వార్కా బీచ్

ముసురు పట్టిన సాయంత్రం
మెరుపొక్కటే వెలుగు
తుఫాను హెచ్చరికలతో ఖాళీగా
నువ్వు.

పామ్ చెట్ల వెనుక
నీదైన ఓ మహాప్రపంచం
నీ కోసం పరుగులెత్తే
అలల గలగల నవ్వు
విచ్చుకుంటూ ముడుచుకుంటూ
నే దాటి వచ్చిన
అత్తిపత్తి పొదల్లోని ఆకుల్ని గుర్తుచేస్తూ.


ఉన్నాన్నీ దగ్గర. ఊరికే అలా ఉన్నాను.
నీ ఒడిలోకొచ్చే పోయే అలలతో
నా జీవన సాఫల్య క్షణాలను లెక్కపెట్టాను
అలకీ అలకీ మధ్య పారాడే నిశ్శబ్దంతో
నా లోపలి తీరపు స్థిమితాన్ని కొలిచాను
అమూర్తచిత్రాల ధ్యాసలో ఆరాత్రం నలిగే తీరంలో
అడుగుకో గవ్వను గుచ్చి పిలిచావు, వార్కా.

ఈ ఇసుక మెత్తదనంలో
నీ నిర్మలత్వాన్ని అనుభవించాను
నీ ఉప్పునీటి పచ్చి కౌగిలింతలో
నా అణువణువునీ తడవనిచ్చాను
నా ఒక్కో ఆలోచననీ ఒక్కొక్క తపననీ
ఒలిచి ఒలిచి ఈ ఈమిరిలో
కలిసిపోనిచ్చాను.
పునర్యవ్వనాన్ని కానుకిచ్చే
నీ సమక్షాన్ని ఇంకాస్త గట్టిగా-
హత్తుకున్నాను.


మీరలేని జీవన వాస్తవంలా
తీరం మీద రెపరెపలాడే
ప్రమాదసూచికలు

ఇసుక బొరియల్లోకి దూరాలని
వంకరకాళ్ళతో పరుగెట్టే
ఎండ్రకాయలు

వాటిని చూసి నవ్వే అర్హత, వార్కా
నీ వల్లే పోగొట్టుకున్నాను!


మానస చామర్తి

రచయిత మానస చామర్తి గురించి: ఇంజనీరింగ్ (కంప్యూటర్స్) 2005లో పూర్తి చేసి ఐ.టి. రంగంలో ఉద్యోగం. ప్రస్తుత నివాసం బెంగలూరు. మధుమానసం అన్న బ్లాగ్ ఉంది వీరికి. అలతి అలతి పదాలతో లోతైన కవిత చెప్పగల వీరు కవిత్వంలోను, సాహిత్యవిమర్శలోను తనదైన గొంతు వినిపిస్తున్నారు. ...