‘‘ఈ కుల వివక్ష యేమిటి?
ఆహా! ఏ పుణ్యాత్ముడు కల్పించెనో
ఈ పాడు ధర్మంబులు’’
శ్రీరంగరాజు చరిత్ర నవలలో నాయకుడు రంగరాజు వేటకు వెళ్ళి వడదెబ్బ తగిలి సొమ్మసిల్లిపోతే దరిదాపుల్లో ఉన్న కొందరు కాపులు పరుగున వచ్చి అతని నోట్లో నీళ్ళు పొయ్యడానికి ప్రయత్నిస్తారు. ఇంతలో ఒక ముసలాయన వచ్చి ఆ రాజుకి మనం నీళ్ళు పొయ్యకూడదు. ఈ నీళ్ళు తాగితే అతడు కులభ్రష్టుడవుతాడని వాళ్ళను అడ్డుకుంటాడు ఈ సన్నివేశంలో రచయిత పైమాటలంటాడు.
1872లో నరహరి గోపాలకృష్ణమ చెట్టి రచించిన శ్రీరంగరాజు చరిత్ర నవలలో రంగరాజు ఒక రాజ కుమారుడు. అతని తండ్రికి వేశ్య వలన కలిగి మరొక కుమారుడుంటాడు. కొడుకు లిద్దరినీ సమానంగానే చూస్తాడు తండ్రి. రంగరాజుకు అది నచ్చదు. అతడు ఇల్లు వదిలి పారిపోతాడు. ఒక ఊళ్ళో లంబాడి కన్య సోనాబాయి కనిపిస్తుంది. రంగరాజు ఆమెను ప్రేమిస్తాడు. ఆమెను ప్రేమించి వేరొకడు కొండవీడుకు ఎత్తుకు పోతాడు రంగరాజు కొండవీడు చేరుకుంటాడు. అక్కడ సోనాబాయి రంగరాజుకు మేనత్త కూతురని తెలుస్తుంది. వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుంటారు. ఇదీ కథ. ‘‘సోనాబాయి పరిణయము’’ అనే వేరే పేరు కూడా ఈ నవలకు ఉంది.
గత పది పదిహేనేళ్ళలో వచ్చిన నవలల గురించి చెప్పబోతూ ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఇప్పుడు ఇంతింతై వటవృక్షంలా శాఖోప శాఖలుగా విస్తరించిన తెలుగు నవల దాని విశ్వరూపాన్ని విత్తనంలోనే నాటికి ఎలా ఇముడ్చుకోగలిగిందో తెలియచెప్పటానికి.
కందుకూరి వీరేశలింగం పంతులు వచన ప్రబంధంగా రాజశేఖర చరిత్ర (వివేక చంద్రిక) ని 1878లో వెలువరించాడు. తదనంతర నవలలకి ఒక నమూనాగా ప్రచారంలోకి రావటంతో రాజశేఖర చరిత్ర మొదటి నవలగా గుర్తింపును, ప్రాముఖ్యాన్ని పొందింది.
నరహరి గోపాలకృష్ణమ చెట్టి తన నవలను నవీన ప్రబంధమన్నాడు. 1896లో వివేక చంద్రికా విమర్శనంలో కాశీభట్ట బ్రహ్మయ్య శ్రాస్తి నవల అని స్థిరపరిచేరు.
తదాదిగా తెలుగు నవల సంఘ సంస్కరణోద్యమానికి చేదోడు వాదోడుగా నిలిచింది. ఆంధ్రుల చారిత్రక వైభవాన్ని చాటి చెప్పింది. జాతీయ ఉద్యమానికి ఊపిరులూదింది. మనిషి మనోవల్మీకంలో సంచరించే సరీసృపాల విన్యాసాల్ని, వాటి హేతువుల్ని వెదికింది. పోరాటాల్లో ‘మృత్యుం జయులై’న ‘‘ప్రజల మనుషుల్ని’’ వారి వీరోచిత గాథల్ని గానం చేసింది. ‘‘చెలియలి కట్టల్ని’’ దాటి ‘స్వేచ్ఛ’గా ‘మైదానాల్లో’ సంచరించింది. మధ్య తరగతి బుద్ధి జీవులకు ‘చదువు’ నేర్పించి ‘మంచీ – చెడులను’ విడమరిచింది. ‘అల్పజీవి’కి ఆలంబనగా నిలబడింది. ‘అంధకారంలో’ ఉన్న ‘మట్టి మనిషి’ని గురించి ఆరా తీసింది.
ఇంతచేసి రాను రాను తీరిక సమయం ఎక్కువై సుఖం మరిగి పడవలాంటి కారుల్లో రాకుమారుడి లాంటి ప్రియుడితో షికార్లు కొడుతూ పగటి కలలు కన్నది. చివరికి భూతప్రేత పిశాచాలను ఆవాహన చేసుకున్నది. కానీ అదే సమయంలో ‘‘కలిమంటుకున్నాది’’. అది రాష్ట్ర వ్యాప్తంగా రాజుకునేసరికి ఒక దశాబ్దం పట్టింది.
తొంభయ్యవ దశకంలో వచ్చిన నవలకు చాలా వరకు ముడిసరుకు ఎనభయ్యవ దశకం నుంచీ లభించింది. డబ్బై ఎనభై దశకాల్లో జరిగిన అనేక రాజకీయ ఆర్థిక మార్పులు తొంభయ్యవ దశకం నాటి వచన రచనా భూమికని ఏర్పరిచాయి.
గత కొంతకాలంగా అస్తిత్వ ఉద్యమాలు ఊపందుకున్నాయి. స్త్రీలు, దళితులు, ముస్లింలు తమపై అమలవుతున్న ప్రత్యేక పీడనలను అక్షరబద్ధం చేస్తున్నారు. అస్తిత్వ ఉద్యమ నేపథ్యంలో సాహిత్యంలో నిర్దిష్టత ప్రాధాన్యం సంతరించుకుంది. రచయితలు, కవులు తమ తమ మూలాల్లోకి వెళ్ళి రాయడం తప్పని సరయింది. లింగవివక్ష, కులం, మతం, ప్రాంతంవంటి నిర్దిష్టతలు తెలుగు సాహిత్యం సంపన్నతకు దోహదం చేస్తున్నాయి.
ఒక విప్లవ ప్రధాన స్రవంతిలో భాగమై ఉన్న స్త్రీలు, దళితులు, చైతన్య పూర్వకంగా సృజనాత్మకంగా తమను కలుపుకోలేనందువల్ల వేరువేరు పాయలుగా విడిపోయి ఎవరికి వారు పరిష్కార విముక్తి మార్గాలు వెదుక్కుంటున్నారు.
1975-85ని అంతర్జాతీయ మహిళా దశాబ్దంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన తరువాత ప్రజా రాజకీయ ఉద్యమ చైతన్యం ఈ కాలంలో అసమానతలకు సంబంధించిన అన్ని పార్శ్వాలనూ కదిలించింది. లింగవివక్ష, పునరుత్పత్తి హక్కులు, అణిచివేత, పీడన, హింస, ఇంటిచాకిరి మొదలైన కీలకమయిన అంశాలను లేవనెత్తింది. స్త్రీలు తమ స్వేచ్ఛకు, వ్యక్తిగత వికాసానికి ఆటంకాలుగా ఉన్న పరిస్థితులేమిటో గుర్తించి ఆ క్రమంలో వివాహం, దాని ననుసరించి ఏర్పడ్డ కుటుంబం, ప్రధానమైన అడ్డంకులుగా పని చేస్తున్నాయని గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా మంది స్త్రీలు తమదైన తాత్విక పునాది నిర్మించుకుని రచనలు చేయసాగారు.
ఈ సందర్భంగా తొంభైల తరువాత వచ్చిన స్త్రీవాద రచనలు పరిశీలిస్తే వెలుతురు సోకని అనేక అంశాలు అవగతమవుతాయి. పరిశీలిస్తే –
ఆధునిక యువతి అంతరంగాన్ని, స్వీయ మానసిక చైతన్యాన్ని ఆవిష్కరించింది అహల్య (కుప్పిలి పద్మ). ముగ్గురు పురుషులతో తనకున్న సంబంధ బాంధవ్యాలను సహజీవనానికి, లేదా సహచర్యానికి, సంబంధించిన అంశాలను చర్చకు పెట్టింది. శాంతి నిండిన, స్నేహమయ ప్రేమతో, సమానంగా నడవగలిగే పరిస్థితికోసం ఎందుకు ప్రయత్నించకూడదు, అంటూనే ప్రతిపాదనల్ని సున్నితంగా తిరస్కరించి ఒంటరిగా ఉండడానికే నిశ్చయించుకొంటుంది.
వివాహంతో నిమిత్తం లేని స్త్రీ పురాణ సంబంధాలను స్త్రీల వైపు నుంచి వాంఛించబడడం ఆ సంబంధాలలోని ఔచిత్యాన్ని ఔన్నత్యాన్ని పురుషాధిక్య ప్రపంచం గుర్తించలేకపోవడం అనే అంశాలను ప్రయోగం (ఓల్గా) చర్చించింది.
స్త్రీలను విడదీసి పోటీకి పెట్టిన పితృస్వామ్య మాయాజాలాన్ని బట్టబయలు చేసింది. ‘‘ఆమె అడవిని జయించింది (గీతాంజలి) తన సంక్షోభ కారణాలు, పరిష్కారాలు, కేవలం తనలో లేవని వ్యవస్థలో ఉన్నాయని గ్రహించి నివారణ కోసం ఉద్యమించింది.
భిన్న పార్టీలలో శత్రువులుగా ఉన్న అగ్రవర్ణ భూస్వాముల పెత్తనం కింద నలిగిపోతున్న దళితులందరినీ సమీకరించి ఎదిరించి గ్రామాల్లో మహిళా ఉద్యమాన్ని నడిపి అగ్రవర్ణ పురుషుల అహంకారానికి బలైపోయిన స్త్రీ కథ ‘‘ఆకాశంలో సగం’’ (ఓల్గా). దళిత స్త్రీ నాయకత్వంలో స్త్రీలందరూ ఏకమై అగ్రవర్ణ భూస్వాములను ఎదుర్కోడం నవలలో ముఖ్య విషయం.
పట్టణ స్త్రీల జీవితం కన్నా దళిత స్త్రీల జీవితాలు ముఖ్యంగా పల్లెలో ఎందుకు భిన్నమైనపో చూపుతుంది ‘‘ఎల్లి’’ (అరుణ). కులానికి, లింగానికి వర్గానికి సంబంధించిన అధికార సంబంధాలను పలుకోణాల్నుంచి ప్రవేశపెట్టి బయట పెత్తందారుల లైంగిక పీడన, ఇంట్లో పురుషుల పీడన, పునరుత్పత్తి హక్కులు లేని దుర్భర జీవిత పరిస్థితులను ఎరుకుల జీవిత నేపధ్యంలో చిత్రించింది.
పైనాలుగు నవలలు రకరకాల సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన స్త్రీల సమస్యలను చర్చించాయి.
కొన్నేళ్ళ క్రితం రాజస్థాన్‌లో రూప్‌కన్వర్ సతి జరిగింది. ఆ ప్రేరణతో వచ్చిన ‘‘సతిమంటలు’’ (సింహాప్రసాద్) నవల విధవల మనోవేదనని మన కళ్ళకు కడుతుంది.
వృత్తిరీత్యా, సామాజిక దౌష్ట్యంలో భాగమయిన కుళ్ళు రాజకీయాల మధ్య నిత్యం నలిగిపోతూ, విధినిర్వహణలో సజీవ సమాధులవుతున్న వేలాది ఎ.ఎన్.ఎం. నర్సుల జీవితాలను సమాజానికి తెలియజేసింది ‘‘సంకెళ్ళు’’ (పి.వి.బి.శ్రీరామమూర్తి). సలీం ‘‘జీవన్మృతులు’’ నవలలో కూడా నర్సులకు సంబంధించిన సమస్యలను స్పృశించాడు.
గ్రామాల్లో అట్టడుగువర్గాల్లో స్త్రీలను, ఆసాములు కామానికి మాతంగినులుగా, బసివినిలుగా ఎలా బలితీసుకుంటారో వి.ఆర్.రాసాని ‘‘మట్టిమనుషు’’ల్లో బయటపెట్టారు.
‘‘సరిహద్దు’’, ‘‘రాగో’’ (సాధన) నవలల్లో జైని అంబక్కల జీవితాలను పరిశీలిస్తే స్త్రీలపై అత్యంత క్రూరంగా అమలయ్యే ఉక్కు చట్రంలాంటి పితృస్వామిక అణచివేత ఆదివాసీ ఆడవాళ్ళ జీవితాల్లోనూ అనివార్యమని తెలుస్తుంది.
‘‘పునరావాసం’’ (అప్పల నాయుడు)లో పాతికేళ్ళ గిరిజన మహిళ బంతి ఏ అనుభవాలలోంచి అవగాహనలోంచి, కీకారణ్యంలోంచి, ఒక బిగిసిన పిడికిలై ఆమె జ్ఞానం వికసిస్తుందో మనం చూడొచ్చు.
రాజకీయంగా సాంస్కృతికంగా ముస్లింల సమస్యలు చాలా ప్రత్యేకమయినవని ఇంతవరకూ వెలువడిన ముస్లిం సాహిత్యం నిరూపించింది. ఈ సందర్భంలో (సలీం) ‘‘వెండిమేఘం’’ నవల వెలువడింది. క్రింది స్థాయి ముస్లిం స్త్రీ జీవితాన్ని మతంలో అంతర్గతంగా ఉండే వైరుధ్యాలనీ వివరించడంతో పాటు తమ ఆత్మన్యూనతకి మూలాలెక్కడున్నాయో కూడా పట్టుకునే ప్రయత్నం చేసింది.
జాతీయ అంతర్జాతీయ సంస్థలు దళిత హక్కుల కోసం పోరాటం చేస్తున్నాయి. సాంఘిక వివక్షకు, అసమానలతకు వ్యతిరేకంగా దక్షిణాఫ్రికాలో డర్బన్‌లో 2001లో సదస్సు జరిగింది. భోపాల్ డిక్లరేషన్, అంబేద్కర్ శత జయంతి ఉత్సవాలు, ఇవి ఇలా ఉండగా, దళితులకు రాజ్యాధికారం అనే నినాదంతో 1984లో కాన్షీరాం దళితుల రాజకీయ హక్కులు సాధించడానికి బహుజన పార్టీ స్థాపించడం, 85లో మన రాష్ట్రంలో కారంచేడులో దళితుల ఊచకోత, 86లో దళిత మహాసభ ఆవిర్భావం, చుండూరు, నీరుకొండల్లో దళితులపై పునరావృతమైన దాడులు జరిగాయి. రాష్ట్రంలో రిజర్వేషన్‌లు పెంచారు. కేంద్రంలో మండల కమిషన్ నివేదిక అమలు ప్రకటన, రిజర్వేషన్ అనుకూల ప్రతికూల పవనాలు, ఫలితంగా నూతన సామాజిక సమీకరణాలు రూపొందాయి.
87లో మహారాష్ట్ర రాజధానిలో అఖిలభారత దళిత రచయితల మొదటి సభలు జరిగాయి. ఇవి సాహిత్యంలో దళితుల ఉనికిని తెలియచేశాయి. 93లో హైదరాబాద్‌లోను, 95లో వరంగల్లోనూ ‘ఆంధ్రప్రదేశ్ దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్యవేదిక సభలు జరిగాయి. సమస్త వర్ణ లింగ, కుల, జాతి, మత, భాష, ప్రాంతీయ అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతూ, అణచివేతకూ, దోపిడీకి, అసమానతలకు తావులేని నిజమయిన ప్రజాస్వామికతనూ తన సాంస్కృతిక విలువలతో కూడిన నిర్మాణానికి కృషి చెయ్యాలని తీర్మానించడం జరిగింది. అంతకు మునుపే కోస్తాలో మిషనరీల సహాయంతో ఆరంభమైన దళిత వికాసం, మార్క్సిస్ట్ ఉద్యమాలు దళితులకు ఆత్మ స్థైర్యాన్నిచ్చాయి. విద్యా, ఉద్యోగ రంగాల్లో ప్రవేశించిన నేటి దళితయువత, ఆత్మన్యూనతాభావం విడనాడి కులం పేర్లను తమ పేర్లతో సహా ప్రకటించుకునే ఆత్మ గౌరవాన్ని పెంపొందించుకుంది. ఈ కారణాలన్నీ గత పది పదిహేనేళ్ళలో వచ్చిన సాహిత్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపాయి.
ఈ కాలంలో వచ్చిన గొప్ప దళిత నవల ‘‘అంటరాని వసంతం’’ (కళ్యాణరావు). దాదాపు ఒకటిన్నర శతాబ్దాల కోస్తా ప్రాంత దళితుల జీవన గమనాన్ని ఉద్వేగభరితంగా వర్ణించింది. మాలమాదిగల ఉమ్మడిచరిత్ర, సంస్కృతి, జానపద కళల సంప్రదాయ నేపథ్యంలో సాగుతుంది. ఆరుతరాల అంటరాని ఇతిహాసం ఇది.
నల్లమల అడవుల నుంచి నెల్లూరు సముద్రతీరం వరకూ విస్తరించిన సంచార గిరిజనతెగ యానాదులు, సామాజిక పరిణామంలో ఆహార సేకరణ దశకు చెందిన జాతి. అలాంటి ఒక యానాది, మన్నోడుక,ి భూస్వామి మణియంకు, మధ్య సంఘర్ణణను గొప్ప శిల్పసౌందర్యంతో ప్రతీకాత్మకంగా డా॥ కేశవరెడ్డి ‘‘చివరి గుడిసె’’ నవలలో చిత్రించారు.
తన అధికార ప్రాబల్యంకోసం కురవల్లో, రెండు తెగల వారినీ ఎర్రమరెడ్డి విడదీసినప్పుడు, చివరికి వాళ్ళంతా నిలకడ మీద నిజాన్ని గ్రహించి ఏకమవ్వడం (వి.ఆర్.రాసాని) ‘‘చీకటి రాజ్యం’’ ఇతివృత్తం.
నిత్యం అనావృష్టి పీడిత రాయలసీమలో నీటివనరుల వినియోగాన్ని ప్రాజెక్టుల రూపంలో వ్యవస్థీకరించి చివరకు అవ్యవస్థ విస్తరణకు ఎలా దారితీస్తుందో (స్వామి) ‘‘గెద్దలాడతండాయి నవలలో’’ చూపించారు.
అనంతపురం జిల్లా సామాజిక రాజకీయ చరిత్రను ‘‘మీ రాజ్యం మీరేలండి’’ (స్వామి)లో చూడవచ్చు. అందివచ్చిన అవకాశాలను చేజిక్కించుకుని మతాలు మార్చుకుని కులస్వభావాన్ని భద్రంగా అంటిపెట్టుకుని, రెండు అగ్రవర్ణాల వారు, ఎలా దళితుల్ని కీలుబొమ్మలుగా చేస్తారో, ఈ నవల నిరూపించింది.
దళిత నేపధ్యంలో కులవర్గ దృక్పధాల నుండి, దళిత సమస్యను విశ్లేషించిన నవల (చిలుకూరి దేవపుత్ర), ‘‘పంచమం’’. దళితుడు, అచేతన దశనుంచి హక్కులకోసం ఉద్యమాన్ని చేపట్టడం వరకూ సాగుతుంది. నవల్లో ప్రధానమైన కథతోపాటు స్త్రీవాదం, ముస్లింలు, క్రైస్తవులకు సంబంధించిన సమస్యలు చర్చకువచ్చాయి. గతశతాబ్దం ఎనిమిదో దశకానికి ముందట భూసంస్కరణలు మొదలుకొని, దండోరా వనాల మహానాడు వరకు, పరిణామాలను చిత్రించింది.
మాలమాదిగల మధ్య అంతరాలను, అనాదిగా వస్తున్న పంతాలను, ఆసరాగా చేసుకుని తమ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం అగ్రవర్ణాల వారు ఉపయోగించుకోడం మామూలు కథే అయినప్పటికీ ఏభై ఏళ్ళ కాలాన్ని నవలలో ఇనుమడింపచేస్తూనే గత పదేళ్ళ కాలంలో గ్రామాల్లో చోటుచేసుకున్న పరిణామాలను రికార్డు చేసింది. (ఎస్.వెంకట రామిరెడ్డి) ‘‘కాడి’’ నవల.
రాయలసీమ ముఠా కక్షల నేపథ్యంలో వేంపెంట సంఘటన స్ఫూర్తితో వెలువడిన నవల (పినాకపాణి) ‘‘నిప్పులవాగు’’. నల్లమల అటవీ ప్రాంతంలో పీపుల్స్‌వార్ ప్రవేశం నుంచి అనేక రాజకీయ పరిణామాలు ఇందులో చోటుచేసుకున్నాయి. భూస్వామ్య సాయుధ ముఠాలు పోలీసుల వెన్నుదన్నుతో, మాదిగల్ని సజీవ దహనం చెయ్యడం నుంచి, మాలమాదిగల మధ్య ఉన్న వైరుధ్యాలను, విప్లపోద్యమ క్రమం నుంచి దండోరా వరకూ, చిత్రించింది.
దళిత సమస్యకు మార్క్సిస్ట్ ఉద్యమాల సహాయం అవసరమని, దళిత బహుజన విముక్తికి వెలుగుదారి విప్లవమని, చెప్పిన నవల ‘‘దండంమీద చిలకలు’’(గోపరాజు నాగేశ్వరరావు). మధ్య కోస్తాలో దళిత బహుజనులు వృత్తుల పరాయాకరణ పొంది, దొరలకు కిరాయిహంతకులుగా, దళారులుగామారడం చాపకింద నీరులా విస్తరించిన పీపుల్స్‌వార్ కార్యక్రమాల పట్ల దళితులు ఆకర్షితులవ్వడం, ఈ రెండు అంశాలు కేంద్రంగా నడుస్తుందీ నవల.
దళిత జీవిత వాస్తవాల్ని, వాళ్ళు అనేక రకాలుగా ఎదుర్కొంటున్న సమస్యల్ని ‘‘మాదిగపల్లె’’ (పి.నాసరయ్య) నవలలో చూడొచ్చు. దళితులను చైతన్యపరిచి, వారిని సంఘటిత పరుస్తుంటే, వాళ్ళను విడదీసి బలహీనుల్ని చేయడానికి పెద్దలు ఎలా ప్రయత్నిస్తారో చెప్పారు.
తెలంగాణా మాదిగ జీవితాన్ని చిత్రించిన (వేముల ఎల్లయ్య) నవల ‘‘కక్క’’ దళిత సాహిత్యోద్యమం, సామాజిక న్యాయం దిశగా, మళ్ళిన క్రమంలో కులవృత్తి నేపథ్యంలో (వీర) మాండలికంలో వచ్చిన నవల ఇది. పాలేరు జీవితంతో తృప్తిపడని ఓమాదిగ యువకుడు, కులవృత్తివేపు మళ్ళడం కథకు ఆయువుపట్టు. దళితుడి ఆత్మగౌరవానికిది నిక్కమైన నిదర్శనం.
‘‘సూర’’ (భూతల ముత్యాలు) నవలలో కూడా ఒక దళిత యువకుడి స్వీయాత్మక కథగా సాగుతుంది. వలసజీవిత విషాదం గురించి, అగ్రవర్ణాల వారి పెత్తనం గురించీ, ఆడవాళ్ళపై లైంగిక దాడుల గురించీ స్పృశించింది.
సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వస్తున్న మార్పుల్ని ‘‘మంచి నీళ్ళ బావి’’ (సదానంద శారద) కేంద్రంగా చిత్రిస్తూనే మొత్తం తెలంగాణా గ్రామీణ సమాజ పరిణామాలను పరిశీలించింది. తెలంగాణా గ్రామీణ సంస్కృతిని కళ్ళకు కట్టినట్టు వర్ణించడం ఈ నవల ప్రత్యేకత.
విద్యావంతుడైన ఒకమాదిగ యువకుడు, జీవితం పట్ల అతని చుట్టూ ఉన్న సామాజిక వ్యవస్థ పట,్ల మానవ సంబంధాల్లో డొల్లతనం వల్ల కలిగే మానసిక సంవేదన సంఘర్షణ ప్రతిరూపమే ‘‘వేర్లు’’ (కేతు విశ్వనాధరెడ్డి). ముప్పయ్యేళ్ళ క్రితం విద్యావంతుడైన ఒక దళితుడి అంతరంగానికి అద్దం ఈ నవల.
అయిదారు తరాలుగా వీధినాటకాలనే జీవనోపాధిగా జీవించిన ఒక కుటుంబం పడిన కష్టనష్టాల్ని వారు వేసుకున్న రంగుల వెనుక ఉన్న విషాదాన్ని బొమ్మట్టించారు ‘‘బతుకాట’’ నవలలో వి.ఆర్.రాసాని.
వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం ఈ మూడు కాలాల్లోనూ రజకులు వృత్తిపరంగా ప్రకృతితోనూ, అగ్రవర్ణాల వారితోనూ నిత్యఘర్షణ (జ.ఎన్.చలం) ‘‘రేవు’’ నవలలో చూడొచ్చు. ఇదే ఇతివృత్తంతో వచ్చిన (పి.నాసరయ్య) ‘‘ఉతికేసిన బతుకులు’’ నవలలో తండ్రీ కొడుకులిద్దరూ తోటి రజకుల్ని చైతన్యవంతుల్ని చెయ్యడం, అగ్రకులాల వారి ఆధిపత్యాన్ని ప్రశ్నించడం, ఇందులో కథ.
దళిత స్త్రీలను జోగినులుగా మార్చడం నుంచి, దళితులపై దాడులను ‘‘జగడం’’ నవలలో బోయ జంగయ్య చిత్రించారు. నవలంతా సామాజిక పరిస్థితుల చిత్రణే ప్రాధాన్యంగా సాగింది.
సంసారాలను కూల్చే సారాను నిషేధించాలనే డిమాండుతో సారాజులను, వారి మద్దతుదారులతో గద్దెనెక్కిన పాలకులను, గజగజ లాడించిన మహోజ్వల మహిళా ఉద్యమం సారా వ్యతిరేక ఉద్యమం. నాటి చారిత్రక సందర్భాన్ని రికార్డు చేసిన నవల (శక్తి) ‘‘పులిజూదం’’.
భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. కరువులొచ్చినా కాటకాలొచ్చినా లెక్కచెయ్యకుండా ఎనభై శాతం ప్రజలు గ్రామాలలో నివసిస్తున్నారు.
1990-91లో నూతన ఆర్థిక విధానాలద్వారా భారతదేశంలోకి ప్రవేశించిన ప్రపంచీకరణ, డబ్బుతో ముడిపడినా, ఉన్న వ్యవసాయక ఉత్పాదకాలన్నింటినీ బహుళజాతి సంస్థల ద్వారా నియంత్రించడం ప్రారంభించింది. ఇది ప్రత్యేకించి రైతు జీవితాన్ని, మొత్తంమీద గ్రామీణ జీవితాన్ని, తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది.
95లో గాట్ ఒప్పందం W.T.O. రూపంలో మన ముందుకు వచ్చింది (సభ్యత్వ హోదాలో మన దేశం కూడా ఉండడం గమనించదగ్గది). దీని ముఖ్య లక్ష్యం వ్యవసాయ రంగంలో మార్కెట్ దృక్పధాన్ని ప్రవేశపెట్టడం. వ్యవసాయం ఒక జీవనోపాధి మార్గంగా ఉన్న పరిస్థితి నుంచి అది ఒక లాభార్జన దృష్టిగల పారిశ్రామిక సంస్థగా అవతరించడానికి రంగం సిద్ధమైంది. ఆహార ఉత్పత్తుల స్థానాలలో, వాణిజ్య పంటలు ప్రవేశించాయి. మార్కెట్టులో వచ్చే ఒడిదుడుకులు, చాలా సందర్భాలలో, రైతు జీవితంలో కొత్త సమస్యలు తెచ్చిపెట్టాయి. సహకార రంగాల రద్దు, సబ్సిడీల కోత, వ్యవసాయేతర రంగాలలో ఉపాధి లేకపోవడం, మొత్తంగా ఈ సంక్షోభానికి పరాకాష్ట. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి దారితీసింది.
ఛిన్నాభిన్నమయిన గ్రామీణ వ్యవస్థని చిత్రించే సాహిత్యం తెలుగులో వివిధ ప్రక్రియల్లో వచ్చినప్పటికీ, ఈ సద్యస్పృహతో అయినా కాకపోయినా, రైతు జీవితాన్ని గురించి, కొద్దో గొప్పో నవలలు కూడా వచ్చాయి.
భూమికి, రైతుకి ఉన్న సంబంధం తల్లీబిడ్డల సంబంధం. పండినా పండకపోయినా, చివరకు అడుక్కుతినే పరిస్థితి దాపురించినా, భూమిని అమ్ముకోడానికి మాత్రం ఇష్టపడడు. కానీ మారుతున్న సామాజిక వ్యవస్థలో భూమిని బేరంపెట్టడం అనివార్యమవుతుంది. పిల్లల్ని చదివించాలన్నా, వివాహాలు జరిపించాలన్నా రైతుకున్న ఆధారం అదొక్కటే (కాలువ మల్లయ్య), ‘‘భూమిపుత్రుడు’’ నవలలో కొండ మల్లయ్య పరిస్థితి కూడా అంతే. భూమిని తప్పని సరై అమ్ముకుని పట్నానికి వలసపోతాడు. ఇది వాస్తవ చిత్రణ.
‘‘మూగవాని పిల్లనగ్రోవి’’ (డా॥ కేశవరెడ్డి) నవలలో కూడా భూమితో రైతుకున్న సంబంధం అన్యోన్యత ఎంత గాఢమైందో, ఎడబాటు రైతు అస్తిత్వాన్ని ఎంతగా కుంగదీస్తుందో, జానపదుల విశ్వాసాల నేపథ్యంలో బలమైన, గాఢమైన, తాత్విక పునాదితో చర్చించారు.
అప్పు కింద తన భూమిని మణియం చేజిక్కించుకున్న తరువాత, బక్కరెడ్డి తనిక కాపోడిని, కానంటాడు. ఆ అర్హత లేదంటాడు. మిత్రుడు మాత్రం కాపు కులంలో పుట్టినోడివి కాపోడివి కాకుండా ఎలా పోతావంటాడు.
‘రౌడి’ నవలని దళిత నవలల్లో చేర్చినప్పటికీ, రైతు జీవితానికి సంబంధించిన అనేక అంశాలను కూడా స్పృశించింది. అసలు ఈ నవల ఏ రకమయిన వింగడింపుకీ లొంగనిది. పాలేర్లు ఉన్నవాళ్ళు కాడిని చేపట్టే స్థాయికి ఎదగడం, వ్యాపార సంస్కృతి కారణంగా అగ్రవర్ణాల వారు ఎందుకు వదులుకున్నారో అదే వాడిని ‘సొంతం’గా చేపట్టడానికి దళితులు ఎందుకు ఆరాటపడవలసి వచ్చిందో అద్భుతంగా చిత్రించింది.
మధ్య కోస్తా నుంచి తెలంగాణాకి పోయి ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయాన్ని చేపట్టి బీడు భూమిని సస్యశ్యామలం చేసిన ఒక కృషీవలుని కథ ‘‘రేగడి విత్తులు’’ (చంద్రలత` వలసకు సంబంధించిన పరిమితులున్నప్పటికీ). ఈ దశాబ్దిలో వ్యవసాయానికి సంబంధించిన అనేక అంశాలను శ్రాస్తీయంగా చర్చకు పెట్టింది. వ్యవసాయం వ్యాపార మార్గం పట్టిన తరువాత సంప్రదాయ సేద్యం, దానికి ఆలంబనగా ఉన్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థా, ఏ విధమయిన మార్పుకు లోనయ్యిందీ ఈ నవలలో విశ్లేషించారు.
పత్తికాయను పురుగు దొలిచినట్టు రైతుల రక్తాన్ని దళారులు ఏ విధంగా పీల్చేస్తున్నారో హృదయ విదారకంగా చిత్రించిన (మొలకపల్లి కోటీశ్వరరావు) నవల ‘‘ఆక్రందన’’. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు, గిట్టుబాటు ధర లేకపోవడం, అప్పులు, వడ్డీలు, ఈ క్రమం అంబయ్య అనే రైతు కుటుంబాన్ని (భార్య, చెల్లెలు ఆత్మహత్య) ఎలా విచ్ఛిన్నం చేసిందో చూపింది.
గ్రామాలు ప్రగతికి పట్టుకొమ్మలనీ, భారతదేశానికి ఆత్మలని, ఎవరెన్ని రకాలుగా చెప్పినా, కూడు, గూడు, గుడ్డ, చదువు, వైద్యం, త్రాగునీరు వంటి మౌలికమయిన సౌకర్యాలు లేని గ్రామాల అభివృద్ధికి, అలవిమాలిన అభిమానంతో కృషిచేసిన పాత్రలు కొన్ని నవలల్లో చూడవచ్చు.
‘‘పల్లె పిలిచింది’’ (ద్వారక) నవల ఒక ఉపాధ్యాయుడి కనీస కర్తవ్యాన్ని, కఠోర శ్రమని, తెలియచేసిన నవల. పల్లెతో అతడు మమేకమయ్యే వైనాన్ని, గొప్ప గొప్ప మార్పుల్ని, చిన్న చిన్న లక్ష్యాలు ఎలా నిర్దేశిస్తాయో నిరూపించిందీ నవల.
ఏ రకమయిన సౌకర్యాలూ లేని పాలెం గ్రామానికి, రహదారి ద్వారా పట్టణానికి అనుసంధానం చేస్తే, స్వాలంబన సాధ్యమవుతుందని విశ్లేషించి చెప్పిన నవల ‘‘ది రోడ్’’ (చంద్రశేఖర్ అజాద్).
రావిశ్రాస్తి నవలల్లో కథా సందర్భంలో తప్ప, కేవలం పోలీసులకు సంబంధించిన వస్తువుతో వచ్చిన నవలలు, తెలుగులో చాలా తక్కువ. 96లో వచ్చిన ఖాకీ బతుకులు (స్పార్టకస్) నవల పోలీసు వ్యవస్థలోని కింది స్థాయి ఉద్యోగి జీవితాన్ని చిత్రించింది. తన అట్టడుగు కులాన్ని, చేస్తున్న అట్టడుగు ఉద్యోగాన్ని, రచయిత నవల ఇతివృత్తంగా, స్వీకరించడం ఈ నవల ప్రత్యేకత. సమకాలీన సమాజంలోని పోలీసు కానిస్టేబుల్స్ చుట్టూ అల్లుకు పోయిన కుల, మత, ఆర్థిక, రాజకీయ సమస్యలతో పాటు, అధికార్ల జులుం, వృత్తి సమస్యలు, కులపరంగా అదనంగా ఎదుర్కొనే పీడన, ఈ నవలలో చాలా విపులంగా విస్తారంగా చర్చకు వస్తాయి.
ఓ పోలీసు ఉన్నతాధికారి వ్యక్తిత్వానికి, ఉద్యోగ ధర్మానికి మధ్య జరిగిన సంఘర్షణ నేపథ్యంగా, పోలీసు వ్యవస్థపై రాజకీయాల దుష్ప్రభావం, వివిధ స్థాయిల్లో అధికారుల మధ్య జరిగే ప్రచ్ఛన్న యుద్ధాన్ని మనకు తెలియచేస్తుంది. ‘‘నిర్జీవయాత్ర’’ (సత్యపోలు సుందర సాయి) నవల.
కరుడుగట్టిన ఖాకీల కఠోర ఆదేశాలకు, వాటి అమలుకు, చిల్లర మల్లర దొంగతనాలు చేసేవాళ్ళు ఎలా బలైపోతారో, థర్డ్ డిగ్రీ, వాళ్ళపై ఎంత పాశవికంగా ప్రయోగింపబడుతుందో, వళ్ళు జలదరించే విధంగా దృశ్యమానం చేశారు (మొలకపల్లి కోటేశ్వరరావు) లాకప్ నవలలో.
అటూ ఇటూ కాని వయసులో, తెలిసో తెలియకో చేసిన తప్పుకు, చిన్నపిల్లలు బాలనేరస్తులుగా చీకటి బతుకులు బతకవలసిన దుస్థితిని వర్ణించారు, చిలుకూరి దేవపుత్ర ‘‘చీకటిపూలు’’ నవలలో. అమ్మానాన్నల ఆలనా పాలనా లేక, వీధిబాలలు నేరస్థులుగా ఎలా మారుతారో, మానసిక పరివర్తనకు దోహదపడవలసిన కారాగారాలు, ఆ పని చేయకపోతే పిల్లల్లో పెరిగే వ్యతిరేక భావాలు ఈ నవలలో ప్రస్తావించారు.
పైనాలుగు నవలల్లో పోలీసుల్లో పైఅధికారులు, అట్టడుగు ఉద్యోగులు. కటకటాల్లో చిల్లర దొంగలు, బాలనేరస్తులు ఇలా నలుగుర్నీ నాలుగు కోణాల్లో చిత్రించడం జరిగింది.
ఎన్ని లాకప్ డెత్‌లు జరిగినా, చిన్న పిల్లలమీద ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని అత్యాచారాలు జరిగినా, న్యాయం చీకట్లో పిల్లి లాంటిదని, దాని ఆనుపానులు పట్టుకోడం కళ్ళకి గంతలు కట్టుకున్న న్యాయదేవత వల్ల కాదని, దాన్ని కనిపెట్టాల్సిన వాళ్ళు దాచి పెట్టడానికే తోడ్పడుతున్నారనీ, పౌరహక్కులకు సంబంధించిన అనేక కోణాల్ని స్పృశిస్తూ న్యాయ వ్యవస్థని శాసిస్తోన్న శక్తుల గురించి చర్చకు పెట్టిన నవల ‘‘చీకట్లో నల్లపిల్లి’’ (నందిగం కృష్ణారావు).
ప్రజాసామ్యం ఎంత మేడిపండు చందంగా ఉంటుందో, ‘‘రిగ్గింగ్’’ (విశ్వమోహనరెడ్డి) నవలలో విడమరచి చూపించారు. అభ్యర్థుల ఎంపిక నుంచి, ప్రచారం, పోలింగ్, కౌంటింగులలో జరిగే అక్రమాలు, వాటిని మనం కనీసం ప్రశ్నించకుండా, పరోక్షంగా అలాంటివి కొనసాగడానికి ఎలా సహకరిస్తున్నామో, ఈ నవల ప్రతిబింబించింది.
పోలీసులు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు, పత్రికలు, ఈ నాలుగు రంగాల నీతిమాలినతనాన్ని అత్యంత వ్యంగ్య వైభవంతో చీల్చి చెండాడారు, ‘‘గోపాత్రుడు’’ (‘పిలక తిరుగుడు పువ్వు’ దీనికి కొనసాగింపే) నవలలో కె.ఎస్.వై.పతంజలి.
డభ్బయిలలో నిర్దిష్టమయిన లక్ష్యంతో కొత్త రూపం తీసుకున్న ప్రజారాజకీయ ఉద్యమాలు, పౌరహక్కుల ఉద్యమాలు, ఎనభైలలో మరింత బలపడి, ప్రజాఉద్యమాలకు, పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయాలకు ఉన్న వైరుధ్యం స్పష్టంగా బయటపడింది. వర్గ సమాజంలో జీవితం తప్పనిసరిగా వర్గస్వభావాన్ని కలిగి ఉంటుందని, రచయితలకు దోపిడివర్గం దోపిడీకి గురవుతున్న వర్గం` ఈ రెండు రకాల వాళ్ళ జీవితం గురించి స్పష్టమయిన అవగాహన ఉండాలన్న చైతన్యం బలపడింది. ఈ రకమయిన చైతన్యంతో జీవితాన్ని కొత్త కోణాల నుంచి చూపిస్తూ వేరు వేరు రంగాలలో వివిధ అంతరువులలో ఉన్న సంక్లిష్టతను, సమస్యలనూ, సంఘర్షణనూ వస్తువుగా చేసికొని వస్తోన్న నవలలున్నాయి.
దళజీవితాన్ని, దళాలకు గ్రామీణజనజీవితంతో ఉన్న అనుబంధాన్ని, గ్రామీణ జీవితాన్ని అభివృద్ధికరంగా మార్చడం, 16 దళాలు నిర్వహించే పాత్రను, దళాలకు, ప్రభుత్వ పోలీసు యంత్రాంగానికి, మధ్య నడిచే రాజకీయ వ్యవహారాన్ని వస్తువుగా చేసుకుని, సామాజిక నవల, పోరాట నవలగా మలుచుకున్న నవలలు ‘‘సరిహద్దు’’ ‘‘రాగో’’ (సాధన) నవలలు.
మన రాష్ట్ర సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర అరణ్య ప్రాంతాలలోని ఆదివాసీ రైతాంగ ఉద్యమం, ‘‘సరిహద్దు’’ నవలకు ఇతివృత్తం. గిరిజనులపై పోలీసులు, ఫారెస్టు అధికారులు, సాగిస్తున్న నిరంకుశ దోపిడీ దౌర్జన్యాలే ముఖ్యమైన అంశాలు.
బలవంతపు పెళ్ళి నిర్బంధాల నుంచి విపరీతంగా పెనుగులాడి బయటపడి దళంతో కలుస్తుంది ‘‘రాగో’’. తను అనుభవించిన క్షోభ – స్వేచ్ఛకోసం పడే ఆరాటం, మీడియ్రాస్తీలందరిలోనూ చూస్తుంది రాగో. పంజరం లాంటి జీవితం నుంచి ఏ కట్టుబాట్లు లేని అరణ్యంలోక,ి అక్కడి నుంచి ఆశయ పథంలోకి పయనించింది.
నేటి యువతరం కంప్యూటర్‌లలో తమ భవిష్యత్తుని వెదుక్కుంటున్న సమయంలో సామాజిక భవిష్యత్తుని గురించి ఆలోచించవలసిన అవసరాన్ని గుర్తుచేస్తుంది ‘‘వేకువ పూలు’’ (జతిన్‌కుమార్). వామపక్ష ఉద్యమంలో పనిచేసే స్త్రీ పురుష సంబంధాల్లో నెలకొన్న వివక్షనూ బయటపెట్టింది.
ప్రాణభయంతో దొరలు ఎక్కడున్నా, గ్రామాలపై ఏదో ఒక పద్ధతిలో పట్టును బిగించి ఉండడం, ఆర్థికంగా జరిగిన మార్పులు, వ్యవసాయం, దాని అనుబంధ వృత్తులమీద ఎలాంటి చావుదెబ్బ తీసిందో, ఈ మార్పు ఎలాంటి అరాచకానికి దారితీస్తుందో చూపింది పులుగు శ్రీనివాస్ ‘‘అన్నలు’’. బూటకపు ఎన్‌కౌంటర్లు నిర్వహించే పోలీసులను విమర్శిస్తూనే, అన్నల్లో వివిధశిబిరాల మధ్య నెలకొన్న శత్రువైఖరులను, వాళ్ళు బలిగొంటున్న అమాయకులను, ఇలా అనేక అంశాలను విశదపరిచారు.
అటు నక్సలైట్లకు, ఇటు పోలీసులకు, మధ్యనలిగే ఆదిలాబాద్ గోండు గిరిజన యదార్ధ జీవితం ‘‘ఊరు’’ (వసంతరావు దేశ్‌పాండే) నవల చిత్రీకరించింది. నక్సలైట్ల పునరావాసం గురించి ‘‘త్రేతాగ్ని’’ (అడవి సూర్యకుమారి) నవల చెబిత,ే గిరిజనులకు పునరావాసం పేరుతో పాలకులు చేసే ప్రచారాలు ఉత్తుత్తివేనని గిరిజన జీవన సంఘర్షణకు భూమి కేంద్రమనేది మనకు ఎరుకపరుస్తుంది, అప్పలనాయుడి ‘‘పునరావాసం’’. శ్రీకాకుళ ఉద్యమ నేపథ్యంలో వాస్తవాన్ని, కల్పననూ, జ్ఞాపకాన్ని, కలగలిపి అల్లిన నవలిది. ‘‘ఆ కొండల వెనుక’’ (ఇ.రామచంద్రం) నవల కూడా గిరిజనులను ప్రధాన జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం చేసే కృషిలో నిబద్ధత కొరవడి, గిరిజనులు పడేపాట్లు చిత్రించింది.
‘ప్రాంతీయత’ ఇటీవల తెలుగు సాహిత్యంలో ప్రధాన వస్తువయింది. నిర్దిష్ట ప్రాంతీయ ప్రత్యేకతతో రచన సాగించడమో ఆ ప్రాంతానికున్న చరిత్రని, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని, చెప్పడమో రచయితల ఉద్దేశంగా కనిపిస్తుంది. ఈ దృష్టితో చూసినప్పుడు మూడు ప్రాంతాల నుంచి వచ్చిన నాలుగు నవలలు ప్రత్యేకంగా అనిపించాయి. కళింగాంధ్ర నుంచి అప్పల నాయుడి ‘‘ఉత్కళం’’, రాయలసీమ నుంచి శాంతినారాయణ ‘‘పెన్నేటి మలుపులు’’, తెలంగాణ నుంచి దాశరధి రంగాచార్య ‘‘అమృతంగమయి’’, నవీన్ ‘‘కాలరేఖలు’’.
గత ఎనభై ఏళ్ళ కాలపరిమితి గల ‘‘ఉత్కళం’’లో ఒకే కుటుంబానికి చెందిన నాలుగు తరాల కథ ఉంది. ఉనికికోసం మనిషికోసం మట్టిమనుషులు ఎలాంటి పోరాటాలు చేయవలసివస్తుందో ఈ నవల వివరిస్తే ఎనభై దశకంలో రాజకీయ గ్రామాల నేపథ్యంలో అనంతపురం జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన సామాజిక చలనాన్ని రికార్డు చేసింది ‘‘పెన్నేటి మలుపులు’’. తుంగభద్ర కాలువ సాగునీటి మూలంగా భూస్వాముల సంబంధాల పరిధిలో చెన్నంపల్లి సామాన్య జనాల బతుకుల్లో భూస్వాముల రాక్షసత్వాన్ని మనకళ్ళకు కడుతుంది. గ్రామీణ జీవితంలోని అనేక పార్శ్వాలను వాటి అంత: సంబంధాలను వెల్లడించింది. ‘‘అమృతంగమయం’’లో స్వాతంత్య్రానికి పూర్వం ఏభై ఏళ్ళు, తరువాత ఏభై ఏళ్ళు, ఈ వందేళ్ళ కాలంలో తెలంగాణ గ్రామీణ జీవితంలో సాంఘిక ఆర్థిక రాజకీయ పరిణామాలు విచ్చలవిడి పాశ్చాత్య నాగరికత పోకడలు పర్యావరణం ఈ అంశాల నేపథ్యంలో సాగుతుంది. ‘‘కాలరేఖలో్ల’’, 1944 ఆంధ్ర మహాసభ ప్రారంభం నుంచి 56 ఆంధ్రప్రదేశ్ ఏర్పడినంతవరకూ మధ్య కాలాన్ని ప్రాతిపదికగా చేసుకుని నాటి సాయుధ రైతాంగ పోరాటం చెప్పబడుతుంది.
కె.ప్రతాపరెడ్డి ‘‘బందూక్’’ నవల నాటి నిజాం నవాబుల పాలనలో దొరల అక్రమాలు రజాకార్ల దురాగతాలు వివరిస్తే ముదిగంటి సుజాతారెడ్డి ‘‘మలుపుతిరిగిన రథచక్రాలు’’ కూడా తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన ఇతివృత్తంతోనే సాగింది.
‘‘మంటలు మానవత్వం’’ (సరిపల్లి కృష్ణారెడ్డి) నవలలో రజాకార్లు సృష్టించిన హింసలో కొంతమంది ముస్లింలు అనుకూలంగా ప్రవర్తించగా మరికొంతమంది ముస్లింలు మాత్రం ఎదురు తిరగడం ఇతివృత్తం.
‘‘జగడం’’ దళిత నేపథ్యంలో సాగినప్పటికీ నవల రజాకార్ల ఆగడాలతో ఆరంభమవుతుంది. కాలువ మల్లయ్య ‘‘సాంబయ్య చదువు’’లో 1947 – 95 పాఠశాల నుంచి కళాశాల విద్య వరకు వచ్చిన మార్పులు ఆంధ్ర తెలంగాణ ఏర్పాటు ఉద్యమం నక్సలైట్ ఉద్యమం తెలంగాణను ఏ మేరకు ప్రభావితం చేశాయో విపులీకరించారు.
తెలంగాణ సాంఘిక సాంస్కృతిక జీవితాన్ని, దొరల నిరంకుశ పీడనకు, దోపిడీకి గురవుతున్న ఒక గ్రామాన్ని, ఆ దొరల కబంధ హస్తాల నుంచి విముక్తం చేసిన, ఒక గాంధేయవాది కథ ‘‘నిరుడు కురిసిన కల’’ (బి.మురళీధర్)
హైదరాబాద్ చారిత్రక నేపథ్యాన్ని విశిష్టతను లోకేశ్వర్ ‘‘సలాం హైదారబాద్’’ నవలలో చిత్రించారు. పరస్పర మత సహనంతో మానవత్వం వెల్లివిరిసిన ఒకప్పటి నగర జీవన సరళిని ఆవిష్కరించారు.
కాకినాడ యానాంల మార్గాలలో ఉన్న కోరంగికి చారిత్రకంగా చాలా పేరుంది. ఆంగ్లో ఫ్రెంచి యుద్ధాలు మొదలుకొని ఒక పల్లెలో జరిగిన మామూలు సంగతుల వరకూ చిత్రించింది ‘‘బంకోలా’’ నవల. ఒక చారిత్రక సంఘటన ప్రభావం సమకాలీన సమాజంపై ఎలాపడుతుందో నిరూపించింది.
సింహప్రసాద్ ‘‘స్వేచ్ఛా ప్రస్థానం’’ స్వాతంత్య్రోద్యమ నేపథ్యంలో ప్రారంభమై అయిదున్నర దశాబ్దాల తెలుగు రాజకీయ చరిత్రను ఓ మహిళా కేంద్రం స్థానంగా చేసుకుని సాగింది.
పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయం స్థాయి వరకు ఉన్న సమస్యలను చిత్రిస్తూ కూడా కొన్ని నవలలు వచ్చాయి.
కళ్యాణి రచించిన ‘‘భేటి’’ నవల పాఠశాలలో మార్గదర్శకులుగా ఉండవలసిన ఉపాధ్యాయుల్లో క్రమశిక్షణ, నిజాయితీ లోపిస్తే సున్నిత మనస్కులయిన పిల్లలు ఎంత నొచ్చుకుంటారో లోకంలో మంచిపట్ల వారిలో ఎలాంటి అపనమ్మకం కలుగుతుందో వివరించారు.
గారాబంగా పెరిగిన పిల్లలు కన్నవారి నుంచి, పెరిగిన పరిసరాల నుంచి దూరమైనప్పుడు ఆ పిల్లల్లో రేగిన కల్లోలమే చంద్రలత ‘‘వర్థని’’ నవల.
భావుకుడయిన ఒక విద్యార్థి హృదయంలో ఎగిసిన రాగరంజిత భావాలు, కలలు, కోరికలు సంఘర్షణలు లేఖా ప్రక్రియలో సాగింది చంద్రశేఖర ఆజాద్ ‘‘నాన్నకో ఉత్తరం’’ నవల.
విద్యార్థి ‘‘తొలి అడుగు’’ నవలలో ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్న విద్యార్థులకు నేటి కర్తవ్యాన్ని, వారిపట్ల తల్లిదండ్రుల ప్రవర్తనని, ఉపాధ్యాయుల బాధ్యతని గుర్తుచేస్తుంది.
‘ది యూనివర్సిటీ’ నవలలో కె.సురేష్ చాలా ఆసక్తికరమైన, ఆలోచించవలసిన ప్రతిపాదన చేశారు. లోపభూయిష్టమైన ఈ విద్యావిధానం వల్ల విద్యార్థుల్లో స్వార్థం, సంపాదన తన కోసమే తను, అనే భావన పెరిగిపోతుందని ప్రత్యామ్నాయంగా శ్రాస్తీయమైన విద్యాబోధన గురించి రచయిత కొన్ని సూచనలు చేశాడు.
పరిశోధనా రంగాలలో విశ్వవిద్యాలయ ఆచార్యులు గైడులుగా వ్యవహరిస్తూ విద్యార్థులను పెట్టే ఇబ్బందులను ‘‘స్కాలర్’’ నవలలో ఏకరవు పెట్టారు సీతా రత్నం.
ప్రపంచం ముందున్న అతి పెద్ద సమస్య, అత్యంత ప్రమాదకరమైన సమస్య, పర్యావరణం. ఈ అంశాల పట్ల కూడా రచయితలు స్పందించిన తీరు అభినందనీయం.
పరిశ్రమలు సృష్టిస్తున్న కాలుష్యం జనజీవనంపై చూపిన దుష్టభావం ప్రాణ్‌రావు ‘‘నీలిపాప’’ నవలలో బయటపెట్టారు. అభివృద్ధి పేరిట విస్తరిస్తున్న పరిశ్రమలు పర్యావరణానిక,ి మనిషి మనుగడక,ి ఎలా పరిణమించాయో ఇందులో చూడవచ్చు.
ఆనకట్టల నిర్మాణం వల్ల జరిగే సాధక బాధకాలను ఒక గ్రామం ప్రాతిపదికగా పరిసరాలు, కాలుష్యం, నీటి సమస్య వంటి పర్యావరణ సమస్యలతో చర్చించింది ‘‘దృశ్యాదృశ్యం’’ (చంద్రలత) నవల.
ఊర్లు పట్టణాలుగా పట్టణాలు నగరాలుగా మారుతున్న పరిణామక్రమంలో ఆవాస భూములు అమ్మకపు సరుకై సంపదల అభివృద్ధిలో ఎలా భాగమవుతాయో విశదపరుస్తుంది. ‘‘ఇల్లు’’ (రాచకొండ విశ్వనాథశ్రాస్తి) నవల. ఇల్లు ఉనికికి ఆలంబన కాని వ్యాపార సంబంధాలు బలపడే క్రమంలో ఉనికికి సంబంధించిన అంశాలు సైతం ఆర్థిక విలువలుగా మారిపోయి లాభనష్టాల దోపిడి దురాగతాల పరిధిలోకి వెళ్ళిపోతాయని నిరూపించిన నవల.
వైద్య విజ్ఞాన రంగంలో జరుగుతున్న ప్రయోగాలు సంతానోత్పత్తి విషయంలో జన్యుశాస్త్ర విషయంలో ఇటీవల పరిశోధనలు ప్రాతిపదికగా చేసుకుని రాసిందే కె.కె.మీనన్ ‘‘క్రతువు’’. కృత్రిమ గర్భధారణకు ముందు, తరువాత, రమేష్ దంపతుల మానసిక మార్పులు ఈ నవల సహజంగా వర్ణించింది.
ధనకాంక్ష, భోగలాలసతనీ, స్త్రీ పొందుపొందేందుకు ప్రజల మూఢత్వాన్ని, బలహీనతల్ని, వాడుకునే వారు మన సమాజంలో ఇటీవల మరీ ఎక్కువయ్యారు.
ఈ క్రమంలో మనకు చాలా మంది బాబాలు స్వాములు అమ్మలు, యోగులు, అవతారాలు కనబడుతున్నారు. వీళ్ళు సాగించే చీకటి తప్పులను విశ్వమోహనరెడ్డి తన ‘‘నరబలి’’లో బట్టబయలు చేశాడు.
వృత్తి రీత్యా పాత్రికేయుడయిన కె.రామచంద్రమూర్తి అంతర్జాతీయ రాజకీయాలలో నాలుగు దశాబ్దాలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను పాత్రికేయ పద్ధతిలో సెప్టెంబరు 11, 2001 నేపథ్యంలో రాసిన నవల, ‘‘కాలమేఘం’’.
ఇంకా అమెరికిండియా సంస్కృతి మీద ‘‘నీళ్ళలో చంద్రుడు’’, కల్లుగీత కార్మికుల మీద ‘‘బతుకుతాడు’’, దళిత నేపథ్యంలో ‘‘అయిదు హింసలు’’. ‘‘దిక్కుమొక్కులేని జనం’’, ‘‘ఊర్మిళ’’, ‘‘ఆకాశంలో విభజన రేఖల్లేవు’’, మొదలయిన నవలలు వచ్చాయి. (నా దృష్టికి రాని మరికొన్ని మంచి నవలలు కూడా ఉండవచ్చు)
శిల్పం సంగతి కాస్తా పక్కన పెడితే తెలుగు నవల పుట్టిననాట ఇంతకు ముందులేని వస్తు వైవిధ్యం ఈ పది పదిహేనేళ్ళలో తెలుగు నవల సాధించిందని చెప్పవచ్చు. తమ దృక్పధానికి ప్రాంతీయ జీవిత చైతన్యాన్ని మాండలిక మాధుర్యాన్ని అనుసంధించి విజయవంతమయ్యారనీ చెప్పవచ్చు.
మునుపటి రచయితలు వెళ్ళని జీవిత పార్శ్వాలలోకి అనుభవ మూలాల్లోకి ఈనాటి రచయితలు వెళుతున్నారు. జీవితం మారుమూలల్లోకి కల్పనా సాహిత్యం చొచ్చుకు పోయినప్పుడు జీవితం మరింత విస్పష్టంగా అర్థమవుతుంది. జీవితం నుంచి పుట్టిన రచనకు మరింత సమగ్రత ఏర్పడుతుంది.
సాహిత్యం సమాజానికి ప్రతిబింబం కనుక రచనలన్నిటినీ వాటి సామాజిక అస్తిత్వాల నుంచి పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తరువాత ఆధునిక ఇతిహాసం, నవల, అన్నమాట బలపడింది.
సకల జీవన రంగాల్లోకి ప్రపంచీకరణ చొచ్చుకు వచ్చింది. పుష్కర కాలం నుంచి దాని దారుణ ఫలితాలను అనుభవిస్తున్నాం. సామాజిక సంబంధాలు, మానవీయ అంశాలు ఎలా దెబ్బతింటున్నాయో, మన జీవితాల్లోని సున్నితమైన అంశాల్లోకి సైతం ప్రపంచీకరణ ఎలా చొరబడిందో మనం ఏం కోల్పోయామో, కోల్పోనున్నామో చిత్రిస్తూ (కథ, కవిత వచ్చినప్పటికీ) బృహత్తర నవలలు రావలసి ఉంది. *