ఆకాశంలోకి ఎడారి ప్రాకింది
చెట్లకేకాదు, పుట్లకేకాదు
అనంతపురంలో భూమికే చెదలు పట్టింది
నింగిలో ఎక్కడా నీడజాడలేని సముద్రుని పాదముద్ర
శూన్యాకాశ ఎడారి విస్తరిలో
ఏ దిక్కునా కానరాని చిటికెడు ఉప్పు మేఘం
గగనమంతా ఎలుకలు పారాడే ఆకలి కడుపుతో నిండిన
చీకటి గుహ
నింగినేల ఏకమై మమేకమై భోరున కురుస్తున్న ఎండ
మేఫూల నీడ సోకక
ఈ మట్టి మరిచింది పుట్టుక
విత్తిన విత్తనం మొలకెత్తక
రైతు గొంతులోకి జారిన విషపు గుళిక
కానీ … కాసిన్ని నీళ్ళను చిల్లిగవ్వలో నింపి ఇవ్వలేక
రాళ్ళను ఇసుకతో కలిపి తింటున్న రాజకీయ వర్ణకారులు
ప్రజల దాహానికి గాజు గ్లాసులతో నిర్మిస్తున్న ఆనకట్టలు
ఎండమావుల్లో నీళ్ళు చూపించి కన్నీళ్ళు తెప్పించే నేర్పరులు
ప్రతి ప్రభుత్వం ఓ సాలె పురుగే!
అందమైన జలతారు పలుకుల తీగలతో
అయదేళ్ళకోసారి అల్లిన వలలోకి వెళితే చాలు
అప్పుల నిప్పులు చేతితో తాకితే చాలు
మొనోక్రోటోఫాస్ ఉచితం … ఎందుకో తెలుసా!
నేలపై పైరుకు చీడ వదిలించడానికి కాదు
నేలలోకి పెరగని విత్తనంలా రైతును దించడానికి
రేపు మళ్ళీ వాడి కడుపును వాడి నాగలితోనే కోయడానికి
ఇక ఇక్కడ చరిత్ర పుటల్లోని ప్రతి అక్షరం
రైతుల సమాధుల ఫలకాలపై మండే భాస్వరం.
పిల్లల్ని అనాథల్ని చేస్తూ
పెద్దల్ని చావు దీవిస్తుంటుంది ఎల్లప్పుడు.
మొన్న రతనాల సీమ
నిన్న రాళ్ళసీమ
నేడు భస్మసీమ
రేపు చితాభస్మసీమ
ఇక్కడ ప్రతి ప్రభాతం ఓ భూతం
ఏ వార్తను ఎలా తెస్తుందో
తనకే తెలియని చీకటి గీతం.
ఉరితాళ్ళకు వ్రేలాడే నూలుపేగుల ఆకలి పేగులు
ఉదయం దినపత్రికలో నల్లగా మారిన అక్షరాలు
కూడు గుడ్డ ఇచ్చే వారి
రక్తం మరకలతో నిండిన ప్రతి దినపత్రిక
మా రాయలసీమ ప్రతిరోజూ పాడుకునే
ఆకలి చావుల అత్యున్నత జాతీయ గీతిక