శరీరంబుట్ట

పుట్టుకనుంచీ శరీరాన్ని
సమయపు తూకపురాళ్ళతో
కొలుస్తూనే ఉంది జీవితం

ఎన్ని రాత్రుళ్ళు లెక్కిస్తున్నా
నక్షత్రాల లెక్క తేలనట్టు
సుదూరం

ఎంతగానో ఎరిగిన దారులు
మారిపోతునే ఉన్నాయి
ఇళ్ళూ ఎదిగిపోతున్నాయి
వాటి దుస్తులూ మారిపోతున్నాయి

శరీరంబుట్టలో
మళ్ళీ తిరిగిరాని
పుట్టిన రోజులు
నిండుతూనే ఉన్నాయి
ఇంకెంత ఖాళీ ఉందో
ఎవరికి తెలుసు

జీవితపు ఆశ్చర్యాల్ని చూస్తూ
ప్రతీ పుట్టిన రోజూ
ఎన్నిసార్లు కొత్తగా పుడుతున్నా
సంవత్సరపు రాళ్ళని
దాటుతున్న జీవితం
దగ్గరవుతున్న గమ్యానికి
ఎంత దగ్గరో
ఎంత దూరమో