కవిత్వంలో ఆధునికత అనే పదానికి ఏనాడూ ఒక స్థిరమైన నిర్వచనం అనేది దొరకదు. ఏ తరానికా తరం కొత్త కవిత్వాన్ని సృజిస్తూనే ఉంటుంది. వచన కవిత్వపు తొలి నాళ్ళతో పోలిస్తే ఇప్పటి కవిత్వం ఎన్నో రకాలుగా మారింది. కొత్త ప్రతీకలు, కొత్త భావాలు, కొత్త రూపకాలు, సరికొత్త వాక్యనిర్మాణం, పదబంధాలూ – ఇవన్నీ కవిత్వంలో కొత్త కోణాలను చూపెడుతున్నాయి. కవుల సంఖ్య పెరుగుతోంది, ఎల్లలు చెరిగిన ప్రపంచంలో కవుల భాష కూడా స్వేచ్ఛను సంతరించుకొంటోంది. అభివ్యక్తి పరిథులు అంతకంతకూ విస్తృతమవుతున్నాయి. కవిత్వంలోని ఈ మార్పులకూ, కొత్త పోకడలకూ అద్దం పట్టే సంపుటిగా, వాసుదేవ్ గారి ‘ఆకుపాట’ను చెప్పుకోవచ్చు.
స్థూలంగా చూసినప్పుడు ‘ఆకుపాట’ అనుభూతి కవిత్వంలానే తోచినా, ఏ సిద్ధాంతాలకూ, బంధనాలకూ లొంగని విశృంఖల విహారిగానే కవి మనకు గుర్తుండిపోతాడు. ఆ మాటకొస్తే, భావ కవితాయుగంలోనో, అభ్యుదయ ఉద్యమంలోనో చిక్కుపడకుండా, తనకు తప్పనిసరైన వృతాల్లో తాను బందీగా ఉంటూనే, లోకంలోని సమస్యలకు అశాంతికి లోనయ్యే సగటు మనిషి గూర్చి పరితపించే ప్రవృత్తి వదులుకోలేక పోవడంలోనే ఈ తరపు కవిత్వ దృక్పథమేదో దాగి ఉందనిపిస్తుంది.
సాహిత్యమూ-సమాజమూ పరస్పర ఆశ్రితాలనీ, పరస్పర ప్రభావితాలనీ పునరుద్ఘాటిస్తున్నారు నేటి కవులు. అభ్యుదయ కవితా వస్తువునెంచుకుని, భావకవిత్వ శైలిలో వ్రాయడం ఈ మధ్య కాలంలో కనిపిస్తోన్న మరో పరిణామం. దీనిని ప్రయోగంగా స్వీకరించవచ్చు కానీ, ఈ రెంటికీ అతీతంగా మానవతా దృక్పథాన్ని పలికించగల గొంతొకటి కవి లోతుల్లోనుంచి రానప్పుడు, కవిత బలహీనపడుతుంది. ప్రస్తుత సమాజంలో కనపడ్డ ప్రతి అసంబద్ధ విషయానికీ ప్రతిక్రియగా వస్తున్న కవిత్వంలో సుస్పష్టంగా కనపడుతోన్న దోషమిదే. ఆలోచన నశించిన ఆవేశమే తప్ప, ఆవేదన ఏ అక్షరంలోనూ ప్రతిఫలింపజేయని ఖండికలుగా మిగులుతున్నాయవి. సామాజిక సమస్యలపై వ్రాయబడ్డ కవితల్లో సహానుభూతి స్పష్టంగా ఉండాలంటే, అంతుపట్టని ఆవేదనను సమర్థవంతంగా అక్షరాల్లో నింపాలంటే, ముందుగా ఆ బాధ కవిలో ఇంకాలి. ఆ కాస్త సమయాన్నీ కూడా వెచ్చించగల సహనం లేకపోవడం వల్లే, చాలా మంది కవుల కవితలు తేలిక భావాన్ని కలుగజేస్తున్నాయి.
‘ఆకుపాట’ కవి ఆ తప్పిదం చేయలేదు. ఉదాహరణకు ఖాళీనీడల్లో అనే కవితలో (పు:50), కొన్ని దక్షిణాసియా దేశాల్లోని ట్రాన్స్‌జెండర్స్ గురించి బలమైన ప్రతీకలతో చక్కని కవిత వ్రాశారు. మొదటి పాదంలోనే వాళ్ళ దేహాన్ని వర్ణిస్తూ, “వెన్నెలని తొడుకున్న సూర్యుడిలా” అంటాడీ కవి. వెన్నెల సూర్యుడు స్త్రీ పురుష తత్వాలకు ప్రతీకలు. అలాగే వెన్నెలను తొడుక్కోవడం అనడంలో – వెన్నెల పైన ఉంటుందనే భావం కూడా వ్యక్తమవుతోంది. (ఈ ట్రాన్స్‌జెండర్లకు స్త్రీ అవయవాలు పై భాగంలో ఉంటాయి).
“దేహారణ్యంలోకి ప్రవహించే చీకటి బాధించేది కాదు
కాల్తున్న మిత్రుడి శవం చితిమంట వెలుగు
అప్పుడప్పుడూ వెలుగు నిచ్చేది” –(రక్తాక్షరి, పు:102)
కవిత ఇతివృత్తం మలేషియా అడవుల్లోకి తీసుకువెళ్ళిన ఉద్యోగులను నెలల తరబడి అక్కడి ప్లాంటేషన్లలో వదిలేయడం. దానికి తగ్గట్టుగా ‘దేహారణ్యం’ అనే పదబంధాన్ని వాడి, శారీరక బాధలన్నింటికీ అలవాటు పడిపోయినట్టు చెబుతూనే, తరువాతి పాదంలో, అకారణంగా చనిపోయిన ఏ ఆప్తమిత్రుడి శవదహనమో తిరిగి వెల్లువలా పొంగించే ఆలోచనలో, ఆవేశాలో — తిరిగి రేకెత్తించే జీవితేచ్ఛనూ, తిరిగి వెళ్ళిపోయేందుకు రేగే తపననూ అలతి పదాల్లో ఆర్ద్రంగా చిత్రించారు.
భాష విషయానికొస్తే, ఆకుపాటలో వెనువెంటనే పాఠకుల గమనింపుకు నోచుకునేది ఆంగ్లపదాల వాడకం. కవిత్వంలో భాష కంటే భావాన్ని యథాతథంగా చెప్పడానికే ప్రాథాన్యత నిచ్చిన కవులు మనకు లేకపోలేదు. ఉదాహరణకు దాశరథి పద్యనిర్మాణంలో ఉర్దూ సాహిత్య సంస్కారం నుండి వచ్చిన పదబంధాలు ఎక్కువ. అలాగే మో “కవిత్వం భాష యొక్క భాష” అంటూ ఆంగ్ల పదాలను తన కవిత్వంలో అలవోకగా పొదగడమూ, శేషేంద్రశర్మ ఈ రెంటినీ అవసరమనిపించిన ప్రతిసందర్భంలోనూ యథేచ్ఛగా వాడటమూ మనకు తెలుసు. ‘ఆకుపాట’ కవి మీద మో నెరపిన ప్రభావం సామాన్యమైనదేమీ కాదని, ఈ సంపుటిలో అక్షరమో-అనుభవమో అన్న కవిత స్పష్టంగానే చెబుతుంది. ఒక్క ‘చితి-చింత’ను మినహాయించుకుని, మో ఇతర రచనలన్నింటినీ కలుపుతూ అల్లిన ప్రయోగాత్మకమైన కవిత ఇది. మో లోని తీవ్రత, తీవ్రమైన భావాలను వ్యక్తపరించేందుకు అంత తీవ్రమైన భాషనూ వాడటం, తెంపరితనమా అనిపించే అక్కడక్కడి అస్పష్టతా, ‘ఆకుపాట’ కవిత్వంలో కనపడవు. అయితే, ఆంగ్ల పదాల వినియోగానికి సంబంధించి, మో లో కనపడే సహజసిద్ధమైన ధోరణి ఆకుపాటలో మాత్రం కొన్నిచోట్ల కృతకంగా కనిపిస్తుంది. కొన్ని ఉదాహరణలతో గమనిద్దాం.
“హవర్ గ్లాసులో ఇసుక రేణువుల్లా
ఒత్తిడి పరుగు” –(అంతర్ముఖం, పు:75)
అని వాడారీ కవి. ఇక్కడ ‘అవర్‌గ్లాసు’కి బదులుగా ఇసుకగడియారమనో, ఢమరుకమనో వ్రాయవచ్చు. కానీ వాటి వల్ల కవితకు ఒనగూరే ప్రయోజనం ఏమిటంటే సమాధానం ఉండదు. పాఠకులకు ఇసుకగడియారం అని చెప్పడం కన్నా అవర్‌గ్లాసు అని చెప్పడమే మంచిదనీ, ఇసుకరేణువులలా జరజరా నిర్విరామంగా పడడం లోని ‘పడకతప్పని’తనాన్ని బ్రతుకు ఒత్తిడితో సమన్వయం చేయడానికి తేలిగ్గా పట్టుకోగల తెలిసిన పదమే అవసరమనీ తోస్తుంది. ఆ మేరకు కవి ఎంపిక చేసుకున్న పదమే సముచితమైనదన్న నమ్మకమూ కుదురుతుంది.
రెండవ ఉదాహరణగా, ఈ కవితా సంపుటికి శీర్షిక అయిన ఆకుపాట (పు:94) కవితను తీసుకుంటే,
“మరో సీజన్, మరో పాట,
మా రంగులు మారుతూంటాయి”
అన్నప్పుడు, సీజన్‌కు బదులుగా ఋతువు అన్న పదం ఎందుకు వాడలేదన్న ప్రశ్న వస్తుంది. ఋతువు ఎంతో తేలిగ్గా లభ్యమయ్యే పదమైనప్పుడు, సలక్షణంగా కవితలో ఒదిగే అవకాశమున్నప్పుడు, ఆంగ్లపద వాడకం అకారణమని అనిపించక మానదు. మరొక కవితలో “మైనింగుల్లో మైనంటూ లేనివాళ్ళు” అన్నప్పుడూ అదే అసహజమైన ధోరణి.
‘నైమిత్తికం’ (పు:86) కూడా ఇదే కోవలోకి చేరుతోంది, ఈ క్రింది పంక్తుల ద్వారా.
“మరణించే రోజుల్నుండి
జారిపోయిన క్షణాలని మైనస్సంటావా?”
తీసివేద్దామా /వెలివేద్దామా /చెరిపివేద్దామా /మలిపివేద్దామా – ఇలా పెద్ద ఆలోచనలేమీ అక్కర్లేకుండానే అందంగా అమరే పదాలున్నప్పుడు, పాఠకుల ఆలోచనాస్రవంతిని పక్కదారి పట్టించే అకస్మాత్తు మార్పులు అనవసరమే. కవిత్వమే కొత్త పుంతలు తొక్కే కాలంలో మనం ఉన్నప్పుడు, భాషాపరంగా కొత్తదారులు ఎంచుకోవడం అనివార్యమూ, అభిలషణీయమూ కూడా. కానీ, ఓ కొత్త భాషలోని పదం వాడేప్పుడు, అది కవితా ప్రవాహంలో కలిసిపోవాలి. ఆవేశంలో ఆవేశమై ఖణీమని మ్రోగాలి. సర్వస్వతంత్రంగా, ఆ పదం తీసివేసి మరేపదమూ పెట్టలేనంత పకడ్బందీగా చొచ్చుకుని వచ్చి, కవితకు కొత్త సొబగులద్దాలి. లేదా ఓ కొత్త రూపాన్నివ్వాలి, కొత్త భావాన్నివ్వాలి, కొత్త ఉద్వేగాన్ని సరికొత్తగా పలికించేందుకు తేలికైన సాధనంగా నిలబడాలి. ఇవేమీ మద్దతుగా నిలబడని సందర్భాల్లో పరభాషా పదాలు కేవలం పాఠకుల దృష్టిని కవిత మీద నుండి తప్పించడానికే ఉపయోగపడతాయి.
అన్వయం సరిగా కుదరక పాఠకుడు ఇబ్బంది పడే సందర్భాల గురించి కూడా ఒకట్రెండు ఉదాహరణలు –
“వెన్నెల వెండితెరలో నుండి తొంగిచూస్తూ
మబ్బుల తివాచీపై ఇంద్రధనువులా తన వైభవాన్ని
ముద్రిస్తూ ముద్దు కౌముది” –(ఛాయాగీత్, పు: 43)
చదవగానే ఇది రాత్రికి సంబంధించినదని తెలుస్తుంది. కవితలో మిగిలిన పాదాలు కూడా హాయిగానే సాగుతాయి, లాలిపాటలా. వచ్చిన చిక్కల్లా ఈ మూడు లైన్ల దగ్గరే. రాత్రివేళ ఇంద్రధనువెలా వచ్చింది? మూన్‌బౌ అనుకోవడానికీ ఆస్కారం కనపడలేదు. కౌముది అంటేనే వెన్నెల. వెన్నెల వెండి తెరలో నుండి మళ్ళీ వెన్నెలే తొంగిచూస్తోందా?
అలాగే, ద్వైతం గురించి వ్రాస్తూ, వేరొక కవితలో (ద్వైతం, పు: 53), ఉచ్ఛ్వాసనిశ్వాసల రోలర్కోస్టర్, జీవనరథానికి భార్యాభర్తలు, నాణానికి రెండు వైపులు, ఇలా కొన్ని చక్కటి ప్రతీకలతో శీర్షికను ప్రకటిస్తూ, చివర్లో,
“కాలగమనాన్ని అందంగా శాసించే
వెలుగురేడు, రేవంతుల దాగుడుమూతలు
ద్వైతసమానమే”
అంటారు. ముందు ఉన్న ప్రతీకల ఆధారంగా చూస్తే, రోజుకు రెండు కొసలుగా ఉండేది పగలూ, రాత్రి. వాటిని శాసించేది సూర్యచంద్రులు. అలాంటప్పుడు అక్కడ వెలుగురేడు – రేరేడు అని రావాలి. రేవంతుడు అంటే అశ్వశిక్షకుడు. ఈ పదానికి చంద్రుడు అన్న అర్థం ఉంటే తప్ప, అక్కడ ఇమడదు. లేదూ, ఇది ఒక అచ్చుతప్పో, మానవ సహజమైన పొరబాటో అయి ఉండాలి. ఇతర కవితల్లో సైకతశ్రోణీ, ప్రేమపంకిణి లాంటి అరుదైన పదాలను అర్థవంతంగా వాడిన తీరు చూస్తే, ఇది పొరబాటేనేమో అనిపించక మానదు.
వచన కవిత్వ ప్రక్రియ మొదలయ్యాక, కవితా శిల్పం నిర్లక్ష్యానికి గురవ్వడం తఱచుగా కనిపిస్తున్నదే. “కాదేదీ కవితకనర్హం” అన్న శ్రీశ్రీ మాటలను శిరోధార్యంగా భావించే వారెందరో, సౌకర్యవంతంగా ఆ మరుసటి పాదంలోనే ఉన్న “ఔనౌను శిల్ప మనర్ఘం” అనడాన్ని మాత్రం విస్మరిస్తారు. ఆకుపాట కవితలు, ముఖ్యంగా ఓ పుస్తకంగా మన చేతుల్లో పడ్డప్పుడు, ఒకదాని వెనుక ఒకటిగా అన్నింటినీ ఏకధాటిగా చదువుతున్నప్పుడు, పాఠకులను ఆకర్షించే విషయం కవితారూప శిల్పం. రూపపరంగా కవితలన్నీ ఒకేలా ఉండడం, ఇలా ఒక్కసారిగా చదివేటప్పుడు గొప్ప సౌలభ్యాన్నిస్తుంది. ముఖ్యంగా ఇతివృత్తాలు (లేదా కవితా వస్తువులు), భావాల్లో స్పష్టమైన మార్పులు కవిత కవితకీ కనిపించడం వల్ల రూపం అదనపు ఆకర్షణై పఠనం వేగంగా సాగుతుంది. వ్యాకరణం గురించి మాత్రం మరో నాలుగు మాటలు చెప్పాలి.
ఇస్మాయిల్, ‘రాత్రి వచ్చిన రహస్యపు వాన’లో, ధనియాలతిప్ప అనే కవితను ఇలా వ్రాస్తారు:
“అంతా ఒక తెల్ల కాగితం.
అందులో ఒక మూలగా
ఒక అడ్డు గీతా
ఒక నిలువు గీతా
తెరచాప ఎత్తిన పడవ
కిందిది నదీ
పైది ఆకాశమూ
కావొచ్చు.”
కవిత ఇంతే. ఈ ఎనిమిది పాదాలే. ఒక వాక్యానికీ మరో వాక్యానికీ విడిగా చదివినప్పుడు పెద్దగా పొంతనేమీ కనపడదు. కానీ, కవిత పూర్తి చేసేసరికి మాత్రం కవితలో ప్రస్తావించబడని నదీతీరంలో చేతులు కట్టుకు నిలబడి, కవితలో ఆవిష్కృతమైన దృశ్యాన్ని చూస్తూంటాం. అదీ ఈ కవితలోని సౌందర్యం. కవిత మొత్తంలో ఎక్కడా ఏ విరామ చిహ్నమూ కనపడదు. అలా అని ఏ విధమైన అస్పష్టతకూ కవిత తావివ్వదు. కవిత్వంలో స్పష్టత, క్లుప్తత, స్వేచ్ఛ అనే మూడు అద్భుతమైన లక్షణాలకు, ఏ కాలంలోనైనా తిరుగులేని ఉదాహరణగా నిలబడగల కవిత ఇది. ఇక్కడ స్వేచ్ఛ అనేది పాఠకుల ఊహాపరిధికి సంబంధించినదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
కవిత్వంలో స్పష్టత, క్లుప్తత అన్ని వేళల్లోనూ అభిలషణీయమే కానీ తేలిగ్గా సాధ్యపడేవి మాత్రం కావు. క్లుప్తత మనం ఎంచుకున్న కవితా వస్తువుకు నప్పదు అనుకున్నప్పుడు భావసాంద్రత మీద దృష్టి నుంచాలి. అలాగే స్పష్టత విషయంలోనూ విరామచిహ్నాల సాయం తీసుకోవడం నేరమనిపించుకోదు. కవిత్వంలో అవేమీ నిషిద్ధాలు కావు. ఈ మాట ఎందుకు చెప్పవలసి వస్తోందంటే, వచన కవిత్వం వ్రాస్తున్న వారిలో చాలా మందికి, పాదాల విరుపే అన్ని బాధ్యతలనూ నిర్వహిస్తుందన్న గుడ్డి నమ్మకమొకటి బలంగా ఉంటుంది. అది నిజం కాదు. ఒక్కోసారి బలమైన ప్రతీక లేదా పదబంధం చేసేపనిని కామా, లేదా ఫుల్‌స్టాప్ చేస్తుందనడం అతిశయోక్తి కాదు. కవి సందర్భానుసారంగా వీటిని వాడకపోతే, కవిత రాణించక, ఇది అస్పష్టతా/ అన్వయదోషమా అనే ప్రమాదకరమైన ఆలోచన పాఠకులలో తలెత్తగలదు.
ఆకుపాట కవి కామా వాడటంలో ఎంచేతనో తటపటాయించి ఆగిపోవడం చాలా చోట్ల కనపడుతుంది. వేళ్ళ మీద లెక్కబెట్టగల్గిన సంఖ్యలో మాత్రమే వీటి వాడకం ఉంది. అడపాదడపా ఎలిప్సిస్ (…) అయినా వాడారేమో కానీ, కామా, ఫుల్‌స్టాప్ పెట్టగలిగిన వీలూ, పెట్టవలసిన అవసరం ఉన్న చోట్ల కూడా రెంటినీ నిర్లక్ష్యం చేశారు. అది కవిత్వంలోని అస్పష్టతగా చాలా చోట్ల నిరాశపరచింది.
వ్యాసంలో మొదట ప్రస్తావించినట్టు, కవితలను పుస్తకంగా చదివితే కలిగే లాభమేమిటో ఈ సందర్భం మరోసారి ఋజువు చేస్తుంది. ఏమంటే, ఆఖరు కవితల వద్దకొచ్చేసరికి, పాఠకులకు అప్రయత్నంగానే విరుపు ఎక్కడ ఉండాలో తెలిసి వస్తుంది. అంటే, ఈ దశలో కవి శైలి పాఠకులకు అర్థమవుతుంది. అతని ముద్రను గమనించగల్గిన మెలకువ ఏర్పడుతుంది. దీనిని పఠితల ప్రతిభగానే గుర్తించడం అవసరం.
అభ్యుదయ కవిత్వం వ్రాసినప్పుడు ఎంత నవ్యమైన ప్రతీకలతో, నిజాయితీని ప్రకటిస్తూ సాగిందో, అంతే నవ్యతతో, ఆర్ద్రతతో అనుభూతి కవిత్వాన్నీ వెలిగించిందీ సంపుటి. జీవితంలో మైలురాళ్ళుగా నిలబడ్డ కొన్ని సందర్భాలను గుర్తుచేసుకుంటూ, ఆనాటి అనుభవాలను వల్లె వేసుకుంటూ —
“ఈ అనుభూతులంతే,
వెన్నెల్నీ జేబులో పెట్టుకోనీయవు
వర్షాన్నీ తాగనీయవు”
అంటాడీ కవి. ఇవి రెండూ తేలిగ్గా, మామూలుగా అనిపించే రెండు మంచి ప్రతీకలు, మంచి వాక్యాలు. వెన్నెల, వర్షం రెండూ ‘తడి’ గుర్తులు. ఈనాటి వెన్నెలను రేపటికి దాచుకుని అనుభవించడం అయ్యే పని కాదు. అలాగే వర్షం కూడా. అంటే, ‘ఆ క్షణంలో’ నిలబడగల్గితేనే వాటి సౌందర్యం ఇనుమడిస్తుందన్నమాట. జీవితమూ అంతే, అనుభవాలూ అంతే. అంతా మన చుట్టూ ఉన్నట్టే ఉంటుంది. కానీ, ఆవేశపడి ముందస్తుగా ఖర్చుపెట్టుకోలేం, ఆశపడి అంతా దాచుకోనూలేము. అనుభవించగలం, అంతే.
అలాగే, ప్రేమ కవిత్వానికి సంబంధించి కూడా, ఈ కవిది ఓ ప్రత్యేకమైన సంతకం. “కారణం లేకుండా ప్రేమించలేను/ ప్రేమే కారణమైనప్పుడు” అంటూ తన ప్రేమ సిద్ధాంతాన్ని కూడా కవిత్వంలో పొందుపరిచారు. “ప్రేమను ప్రేమించిన ప్రేమ, ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుంది” అన్నారు కదా, అలాంటి ప్రేమ నిస్సందేహంగా గెలుస్తుంది కూడానూ.
“నువ్వున్న క్షణం/కాలంపై పచ్చబొట్టు” –(కాలంలో ఆమె, గాలంలో నేను, పు:106),
“కాలం తాళం తీసి మరీ లాక్కుంటానా
నీ చిరునవ్వుతో ఆ రాత్రిని వెలిగించుకుంటాను
నువ్వూ.. నేనూ, ఆ ద్వీపం” –(నువ్వూ, నేనూ..ఓ ద్వీపం, పు: 65)
-లాంటి చక్కటి చిక్కటి కవిత్వముంది ఈ సంపుటిలో.
మరొక ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ సంపుటిలో ఎక్కువ భాగం ప్రథమపురుషలో సాగేవే. ‘నేను’ తఱచుగా కనపడ్డ ఓ పదం. అలాగే ప్రణయ కవిత్వం వ్రాసినప్పుడు పదాల విషయంలో పాటించని పొదుపు, గంభీరమైన విషయాల వద్దకొచ్చేసరికి కనపడి ఓ కొత్త అనుభూతినిస్తుంది. ఉదాహరణకు, మరణం గురించి వ్రాస్తూ,
“కొంచం తులసి తీర్థం, కొన్ని కన్నీళ్ళు
ఓ మరణం ఖర్చు
గుండెడు దుఃఖం, గుప్పెడు వెలితి
ఓ బంధం ఖరీదు;
ఓ ఉల్కలానో, పండుటాకులానో
పుటుక్కున పోయే ప్రాణం
వెళ్ళొస్తానని చెప్పదు.” –(ఇత్తెఫాక్, పు:84)
ఆత్మీయుల మరణం ఎవ్వరికైనా మిగిల్చేది ఇలాంటి వేదననే. ఆ సార్వజనీయమైన కోణం కవితలో చక్కగా ప్రతిఫలించింది. ఇలాంటి వేదనలు లేదా వ్యక్తిచైతన్యాన్ని విశ్వచైతన్యంతో సంవదింపజేసే సాహిత్యసాధనా ప్రక్రియలు (సాధారణీకరణము, సామాజికీకరణము మరియు స్వాత్మీయీకరణము) విశ్వజనీనం కాబట్టి, ఆ భావాలను ఒడిసిపట్టుకున్న కవిత్వంలో ఏనాడైనా ప్రాణం తొణికిసలాడుతుంది.
తీవ్రతరమైన ఆవేశాలను కూడా లలితమైన పదాల్లో వ్యక్తీకరించగల్గిన నేర్పును వ్యక్తిత్వ ఛాయగా కవిత్వంలో విడిచిపెడుతూ, సమాజంలోని బురదను క్షాళించే ఇందుపగింజల వంటి ఖండికలకు కవిత్వంలో సముచిత స్థానమిస్తూ, అత్యంత నవీనమైన బింబకల్పనా విథానంతోనూ, సహృదయపాఠకులను అలరించే శయ్యావిశేషాలతోనూ, ఈ తరపు కవిత్వానికి ఓ బలమైన ప్రతిధ్వనిగా వినపడే రచన చేశారు వాసుదేవ్.
ఎంత చెప్పినా, ఎన్ని గమనికలు వ్రాసినా, ఇవన్నీ ఒక ఒక సంపుటిని ఉదాహరణగా తీసుకుని కవి తత్వాన్నీ లేదా మొత్తంగా కవిత్వాన్నీ మరింత విస్తృతంగా, ఉదాత్తభావజాలంతో అర్థం చేసుకునే ప్రయత్నమే తప్ప వేరొకటి కాదు. కవిత్వానికి తూకపు రాళ్ళు శాస్త్రాలు కావు, అనాదిగా మనం నమ్ముతున్న నియమాలూ కావు. ఒక్కో కవితా చదివాక, అది మనకంటూ మిగిల్చే అనుభవాల సాంద్రతే కవిత్వ విలువకు గీటురాయి.
[ఆకుపాట – వాసుదేవ్ కవితా సంకలం. జె.వి. పబ్లిషర్స్ ప్రచురణ, పే. 118. 2014. ఈపుస్తకం కినిగె ద్వారా, ప్రతులు అన్ని పుస్తకాల దుకాణాల్లోనూ లభ్యం.]