటాం కానీ రచయిత కథ రాస్తాడనుకోవడం మన భ్రమ. చివరకు కథ రాసుకొనేది పాఠకుడు తన మనసులో కథను తన అనుభవాలకి తగిన విధంగా అన్వయించుకొంటూ. మంచి రచయిత చేయగలిగిందల్లా పాఠకుల్ని ఈ పనికి ప్రోత్సహించడమే. పాఠకుడికి కావలసినంత కాన్వాస్‌ రంగులూ ఇచ్చి తను పక్కకు తప్పుకోవటమే రచయిత చెయ్య వలసిన పని.

నీడ కథలో మాకు నచ్చిన అంశాలు ఏవంటే, వస్తువుని వేరు వేరు విధాలుగా చదవగలిగే ఆస్కారం ఇవ్వడం, ఒక ముఖ్యమయిన వస్తువు గురించి రాయడం. కొంతమందికి ఈ కథ కేవలం పాత కథ లాగ, “తాతా మనవడు” సినిమా కథ లాగ అనిపిస్తుంది. మరికొందరికి,  గ్రామాల్లో మారే వ్యాపకాల గురించి రాసినట్లు అనిపిస్తుంది. ఇంకా తరిచి చూస్తే, ఈ కథలో పెట్టుబడి రాక పోకలు ( ధథవబసథl పlలళ ) గ్రామాల్లో ఎలా మారుతోంది అనేది కనిపిస్తుంది. “కుడి” నుంచీ, “ఎడమ” దాక ఈ ప్రశ్నని చాల మంది ఎకనామిస్టులు పరిశీలించారు, పరిశీలిస్తున్నారు.

ఇంకొక మెచ్చుకోవలసిన విషయం కథనం బాగా సునాయాసంగా ఉంది. పాత్రల ప్రవర్తనని సహజంగా నడిపిస్తూనే, కథలో తను చెప్పదలుచుకున్న విషయానికి తెలివిగా దారి చూపించారు రచయిత. మాండలికం చక్కగా రాశారు. కథనం ముఖ్యాంశాలని మాత్రమే ముందుకు తెచ్చే విధంగా ఉండి, ఒక అవసరమైన పొదుపరి తనాన్ని చూపించారు రచయిత.

మరి ఈకథకి మొదటి బహుమతి ఎందుకు రాలేదు అంటే, కొన్ని లోపాలు స్ఫురిస్తాయి. రచయితకి మార్పు గురించి మంచి అవగాహన ఉన్నట్లు అనిపించ లేదు. అంతే కాకుండా, వస్తువుని అవసరమైనంత పూర్తిగా వృద్ధి చెయ్య లేదు. కథ కేవలం ఒక తరపు నుంచే చెప్పినట్టు ఉంది.

రచయిత తన వస్తు వైవిధ్యాన్ని ఈ కథ కన్నా బాగా వాడుకుంటానికి ఈ బహుమతి ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నాము.

నవలల పోటీ ఫలితాలు

నవలల పోటీకి మొత్తం 53 నవలలు రాగా, ప్రాథమిక పరిశీలన తరువాత 45 నవలలు మిగిలాయి. రెండవ వడబోత తరువాత మిగిలిన 9 నవలలనుంచి ప్రఖ్యాత రచయిత శ్రీ కేతు విశ్వనాధ రెడ్డి, విమర్శకురాలు శ్రీమతి కాత్యాయనీ విద్మహే గార్లు 3 నవలలను ఎంపిక చేసి అమెరికాలోని పరిశీలకుల బృందానికి అందించారు.

ఆఖరి దశకు చేరిన మూడు నవలలనూ నిశితంగా పరిశీలించిన మీదట, ఆ మూడిటిలో ఏ ఒక్క నవల కూడా తానా ఆశించిన ప్రమాణాలకు దగ్గరగా లేవని ఇండియా పరిశీలకులు వెలిబుచ్చిన అభిప్రాయంతో తానా పరిశీలకుల బృందం కూడా ఏకీభవించింది. అందుచేత ఈ పోటీలో ఉత్తమ నవలకు ఇవ్వదలచిన 1 లక్ష రూపాయల బహుమానాన్ని ఈ సంవత్సరం ఇవ్వటంలేదని ప్రకటించడానికి తానా ప్రచురణల కమిటీ విచారిస్తుంది. వి.ఆర్‌ రాసాని రచించిన “బతుకాట” నవలకు 10 వేల రూపాయల ప్రోత్సాహక బహుమతిని ఇవ్వడానికి తానా ప్రచురణల కమిటీ నిర్ణయించింది.

నవలల పోటీ పై పరిశీలకుల అభిప్రాయం (సమీక్షకుడు   జంపాల చౌదరి)

గత రెండు పోటీలలో లాగానే ఈ సారి కూడా మంచి నవలలు చదవ్వచ్చు అని ఎదురు చూసిన పరిశీలకులందరినీ ఈ సంవత్సరం నవలల పోటీ నిరుత్సాహపరిచింది. ఫైనలిస్టులుగా మిగిలిన మూడు నవలల్లోనూ ఎన్నుకొన్న వస్తువుల్లో వైవిధ్యం ఉంది. అయితే ఆ వస్తువుల్ని హృద్యమైన నవలలుగా మార్చటంలో రచయితలు పూర్తిగా కృతకృత్యులు కాలేకపోయారు. ఒక వరుసగా సంఘటలను కూర్చుకుపోవటమే తప్ప ఉత్కంఠతో కూడిన కథలు చెప్పలేకపోయారు. ఈ నవలలు ఆయా ముఖ్య పాత్రల వ్యక్తిగత కథలుగా మిగిలిపోయాయే తప్ప మంచి పుస్తకానికి అవసరమైన విశ్వజనీనత, సార్వత్రికత, గాఢత లోపించాయి. ఆ పాత్రలు కూడా కాగితపు బొమ్మల్లా ఉన్నాయే తప్ప సజీవంగా కనిపించలేదు. పాత్రచిత్రణ, పాత్రల, పరిస్థితుల అంతస్సంఘర్షణ చాలా బలహీనంగా ఉంది.  పాత్రల మనసుల్ని రచయితలు తాకనప్పుడు పాఠకుల మనసుల్ని పాత్రలు తాకలేవు.  ఈ నవలల పోటీ వెనుక ఉన్న తానా ఆశయానికి (కలకాలం నిలిచే, ప్రపంచ ప్రమాణాలతో సరితూగే తెలుగు నవలల రచనను ప్రోత్సహించటమ్‌, ప్రమాణాలకి ఈ నవలలేవీ దగ్గరగా లేవని పరిశీలకులందరూ ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు.

పరిశీలకులందరినీ ఆందోళన పరిచిన విషయం ఒకటి చెప్పక తప్పదు. గ్రామీణ వాతావరణంలో బహుకష్టాలు పడుతున్న వ్యక్తుల గురించి మాండలికంలో రాస్తూ వీలయినప్పుడల్లా జానపద గీతాల్ని చొప్పిస్తే బహుమతులు వస్తాయి అన్న ఫార్ములా ప్రకారం కొందరు రచయితలు ఈ పోటీలకు నవలలు వండుతున్నారేమో అన్న అనుమానం కొన్ని నవలలను చదువుతున్నప్పుడు వచ్చింది. ఇది నిజం కాదనీ, యాదృచ్ఛికమేననీ ఆశిద్దాం. మంచి నవలలు ఫార్ములాల వల్ల పుడతాయని గానీ, ఏదో ఒక నేపధ్యాన్నుంచే వస్తాయని గానీ మేము అనుకోవటం లేదు. హృదయానికి హత్తుకొనే వస్తువు, పాత్రచిత్రణ, శిల్ప నైపుణ్యం మంచి రచనలన్నిటికీ అవసరమని, రచయితలకు రచనలకు నిజాయితీ ముఖ్యమని, ఫార్ములా దారుల్లో ప్రయాణం మంచి రచనలు తేలేదని మేం మళ్ళీ వేరుగా చెప్పనక్కరలేదు కదా.

ఇంకో చిన్న విషయం. ఇలాటి పోటీలకు పంపుతున్నప్పుడు చదవటానికి తేలిగ్గా వీలయ్యే చేతివ్రాతతో నవలల శుద్ధప్రతుల్ని పంపటం రచయితలకూ, పరిశీలకులకూ, ఆ పైన టైప్‌ సెట్టర్లకూ ప్రయోజనకారిగా ఉంటుంది.

బతుకాట నవల గురించి (సమీక్షకుడు   మద్దిపాటి కృష్ణారావు)

రాయలసీమ గ్రామీణ జీవితంలో నాటక కళను నిలబెట్టటానికి కృషి చేసిన ఒక కుటుంబం కథ, బతుకాట నవల. నాటకాలను కేవలం జీవనోపాధిగా కాక తమ కుటుంబ జీవనంలో అంతర్భాగంగా పరిగణించి, పోషించిన కుటుంబపు రెండు తరాల చరిత్రను చిత్రించడానికి ప్రయత్నిస్తుందీ నవల.

కుటుంబ చరిత్రే ఈ నవలకు ప్రధాన వస్తువైనా, ఇరవయ్యో శతాబ్దంలోని (ముఖ్యంగా ప్రధమార్ధం లో) రాయలసీమ గ్రామీణ జీవన విధాన చిత్రణ కూడా చాల వరకూ జరిగింది. కేవలం కథలు, కావ్యాల ద్వారానే సమకాలీన ఆర్ధిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులను తెలుసుకోవలసిన పరిస్థితి, అగత్యం భారతీయులకు చాలవరకు తగ్గినా, సాంఘిక చరిత్రను ఒక క్రమ పద్ధతిలో సేకరించి నిలవజెయ్యవలసిన అవసరాన్ని మనం ఇంకా పూర్తిగా అవగాహన చేసుకోలేదనే చెప్పాలి. నాగరికతా పరిణామంలో కాలక్రమేణా గ్రామీణ జీవనవిధానం మరుగున పడుతోంది. తద్వారా ఒకప్పుడు ఎంతో ప్రచారంలో ఉన్న కళలు మరుగున పడిపోవడం, గ్రామీణ జీవన విధానానికే పరిమితమైన భాషా పదాలు మాయమైపోవడం వంటివి సర్వసామాన్యం. ఇది ఎవరూ ఆపలేని పరిణామమే ఐనా, తరువాత తరాల వారికి చారిత్రక అవగాహన కోసం వీటిని ఏదో రకంగా పరిరక్షించడం అవసరం. నవల ఇతివృత్తంలో భాగంగా రాయలసీమ ప్రాంతం లోని పల్లెల్లో జీవన విధానాన్ని విపులీకరించారు రచయిత. పండుగలు జరుపుకోవడంలో భాగంగా ఆడే నాటకాల పద్ధతి, ప్రాంతీయ వైవిధ్యంతో ప్రచారంలో ఉన్న పురాణగాథల వివరణ ఈ నవలలో ఎక్కువ భాగం ఆక్రమించినా, ఆ ప్రాంతానికి విశిష్టమైన వ్యవసాయ పద్ధతులు, ఆహార వ్యవహారాలు, చేతి పనులు చాలా వివరంగా వర్ణించారు రచయిత. ఇందుకోసం రాయలసీమ మాండలికాన్ని చాలా చక్కగా వాడారు. అయితే కథకు ఎంచుకున్న వస్తువును విశదంగా విపులీకరించాలనే ప్రయత్నంలో పాత్రల చిత్రణను రచయిత విస్మరించారనిపిస్తుంది. గ్రామీణ జీవితాన్ని వర్ణించిన తీరు ఒక ఉపన్యాసం లా, వ్యాసంలా సాగిందేగాని పాత్రలలో జీవం కనిపించలేదు. విషయం పైన, భాష పైన చూపిన శ్రద్ధ, పాత్రల రూపకల్పనలోను, పాత్రలకు కథావస్తువుకు మధ్య ఉన్న అనుబంధాన్ని చిత్రించడంలోనూ, రచయిత చూపినట్టు కనిపించదు. అందువల్ల పాత్రలు కేవలం కథ చెప్పడానికి ఉపయోగించిన తోలుబొమ్మల్లాగా మిగిలిపోయాయే తప్ప పాఠకుల మనసులో నిలిచిపోయే అవకాశాన్ని కోల్పోయాయి. తీసుకున్న కథా వస్తువు, దానిపై రచయితకు ఉన్న అవగాహన, కథను నడిపించే తీరులో కూడా ఉంటే ఈ నవల మంచి రచన కాగలిగేది.

కృతజ్ఞతలు

ఈ పోటీలు జయప్రదంగా జరగడానికి తానాతో సహకరించి శాయశక్తులా కష్టపడిన కథాసాహితి సంస్థకు, ముఖ్యంగా వాసిరెడ్డి నవీన్‌ గార్కి, ఓపికగా కథలన్నీ పరిశీలించిన న్యాయ నిర్ణేతలు శ్రీమతి కాత్యాయనీవిద్మహే, శ్రీయుతులు కేతు విశ్వనాధ రెడ్డి, శ్రీరమణ, వల్లంపాటి వెంకట సుబ్బయ్యగార్లకు తానా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కథలని ప్రచురిస్తున్న విపుల సంపాదకవర్గానికి , ముఖ్యంగా మాకెప్పుడూ సహాయాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తున్న చలసాని ప్రసాదరావుగార్కి ఇంకోసారి కృతజ్ఞతలు. తానా ప్రచురణల కమిటీ కార్యక్రమాలకు ప్రోత్సాహాన్ని, సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్న తానా అధ్యక్షుడు శ్రీ నాదెళ్ళ గంగాధర్‌ గార్కి మా ప్రత్యేక అభివందనాలు.   ఆర్థికంగా సహాయం చేసిన 13వ ఉత్తర అమెరికా తెలుగు సమావేశపు కార్యవర్గానికి, విరాళాలందించిన దాతలకు ధన్యవాదాలు. శ్రీమతి యార్లగడ్డ కరుణ, శ్రీ వల్లభనేని భాస్కర్‌ సకాలంలో అందించిన సాయం మరువరానిది.

తానా ప్రచురణల సంఘం తరపున, అధ్యక్షుడు

జంపాల చౌదరి.

బీవర్‌ క్రీక్‌ ఒహాయో, యు.ఎస్‌ఏ
జూన్‌ 7, 2001

తా.క.    తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు డాక్టర్‌ జంపాల చౌదరి ఆధ్వర్యంలో శ్రీమతులు అరుణా చౌదరి, మాచిరాజు సావిత్రి, శ్రీయుతులు ఆరి సీతారామయ్య, కన్నెగంటి రామారావు, మద్దిపాటి కృష్ణారావు, శంకగిరి నారాయణస్వామి (నాశీ) అమెరికా పరిశీలకుల బృందంలో సభ్యులుగా ఉన్నారు.  తానా పోటీల నిబంధనల ప్రకారం, బహుమతుల నిర్ణయం పూర్తయేవరకూ రచయితల వివరాలు పరిశీలకులకు (ఇండియాలోనూ, అమెరికాలోనూ) తెలీకుండా గోప్యంగా ఉంచబడ్డాయి.


జంపాల చౌదరి

రచయిత జంపాల చౌదరి గురించి: తెలుగునాడి పత్రికకు సంపాదకత్వం వహిస్తూ, తెలుగు సాహిత్యానికి సంబంధించిన అన్ని చర్చల్లోనూ విరివిగా పాల్గొనే జంపాల చౌదరి గారికి పరిచయం అక్కర్లేదు జగమెరిగిన వారు వారు. ముఖ్యంగా తెలుగు కథల గురించి విశేషమైన కృషి చేసిన చౌదరి గారు, చాలా కాలం తానా పత్రికకు సంపాదకత్వం వహించారు. ...