మార్చ్‌ 2005

ఈమాట మార్చ్‌ 2005 సంచికలో పాఠకులకి పరిచితులైన రచయితలనుంచి కొత్త కథలు, వ్యాసాలు, కొత్త రచయితలనుంచి సరికొత్త కవితలూ కథా ఉన్నాయి. ఈ సారి వ్యాసాలు మంచి చర్చకి దారి తీస్తాయని ఆశిస్తున్నాం. మంచి చర్చ మంచి విమర్శకి పునాది.

తెలుగులో సరైన సాహితీ విమర్శ రావటల్లేదన్న విషయం ఈమాట పాఠకులకి కొత్త విషయం కాదు. ఈమాటలో కథలపైన, వ్యాసాల పైనా, నిష్కర్షగా, వ్యక్తిగత దూషణ లేకుండా చర్చ చేస్తే, మనం సద్విమర్శకు నాంది పలికిన వాళ్ళం అవుతాము. ఫలానా కథ బాగుంది, ఫలానా కవిత, ఫలానా వ్యాసం బాగాలేదు అనే మతింపు అవసరం. రచయితలకీ, మాకు చాలా అవసరం. చాలా ఉపయోగం కూడాను. అయితే, ఏకారణాలచేత ఏది బాగా వున్నదనిపించినదో, ఏ వివరణలవలన ఏది బాగా లేదనిపించిందో నిరూపణలతో చర్చిస్తే అది తప్పక సద్విమర్శ అవుతుంది. ఈ సారి అతిథి పుస్తకంలో ఇటువంటి విమర్శ వస్తుందని ఆశిస్తున్నాం.

రచయితలకి ఒక మనవి. మీ రచనలు సాధ్యమైనంతవరకూ RTS లో పంపించండి. కారణం, సమీక్షకులనుంచి తిరిగి వచ్చింతరువాత మార్పులు చేర్పులు చెయ్యడం సులువు. అన్ని రచనలనీ చూడ ముచ్చటగా కూర్చటం కూడ సులువు. pdf లో మాత్రమే వచ్చిన రచనల సమీక్ష, తదుపరి మార్పులు చెయ్యడం వగైరా చాలా ఆలస్యానికి కారణం అవుతున్నాయి. ఒక్కొక్కసారి ఆఖరి క్షణంలో pdf లో వచ్చిన రచనలని సమీక్షకి పంపించడం కుదరటల్లేదు. కాలాతీతం అవుతున్నది; ఏ విషయం చెప్పనందుకు రచయితలకి సంపాదకుడి మీద విసుగు, కోపం.

మరొక మనవి. ఈమాటలో ప్రచురణకై వచ్చిన రచనలని సమీక్షించి సలహాలు ఇవ్వడానికి ఇష్టపడే సహృదయులు కావాలి. దయచేసి ఆ కుతూహలం వున్న వారు మాకు రాయండి.