ముక్కాలిపీట మీద ముడుచుక్కూర్చుని
ఆరుబయట పెనం సిద్ధం చేస్తుందామె
చుక్కలు మెరిసే వేళకి
నిప్పులు రాజుకుంటాయిసన్నని సెగలో కాలే కోర్కెల్ని దాస్తూ
ఎత్తుపళ్ళు దాచలేని నవ్వుల్తో
ఏవో ఆశల్ని పరుస్తాడతను.
రొట్టెలొత్తే చేతుల ఎర్రమట్టిగాజులు
గలగలలతో లయగా ఊకొడుతూంటాయి.రగులుతూంటాయి నిప్పులు.
కండలు తిరిగిన మగడి దేహంలో
పగటి కష్టాన్ని పరికించి చూస్తూ
మునివేళ్ళతో అతని పెదవులకు
ప్రేమనంతా ముక్కలుగా అందిస్తుందామెఎంగిలిపడటం మొదలవుతుంది
ఆకలి పెరిగి పెద్దదవుతుంది
నిప్పులు పొగలు కక్కుతూంటాయి
గాలులు వేడెక్కిపోతాయినులకమంచం మీద మసకవెన్నెల
వెల్లికిల పడుకుని వేడుక చూస్తుంది
చిట్టిచేమంతులు మడుల్లో లేచి నిలబడి
కంటి చికిలింపుల్లో కథలు దాచుకుంటాయినడిరేయి ఏ ఝాముకో
చలిగాలులు వీస్తాయి.
కుంపట్లో నిప్పులు వాటంతటవే
ఆరిపోతాయి.