1991 – 2005 తెలుగు నవల – విస్తరించిన వివిధ కోణాలు

మధ్య కోస్తా నుంచి తెలంగాణాకి పోయి ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయాన్ని చేపట్టి బీడు భూమిని సస్యశ్యామలం చేసిన ఒక కృషీవలుని కథ ‘‘రేగడి విత్తులు’’ (చంద్రలత` వలసకు సంబంధించిన పరిమితులున్నప్పటికీ). ఈ దశాబ్దిలో వ్యవసాయానికి సంబంధించిన అనేక అంశాలను శ్రాస్తీయంగా చర్చకు పెట్టింది. వ్యవసాయం వ్యాపార మార్గం పట్టిన తరువాత సంప్రదాయ సేద్యం, దానికి ఆలంబనగా ఉన్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థా, ఏ విధమయిన మార్పుకు లోనయ్యిందీ ఈ నవలలో విశ్లేషించారు.

పత్తికాయను పురుగు దొలిచినట్టు రైతుల రక్తాన్ని దళారులు ఏ విధంగా పీల్చేస్తున్నారో హృదయ విదారకంగా చిత్రించిన (మొలకపల్లి కోటీశ్వరరావు) నవల ‘‘ఆక్రందన’’. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు, గిట్టుబాటు ధర లేకపోవడం, అప్పులు, వడ్డీలు, ఈ క్రమం అంబయ్య అనే రైతు కుటుంబాన్ని (భార్య, చెల్లెలు ఆత్మహత్య) ఎలా విచ్ఛిన్నం చేసిందో చూపింది.

గ్రామాలు ప్రగతికి పట్టుకొమ్మలనీ, భారతదేశానికి ఆత్మలని, ఎవరెన్ని రకాలుగా చెప్పినా, కూడు, గూడు, గుడ్డ, చదువు, వైద్యం, త్రాగునీరు వంటి మౌలికమయిన సౌకర్యాలు లేని గ్రామాల అభివృద్ధికి, అలవిమాలిన అభిమానంతో కృషిచేసిన పాత్రలు కొన్ని నవలల్లో చూడవచ్చు.

‘‘పల్లె పిలిచింది’’ (ద్వారక) నవల ఒక ఉపాధ్యాయుడి కనీస కర్తవ్యాన్ని, కఠోర శ్రమని, తెలియచేసిన నవల. పల్లెతో అతడు మమేకమయ్యే వైనాన్ని, గొప్ప గొప్ప మార్పుల్ని, చిన్న చిన్న లక్ష్యాలు ఎలా నిర్దేశిస్తాయో నిరూపించిందీ నవల.

ఏ రకమయిన సౌకర్యాలూ లేని పాలెం గ్రామానికి, రహదారి ద్వారా పట్టణానికి అనుసంధానం చేస్తే, స్వాలంబన సాధ్యమవుతుందని విశ్లేషించి చెప్పిన నవల ‘‘ది రోడ్‌’’ (చంద్రశేఖర్‌ అజాద్‌).

రావిశ్రాస్తి నవలల్లో కథా సందర్భంలో తప్ప, కేవలం పోలీసులకు సంబంధించిన వస్తువుతో వచ్చిన నవలలు, తెలుగులో చాలా తక్కువ. 96లో వచ్చిన ఖాకీ బతుకులు (స్పార్టకస్‌) నవల పోలీసు వ్యవస్థలోని కింది స్థాయి ఉద్యోగి జీవితాన్ని చిత్రించింది. తన అట్టడుగు కులాన్ని, చేస్తున్న అట్టడుగు ఉద్యోగాన్ని, రచయిత నవల ఇతివృత్తంగా, స్వీకరించడం ఈ నవల ప్రత్యేకత. సమకాలీన సమాజంలోని పోలీసు కానిస్టేబుల్స్‌ చుట్టూ అల్లుకు పోయిన కుల, మత, ఆర్థిక, రాజకీయ సమస్యలతో పాటు, అధికార్ల జులుం, వృత్తి సమస్యలు, కులపరంగా అదనంగా ఎదుర్కొనే పీడన, ఈ నవలలో చాలా విపులంగా విస్తారంగా చర్చకు వస్తాయి.

ఓ పోలీసు ఉన్నతాధికారి వ్యక్తిత్వానికి, ఉద్యోగ ధర్మానికి మధ్య జరిగిన సంఘర్షణ నేపథ్యంగా, పోలీసు వ్యవస్థపై రాజకీయాల దుష్ప్రభావం, వివిధ స్థాయిల్లో అధికారుల మధ్య జరిగే ప్రచ్ఛన్న యుద్ధాన్ని మనకు తెలియచేస్తుంది. ‘‘నిర్జీవయాత్ర’’ (సత్యపోలు సుందర సాయి) నవల.

కరుడుగట్టిన ఖాకీల కఠోర ఆదేశాలకు, వాటి అమలుకు, చిల్లర మల్లర దొంగతనాలు చేసేవాళ్ళు ఎలా బలైపోతారో, థర్డ్‌ డిగ్రీ, వాళ్ళపై ఎంత పాశవికంగా ప్రయోగింపబడుతుందో, వళ్ళు జలదరించే విధంగా దృశ్యమానం చేశారు (మొలకపల్లి కోటేశ్వరరావు) లాకప్‌ నవలలో.

అటూ ఇటూ కాని వయసులో, తెలిసో తెలియకో చేసిన తప్పుకు, చిన్నపిల్లలు బాలనేరస్తులుగా చీకటి బతుకులు బతకవలసిన దుస్థితిని వర్ణించారు, చిలుకూరి దేవపుత్ర ‘‘చీకటిపూలు’’ నవలలో. అమ్మానాన్నల ఆలనా పాలనా లేక, వీధిబాలలు నేరస్థులుగా ఎలా మారుతారో, మానసిక పరివర్తనకు దోహదపడవలసిన కారాగారాలు, ఆ పని చేయకపోతే పిల్లల్లో పెరిగే వ్యతిరేక భావాలు ఈ నవలలో ప్రస్తావించారు.

పైనాలుగు నవలల్లో పోలీసుల్లో పైఅధికారులు, అట్టడుగు ఉద్యోగులు. కటకటాల్లో చిల్లర దొంగలు, బాలనేరస్తులు ఇలా నలుగుర్నీ నాలుగు కోణాల్లో చిత్రించడం జరిగింది.

ఎన్ని లాకప్‌ డెత్‌లు జరిగినా, చిన్న పిల్లలమీద ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని అత్యాచారాలు జరిగినా, న్యాయం చీకట్లో పిల్లి లాంటిదని, దాని ఆనుపానులు పట్టుకోడం కళ్ళకి గంతలు కట్టుకున్న న్యాయదేవత వల్ల కాదని, దాన్ని కనిపెట్టాల్సిన వాళ్ళు దాచి పెట్టడానికే తోడ్పడుతున్నారనీ, పౌరహక్కులకు సంబంధించిన అనేక కోణాల్ని స్పృశిస్తూ న్యాయ వ్యవస్థని శాసిస్తోన్న శక్తుల గురించి చర్చకు పెట్టిన నవల ‘‘చీకట్లో నల్లపిల్లి’’ (నందిగం కృష్ణారావు).

ప్రజాసామ్యం ఎంత మేడిపండు చందంగా ఉంటుందో, ‘‘రిగ్గింగ్‌’’ (విశ్వమోహనరెడ్డి) నవలలో విడమరచి చూపించారు. అభ్యర్థుల ఎంపిక నుంచి, ప్రచారం, పోలింగ్‌, కౌంటింగులలో జరిగే అక్రమాలు, వాటిని మనం కనీసం ప్రశ్నించకుండా, పరోక్షంగా అలాంటివి కొనసాగడానికి ఎలా సహకరిస్తున్నామో, ఈ నవల ప్రతిబింబించింది.

పోలీసులు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు, పత్రికలు, ఈ నాలుగు రంగాల నీతిమాలినతనాన్ని అత్యంత వ్యంగ్య వైభవంతో చీల్చి చెండాడారు, ‘‘గోపాత్రుడు’’ (‘పిలక తిరుగుడు పువ్వు’ దీనికి కొనసాగింపే) నవలలో కె.ఎస్‌.వై.పతంజలి.