ఆలోచింపచేసిన మనిషి

[భద్రిరాజు కృష్ణమూర్తి గారి షష్టిపూర్తి సందర్భంగా 1988 లో వెల్చేరు నారాయణరావు గారు రాసిన వ్యాసం ఇది. ఈ ప్రత్యేక సంచికలో ఆ వ్యాసాన్ని పునర్ముద్రించడానికి అనుమతిచ్చిన వెల్చేరు గారికి మా కృతజ్ఞతలు — సం.]

భద్రిరాజు కృష్ణమూర్తి
భద్రిరాజు కృష్ణమూర్తి

కృష్ణమూర్తిగారు అప్పుడే అమెరికానుంచి వచ్చారు. తెలుగులో పరిశోధన చేయడానికి అమెరికా వెళ్ళి వచ్చినాయనగా ఆయన గురించి అప్పటికే కొంత folklore తయారై ఉంది.

‘అమెరికా వెళ్ళి తెలుగులో పరిశోధన ఏం చేస్తారు? బడాయిగాని’ అని కొంతమంది అనుకుంటుండేవాళ్ళు. అవి బాలవ్యాకరణం చెప్పే ప్రతివాడు పంచె కట్టుకుని, ముక్కు పొడుం పీల్చే రోజులు. ఈయన సూటు వేసుకుని, లింగ్విస్టిక్స్ (Linguistics) అనే కొత్త “మాయ” మాటలు మాట్లాడుతూ బాలవ్యాకరణం గురించి అదేదో రకంగా చెప్పేవాళ్ళు. పైగా తెలుగు పద్యాలు చదివేవాళ్ళు.

ఒకసారి నేను ఏలూరు కాలేజిలో చదువుకుంటుండే రోజుల్లో వాల్తేరు వెళ్ళాను. వాల్తేరులో నాకు గురువు లాంటి స్నేహితులూ, స్నేహితుడులాంటి గురువూ బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు ఉండేవారు. ఆయన కోసం వెళ్తే అక్కడ ఉన్న అబ్బూరి రామకృష్ణారావుగారు (భావకవిత్వం రాసి, లైబ్రరీలో పని చేస్తుండే ఆయన) రాచకొండ విశ్వనాథశాస్త్రిగారూ కన్పించేవారు. ఒకరోజు అబ్బూరి రామకృష్ణారావుగారి ఇంట్లో, ఎందుకోగాని చాలామంది సమావేశమయ్యారు. వాళ్ళలో బాలవ్యాకరణాన్ని రమణీయంగా చేసిన దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారు, కృష్ణమూర్తిగారు ఉన్నారు. వాళ్ళ వెనుకాతల ఒక మూల ఒదిగి కూర్చున్నాను నేను. వినగా వినగా నాక్కూడా కొన్ని సంగతులు బోధపట్టం మొదలెట్టాయి. వాళ్ళు నన్నయ్య వాడిన పదాలన్నింటినీ కలిపి ఒక కోశం తయారు చెయ్యడం గురించి సమావేశమయ్యారు. అలాంటి కోశాలు పెద్ద కవులకి అందరికీ ఇంగ్లీషులో ఉన్నాయనీ, వాటిని Concordances అంటారని కృష్ణమూర్తిగారు వాళ్ళకి బోధ పరుస్తున్నారు.

అలాంటిది నన్నయ పదాలకి చెయ్యడం అవసరం. మొదటి పనిగా నన్నయ్యనే తీసుకోవడం సులభం కూడా. అవసరం ఎందుకయ్యా అంటే నన్నయ ఏ మాట వాడేడో చూడాలంటే, జ్ఞాపకం పెట్టుకోవటంతో పనిలేకుండా అకారాది క్రమంలో ఈ పద ప్రయోగ కోశంలో దొరుకుతుంది.
రెండు- తేలిక ఎందుకంటే నన్నయ్య భారతంలొ రెండున్నర పర్వాలే రాశాడు కాబట్టి.

నాకు వాళ్ళ చర్చల్లో నచ్చిందల్లా తెలుగులో పదస్వరూపం ఎలానిర్ణయించాలన్న విషయంలో కృష్ణమూర్తిగారి అభిప్రాయం. తెలుగు పదాల్లో చాలావరకూ ఉకారంతో ముగుస్తాయి. ఆ ఉకారం అచ్చు పరమైనప్పుడు కన్పించదు. ‘ఈ కనిపించని ఉకారం అక్కడ ఉందని నువ్వెలా చెప్పగలవు?’ అంటారు కృష్ణమూర్తిగారు. ఆ చర్చల సారాంశం ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు నేను చెప్పలేను గానీ, నాకు గుర్తున్నదల్లా కృష్ణమూర్తిగారు ఆలోచించే పద్ధతిలో కొత్త దనం. మామూలుగా అలవాటైపోయిన దారిలో నడిచేవాళ్ళ మనసులో ఉండే చీకటి ఒక్కసారి విడిపోయినట్టు విన్పించేయి ఆయన మాటలు నాకు.

ఆ తర్వాత రెండు మూడు సార్లు వాల్తేరు వెళ్ళాను. ఆయన కన్పిస్తే ఆయన మాటలు వినాలనే సరదా.

నేనై అయనతో మాట్లాడే ధైర్యం లేదు. ఆ రోజుల్లో ఆయన కొండ భాష మీద పరిశోధన చేసేవారు. ఒక టేప్ రికార్డరూ, కొండ భాష మాట్లాడే వాళ్ళ దగ్గరనుంచి తెచ్చిన సమచారం, కథలూ, పాటలూ, ఉన్న టేపులూ, అయన దగ్గర ఉండేవి. ఆయన దగ్గిర చేకూరి రామారావు పని చేస్తుండేవాడు.

Sea Sands అనే పేరుతో సముద్ర పొడ్డున ఉన్న ఒక విశాలమైన ఇంట్లో తెలుగు డిపార్ట్‌మెంటు ఉండేది. ఆ డిపార్ట్‌మెంటు లో కృష్ణమూర్తిగారూ, రామారావూ టేప్ రికార్డరు తో పని చేస్తూండేవారు.

అప్పట్లో రామారావు ప్రేమ కవిత్వం రాసేవాడు. కొండ భాషలో మాటల రూపాలు చర్చిస్తున్న వాతావారణం మధ్యలో టేపులోంచి రామారావు రాసిన ప్రేమగీతం ఒకటి విన్పించేది. భాష మాట్లాడే వ్యవహార్తల దగ్గరినించి సేకరించిన మాటల గుంపులోంచి, మాట మాటని విడదీసి వాటికి వ్యాకరణం చేప్పే నిశితమైన ఆలోచనా క్రమంలో ఈ ప్రేమ గీతం కూడా సున్నితంగా కలిసిపోయేది.

వ్యాకరణం అంటే ఎవరో రాస్తారు. దాని ప్రకారం బుద్ధిమంతులు భాష నేర్చుకుంటారు అనే నా ఊహ తలకిందులు కావటం మొదలు పెట్టింది అప్పుడే. ప్రతి భాషకీ వ్యాకరణం ఉంటుంది. ఆ వ్యాకరణాన్ని బుద్ధిమంతులు వ్యక్తీకరిస్తారు, అనే సంగతి బోధపడిందీ అప్పుడే.

కృష్ణమూర్తిగారితో ఈ రకంగా మొదలు పెట్టిన నా పరోక్ష పరిచయం క్రమక్రమంగా ప్రత్యక్ష పరిచయంగా మారి, తర్వాత మంచి స్నేహంగా మారింది.

భాషా శాస్త్ర రంగంలో ఆయన చేసిన విశేషమైన పరిశ్రమ, మౌలికమైన ఆలోచనలూ తెలుగు భాషని ఆధునీకరించటంలో ఆయనకున్న విశాలమైన ఆలోచనలు నన్ను ముమ్మరంగా ఆకట్టుకొన్నాయి. తర్వాత కాలంలో ఆయన పనిచేసిన భాషా శాస్త్రా రంగంలో నాకు చెప్పుకోదగ్గ ప్రవేశం లేకపోయినా అయన ఆలోచించే ధోరణి మాత్రం నాకు చాలా కొత్త దారులు చూపించింది.

తర్వాత్తర్వాత ఆయన చేసిన చాలా చర్చలు, ఆయన రాసిన వ్యాసాలూ నేను చాలా వరకూ చదివి దానివల్ల చాలా లాభాలు పొందాను.

తెలుగులో ఆలోచనా రంగం బలంగా ఏర్పడటానికి కృషి చేసిన వారిలో కృష్ణమూర్తిగారు చాలా పెద్దవారు. ఆయన వేసిన ప్రణాళికలూ, చేసిన ఆలోచనలూ, ప్రతిపాదించిన సిద్ధాంతాలూ తయారు చేసిన శిష్యులూ, తెలుగు భాషని ఒక్కసారిగా కొన్ని శతాబ్దాలు ముందుకు తీసుకొచ్చి ఇరవయ్యో శతాబ్దిలో పెట్టాయి.

ఆయన పరిపాలనా సంబంధమైన ఉద్యోగాలలో ఉంటూ కూడా, పరిశోధనా వ్యాసంగాన్ని ఆలోచనా వ్యాపారాన్ని, ఏనాడు వదిలేయలేదు. పరిశోధనా రంగంలో తలమునకలుగా ఉంటూ కూడా, తన తర్వాత వచ్చే తరం వాళ్ళని తయారుచేసే పనిని ఎన్నడూ విస్మరించలేదు.

మేధావిగానూ, పరిశోధకుడిగానూ మాత్రమే కాకుండా, కొత్త సంస్థలను నిర్మించగల దక్షతగలవాడుగానూ, కొత్త తరాన్ని రూపొందించగల దూరదర్శనం గలవాడుగానూ, ఆయన తెలుగుదేశానికి అపూర్వమైన పని చేశారు.

అంతర్జాతీయ భాషాశాస్త్ర రంగంలో, అయన పేరు తెలియనివారు లేరు. ఆయన చేసిన సిద్ధాంతాలు, ఇప్పటికీ భాషాశాస్త్రజ్ఞులు చర్చిస్తూనే ఉన్నారు. ఆయన ఇప్పటికీ, ఇంతగా పరిపాలనారంగంలోని సమస్యలతో సతమతమవుతూ కూడా, భాషాశాస్త్ర రంగంలోనూ తెలుగు సాహిత్య విమర్శారంగంలోనూ కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఆయన రాసిన ప్రతి వ్యాసమూ కొత్త ప్రమాణాలు సృష్టిస్తోంది.

తెలుగులో, ముఖ్యంగా విశ్వవిద్యాలయాల సాహిత్య శాఖల్లో వైజ్ఞానిక స్థాయి చాలా బలహీనంగా వుంది. ఆయన ఆ సంగతి గుర్తించి, తన భాషా శాస్త్రరంగంలోనే కాకుండా సాహిత్య విమర్శారంగానికి కూడా తన దక్షతని మళ్ళిస్తున్నారు.

ఆయన ఆలోచనలు పాతబడడంలేదు. ఆదర్శాల బలం తగ్గడంలేదు. అందుకనే ఆయనకి ఇపుడు వొచ్చిన అరవైయవ సంవత్సరం మరొక బలీయమైన కొత్త ఆలోచనా దశకి ఆరంభం అవుతుందని నా నమ్మకం.

అందుకని ఆయనకి ఇప్పుడు జరుగుతున్న అరవయ్యో పుట్టినరోజు ఆయన జీవితంలోను, తెలుగు దేశపు మేధారంగ చరిత్రలోను, మరొక కొత్త దశకి ఆరంభమౌతుందని నాకు తెలుసు.

(1988 – ఆలోచింపచేసిన మనీషి నుండి)


రచయిత వెల్చేరు నారాయణరావు గురించి: వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌‍లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌‍గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాశారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం "తెలుగులో కవితా విప్లవాల స్వరూపం" తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని (Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు  ఎమరి యూనివర్సిటీ నుంచి పదవీవిరమణ అనంతరం ఏలూరు దగ్గర నివసిస్తున్నారు. ...