గులకరాళ్ళు

చెరువులోని చేపలన్నీ పట్టి
ఆకాశం వైపుకు వల విసిరినట్టు
పక్షుల గుంపులు.
నా గుండె ఎక్కడ చిక్కుకుందో-
వెనక్కిలాగే లోపే వల పైపైకిపోయింది


ఒకే చెట్టుకు పూసిన పూలు
ఒకదానికి తెలీకుండా ఒకటి
ఒంగి ఒంగి కొలనులోకి చూసుకుంటున్నాయి
రాకుమారుడెటు నుండి వస్తాడో
రహస్యం చెప్పడం కోసం
నీళ్ళన్నీ ఒడ్డును వెదుక్కుంటూ వచ్చాయి


నల్లటి బాతులు రెండు,
నా కళ్ళను తోడు పిలుచుకుని
జంటగా ఈదుకుంటూ పోతున్నాయి
నీడ ఒక్కటే, నీటి మీద వదిలిన
దారి ఒక్కటే.
ఒక్కటే ఎందుకు మునిగిందో మరి,
కాసేపు ఊపిరాడలేదు


పక్షులు రొదపెడుతున్నాయి
పేరు తెలియని పూల పరిమళం
గుబురు చెట్ల వెనుక నుండి మత్తుగా పాకుతోంది
నిద్రకు ముందు నగలన్నీ తీసేసిన యువతిలా
సాయంకాలపు తళుకులు తుడుచుకున్న కొలను
నల్లగా మెరుస్తోంది
చందమామ తోసుకుంటూ ఎందుకొస్తాడో
లోకం ఒక ముద్దు కూడా దొంగిలించకుండానే
చీకటి కౌగిట్లో!


మానస చామర్తి

రచయిత మానస చామర్తి గురించి: ఇంజనీరింగ్ (కంప్యూటర్స్) 2005లో పూర్తి చేసి ఐ.టి. రంగంలో ఉద్యోగం. ప్రస్తుత నివాసం బెంగలూరు. మధుమానసం అన్న బ్లాగ్ ఉంది వీరికి. అలతి అలతి పదాలతో లోతైన కవిత చెప్పగల వీరు కవిత్వంలోను, సాహిత్యవిమర్శలోను తనదైన గొంతు వినిపిస్తున్నారు. ...