రచయిత వివరాలు

మానస చామర్తి

పూర్తిపేరు: మానస చామర్తి
ఇతరపేర్లు:
సొంత ఊరు: విజయవాడ
ప్రస్తుత నివాసం: బెంగళూరు
వృత్తి:
ఇష్టమైన రచయితలు: బైరాగి, తిలక్, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, ఇస్మాయిల్, కృష్ణశాస్త్రి, మో, అజంతా.
హాబీలు: కవిత్వం, వాద్య సంగీతం.
సొంత వెబ్ సైటు: http://www.madhumanasam.in/
రచయిత గురించి: ఇంజనీరింగ్ (కంప్యూటర్స్) 2005లో పూర్తి చేసి ఐ.టి. రంగంలో ఉద్యోగం. ప్రస్తుత నివాసం బెంగలూరు. మధుమానసం అన్న బ్లాగ్ ఉంది వీరికి. అలతి అలతి పదాలతో లోతైన కవిత చెప్పగల వీరు కవిత్వంలోను, సాహిత్యవిమర్శలోను తనదైన గొంతు వినిపిస్తున్నారు.

 

‘మమ మాయా దురత్యయా’ అంటుంది గీత. మాయను అధిగమించడం తేలిక కాదు. అధిగమించామని అనుకున్నది కూడా నిజమో కాదో ఆఖరు క్షణం దాకా తెలిసే వీలూ లేదు. జీవితానికి కావలసినది నిత్య చింతన. బ్రతుకులోని లేతకాంతిని ఏ చీకట్లూ కమ్ముకోకుండా చూసుకోవలసిన వివేచన.

మీరలేని జీవన వాస్తవంలా
తీరం మీద రెపరెపలాడే
ప్రమాదసూచికలు

ఇసుక బొరియల్లోకి దూరాలని
వంకరకాళ్ళతో పరుగెట్టే
ఎండ్రకాయలు

సాహిత్య వాతావరణంలో స్తబ్దత అన్న పదానికి అర్థం, కొత్త రచనలు రావడం లేదని మాత్రమే కాదు, వచ్చిన రచనల్లో కొత్తదనం లేదని కూడా. దానిని చెదరగొట్టడానికి మనకున్న వాతావరణమే మారాలి. అది అంత తేలిగ్గా జరిగే పని కాదు. అయితే, వచ్చే ప్రతి రచనా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మరో సృజనకు ప్రేరణ నిస్తుంది.

బాహ్య ప్రపంచపు పోకడల ప్రేరణలతో ఉత్పన్నమవుతోన్న తనకాలపు కవిత్వ ఋతువులను గమనిస్తూ, ఆ గొంతుల్లోని ‘ఆధునికత’ను జాగ్రత్తగా జల్లెడ పట్టిన సునిశిత దృష్టి ఇంద్రగంటిది. వస్తువూ, వాదమూ ఏదైనా, మనోధర్మమే ఏ కళకైనా శోభనిస్తుందనీ, అది ఎంత గొప్పదైతే కళ అంతలా రాణిస్తుందనీ నమ్మిన కవి ఇంద్రగంటి. ఆయన ఈ భావాలను ఎంతలా నమ్మారో, అంతలా పునరుద్ఘాటిస్తూ వచ్చారు.

ఒక పాట నుండి
ఇంకో పాటలోకి
ఇంకో కాలంలోకి…

తొలిస్పర్శ, తొలిముద్దు,
తొలి తొలి సుఖాల క్షణాల దాటి దాటి
ఎక్కడున్నావిప్పుడు?

నీడలు ముసిరేదీ, చెదిరేదీ
అన్నీ చూసిన ఆకాశానికి తెలుసా?

బ్యాగ్‌ల నిండా తడిబట్టలు. దులుపుతుంటే రాలిపడుతోన్న ఇసుక. తప్పుకుంటుంటే చుట్టుకుంటోన్న సముద్రపు నీటి వాసన, నీచు వాసన. తీరంలో నా పాదాలను తడిపినట్టే తడిపి వెనక్కి పోయిన అలల్లా… సెలవులు. దేవుడా, మళ్ళీ ఎప్పుడు?

ఆగి నిలబడి చూసినా
నాది కాదనే అనిపించే లోకం.
దిగులు బుడగకు బయటే స్థిరపడి
అనుభవానికి రాని సౌందర్యం.
ఘడియఘడియకీ సముద్రాలు దాటి వెళ్ళే
పక్షిరెక్కలతో మనసు.

రోజు రోజూ నేనేం లెక్కపెట్టుకోను
మారే ఋతువుల నసలు పట్టించుకోను

ఉన్నదొక్కటే దేహం
మనసుకొక్కటే పంతం

విమర్శ అంటే ఒక సృజన యొక్క విశ్లేషణాత్మక పరిశీలన అని నిర్వచించుకుందాం. సృజన అంటే ఏమిటి? తన అనుభూతులకు, అనుభవాలకు, ఆలోచనలకు, ఒక కళాకారుడు ఇచ్చే రూపం సృజన. ఇది ఎన్నో లలిత కళారూపాల్లో ప్రకటితమవుతుంది. ఇప్పుడు మనముందున్న మొదటి ప్రశ్న: సాహిత్యాన్ని ఎలా పరిశీలించాలి? ఎలా అర్థం చేసుకోవాలి?

కవి పదాల ఎంపిక కూడా స్పష్టమైనది. అందుకే, ‘గతాన్ని వెలిగించి గట్టిగా పీల్చాను’ అనడం ద్వారా, దిగులు పడడమనేది తనకొక వ్యసన ప్రవృత్తిగా మారిందని చెబుతున్నాడు. ఆ దుఃఖం వదిలించుకునే అవకాశం ఉండి ఉండవచ్చు గాక- దానినితడు వాడుకోలేడు. ప్రతిగా అతడేమి మూల్యం చెల్లించాల్సొస్తుందో కూడా తెలుసు.

పట్టుకోవాలని తపించి తపించి
ఘడియలుగా దహించుకుపోయిన
రాత్రిని లాలించి తప్పించి
సూరీడు నేలను ముద్దాడకుండా ఆపాలని
పైన్ చెట్ల నీడలు వెర్రెత్తినట్టు ఊగే
తోటల్లో చేరి, చీకట్లో, రెండు దీపాల్తో…

సౌభాగ్య కవిత్వం నేల విడిచి సాము చెయ్యదు. అతనిదంతా ఈ లోకపు కవిత్వం. అతను చూపించినదంతా ఇక్కడి సగటు మనిషి జీవితం. ప్రత్యేకించి, ప్రాంతీయతను పదిలపరుచుకున్న కవిత్వమితనిది. ఇతని ఊహలు, కవిత్వము కూడా ఒరిస్సా వాతావరణాన్ని దాటి వెళ్ళవు.

చెరువులోని చేపలన్నీ పట్టి
ఆకాశం వైపుకు వల విసిరినట్టు
పక్షుల గుంపులు.
నా గుండె ఎక్కడ చిక్కుకుందో-
వెనక్కిలాగే లోపే వల పైపైకిపోయింది

మనమున్న జీవితానికి, మనం గీసుకున్న పరిధి దాటి రావడమంటే యుద్ధంతో సమానమైపోయింది. గీతకి అవతలివైపు నుండి చేయి కనపడ్డప్పుడు, అది యుద్ధం నుండి బయటపడేసే సాయమేనేమో అనుకునే మనస్తత్వం దాదాపుగా మాయమై, అది సాయం కోసం చాచిన చేయేనని తీర్మానించుకుని, చూసీచూడనట్టు వెనుతిరగడం పరిపాటైపోయింది.

పల్లెటూళ్ళ జీవన చిత్రణలో ఒక సౌందర్యం ఉంటుంది. వర్గంగానో, సంఘంగానో కూడి బ్రతకడంలో దొరికే భరోసాని బలంగా చూపెడుతుందది. పట్టణజీవితపు ఒంటరితనంలో బిగ్గరగా చెప్పుకోలేని, ఒప్పుకోలేని, ఎవరితోనూ పంచుకోలేని, తప్పించుకోలేని వేదన ఉంటుంది. ఆశ్చర్యకరమైన ఈ వైరుధ్యాన్ని ఒకేసారి ఒకే కవితలో, లేదా ఒకే సంపుటిలో స్ఫుటంగా చెప్పడం మామూలు కవులకు దాదాపు అసాధ్యం. కరుణాకర్ మామూలు కవి కాదు.

పిట్టలు పారే వేళకి ముందే
దండెం మీది నీ బట్టలు మోసుకుని నేనో
లేరంగుల ఇంద్రధనుస్సునై ఇంటిలోకి నడవడం
ఒక రంగులకలలా ఉంటుంది.

ఆ రాత్రి,
ముక్కలయే కాలం ముందు
మౌనం నిశ్శేషంగా నిలబడ్డ రాత్రి,
వెన్నెలను శ్వాసిస్తున్న చీకట్లోనే
లోకం సుస్పష్టంగా కనపడ్డ రాత్రి

నిజానికి ప్రకృతి వర్ణనలకు సంబంధించి చాలా మంది పాఠకులకు ఉండే ఇబ్బంది కవి దృష్టితో లోకాన్ని చూడలేకపోవడం; కవి వర్ణనలను అతిశయోక్తులని నమ్మడం. ఈ వైయక్తికమైన అనుభవాలని సార్వజనీనం చేసి ఒప్పింప జేసుకోవడానికి కవిలో నిజాయితీతో పాటు, పాఠకులను చనువుగా తన వెంట రమ్మని పిలవగల నేర్పు కూడా ఉండాలి.

ఎన్ని వసంతాల వంచనకు వడలి
రేకులుగా రాలిపడుతోందో
లోలోపలెంతగా దహించుకుపోయి
దావాగ్నిలా ఎగసిపడుతోందో
దూరం నుండి చూస్తున్నవాడివి

సన్నని సెగలో కాలే కోర్కెల్ని దాస్తూ
ఎత్తుపళ్ళు దాచలేని నవ్వుల్తో
ఏవో ఆశల్ని పరుస్తాడతను.
రొట్టెలొత్తే చేతుల ఎర్రమట్టిగాజులు
గలగలలతో లయగా ఊకొడుతూంటాయి.

కొండదారిలో రాలిపడ్డ పూలగుత్తుల్నీ
కుబుసాలు విడుచుకుంటోన్న
జంటసర్పాలనీ
జాగ్రత్తగానే దాటుకు ఇల్లు చేరతాను కానీ,
ఆ గాలిలో నలిగిన పూలపరిమళమేదో
ఊపిరిలో చేరి వెంటాడటమాపదు.

వచన కవిత్వం వ్రాస్తున్న వారిలో చాలా మందికి, పాదాల విరుపే అన్ని బాధ్యతలనూ నిర్వహిస్తుందన్న గుడ్డి నమ్మకమొకటి బలంగా ఉంటుంది. అది నిజం కాదు. ఒక్కోసారి బలమైన ప్రతీక లేదా పదబంధం చేసేపనిని కామా, లేదా ఫుల్‌స్టాప్ చేస్తుందనడం అతిశయోక్తి కాదు. స్పష్టత విషయంలోనూ విరామచిహ్నాల సాయం తీసుకోవడం నేరమనిపించుకోదు. కవిత్వంలో అవేమీ నిషిద్ధాలు కావు.

ఆ నిశ్శబ్దపు వీథిలో
రెక్కలల్లార్చిన
తేనెటీగల అల్లరికి
విసుగంతా విదుల్చుకున్న
కిటికీ రెక్కల రెపరెపల్లో

నాకెప్పుడూ నువ్విలాగే కనపడాలి!
సౌందర్యం రెపరెపలాడింది.

నన్నొక్కసారి ముద్దుపెట్టుకోవూ?
ప్రేమ ఆర్తిగా పెనవేసుకుంది.