శాన్ డియేగో కొండల్లో…

సాయంత్రానికి
నేనే కాదు
మా మనుమడూ
ఎదురు చూస్తుంటాడు
కొండలూ లోయల వెనక
అందమైన ముగింపు కోసం

దాచబడుతున్న వెలుగులో
ఆకాశానికి అనేక రంగులు పులుముతూ
రక్తమోడుతూ జారిపోతుంటాడు సూర్యుడు

గాలిని బాదుకుంటూ
నమ్మకంతోనో అపనమ్మకంతోనో
తిరుగు ప్రయాణంలో
పక్షులు

గాలి చెవులకు అల్లల్లాడుతూ
వేలాడుతున్న ఆకులు
గూనిగా మారిన ఆకాశం ఒడినిండా
బయటపడుతున్న నక్షత్ర విత్తనాలు

రోజూ సూర్యుడు ఎక్కడికి పోతుంటాడని
అడుగుతాడు మనుమడు
నీకూ నాకూ తాతలకు తాతే అతను
చూసుకుందుకు మనకు ఒక ఇల్లే
అతనికి ఎన్ని ఇళ్ళో
నువ్వు లేచేసరికే వచ్చేస్తాడు కదా
అని సర్ది చెబుతాను

రేపటి వరకూనా అని
మనుమడి మొహంలో దిగులు
ఈరోజు ముగిసినా
రేపు చూడొచ్చన్న ఆశ
మెరుస్తున్న వాడి
కళ్ళల్లో కనిపిస్తూనే ఉంటాయి
ప్రతీ రోజూ


వై. ముకుంద రామారావు

రచయిత వై. ముకుంద రామారావు గురించి:

9 స్వీయ కవిత్వ సంకలనాలు, 14 అనువాద గ్రంథాలు, ఆంగ్లం కన్నడంలో నా కవిత్వ అనువాద పుస్తకాలు, మరో 5 ఇతరాలు వచ్చాయి. తెలుగు విశ్వవిద్యాలయం నుండి కీర్తి పురస్కారం-సాహితీ పురస్కారం, తాపీ ధర్మారావు పురస్కారం, అజో-విభో-కందాళం ఫౌండేషన్ వారి ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం మొదలైన అవార్డులు వచ్చాయి. ఆంగ్లం, పోలిష్, హిందీ, ఉర్దూ, బెంగాలీ, కన్నడం, తమిళం, మలయాళం, ఒడియా, సంతాలీ, మరాఠీల్లోకి ఎన్నో కవితల అనువాదాలు వచ్చాయి.

 ...