వాన కడిగిన మధ్యాహ్నం …

ఓ మధ్యాహ్నం వేళ
నల్ల మబ్బులు తెల్ల మబ్బులు కలిసి
పల్చని వెలుగుకి తోవ ఇచ్చాక
గడ్డి మీద వాలి గాలితో కదులుతూ
కిటికీ అంచులు పట్టుకుని లోపలికి తొంగి చూసి
అద్దాల రెక్కల సందులో దూరి
సున్నాలు చుట్టుకుని గది గోడల మీద అద్దాలు పేర్చి
ఊగుతున్న ఎండ వెలుగుని మళ్ళీ
నల్ల మబ్బు ఒకటి దాచేసింది.

కిటికీ దూకేసిన వెలుగు
అక్కడే వున్న శంఖు పుష్పాలని తడిమి
విచ్చుకుని గాలికి కిలకిల మంటున్న
పసుప్పచ్చ అడవి పూలని నిమిరి
గడ్డి పరకల మీద పరుచుకుంది
ఎదురుగ్గా ఆకాశంలో ఉండిపోయిన చెట్టు
మొదట్లో నీడ పాదు కట్టుకుంది.
విచ్చుకున్న వెల్తురు లేతగా
చురుక్కు మంటూ రోడ్లని కొలుస్తోంది…