అర్ధణా ఇడ్లీ మొహంతో నువ్వలా
అమాయకంగా ఎటో చూస్తోంటే
నిన్ను చిటికెలతో నా వైపు తిప్పుకోవడం
బాగుంటుంది.నీ ఎడమ కణత మీద
నా చిటికెన వేలొక చుక్కను దిద్దుతోంటే
నీ కనుపాపలు గండు మీనులై తత్తరపడడం
గమ్మత్తుగా ఉంటుంది.పిట్టలు పారే వేళకి ముందే
దండెం మీది నీ బట్టలు మోసుకుని నేనో
లేరంగుల ఇంద్రధనుస్సునై ఇంటిలోకి నడవడం
ఒక రంగులకలలా ఉంటుంది.నిదురలో నువ్వెందుకో
ఉలికిపాటుతో లేచి ఏడ్చినపుడు
అమాంతం గుండెలకు హత్తుకుని
బుజ్జగించి నిద్రపుచ్చేశాక
కన్నుల్లో నీరెందుకో చిప్పిల్లుతుంది.“బారసాల పెళ్ళికొడుకువై…” అంటూ మొదలెట్టి
పెళ్ళి పెళ్ళికొడుకులా ఎలా ఉంటావో ఊహించి దీవించి
కాస్త సంబరపడీ, మరికాస్త కలవరపడీ,
ఊహల రెక్కలు విదుల్చుకోవడం ఇబ్బందిగానే ఉంటుంది.తన కోసం దాచుకున్న పేరుని నీకివ్వడం చూసి
తనే మళ్ళీ నీలా వచ్చాడని నమ్మే ఈ అమ్మానాన్నల్ని చూసి
స్వర్గంలో దేవుడి బొజ్జ మీద ఆడుకుంటూ పెరిగే పసివాడొకడు
సొట్ట బుగ్గలతో నవ్వుతూ ఉంటాడన్న ఊహే, ఉండుండీ మనసును కోసేస్తుంది.
రచయిత మానస చామర్తి గురించి: ఇంజనీరింగ్ (కంప్యూటర్స్) 2005లో పూర్తి చేసి ఐ.టి. రంగంలో ఉద్యోగం. ప్రస్తుత నివాసం బెంగలూరు. మధుమానసం అన్న బ్లాగ్ ఉంది వీరికి. అలతి అలతి పదాలతో లోతైన కవిత చెప్పగల వీరు కవిత్వంలోను, సాహిత్యవిమర్శలోను తనదైన గొంతు వినిపిస్తున్నారు. ... పూర్తిగా »