దేవకన్య

ఎంత సున్నితత్వం నీలో!
పూవు అందంగా సిగ్గుపడింది.

నాకెప్పుడూ నువ్విలాగే కనపడాలి!
సౌందర్యం రెపరెపలాడింది.

పాటలేమైనా పాడగలవా?
సంగీతం గొంతు సవరించుకుంది.

నన్నొక్కసారి ముద్దుపెట్టుకోవూ?
ప్రేమ ఆర్తిగా పెనవేసుకుంది.

ఇల్లెప్పుడూ కళకళలాడుతుండాలి!
ప్రకృతి లోగిలిలో పచ్చగా నవ్వింది.

నా తెలివి ముందు వాళ్ళెంత!
మౌనం నిండుగా విచ్చుకుంది.

పూర్తిగా ఓడిపోయాను, వేరే దారేదిక?
ధైర్యం కౌగిలినిచ్చి ఊరడించింది.

నీ ముఖం నాకు చూపించకు, కంపరం!
సహనం అవమానాన్ని భరించింది.

ఏయ్, ఒకసారిటు నాదగ్గరికి రా!
ప్రేమ ఉలిక్కిపడి ఉన్నదంతా ఇచ్చింది.

ఆవేశంలో జరిగింది, ఇదేమంత కాని పని!
అనుబంధం అగ్నిసాక్షిగా విలవిలలాడింది.

మనసంతా నీవే అని చెప్పిందెప్పుడూ?
గుండె పగిలిపోయి ముక్కలయింది.

శాపమోక్షమైన దేవకన్య నవ్వింది. శపించకుండానే వెళ్ళిపోయింది.


మానస చామర్తి

రచయిత మానస చామర్తి గురించి: ఇంజనీరింగ్ (కంప్యూటర్స్) 2005లో పూర్తి చేసి ఐ.టి. రంగంలో ఉద్యోగం. ప్రస్తుత నివాసం బెంగలూరు. మధుమానసం అన్న బ్లాగ్ ఉంది వీరికి. అలతి అలతి పదాలతో లోతైన కవిత చెప్పగల వీరు కవిత్వంలోను, సాహిత్యవిమర్శలోను తనదైన గొంతు వినిపిస్తున్నారు. ...