చీలిన మనిషి

నా జాడ నేను కోల్పోయాను
నా పరిచయ వాక్యం నన్ను వెతుక్కుంటోంది
పరచుకున్న రస్తాలు
తప్పిపోయిన నా అడుగుల కోసం నిరీక్షిస్తున్నాయి
అనాథగా నా నీడ
ప్రపంచీకరణ రంగుల రాట్నం కింద
పంటరిదై కునారిల్లింది
నా డమరుకం మూగపోయింది
నిద్రించే అక్షరాల నిశ్శబ్దాల్ని ఛేదించే
నా స్వరం శ్వాసకోసం అల్లాడుతోంది
చేప విత్తుల సేద్యంలో
చేజారిన చవిటిపర్ర కింద
దిసమొలతో రైతు దరిద్ర తాండవం చేస్తున్నట్టు
పంటరి ఆకాశం కింద నా నడక
గమ్యంలేని కాగితం పడవైంది
నా కిప్పుడు ప్రయాణాల్లేవు
చేరవల్సిన గమ్యాల్లేవు
నా కట్టుకొయ్యని అన్వేషించడమే
నన్ను నిలదీస్తున్న ప్రశ్న!

హారీ పాటర్లోనో
నేషనల్‌ చాప్టర్లోనో
కాఫీ క్లబ్బులోనో, బఫే డిన్నర్లోనో
జారవిడుచుకున్న నా మాట ముక్కల్ని
అపశ్రుతి చీపురు వూడ్చేసింది
డిస్కోథెక్కుల్లోనూ, పెట్టీ పార్టీల్లోనూ
పారేసుకన్న ఆడతనం
కొత్త వునికిని ఆరేసుకొంటూ
మనిషితనం వెతుక్కుంటోంది.

పడగలు పగడలై విప్పుకన్న
రాజకీయ సర్పాల విషకోరల్ని
పీకి పారేయలేని పిరికితనంలోంచి
ప్రజాస్వామ్య సముద్ర మథనానికి
వాసుకి రాకకోసం నిరీక్షిస్తున్న ఆశ
నా కిప్పుడు అమృతమూ కావాలి
ఈదుతున్న సముద్రమూ కావాలి

కాడి, కర్రు, వులి, బాడిస, మగ్గం, సారె
నిర్జీవ చిత్రాలుగా మిగిలిపోయాక
ఊళ్ళకి ఊళ్ళని అడవుల్ని చేసి
ముదిమిని వృద్ధాశ్రమాలకి తరలించి
నన్ను నేను అమ్ముకుంటున్నాను
కొన్ని కూలీ డబ్బులకి, కొన్ని ఆశలకి
నేనిప్పుడు నాలుగు దిక్కుల నుంచీ
ముట్టడించబడిన సైనికుణ్ణి
నాకిప్పుడు యుద్ధమూ కావాలి
నే కోరుకున్న శాంతీ కావాలి
రాటబల్లకింది అద్దం ముందు నిల్చొని
చిద్రుపలైన నా ప్రతిబింబంలో
నన్ను నేను వెతుక్కొంటున్న అనామకుణ్ణి
నా నుండి విడిపోతున్న నా ఆత్మకి
సంజాయిషీ ఇచ్చుకోలేని ద్వ్యర్థం నుంచి
వ్యర్థంలోకి ప్రయాణిస్తున్న బాటసారిని
ఉమ్మెత్త నాటిన నేలలో మల్లెలకోసం తపిస్తూ
నేనిప్పుడు నిలువునా చీలిన మనిషిని
నాకిప్పుడు నేనూ కావాలి
దూరపు ఆకాశంలోని హరివిల్లూ కావాలి!