శ్రీపాద కథల్లో స్త్రీలు – స్వయం నిర్ణయత్వం

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు తన చిన్న తనంలో రాజమండ్రీలో వారాలు చేసుకుంటూ చదువుకుంటున్న రోజుల్లో జరిగిన ఒక విశేషాన్ని తన స్వీయచరిత్రలో ప్రస్తావించారు. ఓ వారం శాస్త్రిగారికి భోజనం పెట్టాల్సి వచ్చిన ఓ గృహిణి, వాళ్ళఇంట్లో ఏదో కాస్త ఖరీదయిన పిండివంట కాబోలు వండింది. మరి ఆ వంటకం తక్కువే అయిందో, లేక వారాలబ్బాయికి ఇంత ప్రియమైన పదార్థం పెట్టనొల్లకో “కారణం ఏమైతేనేమి` పంక్తిలో నలుగురి సమక్షంలో భోంచేస్తున్న శాస్త్రిగారిని ఉద్దేశించి, ‘ఎలాగూ ఈ పదార్థం నీకు ఇష్టం లేదుగా బాబూ,’ అంటూ గడుసుతనంగా ముందరికాళ్ళకు బంధం వెయ్యబోయింది.

ఏమీ తొణక్కుండా శాస్త్రిగారు, అబ్బే అదేం లేదు, నాకది చాలా ఇష్టం, వెయ్యండి, అని నిర్మొహమాటంగా, విస్తుపోయిన ఆ ఇల్లాలిచేత సదరు పిండివంటని విస్తట్లో మళ్ళీ మళ్ళీ వేయించుకుని హాయిగా ఆరగించారు. ఒకవేళ ఆమెగారు ‘పదార్థం తక్కువగా ఉండబట్టి కొద్దిగానే వేస్తున్నాను, ఏమీ అనుకోకు బాబూ’ అని ఉన్నమాట చెప్పుకుని ఉండిఉంటే కథ ఎలా ఉండేదో తెలీదు. మనకి మాత్రం సుబ్రహ్మణ్యశాస్త్రిగారి వ్యక్తిత్వాన్ని చవిచూపించే ఒక మచ్చుతునక తక్కువై వుండేది.

1891లో కోనసీమలో శుద్ధశ్రోత్రియ వైదిక బ్రాహ్మణ పుటక పుట్టి, 1961లో చనిపోయే లోపల చిన్నా పెద్దా నిడివిగల 65 తెలుగుకథలు రాసిన శాస్త్రిగారిని తెలుగు ప్రపంచపు దిగ్దంతులు చాలామంది గొప్ప స్రష్టగానూ, గొప్ప వ్యక్తిగానూ గుర్తించారు. యేటుకూరి బలరామమూర్తిగారు ఈయన్ని ‘కథక చక్రవర్తి’ అన్నారు. పోరంకి దక్షిణామూర్తిగారు ‘జాతి రచయిత’ అని చాటగా, వాకాటి పాండురంగారావుగారు ‘తెలుగు వేళ్ళున్న ప్రపంచస్థాయి రచయిత’ అన్నారు. ‘కనక్‌ ప్రవాసి’గారు ఈయన రచనలమీద పి.హెచ్‌డి.,పరిశోధన గ్రంథం ప్రచురించి వాటికి ‘అకాడమీ’లో స్థానాన్ని ఇచ్చారు.

తరతరాల వేదపండిత సంప్రదాయపు అభ్యాసనతో ఆరంభించి, ఆ మీదట తెలుగుమీద ప్రేమకొద్దీ వాటిని త్యజించి, కుటుంబ ప్రతిఘటనకీ, ఆర్థిక ఇబ్బందులకూ తట్టుకుని, స్వయంపాఠీగా తెలుగు నేర్చుకుని, ఆ భాషలో రచయితగా ఇంత స్థాయికి చేరుకున్న శాస్రిగారి అపూర్వ వ్యక్తిత్వాన్ని గౌరవించి, కొనియాడనివారు లేరు. తెలుగే తప్ప ఇంగ్లీషుగాని, మరే ఇతర భాషలుగాని (వంశ వారసత్వంగా అబ్బిన సంస్కృతం మినహాయిస్తే) చదువుకోకపోయినా, ఎక్కడా ఎవరికీ తీసిపోని ఆధునికతకి కావలసిన మూలసామాగ్రి యావత్తూ తెలుగు సంస్కృతిలోనే స్వయంభువుగా ఇమిడిఉందని సాక్ష్యం పలికారు. ఇంత అయ్యిఉండిన్నీ, ఆయన జీవితాన్నీ, రచనలనీ తిరగేసిన వాళ్ళకి జాతి, వ్యక్తి జీవనంలో ‘శ్రీపాద వేలిముద్ర’ (మౌలిక లక్షణం) అనేది ఏమిటో తెలుసుకుని నిర్వచించుకోవాలంటే వందేళ్ళనాటి ఆ వారాలభోజనం తాలూకు ఆ ఒక్క సంఘటనా చాలు.

‘ఈ వస్తువు, (ఈ హోదా) అందుకునే యోగ్యత నీకులేదు. ఇది ఇతరులకోసం’ అనే సందేశం సమాజంలో చాలామందికి తరచుగానూ, అందరికీ ఏదో సందర్భంలోనూ, అందించబడుతూనే వుంటుంది. సాధారణంగా అందుకు ‘లొంగుబాటే’ (submission, surrender) జవాబుగా కనబడుతూ ఉంటుంది“ముఖ్యంగా స్త్రీలవిషయంలోనూ, పేదలవిషయంలోనూ. కాకపోతే, ఆ లొంగుబాటనే బొమ్మకి , ఆగ్రహమూ, విసుగూ ఆ మీద కొండొకచో విధ్వంసకత కూడా బొరుసుగా రూపం దాలుస్తూంటాయి. వారాల ఇల్లాలి చేతలకి సమాధానంగా ఆవిడ ఆశించిన విధంగా బిడియపడిపోయి, నోరు కట్టుకుని సంపన్నుల దయాధర్మం మీద ఆధారపడిన తనవంటి బీదవాడికి ఇంతే ప్రాప్తం అనుకుని ఉండవచ్చు శాస్రిగారు. మరింత దూరంపోయి, బ్రాహ్మడైన తనకి జిహ్వచాపల్యం కూడదు అని శుష్కవైరాగ్యంతో ఆత్మవంచన చేసుకుని ఉండి ఉండవచ్చు. కాదా మరోదారిపట్టి, అతిథిని ఇలా అవమానిస్తావుటమ్మా అని రెచ్చిపోయి పంక్తిలో యాగీ చేసిన్నీ ఉండి ఉండవచ్చు. అయితే శాస్రిగారు చేసిందల్లా తొణుకూ బెణుకూ లేకుండా తన అభీష్టాన్ని బాహాటంగా చెప్పుకుని, ఆ ఇష్టమైన వస్తువుని పొంది, అనుభవించి ఆనందించడం.

ఆత్మనిర్ణయం — ఐశ్వర్యం

‘తన దేశ ప్రజకంతకీ స్వయంనిర్ణయశక్తి (culture of self-determination) కలిగించడం’ తన పూనిక అని శాస్త్రిగారు చెప్పుకున్నారు. స్వయంనిర్ణయం అన్నా, స్వేచ్ఛ అన్నా, ఒక వ్యక్తి తన మనసుకోరింది శోధించి అర్ధం చేసుకుని, దానికోసం అవసరమైన ప్రయత్నం చేసి సాధించి సంపాదించి ఆనందించడం అని తాత్పర్యం చెప్పుకోవచ్చు. ఐశ్వర్యానికి పరమార్ధం ఇదే.

శాస్త్రిగారి కథలు చాలావాటిల్లో ఐశ్వర్య ప్రశంస స్థూలవిషయంగా కాకపోయినా, కథాస్థలి వర్ణనల్లో కొట్టొచ్చినట్టు కనబడతుంటుంది. ‘అనకున్నంత పనీ జరిగింది’ అనే కథలో రాజమండ్రి ప్లీడరు చంద్రమౌళి పంతులుగారి ఇంటి వైభవం ఎంతో ప్రీతిగా వర్ణించబడింది. కథను చుట్టుముట్టిన వాతావరణం నామక: పంతులు డబ్బుతోనూ, లోగిలి చక్కదనంతోనూ ఆగదు -విధురుడైన పంతులిదీ, బాలవితంతువైన అతడికూతురు సుభద్రదీ వివాహాలతో ముగిసిన డబుల్‌ రొమాన్సు- ఆ వైభవానికి అర్ధాన్నీ, శోభనీ సమకూరుస్తుంది. యోగ్యుడైన యువకుడు రామచంద్రం, సుభద్రలు ఒకర్నొకరు వరించుకుంటారు. గట్టి వ్యక్తిత్వం కలిగిన విధవరాలు పంతులమ్మ జానకమ్మ, చంద్రమౌళీల మధ్య ప్రౌఢ శృంగారం నడుస్తుంది. వితంతు వివాహాన్ని నిషేధించే సమాజపు నేపథ్యంలోనే, అందరూ అనుకున్నంతా, అంటున్నంతా జరిగి, కథ రమణీయంగా కంచికెడుతుంది.

‘ఆత్మబలి’ అనే ఇంకో కథ వాతావరణం పైపైన చూస్తే ‘అన్నంత పనీ జరిగింది’ కథ తాలూకు సంపన్న, నాగరీక బ్రాహ్మణ గృహ వాతావరణానికి పూర్తిగా భిన్నంగా అనిపిస్తుంది. పల్లెటూరి శూద్రవితంతువు గోవిందమ్మ కథ ‘ఆత్మబలి’. ప్రౌఢప్రాయంలో, ఓ మోస్తరు స్థితిగతులున్న గోవిందమ్మగారు గతించిన పెనిమిటి పోలీసు వెంకటస్వామిగారి మొగతనం, పౌరుషం, తమమధ్య నెలకొన్న ప్రేమానురాగాలూ –వీటి జ్ఞాపకాలతో సతమతమవుతూ కాలం గడుపుతూంటుంది. ఎదిగిన కొడుకు భూషయ్య సైనికుడుగా దేశాంతరంలో యుద్ధంలో ఉంటాడు.

ఈ పరిస్థితిలో తిమ్మయ్య అనే కుర్రాడి పట్ల గోవిందమ్మకి మనసవుతుంది. సాంఘికంగా నిషిద్ధమైన ఈ అనురాగాన్ని, సూచనప్రాయంగా రాధాకృష్ణుల అనుబంధం అనే రాటకి కట్టి ఎంతో అవగాహనతోనూ, సానుభూతితోనూ ఈ కథ చెప్పుకొస్తాడు శాస్త్రిగారు. ఆ సంబంధమైన ఉద్వేగాలతో గోవిందమ్మ పట్టిన కుస్తీ, తుదకు కొడుకు యొక్కా, తద్వారా తనయొక్కా శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకుని ఆవిడ తీసుకున్న నిర్ణయం ఈ కథకి ముఖ్యాంశాలు.

పైకి ‘అన్నంతపనీ జరిగింది’ కన్నా చాలా భిన్నంగా ఉన్నా ‘ఆత్మబలి’ కథ చదివిన వాళ్ళకి గోవిందమ్మా, ఆమె పాటివారూ, అభిలాషల్ని, సంపదనీ, సౌభాగ్యాన్నీ పూర్తిగా అర్ధం చేసుకున్న వాళ్ళలాగా కనబడతారు. పెద్ద శ్రీమంతులు కాకపోయినా, నిమ్నకులస్థులుగా చెప్పబడుతున్న వాళ్ళయినా, వాళ్ళలో ఆత్మవిశ్వాసమూ, ఈప్సితమూ తప్ప దైన్యత ఎక్కడా కనబడవు. స్వేచ్ఛకి పరమార్ధం స్వంత ప్రతాపంతో పైకి రావడం. అభిమానంగా, దర్జాగా బ్రతకడం, కావలసింది గ్రహించి నెరవేర్చుకోవడం ` అన్న భావం ‘ఆత్మబలి’ని, ‘అన్నంత పనీ జరిగింది’నీ ఒక తాటితో కలుపుతుంది. స్వేచ్ఛాజీవికి కూడా పరస్పరవిరుద్ధమైన కోరికలుండటం సహజమే, అటువంటి సందర్భంలో అంతర్ఘర్షణా, ఆత్మత్యాగమూ తప్పనిసరి అవుతాయన్నది ‘ఆత్మబలి’ కథలో శాస్త్రిగారు బోధించే ‘అడ్వాన్సుడు కోర్సు’.

యువతీయువకుల –ప్రత్యేకించి యువతుల–సహజమైన అనురాగభావనల్ని పుష్పించనీకుండా నిర్దాక్షిణ్యంగా తుంచివేసే సమాజంలో సాహసంతో నోరూకాలూ మెదిపి, అందిన సాయం పుచ్చుకుని గట్టెక్కిన బాలవితంతువు రంగనాయకమ్మ కథ ‘కన్యాకాలే యత్నాద్వరితా’. వైధవ్యం సంభవించగానే శాశ్వతంగా సౌభాగ్యానికి, ఆనందానికి దూరంగా ఉండమని శాసించే హిందూసమాజంలో బ్రాహ్మణ యువతి రంగనాయకమ్మ ‘ఆత్మబలి’లోని గొల్లగోవిందమ్మకి తోబుట్టువు.

ఇద్దరూ ఎవరిదైన పద్ధతిలో వాళ్ళు ధైర్యంగా తమ తమ పరిస్థితుల్ని ఎదుర్కొంటారు. ఎదిగొచ్చిన కొడుకు అభివృద్ధికి సమాజం తోడ్పాటు కావాలి. అందుకు విరుద్ధంగా పయనించకపోడమే తన స్వేచ్ఛకి ఉచితమైన అర్ధం అని గోవిందమ్మ నిర్ణయించుకుంటుంది. రంగనాయకమ్మ విషయానికొస్తే, తను ప్రేమించిన పార్వతీశానికి జానకితో పెళ్ళైపోతుంది. తనకి కన్యావైధవ్యం మిగులుతుంది. ఈ పరిస్థితిలో జానకితో బాహాటంగా చెల్లెలి వరస కలిపి, పార్వతీశంయడల తన ప్రేమ ప్రకటించుకుని, జానకితో సవితి స్థాయిని డిమాండుచేసి సంఘంలో కల్లోలం సృష్టిస్తుంది రంగనాయకమ్మ. ఇంత బరితెగించిన విధవస్త్రీకి సాహిత్యంలో సాధారణంగా తలపడేది ట్రాజడీయే. ఇందుకు భిన్నంగా శాస్త్రిగారు ఈ కథలో తెల్లదొర రూపంలో ఒక దివ్యహస్తం(Deus ex Machina, a contrived theatrical interposition offering an unexpected resolution of difficulty, ఆకాశవాణి వంటి సాహితీసాధనం) ఏర్పాటు చేసి, సాహసిస్తే సాయం లభించకపోదన్న సందేశం అందించారు.

మరి సాహసించకపోతేనో? ఆ వ్యక్తీ, పరివృత సమాజ సభ్యులూ, పర్యవసానం అనుభవించక తప్పదు. ‘ఆగిపోయిన కల ఏమవుతుంది? ఎండి ఒరుగౌతుందా? లేకపోతే పుండై రసికారుతుందా? కుళ్ళి కంపు కొడుతుందా?…’ అనడిగాడు లాంగ్‌స్టన్‌ హ్యూస్‌(Langston Hughes) మహాకవి. ‘అరికాళ్ళకింద మంటలు’ కథలో యువవితంతువైన ఇంటాడపడుచుని ఒరుగుచేసి మాడ్చి లొంగదీసే ప్రయత్నంలో కుతకుతా ఉడికిస్తుంది పుట్టింటి కుటుంబం. చివరికి ధైర్యానికి బయటిసాయం జతచేసి ఆ అమ్మాయి వీరేశలింగంగారి ఆశ్రమానికి వెళ్ళిపోయి ఎండక, కుళ్ళక, బతుకుతుంది.

ఇందుకు భిన్నంగా ‘ఇల్లు పట్టిన వెధవాడబడుచు’ కథలో బుచ్చమ్మ వైధవ్యం కుళ్ళరికానికే దారితీసి, తమ్ముడి సంసారానికి ఓ ప్రతిబంధకంగా ఆవిణ్ణి తయారు చేస్తుంది. నిజానికి బుచ్చమ్మకున్న శక్తి స్వల్పమే. అమె కోపతాపాలు పేదవే. అంచేతే అట్టే కష్టంలేకుండా ఆవిడ వదిలిపోతుంది. ఎవరికైనా నిలకడైన శక్తి సిద్ధించాలంటే సాహసించి, ప్రకృతిసిద్ధంగా తమకు సంక్రమించిన స్వయంనిర్ణయ శక్తిని చెల్లుబాటు చేసుకోవాలి–ఇది శ్రీపాద సాహిత్యం ప్రవచించే వేదవాక్కు.

ఆత్మనిర్ణయం — నైతికత

శ్రీపాద మాదిరిగానే వ్యక్తిస్వయంనిర్ణయత్వానికీ, సాహసానికీ ప్రాధాన్యతనిచ్చి, సంఘపు కట్టుబాట్లని తిరస్కరించిన దార్శనికులూ,రచయితలూ అనేకులు. పాశ్చాత్య వాంగ్మయంలో 19 వ శతాబ్దంలో నీట్జ్షే(Nietzsche) , 20వ శతాబ్దంలో అయ్న్‌ రాణ్డ్‌(Ayn Rand) తమ తమ పద్ధతులలో ‘అధిమానవ’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీని ప్రకారం, స్వయంప్రతిభనుపయోగించి తన నిర్ణయాన్ని నెగ్గించుకోడమే ధర్మపథపరాయణం. ఉత్తిపుణ్యానికి పరోపకారానికి ఒడిగట్టడం పాపసదృశం అని అయ్న్‌ రాణ్డ్‌ ‘అబ్జెక్టివిజం’ సిద్ధాంతం. ఈ ఇజాల దృష్టిలో ఉదాత్త మానవ విలువలు అప్రస్తుతాలు, ఇంకా మాట్లాడితే దూష్యాలు కూడా.

బహుళప్రచారంలో ఉన్న తన ‘కలుపు మొక్కలు’ కథలో తన పక్షంగా నైతికతకీ, స్వయంనిర్ణయానికీ ఉన్న లంకెని పరిశీలిస్తారు శాస్త్రిగారు. కొడుక్కి ఉద్యోగం కోసం శిఫారసు కావల్సివచ్చి ఒక బీదబ్రాహ్మడు అంచెలంచెలుగా అవినీతిమత్తులైన ఆ ఊరి కరణం ఇత్యాదిగా గల అధికార వర్గాలవారిని ఆశ్రయించుతాడు. ఒక్కొక్కళ్ళూ ఆ ఉపకారానికి ప్రతిఫలం పేరు చెప్పి ఉన్న కొద్దిపాటి వనరుల్ని పీల్చి పిండుతారు. పన్లోపని సూటిపోటిమాటల్తో అతని ఆత్మగౌరవాన్ని కూడా దోచుకుంటారు. లంచాలు పుచ్చుకున్నందుకు ప్రతిఫలంగానైనా ఆ బ్రాహ్మడి పని నెరవేర్చాలన్న నైతిక బాధ్యతని అధికారుల్లో ఎవరూ గుర్తించరు.

ఈ దారి వెళ్ళి వెళ్ళి బ్రాహ్మణ్ణి, ఒక ఉన్నతాధికారి ఉంపుడుకత్తెగా కోరుకున్న, ఒక వేశ్య దగ్గిరికి తీసుకెళ్ళుతుంది. ఆ అధికారిని అందాకా తోసిపుచ్చిన ఆమెని లొంగి వచ్చేటట్టు ఒప్పిస్తే పని సానుకూలమవుతుందని కింది అధికారులు ఆతడ్ని ఎగదోస్తారు. ఇప్పటికే సగం చచ్చిఉన్న బ్రాహ్మడు తనవనుకున్న నైతికవిలువల్ని దిగమింగి, వేశ్యను వేడతాడు. సునిశితంగా సున్నితంగా ఆమె తనకి ఉన్న ఆత్మగౌరవాన్ని విడనాడి ఆత్మవంచన చేసుకొమ్మని అర్ధిస్తున ఆతడి కోరికలోని అనౌచిత్యాన్ని విశదపరిచి, ఆ మీదట స్వచ్ఛందంగా వినయంతో ఆ కోరికని మన్నించాలని నిర్ణయించుకుంటుంది.

ఈ కథలో బ్రాహ్మడూ, లంచగొండి అధికార్లూ, వేశ్యా వీరందరూ తమతమ పరిధుల్లో ఆత్మనిర్ణయాన్నే అవలంబిస్తున్నారు. ఎక్కడా పస్తులైనా ఉంటాంగానీ, ఈ అవినీతి నా వల్లకాదనగలిగే సామర్ధ్యం బ్రాహ్మడికి లేకపోయింది. తనక్కావాల్సిందీ, అవసరమైందీ అయిన కొడుకు ఉద్యోగం సంపాదించడానికి ఇది తప్ప మరోమార్గం లేదనుకున్నాడతడు. అధికారులు సరే, సంఘం కల్పించిన నియమాలూ వెసులుబాట్లూ తమ స్వయంశక్తులతో మేళవించి, తాము కోరుకున్న వస్తువులు – ధనం, ఇతరుల మీద అధికారం నెరపడంలో లభించే ఆనందం – పొందుతున్నారు. సమస్తమూ అర్ధమై ఉండీ, ఆత్మజ్ఞానం సమృద్ధిగా ఉండిన వేశ్య, పరోపకారంకోసం ఆత్మార్పణ– తుదకది నిష్ప్రయోజనమే అవచ్చుగాక – చేసుకోడానికి నిర్ణయం తీసుకుంది.

చదివేవాళ్ళకి ఎదురయ్యే బేతాళ ప్రశ్న ఇది: ఈ ముగ్గురిలో ఎవరిలా ఉండాలి? అధిక సంఖ్యాకులు నోటితో వేశ్య పాత్రే ఉదాత్తమైనదని చెప్పి, తమదాకా వచ్చేసరికి చేతల్లోమాత్రం పరిస్థితుల్నిబట్టి బ్రాహ్మడిలాగానో, అధికారుల్లాగానో ప్రవర్తిస్తారు. ఇది లోకం తీరు. శ్రీపాద ఈ కథ చెప్పే తీరులో స్పష్టం అయ్యేదేమిటంటే, సమస్యలూ, స్వయంనిర్ణయాధికారం మానవవ సంప్రాప్తాల్లో స్వయంభువులైనట్టే, దొడ్డరికం-నీచత్వం అనే ద్వంద్వాలు కూడా మౌలికాలూ, స్వయంభువులున్నూ. స్వయంనిర్ణయాన్ని వీటినుండి విడదీయడం అసాధ్యం.

శ్రీపాద స్త్రీలు

శ్రీపాద సాహిత్యాన్ని చదివినవాళ్ళకెవరికైనా, ఆయన రచనలో స్త్రీకి కేంద్ర పాత్ర ఉందని స్పష్టంగా తెలుస్తుంది. శ్రీపాద స్త్రీలు సాంఘికన్యాయం అనే వస్తువుని ఒక సుందరమైన ఆదర్శంగా ఊహించుకున్న పురుషులపాలిటి ఒక ‘సమస్య’కి ప్రతిరూపమైన లక్కపిడతలు కారు. ఇవాళారేపూ వస్తున్న కొన్ని రచనల్లోమాదిరి పురుషాధిక్య సమాజానికి ఎరలైపోతున్న నోరూవాయీలేని బలిపశువులు కారు. ఆయన చిత్రించిన ఆడవాళ్ళు రక్తమాంసాలుండి, సర్వమానవసహజమైన ఈతిబాధలకి, ప్రకృతివరమైన స్వయంనిర్ణయాధికారానికీ వారసులైన మానవులు. మానవజాతిలో పురుషార్ధానికంటే ముఖ్యాంశాల్లో భిన్నమైనవాళ్ళు. జాతిని సంపూర్ణం చేసేవాళ్ళు. ‘పురుషుల భాషలో కంటే, స్త్రీల భాషలో మాధుర్యమూ, హృదయాలను పట్టివేసే జాతీయతా కనపడింది నాకు. వారి మాటల పొందికా, వారి హావభావ ప్రదర్శన చాతుర్యమూ తెనుగుభాషలో నాకు మాతృభిక్ష ప్రసాదించాయి,‘ అని చెప్పుకున్నాడాయన.

భావార్ధాలను వదిలి కేవలం భాషే ఒక వ్యక్తికి పట్టుబడటం అసంభవం. శ్రీపాద స్త్రీలు ఆయన తెలుగుని విశాలం చేసి సాన పెట్టడంతో పాటే మానవత గురించి ఆయనకి కలిగిన అవగాహనకి లోతూ, వెడల్పూ సంతరించి పెట్టి ఉండాలి. ఈ ప్రకారం శాస్త్రిగారు తన స్త్రీల ముఖత: చెప్పిన విషయాలూ, చూపెట్టిన విశేషాలూ, సమస్తమానవజాతికి ఎదురయ్యే సాధారణ పరిస్థితులని చిక్కబరచి, మొనదేల్చి, అందరికీ అవసరానికి పలుకుతాయి.

చివరి మాట

ఆత్మనిర్ణయానికి ప్రాతిపదిక ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం నుంచి అత్మగౌరవం, తమనీ తమదైనవాటినీ, తమవారినీ అభిమానించుకోడం అనేవి ఉద్భవిస్తాయి. అందిమీంచే స్వయంనిర్ణయం, స్వయంకృషీ బయల్దేరి, ఐశ్వర్యానికి దారితీస్తాయి. తన్నూ, తనవారినీ అభిమానించి ప్రేమించలేని వ్యక్తి ఎంత విశ్వపౌరుడిగా ఉందామని ప్రయత్నించినా తుదకదంతా బూటకం, ఆత్మవంచనే అవుతుంది. తెలుగన్నా, తెలుగుజాతన్నా రాజీలేని, వ్యాజ్యంలేని అభిమానం నెరపిన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తన జీవనమార్గంగా ఎంచుకున్నదాని లోగుట్టు ఇదే. ఆ ఎంపిక ఆయనకి డబ్బు కొనలేని ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టింది.

‘మేరలేని ఆత్మానందము అనుభవించగలుగుతున్నాను. ఎంచేతా? అంటే తెలుగుభాషలో ఒక రచయితను కాగలిగినందుకు..నా మాతృ భాషలో కలం పట్టి నాలుగు బంతులు రాసే అదృష్టం పట్టినందుకున్నూ..’అని రాసుకున్నాడాయన. అంత ఉన్నందుకే, ఆ శ్రీపాద తెలుగు కథ (ఆయన మాటల్లోనే) ‘…ఆత్మకు మాయావరణం తొలగించి స్వస్వరూప పరిజ్ఞానం కలిగిస్తుంది.ఇందుకు ఫలితంగా ఆ చిన్నకథ, ఎలాంటి విషమ ఘట్టంలోనూ కూడా, వొక్కొక్కణ్ణి చులాగ్గా వొడ్డెక్కించేస్తుంది.’

ఇది చాలు, శ్రీపాదని దేశకాలాతీతంగా జాతి వారసత్వంలో జమ చేసుకోడానికి.*