1991 – 2005 తెలుగు నవల – విస్తరించిన వివిధ కోణాలు

తెలంగాణా మాదిగ జీవితాన్ని చిత్రించిన (వేముల ఎల్లయ్య) నవల ‘‘కక్క’’ దళిత సాహిత్యోద్యమం, సామాజిక న్యాయం దిశగా, మళ్ళిన క్రమంలో కులవృత్తి నేపథ్యంలో (వీర) మాండలికంలో వచ్చిన నవల ఇది. పాలేరు జీవితంతో తృప్తిపడని ఓమాదిగ యువకుడు, కులవృత్తివేపు మళ్ళడం కథకు ఆయువుపట్టు. దళితుడి ఆత్మగౌరవానికిది నిక్కమైన నిదర్శనం.

‘‘సూర’’ (భూతల ముత్యాలు) నవలలో కూడా ఒక దళిత యువకుడి స్వీయాత్మక కథగా సాగుతుంది. వలసజీవిత విషాదం గురించి, అగ్రవర్ణాల వారి పెత్తనం గురించీ, ఆడవాళ్ళపై లైంగిక దాడుల గురించీ స్పృశించింది.

సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వస్తున్న మార్పుల్ని ‘‘మంచి నీళ్ళ బావి’’ (సదానంద శారద) కేంద్రంగా చిత్రిస్తూనే మొత్తం తెలంగాణా గ్రామీణ సమాజ పరిణామాలను పరిశీలించింది. తెలంగాణా గ్రామీణ సంస్కృతిని కళ్ళకు కట్టినట్టు వర్ణించడం ఈ నవల ప్రత్యేకత.

విద్యావంతుడైన ఒకమాదిగ యువకుడు, జీవితం పట్ల అతని చుట్టూ ఉన్న సామాజిక వ్యవస్థ పట,్ల మానవ సంబంధాల్లో డొల్లతనం వల్ల కలిగే మానసిక సంవేదన సంఘర్షణ ప్రతిరూపమే ‘‘వేర్లు’’ (కేతు విశ్వనాధరెడ్డి). ముప్పయ్యేళ్ళ క్రితం విద్యావంతుడైన ఒక దళితుడి అంతరంగానికి అద్దం ఈ నవల.

అయిదారు తరాలుగా వీధినాటకాలనే జీవనోపాధిగా జీవించిన ఒక కుటుంబం పడిన కష్టనష్టాల్ని వారు వేసుకున్న రంగుల వెనుక ఉన్న విషాదాన్ని బొమ్మట్టించారు ‘‘బతుకాట’’ నవలలో వి.ఆర్‌.రాసాని.

వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం ఈ మూడు కాలాల్లోనూ రజకులు వృత్తిపరంగా ప్రకృతితోనూ, అగ్రవర్ణాల వారితోనూ నిత్యఘర్షణ (జ.ఎన్‌.చలం) ‘‘రేవు’’ నవలలో చూడొచ్చు. ఇదే ఇతివృత్తంతో వచ్చిన (పి.నాసరయ్య) ‘‘ఉతికేసిన బతుకులు’’ నవలలో తండ్రీ కొడుకులిద్దరూ తోటి రజకుల్ని చైతన్యవంతుల్ని చెయ్యడం, అగ్రకులాల వారి ఆధిపత్యాన్ని ప్రశ్నించడం, ఇందులో కథ.

దళిత స్త్రీలను జోగినులుగా మార్చడం నుంచి, దళితులపై దాడులను ‘‘జగడం’’ నవలలో బోయ జంగయ్య చిత్రించారు. నవలంతా సామాజిక పరిస్థితుల చిత్రణే ప్రాధాన్యంగా సాగింది.

సంసారాలను కూల్చే సారాను నిషేధించాలనే డిమాండుతో సారాజులను, వారి మద్దతుదారులతో గద్దెనెక్కిన పాలకులను, గజగజ లాడించిన మహోజ్వల మహిళా ఉద్యమం సారా వ్యతిరేక ఉద్యమం. నాటి చారిత్రక సందర్భాన్ని రికార్డు చేసిన నవల (శక్తి) ‘‘పులిజూదం’’.

భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. కరువులొచ్చినా కాటకాలొచ్చినా లెక్కచెయ్యకుండా ఎనభై శాతం ప్రజలు గ్రామాలలో నివసిస్తున్నారు.

1990-91లో నూతన ఆర్థిక విధానాలద్వారా భారతదేశంలోకి ప్రవేశించిన ప్రపంచీకరణ, డబ్బుతో ముడిపడినా, ఉన్న వ్యవసాయక ఉత్పాదకాలన్నింటినీ బహుళజాతి సంస్థల ద్వారా నియంత్రించడం ప్రారంభించింది. ఇది ప్రత్యేకించి రైతు జీవితాన్ని, మొత్తంమీద గ్రామీణ జీవితాన్ని, తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది.

95లో గాట్‌ ఒప్పందం W.T.O. రూపంలో మన ముందుకు వచ్చింది (సభ్యత్వ హోదాలో మన దేశం కూడా ఉండడం గమనించదగ్గది). దీని ముఖ్య లక్ష్యం వ్యవసాయ రంగంలో మార్కెట్‌ దృక్పధాన్ని ప్రవేశపెట్టడం. వ్యవసాయం ఒక జీవనోపాధి మార్గంగా ఉన్న పరిస్థితి నుంచి అది ఒక లాభార్జన దృష్టిగల పారిశ్రామిక సంస్థగా అవతరించడానికి రంగం సిద్ధమైంది. ఆహార ఉత్పత్తుల స్థానాలలో, వాణిజ్య పంటలు ప్రవేశించాయి. మార్కెట్టులో వచ్చే ఒడిదుడుకులు, చాలా సందర్భాలలో, రైతు జీవితంలో కొత్త సమస్యలు తెచ్చిపెట్టాయి. సహకార రంగాల రద్దు, సబ్సిడీల కోత, వ్యవసాయేతర రంగాలలో ఉపాధి లేకపోవడం, మొత్తంగా ఈ సంక్షోభానికి పరాకాష్ట. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి దారితీసింది.

ఛిన్నాభిన్నమయిన గ్రామీణ వ్యవస్థని చిత్రించే సాహిత్యం తెలుగులో వివిధ ప్రక్రియల్లో వచ్చినప్పటికీ, ఈ సద్యస్పృహతో అయినా కాకపోయినా, రైతు జీవితాన్ని గురించి, కొద్దో గొప్పో నవలలు కూడా వచ్చాయి.

భూమికి, రైతుకి ఉన్న సంబంధం తల్లీబిడ్డల సంబంధం. పండినా పండకపోయినా, చివరకు అడుక్కుతినే పరిస్థితి దాపురించినా, భూమిని అమ్ముకోడానికి మాత్రం ఇష్టపడడు. కానీ మారుతున్న సామాజిక వ్యవస్థలో భూమిని బేరంపెట్టడం అనివార్యమవుతుంది. పిల్లల్ని చదివించాలన్నా, వివాహాలు జరిపించాలన్నా రైతుకున్న ఆధారం అదొక్కటే (కాలువ మల్లయ్య), ‘‘భూమిపుత్రుడు’’ నవలలో కొండ మల్లయ్య పరిస్థితి కూడా అంతే. భూమిని తప్పని సరై అమ్ముకుని పట్నానికి వలసపోతాడు. ఇది వాస్తవ చిత్రణ.

‘‘మూగవాని పిల్లనగ్రోవి’’ (డా॥ కేశవరెడ్డి) నవలలో కూడా భూమితో రైతుకున్న సంబంధం అన్యోన్యత ఎంత గాఢమైందో, ఎడబాటు రైతు అస్తిత్వాన్ని ఎంతగా కుంగదీస్తుందో, జానపదుల విశ్వాసాల నేపథ్యంలో బలమైన, గాఢమైన, తాత్విక పునాదితో చర్చించారు.

అప్పు కింద తన భూమిని మణియం చేజిక్కించుకున్న తరువాత, బక్కరెడ్డి తనిక కాపోడిని, కానంటాడు. ఆ అర్హత లేదంటాడు. మిత్రుడు మాత్రం కాపు కులంలో పుట్టినోడివి కాపోడివి కాకుండా ఎలా పోతావంటాడు.

‘రౌడి’ నవలని దళిత నవలల్లో చేర్చినప్పటికీ, రైతు జీవితానికి సంబంధించిన అనేక అంశాలను కూడా స్పృశించింది. అసలు ఈ నవల ఏ రకమయిన వింగడింపుకీ లొంగనిది. పాలేర్లు ఉన్నవాళ్ళు కాడిని చేపట్టే స్థాయికి ఎదగడం, వ్యాపార సంస్కృతి కారణంగా అగ్రవర్ణాల వారు ఎందుకు వదులుకున్నారో అదే వాడిని ‘సొంతం’గా చేపట్టడానికి దళితులు ఎందుకు ఆరాటపడవలసి వచ్చిందో అద్భుతంగా చిత్రించింది.