ఎర్న్‌స్ట్ హెమింగ్‌వే (Ernest Hemingway) వ్రాసిన ఫ్రాన్సిస్ మెకాంబర్ స్వల్పకాలిక సంతోష జీవితం (The Short Happy Life of Francis Macomber) కథను సమీక్షించే ముందు క్లుప్తంగా పరిచయం చేస్తాను.
ఫ్రాన్సిస్ మెకాంబర్ చాలా స్థితిమంతుడు. వేటలో అభిరుచి. ఎత్తైన వెడల్పైన భుజాల అందగాడు. ఇతనికి చాలా అందమైన భార్య. కథలో ఒకసారి ఆమెను భర్త పిలిచినపుడు, ఆమె పేరు మార్గరెట్ అని తెలుస్తుంది. ఆమె ఆమధ్యే తను ఎప్పుడూ వాడి ఎరగని ఒక సౌందర్య సాధనాసామగ్రికి ప్రతినిధిగా కనిపించినందుకు ఆ కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో పారితోషికం అందుకుంది. అంత సౌందర్యం, దానికి తగ్గ ప్రతిష్ట ఉన్నవి ఆమెకు.
ప్రస్తుతం కొన్నిరోజుల వేట వినోదార్థం ఫ్రాన్సిస్ భార్యతో కలిసి ఆఫ్రికా అడవులకు వచ్చాడు. అక్కడ విల్సన్ అనే అతను వేటను ఆర్గనైజ్ చేసి గైడ్ చేసే ఆ ప్రాంతపువాడు. గట్టిగా దిట్టంగా శరీరం, ఎర్రటి ముఖం ఉన్నవాడు. బలాఢ్యుడు. కళ్ళను మాత్రం ఏ భావం పలకనివ్వని జాగ్రత్తపరుడు. సింహాలు, పులులు, భీకరమైన అడవి దున్నపోతులతో పాటు వాటిని వేటాడుతాం అంటూ వచ్చే పురుషులను, వాళ్ళ స్త్రీలను, ముఖ్యంగా అమెరికా ఆడవాళ్ళను ‘ప్రపంచంలోకే అతి కఠినమైన, క్రూరమైన, ప్రమాదకరమైన, మగవాణ్ణి సాంతం కొల్లగొట్టగల అందం తమ సొత్తైన జాతి’గా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నవాడు, పై వాటిల్లో దేన్నైనా హతం చేయగల వేటగాడు.
మొదటి రోజు వేటలో కార్యక్రమం, సింహాన్ని వేటాడటం. తీరా సింహాన్ని చూశాక భయపడిపోయిన ఫ్రాన్సిస్ ఆ మృగం పైకి అస్తవ్యస్తంగా తుపాకీ పేల్చి, దెబ్బతిన్న కోపంతో ఆ సింహం ఎక్కడ తన మీదకు వస్తుందో అన్న పిరికితనం పూని పిచ్చివాడిలా అక్కడనుంచి పారిపోయి ఇవతలకు వచ్చి పడిపోతాడు. విల్సన్ ఒక్క తూటాతో ఆ సింహాన్ని నేలకరిపిస్తాడు. వేట బృందంలో పనివాళ్ళు ఫ్రాన్సిస్ చేతకానితనాన్ని ఏవగింపుగా చూస్తారు. ఒక్క దెబ్బతో పడిపోయే సింహం అందం చూడటం ఇష్టం వాళ్ళకు. ఇప్పుడది నానా చోట్ల తూటాల దెబ్బలు తగిలి శరీరం అంతా చిట్లి వికారమైన కళేబరం. మనుషులు అతన్ని మోసుకొచ్చి టెంట్‌లో దించుతారు. తన చేతిలో చావని సింహం తాలూకు దెబ్బతిన్న ఉగ్రపు చూపు, పనివాళ్ళ కళ్ళల్లో దాగని అపహాస్యం, ఒక్క దెబ్బతో సింహాన్ని పేల్చేసి తనని కాపాడిన విల్సన్ అభావమైన చూపులూ ఫ్రాన్సిస్‌ను ఇంకా వణికిస్తున్నాయి.
అక్కడ ఏమీ జరగనట్టే ఉండటానికి అందరూ ప్రయత్నిస్తున్నా, ఏ నిమిషమైనా అతని భార్య అనే అగ్ని పర్వతం పేలవచ్చు. భర్త పిరికిచేష్టకు దెబ్బతిన్న పులిలా ఉంటుంది ఆమె. భర్త మీది తన కసిని అంతా విల్సన్‌ను ‘స్వీట్ రెడ్ ఫేస్‌డ్ విల్సన్’ అని మురిపెంగా పిలిచి తీర్చుకుంటుంది. అంతేనా! ఆ రాత్రి అతని టెంట్‌కి వెళ్ళి వస్తుంది. నిలదీసిన భర్తను ‘నన్నేం చెయ్యలేవు నీవు పిరికివాడివి’ అని రెచ్చగొడుతుంది. అతను ఏమీ చెయ్యడు. ఆమె ప్రవర్తనను గురించి ఏమీ చెయ్యలేడు. తన ఆస్తి ఆమెను తనతో ఉండేట్టు చేస్తున్న ఏకైక కారణం అని అతను అనుకుంటున్నాడు. తనకన్నా వయసులో చిన్నది అందమైనది ఈ తెగింపు లేనివాడికి దొరకదు కాబట్టి వీడు తనను వదిలిపోడు అని ఆమె అనుకుంటుంది.
మరుసటిరోజు అడవి దున్నను వేటాడాలి. భార్యను ‘వేటకు రావద్దు, టెంట్‌లోనే ఉండు’ అంటాడు. ‘వచ్చి తీరతాను, ఇవాళ్టి లాంటి దృశ్యం రేపు కూడా నేను చూడాలి’ అంటుందామె. ఆమె కచ్చితంగా అనుకుంటుంది ఫ్రాన్సిస్ రేపు కూడా వేటలో ఓడిపోతాడు అని.
కానీ మరుసటి రోజు మొదట కొంచెం తడబడ్డా, ఒక్కొకటీ మూడు మృగాల పెట్టు ఉన్న మూడు అడవి దున్నపోతులను వేటాడి మట్టి కరిపిస్తాడు ఫ్రాన్సిస్. ఆ అడవి జంతువును చంపే ముందు నేరుగా దాని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మరీ తుపాకీ పేలుస్తాడు. విల్సన్ మెచ్చుకోలుగా చూస్తాడు. నిజంగానే మెచ్చుకుంటాడు. ఈ లోపల వెనక నుంచి జీప్‌లో కూర్చుని ఉన్న మార్గరెట్, ఫ్రాన్సిస్ తలలోకి తుపాకీ పేలుస్తుంది. ఆమె గురి తప్పదు. అంత పెద్ద అడవి దున్నపోతును అద్భుతంగా వేటాడాను అనే గర్వపు మెరుపు కళ్ళల్లో ఉండటం తెలుస్తున్న క్షణంలోనే మట్టికరుస్తాడు.
‘I just started liking your husband, a truly nice fellow’ అంటాడు విల్సన్ మార్గరెట్‌తో. ఆమె చేసింది హత్య అని అతనికి తెలుసు, అది పొరపాటున పేలిన తుపాకీ కాదు, గురి తప్పని తూటా అని కొమ్ముల తిరిగిన ఆ వేటగాడికి తెలుసని ఆమెకు తెలుసు! తన నేరం విల్సన్ బయటపెట్టడనీ ఆమెకు తెలుసు. చట్టపరంగా అనుమతి లేని పద్ధతులలో వేట జరిపిస్తాడని ఆమెకు తెలుసని అతడికి తెలుసు కాబట్టి.
ఇదీ కథ.
కథ మొత్తం ఒక్క ఇరవైనాలుగు గంటల కాలం, క్రితం మధ్యాహ్నం ఫ్రాన్సిస్ ఓటమితో మొదలైన కథ ఈ మధ్యాహ్నం అతని సాహసం, వెంటనే చావుతో ముగుస్తుంది. పాత్రలు మూడు. ప్రాంతం వేటాడడానికి అనువుగా సమృద్ధిగా జంతువులు ఉన్న ఆఫ్రికా అడవి.
ఆ వేట కథ ప్రాన్సిస్ పరాజయం తాలూకు వ్యాకులతతో ఉద్రిక్తంగా మొదలై అతని గొప్ప సంతోషంలో ముగుస్తుంది.
కథలో జరిగిన వాటి వెనక కారణాలు ఏమీ కొత్తవి కాదు. మురిగిపోయేంత డబ్బు, చెయ్యడానికి ఏ పనీ లేని విలాసవంతమైన జీవితాన్ని ఉదాసీనంగా ఈడుస్తున్న దంపతులు ఫ్రాన్సిస్, మార్గరెట్. వాళ్ళు ఇంకా భార్యాభర్తలనే హోదా పరస్పరం ఇచ్చుకుంటున్న కారణం, ఎదుటి వాళ్ళ బలహీనతలలో వీళ్ళ బలాన్ని చూసుకోగలగటం చేతనే.
ప్రస్తుత కథలో ఫ్రాన్సిస్ భార్య మార్గరెట్‌కు పరపురుషులవైపు ఆకర్షితురాలవడం మామూలే. అతనికీ అది తెలుసు. ఏమీ చెయ్యలేని పిరికితనం, పరువు కోసం అయినా భార్యతో కలిసి ఉండవలసిన అవసరం. ఆమెకు ఇతని హోదా సంపదలతోపాటు, కాస్తో కూస్తో పిరికితనం కూడా ఒక భర్తకు ఉండవలసిన అర్హతే. ఫ్రాన్సిస్‌కు ధైర్యం రాగానే అతణ్ణి ఆమె ఏం చేసిందో వేట గాని వేటలో చూశాం కదా.
భర్త పిరికివాడైతే భార్యకు పెద్ద తలవంపులు నలుగురిలో. సాహసి అయితే పలు తలనెప్పులు! గొప్ప అభద్రతాభావం వచ్చి చేరుతుంది. తనకు ఇంట్లో అధికార చ్యుతి జరుగుతుందనో, అసలు తన స్థానానికే ముప్పు రావచ్చనో, అతను వేరే స్త్రీని తెచ్చుకునే సాహసం చేస్తే తన గతి ఏంటీ అనో. మార్గరెట్‌ది విచిత్రమైన సమస్య.
బహుశా కాదేమో!
హెమింగ్‌వే ఇంకో కథ ఇండియన్ కాంప్‌లో (Indian Camp) నిక్ అనే కుర్రవాడికి చావు పుట్టుకల తాలూకు ప్రత్యక్ష దర్శనం అవుతుంది. ఆ కథలోనే ఆ చిన్న పిల్లవాడిలో మరో విజ్ఞానం ఉదయిస్తుంది, వాళ్ళ నాన్నతో జరిగిన సంభాషణలో, తను చెప్పించుకున్న సమాధానాలలో. అవును, సాధారణంగా మనుషులు తమకు కావలసిన జవాబులు రాబట్టగల ప్రశ్నలను మలుస్తారు. వాళ్ళ నాన్న వైద్యసహాయం చెయ్యడానికి వెళ్ళిన గిరిజనుల గుడిసెలో ఒక స్త్రీ ప్రసవిస్తుంది, ఆమె భర్త ఆత్మహత్య చేసుకుని మరణిస్తాడు. ఒకే క్షణంలో రెండూ.
“అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు నాన్నా?”
“తెలీదు నిక్. బహుశా ఏవో విషయాలకు తట్టుకోలేక పోయుంటాడు.”
“నాన్నా, చాలామంది మగవాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారా?”
“చాలా మంది కాదు.”
“ఆడవాళ్ళు?”
“ఉహూ, సాధారణంగా చేసుకోరు.”
ఈ మొత్తం ప్రహసనంలో ‘మగవాడికి తట్టుకోలేని పరిస్థితులు ఉంటాయని, మగవాళ్ళు ఎందరో కొందరైనా ఆత్మహత్య చేసుకుంటారని, ఆడవాళ్ళ విషయంలో అది అరుదు’ అనీ మనసులో ఒక ముద్ర పడుతుంది చిన్న పిల్లవాడైన నిక్‌కు.
అదేరకంగా ఒక ప్రేమ వైఫల్యం, వివాహాలు, విడాకులు ఇంకొన్ని చేదు అనుభవాలు హెమింగ్‌వేని స్త్రీ ద్వేషిని కాకపోయినా ఆడవారంటే చాలామటుకు సదభిప్రాయం లేనివాడిని చేశాయి. లేదూ, అతనికి ఎదురుపడ్డ చాలామంది ఆడవారు అటువంటివారో మరి! స్త్రీ ప్రేమ అవసరం తనకు తెలుసు. ‘ప్రేమలో ఉన్నప్పుడు సాహిత్యరచన చాలా చక్కగా తిన్నగా జరుగుతుంది’ అంటాడు హెమింగ్‌వే ఒక ఇంటర్‌వ్యూలో. కానీ తనే అంటాడు మరోచోట: ‘ఒంటరిగా వదిలేస్తే హాయిగా వ్రాసుకుంటాను.’ ఈ ద్వైధము మానవ లక్షణం.
హెమింగ్‌వే కథల నేపథ్యం ప్రపంచ యుద్ధాల తరువాత జీవితాల్లో ఏర్పడిన నిర్లిప్తత, నైరాశ్యం, క్రియావిహీనత, అయాచిత సుఖజీవనాభిలాష, వస్తువినియోగ సంస్కృతిని పూర్తిగా ఆలింగనం చేసుకున్న జనాల పటాటోప జీవన విధానం. నిరాసక్తత ఆవరించిన మనిషి మనసు.
రోజూవారి యాంత్రిక జీవితాన్ని, సుఖాలను దాటి మరో ఊహ కూడా చేయలేని నిర్వ్యాపార స్థితిలో చతికిలబడ్డ మనిషి మెదడు.
మరో చోట ప్రయోజనకరంగా తన మేధను, శక్తినీ వాడుకోలేని వేళల్లో మనిషికి వినోదం వేట.
వేట కొందరికి వారి లోపలి భయాన్ని చంపుకోవడానికి పనికొస్తే, కొందరికి ఎవరో ఒకర్ని చంపాలనే కసిని చంపడానికి పనికొస్తుంది.
ఉన్న మూడు పాత్రల్లో ఇద్దరు మగవాళ్ళను మనం మార్గరెట్ కళ్ళతో, భార్యా భర్తలను ఆ వృత్తివేటగాడు విల్సన్ కళ్ళతోటి చూస్తాము.
‘వేటలో పారిపోవడం కంటే ఆ విషయాన్ని పదేపదే తల్చుకుని కుళ్ళడం, తనకు సాయం చేసి ప్రాణాలు కాపాడినవాణ్ణి ఈ విషయం ఎక్కడా చెప్పవద్దు అని హెచ్చరించడం అసలు భీరుత్వ లక్షణం’ అనే విల్సన్ మాటల్లో రచయిత స్వరం కలుస్తుంది.
అలాగే మార్గరెట్‌ను చూస్తూ ‘అమ్మో! ఈమె భయంకరమైన ఆడది’ అనుకున్నప్పుడు కూడా.
నిజానికి ఈ కథలో ఇద్దరు మగవాళ్ళూ హెమింగ్‌వే రెండు రూపాలు. ఏ మాత్రం అడవి జంతువుకు బెదరని, స్త్రీని నిక్కచ్చిగా అంచనా వేయగల విల్సన్‌లో ఒక హెమింగ్‌వే ఉంటాడు. మృత్యుభయం వదలనివాడు, క్షణక్షణం తన స్త్రీ ముఖకవళికలను గమనిస్తుండే బలహీనుడు, భార్య ఎంత ప్రమాదకరురాలో తెలిసీ ఆమె లేనిది తనకు జీవితం లేదని అనుకునే నిస్సహాయుడు ఫ్రాన్సిస్ లోనూ రచయిత పూర్వానుభవాల ఛాయలు లేకపోలేదు.
ఇంత నేపథ్యం, ఇన్ని రకాల మనోవైచిత్ర్యాలు, ఇరవై నాలుగు గంటల ఆలుమగల తీవ్ర సంఘర్షణ, వారి నడవడికలు, చివరకు దిగ్భ్రమ కలిగించే ముగింపు… వీటన్నింటినీ గట్టిగా నాలుగు పేజీలు కూడా లేని నిడివితో నడిపాడు అక్షరాల పొదుపులో ఉండే మహత్వం తెలిసిన హెమింగ్‌వే.
రచయిత ఒక వాహిక వంటివాడు. తనకు తారసపడిన అనుభవాలు తనకు కలుగజేసే ప్రత్యక్ష జ్ఞానంతోను, సంవేదనలతోను నిండిన అతడు ఒక కొత్త మనిషి అవుతాడు వ్రాతపనికి కూచునే ప్రతిసారీ. రసవాది కానిదే రచయిత కాలేరు. సీసం రసవాది చేతిలో స్వర్ణం అవగలదో లేదో, మామూలు అనుభవాలు కూడా గొప్ప కథలవుతాయి రచయిత చేతిలో. హెమింగ్‌వే తన భయ స్వరూపాలను ముఖాముఖి చూసి వాటిని నిలువరించేందుకు రచనాప్రక్రియను ఎన్నుకున్నాడు. ఆ క్రమంలో తనను తాను కనుక్కున్నాడు, అద్భుత సాహిత్యసృష్టి తన చేతిలో జరగడం కనుగొన్నాడు.
పోరాడి గెల్చుకున్న జీవితం రుచి తెలిసినవాడు, ఈ ప్రపంచం లోంచి తన నిష్క్రమణను అంగీకరించలేడు. సాహిత్య సృష్టి రుచి మరిగినవాడు హెమింగ్‌వే. పోరు ఆపివేయడం, ఓడిపోవడం అతని హీరోల అభిమతం కానివ్వలేదు వారి సృష్టికర్త.
“The world is a fine place and worth fighting for and I hate very much to leave it.” అంటాడు ఫ్రాన్సిస్. ఒకవేళ జీవితాన్నీ కోల్పోవలసే వస్తే, అది తన భయాలను జయించిన క్షణం తర్వాతనే. ఫ్రాన్సిస్ మెకాంబర్‌కు తను కొంతే అయినా, కొద్దిసేపే అయినా గెలిచానన్న తృప్తిని అనుభవిస్తున్న ఆ సంతోషపు క్షణాల్లో చచ్చిపోవడమే వీరస్వర్గం. ఈ సంతోషంలో భార్య క్రూరత్వపు పూర్తి స్వరూపం తెలియకపోవడమనే మంచి విషయానికీ భాగం ఉంది.
ఫ్రాన్సిస్ జీవించినంతకాలం చేజిక్కించుకోలేని ‘భయాన్ని గెలిచానన్న సంతోషం’ అతనికి చివరి క్షణాల్లో దొరికిందా?
ధైర్యం ముందే వచ్చుంటే అతని ముగింపూ అప్పుడే వచ్చేదా?!
మనిషి అభద్రతే అతడు వేటాడేటట్లు చేస్తుంది.
బయట వేట ఏమో గాని, వేట కథా రచనను హెమింగ్‌వేకు సాటి రాగల దక్షతతో నెరపిన రచయితలు అరుదు. చిత్తడి చిత్తడిగా కాకుండా, తూటాలు దుబారా చేయకుండా తలలోకి ఒక్క తూటా పేల్చి మృగాన్ని కూల్చేటటువంటి కౌశల్యమే ఈ రచయితది కథను వ్రాయడంలో కూడా.