ఒక జీవితం – రెండు దృశ్యాలు

ఏదో ఒకరోజు
సిద్ధంగా ఉన్నా లేకున్నా
అనంతమనుకున్నవన్నీ
అంతమవుతూనే ఉన్నాయి

అంతలోనే వాటికి-

రోజూ చూస్తున్న
ఉదయాలు సాయంత్రాలు
గంటలు, ఘడియలు
శక్తీ, కీర్తి
అన్నీ నిరర్థకాలవుతున్నాయి

కోపాలు తాపాలు
ఈర్ష్యాద్వేషాలు
నిరాశ నిస్పృహలు
అన్నీ మాయమవుతున్నాయి

అందం ఆనందం
అదృష్టం వివేకం
ఏవీ పనికిరాకుండా పోతున్నాయి

ఆడామగా
మనిషా పశువా
నలుపా తెలుపా
వేటికీ విలువ లేకుండా పోతున్నాయి

అవశేషాల వెదుకులాటా మొదలయిపోతుంది-

ఏమి తెచ్చారని కాదు, ఏమి చేశారని
ఏమి ఉన్నదని కాదు, ఏమి ఇచ్చారని
ఏమి నేర్చుకున్నారని కాదు, ఏమి నేర్పారని
యోగ్యత కాదు, నడత ఏమి మిగిల్చిందని

ప్రేమించినవారిలో వారి జ్ఞాపకాలు
సజీవంగా ఎన్నాళ్ళు ఉన్నాయన్నదే
వారి జీవిత కాలాన్ని నిర్ణయిస్తోంది

జీవితం ఇంతకీ
ప్రమాదమా, ప్రయాణమా?
ఏమీ ఎరగనిదా ఎగిరిపోయేదా?
ఏమో

ఏదో ఒకరోజు
ఉన్నట్టుండి దృశ్యమే మారిపోతుంది

(19 మార్చి 2013న స్వర్గస్థులైన సి. ధర్మారావుగారికి నివాళిగా…)