బ్యాగుల నిండా తడిబట్టలు. దులుపుతుంటే రాలిపడుతోన్న ఇసుక. తప్పుకుంటుంటే చుట్టుకుంటోన్న సముద్రపు నీటి వాసన, నీచు వాసన. తీరంలో నా పాదాలను తడిపినట్టే తడిపి వెనక్కి పోయిన అలల్లా… సెలవులు.
పొద్దున్నే మళ్ళీ అదే దారిలో, అవే మలుపులు దాటితే, ఆఫీస్. స్నాప్‌వేర్ లంచ్ బాక్స్. తరిగి పెట్టుకున్న కూరలు, డబ్బాల నిండా పాలు. ఫ్రిడ్జ్‌లో. తలుపు తీస్తే తగిలే గాలి, ఏ తీరాలది?
తలుపు మూస్తే… బీచ్ సైడ్ గిఫ్ట్ షాప్. బేరమాడిమరీ కొన్న మాగ్నెట్. బబుల్ ర్యాప్‌లో భద్రంగా నా సంభ్రమం. నాకు మాత్రం తెలుసా, సముద్రాన్ని ఇంటికి తెచ్చుకోవడం ఇంత తేలికని.
ఆకర్షణ. ఏదీ శాశ్వతం కాదనిపించే క్షణాల్లో, అన్నీ స్థిరంగా కనపడే సందర్భాలు. కలిసే ధ్రువాలు అరుదూ అపురూపమూ. ఎవరు విడదీయగలరు?
అరచేతుల్లో మాగ్నెట్. జ్ఞాపకం ఎప్పుడూ ఆకర్షణే.
ఆకర్షణ, ఒక జ్ఞాపకమిప్పుడు.