తన్మాత్ర: లేతకాంతిలోకి…

ఒక్కో పుస్తకం పాఠకులను ఆలోచనల్లోకి నెడుతుంది. ఒక్కో పుస్తకం ఒకానొక ఆవేశంలోకి నడిపిస్తుంది. ఒక్కొక్క పుస్తకం అపరిచిత ఆవరణలోకి, స్వాప్నిక లోకంలోకి పిలుచుకుని వెళుతుంది. ఆ ఆవరణలు ఆయా రచనలకు సంబంధించిన కథావస్తువుల వల్ల సృష్టించబడవచ్చు, అందులోని పాత్రల వల్లనో, వాళ్ళ ప్రవర్తన వల్లనో, అందులోని ప్రదేశాల, వ్యవహారాల వర్ణనల వల్లనో కూడా ఈ ఆవరణలు సాధ్యపడవచ్చు. కట్టుదిట్టంగా రాయబడ్డ కథ, ఈ ఆవరణలను, లోకాలను తనదైన రంగుటద్దాల మధ్య నుండి చూపించి, కోటి కాంతుల నడిమ ఆవిష్కరిస్తుంది. మళ్ళీ మళ్ళీ తలుచుకునేలా, చదివేలా, ప్రేమించేలా చేస్తుంది.

మైథిలిగారి కథల్లో జన్మాంతరాల ప్రేమలు, మనవి కాని ఆ కాలాల్లోకి ప్రయాణాలు, ఆయా కాలాలను దాటుకుని గెలిచే మోహావేశాలు, ఆ మోహావేశాల ఆలంబనతోటే మార్మిక జగత్తులోకి తెరుచుకునే ద్వారాలు కనవస్తాయి. అయితే వీటన్నింటికీ ఇంత సత్తువనిచ్చింది మాత్రం మొదటగా, ముఖ్యంగా, అపురూపమైన ఆమె శైలి. సుకుమారమైన తన భాష. చారిత్రక సంఘటనల ఆధారంగా నిర్మించబడ్డ కథలను మినహాయిస్తే, ఈ కాలంలో నడిచిన కథలన్నింటిలోనూ ఎగువ మధ్యతరగతి కుటుంబ నేపథ్యం, చదువుకున్న, వ్యక్తిత్వాలున్న మనుషులూ; మీమాంసలోకి నెట్టే, ముట్టడి చేసే ప్రేమలూ; ఆదర్శాలను తరచి చూసుకుంటూ, వాస్తవికతను వదులుకోకుండా, స్వాప్నికతను జారిపోనీకుండా తమదైన రీతిలో జీవితాలను వెలిగించుకునే మనుషులూ ప్రధానమైన ఆకర్షణలు. 

ఇంటిని, ఒంటినీ బ్రతుకునీ మలుచుకునే తీరులో కనవచ్చే ఒక స్పష్టమైన అభిరుచి, మనసులను అర్థం చేసుకునే చూపులో ఓ నాజూకుదనం, అందమైన, విలువైన గాజుబొమ్మల నగిషీల్లో కనపడే పనితనం, విలక్షణమైన కవితాత్మక శైలి అడుగడుగునా కనవచ్చే కథల తావులివి. చాలా చిన్న చిన్న వివరాలతో ఒక రూపాన్ని కళ్ళకు కట్టడమొక ప్రత్యేకత. నాయికల వర్ణనలొచ్చిన ప్రతిసారీ వాళ్ళ చుట్టూ ఒక ‘ఆరా’ కూడా ఆ మాటలతో సృష్టించగలగడమొక ఆశ్చర్యం. పత్రహరితం కథలో మృదులను తెల్లతామరతో, ముత్యాలరాశితో పోలుస్తారు. ఆ సుకుమారమైన పరిమళం, మెత్తని కాంతి- తనను పరుచుకుని ఉండేవి అన్నప్పుడూ; ఆభాస కథలో నాయికను సంజెపసుపు రంగు నూలు దుస్తుల్లో చూపెట్టినప్పుడూ; ద్వారబంధం కథలో నాలుగంటే నాలుగు వెన్నెల దారాలు మెలిపెట్టి తీర్చినట్టు పల్చగా ఊగే దేహంగా యామినిని పరిచయం చేసినప్పుడూ; అలాగే మహాశ్వేతలో నాయికను కలువపూలమాలగా అభివర్ణించినప్పుడూ – ఆయా నాయికల సౌందర్యం, సౌకుమార్యం కళ్ళ ముందుకు వచ్చి అనుభవమవుతుంది. నియతి కథలో దీపక్‌ని వర్ణిస్తూ ‘జీవితపు ఏ చేదునీ చవిచూడని తాజాదనం, ముఖంలో’ అన్నారు. ఇట్లాంటి వాక్యాలు ఒకేసారి అతని గురించి చెబుతూ, తరువాతి కథలో అతని ప్రవర్తనని అర్థం చేసుకునేందుకు కూడా సాయపడతాయి.

‘జీవితాదర్శం శాంతి’ కావాలన్న చెలం మాటల వెలుగు ఈ కథల నిండా పరుచుకోవడాన్ని గమనించడం దానికదే గొప్ప ఉపశాంతి. సంఘర్షణలు లేకపోలేదు. తప్పిదాలు చేసిన మనుషులు కనపడకపోలేదు. ఆశ నిరాశల మధ్య ఊగిసలాటలూ, నిరాశ నిండిన బతుకుతో రాజీపడి కొనసాగటాలూ కూడా ఈ కథల్లో గమనించవచ్చు. వర్ణారణ్యంలో ‘ఇప్పుడే విచారమూ విచారణా వద్దు. ఈ రాత్రి…’ అని ఆగిపోవడం ఒక వివేకం. మహాశ్వేతలో ‘శృతి చేసిన ఉన్మత్తతలో’ దగ్గరవడమే సహజమూ, అవసరమూ. ‘నీలోని స్వేచ్ఛని ఉత్సాహంగా నిలుపుకొ’మ్మన్న మాటలు విని సందేహాల రెపరెపలు విదుల్చుకుంటూ పరుగెత్తి శరత్తులో కలిసే నీలిమ, ఒక ప్రేమ ప్రమాణం. ‘అవధులలో ఒదగటం అనవసరమైన నాగరికత అయితే, ఆదిమత్వపు స్వేచ్ఛ కోసం ప్రయాణం – జీవితాంతమూ చేయవలసిన కఠిన వ్యాయామం. అంత జీవశక్తి ఉందా? ఖర్చు పెట్టగలవా?’ వేళ దాటాక ఉదయించాలనుకునే ప్రేమలన్నీ ఎదుర్కుని తీరాల్సిన ఈ తర్కం, నియతి కథలో ఎదురొచ్చే బ్రతుకు పాఠం.

పాజిటివ్ ఎనర్జీని ప్రతి కథలోనూ రహస్యంగా పరుచుకుంటూ వచ్చిన ఈ కథల్లో కూడా, భగ్నమైన శాంతులున్నాయి, ఛిద్రమైన స్వప్నాలూ ఉన్నాయి. నెరవేరని వాంఛలూ అవి మిగిల్చిన కల్లోలాలూ ఉన్నాయి. 

మరి ఎలా ఈ కథలు ప్రత్యేకమంటే, ఎక్కడ ఆగి తరచి ఆలోచించాలో అన్యాపదేశంగా నేర్పినందుకు. ఆశను ఎక్కడ వదిలిపెడితే బ్రతుకు శాంతిగా మనగలదో, ఎక్కడ దాని కొనసాగింపే బ్రతుకుకొక తోడు కాగలదో సూత్రప్రాయంగా నేర్పినందుకు. 

‘మమ మాయా దురత్యయా’ అంటుంది గీత. మాయను అధిగమించడం తేలిక కాదు. అధిగమించామని అనుకున్నది కూడా నిజమో కాదో ఆఖరు క్షణం దాకా తెలిసే వీలూ లేదు. జీవితానికి కావలసినది నిత్య చింతన. బ్రతుకులోని లేతకాంతిని ఏ చీకట్లూ కమ్ముకోకుండా చూసుకోవలసిన వివేచన. ఈ తన్మాత్ర అలాంటి చీకట్లను చీల్చే సాయక.


మానస చామర్తి

రచయిత మానస చామర్తి గురించి: ఇంజనీరింగ్ (కంప్యూటర్స్) 2005లో పూర్తి చేసి ఐ.టి. రంగంలో ఉద్యోగం. ప్రస్తుత నివాసం బెంగలూరు. మధుమానసం అన్న బ్లాగ్ ఉంది వీరికి. అలతి అలతి పదాలతో లోతైన కవిత చెప్పగల వీరు కవిత్వంలోను, సాహిత్యవిమర్శలోను తనదైన గొంతు వినిపిస్తున్నారు. ...