మోహమకరందం

ఒకదానిపై ఒకటి
మరొకదానిపై ఒకటి
కౌగిలించుకుంటూ
కలియబడుతూ
ముద్దాడుతూ
మత్తెక్కుతూ
మరిన్ని, మరిన్ని,
మరిన్ని పోగవుతూ
ఆ నిశ్శబ్దపు వీథిలో
చివరి ఇంటి చూరుపట్టి
రెక్కలల్లార్చిన
తేటీగల అల్లరికి
విసుగంతా విదుల్చుకున్న
కిటికీ రెక్కల రెపరెపల్లో
మెల్లిగా మొదలైందో
మౌన ప్రణయం.

మెరిసిన కనులు; కలలు
ముసిరిన సంగీతం; వసంతం
“ఎంత ప్రమాదం”
అరిచారెవరో!
రాళ్ళు రువ్వారెవరో!

నల్లని మచ్చలు గోడకు మిగిల్చి
తేనెతుట్ట చెదిరిపోయింది.
తడితడి గుర్తులు ఊచలకొదిలి
మేడ గడియలు బిగుసుకున్నాయి.

కాటు పడిందని దిగులెందుకు,
తేనెచుక్క చిందే ఉంటుంది!

మానస చామర్తి

రచయిత మానస చామర్తి గురించి: ఇంజనీరింగ్ (కంప్యూటర్స్) 2005లో పూర్తి చేసి ఐ.టి. రంగంలో ఉద్యోగం. ప్రస్తుత నివాసం బెంగలూరు. మధుమానసం అన్న బ్లాగ్ ఉంది వీరికి. అలతి అలతి పదాలతో లోతైన కవిత చెప్పగల వీరు కవిత్వంలోను, సాహిత్యవిమర్శలోను తనదైన గొంతు వినిపిస్తున్నారు. ...