గెలుపు సంబరంలో
స్నేహితులకు విందిచ్చి
ఆఖరున జేబు తడుముతుంటే
అక్కడ నా వేళ్ళకి
అమ్మ చేయి తగిలింది.
కొంత పోగేసుకునీ
ఇంకొంత అప్పుచేసుకునీ
మూడంతస్తుల కలల మేడ కట్టుకుని
బాల్కనీలో నుండి కిందికి చూస్తుంటే
పునాదుల్లా అక్కడ
నాన్న పాదాలు కనపడ్డాయి.
ప్రశంసల ముసురులో
చూరు కింద నిలబడీ నిలబడీ
తడిబట్టలతోనే ఇల్లు చేరినపుడు
కంచం నిండా అన్నీ వడ్డించి పెట్టిన
హృదయం ఒకటి
బువ్వ మెతుకు కన్నా మెత్తగా తగిలింది.
నా వ్యక్తిత్వాన్నీ ప్రతిభాపాటవాలనీ
ప్రపంచం వేనోళ్ళ కీర్తిస్తున్నప్పుడు
వేల చూపులు వాలిన
వర్షాకాలపు తొలి చిగురులా
నేను గిలిగింతలవుతుంటే
గోడ మీద నా కుటుంబపు చిత్రం
నన్ను నవ్వుతూ చూసింది.
ఆ తోటలో
తొలి పువ్వును నేనే అనుకుని
ఆ మేఘంలో
మొదటి వానబొట్టును నేనే అనుకుని
ఆ గెలుపులో
ఆరంభవాక్యాన్ని నేనే అనుకుని
నన్ను నేనే మోసేస్తున్నపుడు
ఇన్నేళ్ళ నా కాళ్ళ కింద నేల
ఒక మట్టిపద్యాన్ని చదివింది
ఎప్పటిదో ఒక పూలతీగ
నా వెన్నులో అటూ ఇటూ ఊగింది
అప్పటికే ముస్తాబై కూర్చొని
నాకోసం నిరీక్షిస్తున్న సభ
నేనక్కడికి చేరుకోగానే
ఇక మొదలెడదామా అన్నట్టు చూసింది.