నిద్రపట్టని రాత్రి నిమిషాలు దొర్లిపోతున్నాయి
కిటికీ మీద నెమ్మదిగా జారుతున్న మంచుతునకల్లా
మనసు పలకమీద సగం తుడిచిన జ్ఞాపకాలు వేధిస్తున్నాయి
సైనికుడి మొండిచేతి అంచున సలపరిస్తున్న దురదలా
మనసు రెటీనా మీద రికార్డు చేసుకున్న కవితలని
బతుకు బండి చారికలు కనుమరుగు చేస్తున్నాయి
తోట మొక్కలని కప్పేస్తున్న మంచుముద్దల్లా
మనమల్లుకున్న జాలంలో మనమే చిక్కుకుంటుంటాం
బతుకుచెట్టు అంచు వరకూ పెంకితీగెలా ఎగబాకుతూ
బతుకులోని ఆహ్లాదాలని జేబులోంచి జార్చుకుంటుంటాం
వలసదేశపు తొడతొక్కిడి తొందరలో తలమునకలవుతుంటాం!
యంత్రాలయ దినచర్యలో యంత్రలయనలవర్చుకుంటాం
సంధ్య నుంచి సంధ్య దాకా కాలసముద్రంలో ప్రయాణం
ఆటో పైలట్ మీద కొనసాగిస్తుంటాం
పాతికేళ్ళలో పాతిక దేశాలు తిరిగిన సంబరంలో
పాతిక రోజులు కూడా పిల్లలతో గడపలేదని మర్చిపోతాం
యంత్రలయని భగ్నం చేస్తూ ఎప్పుడయినా ఒక పలకరింపు
గుండ తలుపు తడుతుంటే చెవులు మూసుకుంటుంటాం
తీరికలేమి సాకు చెప్పి వాయిదాలు వేస్తుంటాం
బతుకు యంత్రం ఉరవడిలో వెనకబడిన పనుల జాబితా
వారమంతా పెరుగుతూనే ఉంటుంది
వారాంతం కోసం వారమంతా చకోరాల్లా ఎదురుచూస్తుంటుంటాం
తీరా వచ్చేసరికి ఏదీ మన చేతిలో ఉండదు
పూర్తిచేసిన పనుల జాబితా ఖాళీగానే మిగిలిపోతుంది
వాన వెలిసి తెల్లవారి నిద్రరాని కళ్ళల్లో సూర్యకాంతి గుచ్చుకుంటుంది
మనసు పలకమీది జ్ఞాపకాలని తిరిగి దిద్దుకోవాలని
అనుభూతుల ఆనవాళ్ళని భద్రంగా దాచుకోవాలని
గుండె చప్పుళ్ళు శ్రుతిచేస్తూ బతుకులయని మార్చాలని
రాత్రి చేసిన తీర్మానాలని న్యూస్‌పేపర్తో బాటు మడిచిపెట్టి
బ్రీఫ్‌కేస్‌లో దాచుకుని బతుకు యంత్రాన్ని తిరిగి మొదలెడుతుంటాం
వచ్చే వారాంతం వరకూ షరా మామూలే